ఇక పైవాడు జూమ్ చేసి చూస్తాడు!

ఫొటో సోర్స్, SSTL
- రచయిత, సతీష్ ఊరుగొండ
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో సెంచరీ కొట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
ఉదయం 9.28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ ద్వారా స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-2ఈఆర్‌తో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి రోదసిలోకి పంపించారు..
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇస్రోకు బాగా కలిసి వచ్చింది. పీఎస్‌ఎల్‌వీకి ఇది 42వ ప్రయోగం.
గతేడాది ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ-సీ 39 ప్రయోగం విఫలమైంది.
ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఇదే తొలిసారి.



ఫొటో సోర్స్, Getty Images
ఒక్క ప్రయోగం.. 31 ఉపగ్రహాలు!
పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్ మొత్తం 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. ఇందులో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఈఆర్ ప్రధానమైంది.
గతంలో ప్రయోగించిన 6 కార్టోశాట్ ఉపగ్రహాల మాదిరిగానే కార్టోశాట్-2ఈఆర్ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్.
భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో భూకేంద్ర కక్ష్యలో ఈ శాటిలైట్‌ను ప్రవేశపెట్టారు. వెంటనే ఇది తన పని ప్రారంభించింది.

ఫొటో సోర్స్, ISRO
ఏదైనా ఇట్టే ఫొటోలు తీయోచ్చు!
కార్టోశాట్ భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ భూమిపై దేనినైనా అత్యంత స్పష్టంగా నాణ్యమైన ఫొటోలు తీస్తుంది.
ఇంకా చెప్పాలంటే సుమారు అర మీటర్ విస్తీర్ణంలో ఉన్న వస్తువులను కూడా ఇది క్లియర్‌గా ఫోటోలు తీస్తుంది.
అంతేకాదు, ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో అవసరమైన టార్గెట్‌ను మాత్రమే ఫొటోలు తీసే సదుపాయం కూడా ఇందులో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మరింత పక్కాగా భూముల లెక్క!
కార్టోశాట్-2ఈఆర్ పంపించే ఫొటోల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంత భూముల లెక్కలను పక్కాగా గుర్తించొచ్చు.
- తీరప్రాంత భూములను గుర్తించడంతో పాటు వాటి వినియోగాన్ని లెక్క కట్టొచ్చు.
- నీటి పంపిణీ వ్యవస్థ, రోడ్ నెట్‌వర్క్ పరిశీలన, నావిగేషన్ అప్లికేషన్లకు కూడా కార్టోశాట్ పంపించే ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయి.
- భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి ఇది సహాయం చేస్తుంది.
- కార్టోశాట్-2ఈఆర్ బరువు 710 కేజీలు. దీని కాలపరిమితి ఐదేళ్లు.
కార్టోశాట్‌తో పాటు మరో 30 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టారు. ఇందులో మైక్రోశాటిలైట్, నానోశాటిలైట్ భారత్‌కు చెందినవి కాగా.. మిగిలిన 28 ఇతర దేశాలకు సంబంధించినవి.
మైక్రోశాట్ విశేషాలు
కార్టోశాట్‌తో పాటు భారత్‌కు చెందిన మైక్రోశాట్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా ప్రయోగించారు.
- మైక్రో శాటిలైట్‌ను ఇస్రో తయారు చేసింది.
- ఇది సుమారు వంద కిలోల బరువు ఉంటుంది.
- ఐఎంఎస్-1 ఉపగ్రహాన్ని పోలి ఉంటుంది.

ఫొటో సోర్స్, ESA
నానో శాటిలైట్-1సీ విశేషాలు
ఇస్రో ప్రయోగించిన 31 ఉపగ్రహాల్లో ఇదొకటి.
- భారత్‌కు చెందిన నానో శాటిలైట్ సిరీస్-ఐఎన్‌ఎస్‌లో ఇది మూడోది.
- 11కిలోల బరువు ఉంటుంది. దీని కాల పరిమితి ఆరు నెలలు.
- మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ టెక్నాలజీ డెమానుట్రేషన్-ఎంఎంఎక్స్-టీడీ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
- ఐఎన్‌ఎస్-1సీ తీసిన ఫొటోల ఆధారంగా స్థలాకృతికి సంబంధించిన మ్యాప్‌లు తయారు చేస్తారు.
వృక్ష సంపద పర్యవేక్షణ, మేఘాల అధ్యయనం, వాతావరణ మార్పులు తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, AFP
విదేశీ ఉపగ్రహాల విశేషాలు
మిగతా 28 ఉపగ్రహాలలో అమెరికా, బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, కెనడా దేశాలకు చెందిన 3 మైక్రో, 25 నానో శాటిలైట్లు ఉన్నాయి.


విదేశాలకు చెందిన 28 శాటిలైట్ల మొత్తం బరువు 470 కేజీలు.
పీఎస్‌ఎల్‌వీ సీ40 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇది భారత దేశానికి ఇస్రో ఇచ్చి కొత్త సంవత్సర కానుక అని అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- మహిళలు కనిపెట్టిన అద్భుతాలివి
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- #metoo బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- #కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- ఫేస్బుక్లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
- 'గ్రీన్ కార్డు రావాలంటే మరో 108 ఏళ్లు ఆగాలి'
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









