చమోలీ గ్లేసియర్ : 15 అణుబాంబులు ఒకేసారి పేలినట్లు ఆ రాయి లోయ అడుగును తాకింది

ఫొటో సోర్స్, VINAY, SHAHBAZ ANWAR
- రచయిత, జోనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ కరస్పాండెంట్
ప్రకృతి మనల్ని తరచూ ఆశ్చర్యపరుస్తుంటుంది. దాని శక్తిని మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. కానీ మనిషి ఊహించ లేనంత విధ్వంసం సృష్టించే శక్తి ప్రకృతికి ఉంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హిమాలయాల్లో ఒక పర్వతపు అంచు విరిగి లోయలో పడడంతో చమోలీ గ్లేసియర్ విపత్తు సంభవించింది.
రాళ్లు, మట్టి, బురద, ఇతర శిథిలాలు కలిసి వచ్చిన ఆ వరదలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల కోట్ల విలువ చేసే జల విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసమైంది. ముంచుకొస్తున్న విపత్తును కొందరు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు.
వైరల్ అయిన ఆ వీడియోలను మీరు కూడా చూసే ఉంటారు. అడ్డొచ్చిన వాటన్నిటినీ తుడిచి పెట్టేస్తూ సాగిన బురద నీటి ప్రవాహం చూసే వారికి వెన్నులో వణుకు పుట్టించింది.
అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అన్నదానిపై ఒక అంతర్జాతీయ బృందం అధ్యయనం చేసింది. ఈ బృందంలో 50మందికి పైగా పరిశోధకులు ఉన్నారు. ఆ బృందం చమోలీ గ్లేసియర్ ఘటన గురించి ఇటీవలే ఒక సమగ్ర నివేదికను ప్రచురించింది.
ఈ రిపోర్ట్‌లో ఉన్న అంశాలు మన ఊహకు అందని విధంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అసలు ఏం జరిగింది?
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆరు కిలోమీటర్ల ఎత్తైన రోంటీ శిఖరం పైభాగానికి సమీపంలో ఈ ప్రమాదం ప్రారంభమైంది. అకస్మాత్తుగా మంచుతో కప్పబడిన ఒక పెద్ద శిల విరిగి పడిపోయింది. ఈ మంచు పలక 500 మీటర్లకు పైగా వెడల్పు, 180 మీటర్ల మందం ఉంది.
దాదాపు 27 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఈ రాయి ఒక్క నిమిషంలో కింద పడిపోయిందని ఈ బృందం అంచనా వేసింది. దారిలో ఏ అడ్డంకీ లేకుండా వేగంగా ఆ రాయి కిందకు పడిపోయింది.
విరిగి పడిన ఈ ముక్క పరిమాణం ఈజిప్ట్‌లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాకు దాదాపు పది రెట్లు పెద్దగా ఉంటుంది. అంత భారీ గ్లేసియర్ ముక్క రోంటీ గఢ్ లోయ అడుగును తాకగానే 15 హిరోషిమా అణుబాంబులకు సమానమైన శక్తి విడుదలైంది.
"అందులో రాయి 80 శాతం, మంచు 20 శాతం ఉంది. అది దాదాపు 2 కి.మీ.ల ఎత్తు నుంచి పడడంతో ముక్కలు ముక్కలైపోయింది. ఆ రాపిడికి తగినంత వేడి పుట్టడంతో అందులో ఉన్న మంచు మొత్తం దాదాపుగా కరిగిపోయి నీళ్లుగా మారింది. చిన్న చిన్న ఎత్తులను కూడా ముంచేయగల రీతిలో నీరు ఉధృతంగా ప్రవహించడానికి ఇదే ముఖ్య కారణం" అని టీమ్ లీడర్ డాక్టర్ డాన్ షూగర్ చెప్పారు. షూగర్ కెనెడా యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో పని చేస్తున్నారు.
ఆ ధాటికి చుట్టుపక్కల 10మీ ప్రాంతంలో ఉన్న రాళ్ల గుట్టలన్నీ తడిసిపోయాయి. అందులోంచి ఎగసిన గాలి వేగానికి దగ్గర్లో ఉన్న 20 హెక్టార్ల అడవి చదునుదేరిపోయింది.
సాధారణంగా పై నుంచి పడి ముక్కలైపోయి, పొడిగా మారిన ద్రవ్యరాశి అక్కడే నిలిచిపోతుంది. కానీ కాంక్రీట్ ముద్దలా ఉన్న ఈ ప్రవాహం ఇంకా కిందకు ప్రవహించింది.
రాయినీ గ్రామానికి సమీపంలో ఉన్న రిషిగంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌ను ముంచేసి ఓ 15 కి.మీ.ల ముందుకొచ్చినప్పుడు ఆ బురద నీటి ప్రవాహ వేగం 25 మీ/సె. ఉంది.
అంటే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు లెక్క. చాలా వేగంగా దూసుకెళ్తున్న కారు లాగ అన్నమాట. మరో 10 కి.మీ.ల దూరంలో తపోవన్ హైడ్రో ప్లాంట్ సమీపించినప్పుడు కూడా దాని ప్రవాహం 16 మీ/సె. ఉంది.
ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన 204 మందీ ఈ ప్లాంటుల దగ్గర పని చేస్తున్నవారు లేదా ప్లాంట్లు చూడ్డానికి వచ్చినవారు. ఇలాంటి ప్రవాహం ఒకటి తరుముకొస్తోందని వారు కలలో కూడా వారు ఊహించి ఉండరు. దీని గురించి వారికి ఏ రకమైన హెచ్చరికలూ అందలేదు.
అప్పటికి, అదంతా హిమనీనదీయ సరస్సు పొంగి ప్రవహిస్తున్న నీరు అనే అనుకున్నారు.
సాధారణంగా హిమాలయాల్లో గ్లేసియర్ల చుట్టుపక్కల నీరు కరిగి సరస్సులు, చెరువులుగా మారడం కనిపిస్తుంది. అవి ఒక్కోసారి పొంగి వరదగా మారుతుంటాయి.
అయితే, ఇలాంటిదేమీ జరగలేదని ఈ బృందం పరిశోధనలు తెల్చి చెప్పాయి.

ఫొటో సోర్స్, ITBP
వాతావరణ మార్పులే కారణమా?
ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్రధానంగా తలెత్తిన ప్రశ్న.. దీనంతటికీ వాతావరణ మార్పులే కారణమా? దీనికి జవాబు చెప్పడం అంత సులువు కాదు. దీన్ని ఏదో ఒక సంఘటనకు ఆపాదించలేమని పరిశోధకుల బృందం అంటోంది.
అయితే, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా రాను రాను హిమాలయాల్లో కొండ చరియలు విరిగి పడడం ఎక్కువవుతోందని ఈ బృందం హెచ్చరించింది.
"గ్లేసియర్లు కరగడం వలన, హిమాలయాల్లో మంచు కొండ చరియలు తరచూ విరిగి పడడమే కాకుండా, అడుగున ఉన్న శిలల్లో హైడ్రోలాజికల్, థర్మల్ రసాయనాల పరిస్థితి మారిపోతుంది" అని ఈ రిపోర్టులో రాశారు.
"ఏదో ఒక్క విషయం వలన ఇదంతా జరిగిందని చెప్పలేం. కానీ, ఇప్పుడు విరిగి పడిన రాయి, గత నాలుగు సంవత్సరాలుగా మెల్లి మెల్లిగా జరుతూ వస్తోందని మాత్రం చెప్పగలం. ఇలా జారుతోందన్న విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. కానీ, ఎవరూ దీన్ని కనుక్కోలేకపోయారు" అని ఈ రిపోర్ట్ సహ రచయిత ప్రొఫెసర్ జెఫ్రీ కార్గెల్ తెలిపారు. ప్రొ. కార్గెల్ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ప్లానెటరీ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తరాఖండ్‌లో పర్వతాలపై నివసించేవారి పరిస్థితి ఏంటి?
కొండ చరియలు విరిగి పడడమే కాకుండా, వరదలు, భూకంపాలు కూడా తరచుగా సంభవించే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించే ముందు మరింత ఆలోచన, చర్చ అవసరమని వాటర్ పాలసీ నిపుణులు, జర్నలిస్ట్ కవిత ఉపాధ్యాయ్ అంటున్నారు.
ఈ ప్రాంతంలో సహజ పర్యావరణం, హైడ్రో-ఎలక్ట్రానిక్ పవర్ గురించి కవిత అనేక వ్యాసాలు రాశారు.
"ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడం ఇదేం మొదటిసారి కాదు. 2013, 2016 సంవత్సరాలలో వచ్చిన వరదలకు కూడా ఇవి దెబ్బతిన్నాయి. ఇంత బలహీనమైన ప్రాంతంలో ఇలాంటి ప్లాంటులు నిర్మించడంపై హెచ్చరించాలి. ఇలాంటి వాటిని ఇలా నిర్మించుకుంటూ పోవడం మంచిది కాదని గట్టిగా చెప్పాలి. కానీ, ప్రభుత్వం మన మాట వినదు. ప్రజలు కూడా వద్దనరు ఎందుకంటే వాళ్లకి ఉద్యోగాలు వస్తున్నాయి. శిలాజ ఇంధనాల నుంచి దూరంగా జరగాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అందుకు హైడ్రో ప్లాంటులే మార్గం. ఇది తప్పదు అనుకుంటే, కనీసం ఇలాంటి ప్రమాదాలు సంభవించే ముందే హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ అయినా ఉండాలి" అని ఆమె అన్నారు.
ఈ నివేదిక సహ రచయిత, బ్రిటన్‌లోని షీఫీల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డవే పెట్లీ కూడా కవిత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు.
"ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నిర్మిస్తున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఉన్న ముప్పును మనం తక్కువగా అంచనా వేస్తున్నామని చమోలీ విపత్తు తెలియజేస్తోంది " అని ఆయన అన్నారు.
"సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. వాతావరణ మార్పులు సమస్య అధికమవుతున్నప్పుడు పరిస్థితి మరీ విషమిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను ముందే అంచనా వేయగలగాలి. లేదంటే భారీ స్థాయిలో జనాభా, ఆర్థిక, సామాజిక, పర్యావరణ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది" అని ప్రొఫెసర్ పెట్లీ హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా: గాల్వాన్ లోయలో ఘర్షణలు ఎలా మొదలయ్యాయి.. ఆ తర్వాత ఏం జరిగింది?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- టోక్యో ఒలింపిక్స్ వచ్చే నెలలో మొదలవుతాయా... ఈ క్రీడా వేడుకకు కోవిడ్ ఎమర్జెన్సీ అడ్డంకి అవుతుందా?
- సియాచిన్: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రం
- ఫ్రెంచ్ ఓపెన్ 2021: తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న బార్బోరా క్రెచికోవా
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








