అమెరికాలో వడగాలులు: ‘విమానాలతో చల్లుతున్న నీరు భూమిని చేరక ముందే ఆవిరవుతోంది’

కార్చిచ్చులు

ఫొటో సోర్స్, Truckee Meadows Fire & Rescue

అమెరికాలోని పశ్చిమ భాగంలో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వడగాలులు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

భారీ ఉష్ణోగ్రతలు, వాడగాలుల నేపథ్యంలో నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కార్చిచ్చు చెలరేగిన సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు.

విద్యుత్‌ లైన్లలో ఇబ్బందుల కారణంగా విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కాలిఫోర్నియావాసులకు విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ విపరీత పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది పోరాడుతున్నారు. అరిజోనాలో విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది మంటలను అదుపుచేసే క్రమంలో విమాన ప్రమాదంలో మరణించారు.

కార్చిచ్చులు

ఫొటో సోర్స్, Getty Images

భూమిని చేరేలోపే ఆవిరవుతోన్న నీరు

లాస్‌వెగాస్, నెవడా ప్రాంతాల్లో శనివారం రికార్డు స్థాయిలో 47.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రస్తుతం గాలి బాగా పొడిబారి ఉండటం వల్ల మంటల్ని ఆర్పేసేందుకు విమానాల ద్వారా చల్లుతున్న నీరు భూమిని చేరకముందే ఆవిరి అవుతోందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఉత్తర అమెరికాలో వడగాలుల బీభత్సం తర్వాత వారాల వ్యవధిలోనే తాజా ఉత్పాతం చోటుచేసుకుంది. నార్త్ అమెరికా వడగాలుల ప్రమాదంలో వందలాది మంది మృత్యువాత‌ పడ్డారు. ఇందులో చాలా మంది వేడి సంబంధిత ఇబ్బందులతో మరణించారు. ఈయూ ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ ప్రాంతంలో జూన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వీడియో క్యాప్షన్, అగ్ని పర్వతం లోపల ఇలా ఉంటుంది!

ఈ వాతావరణ మార్పులు విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశాలను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వడగాలులు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా జూన్ నెల చివరలో పశ్చిమ కెనడా, అమెరికాల్లోని ప్రాంతాల్లో నమోదైన వేడి అసాధారణం అని వాతావరణ పరిశోధకులు చేసిన ఒక పరిశోధనలో తేలింది.

కాలిఫోర్నియాలోని ఓ చెరువులో సేద తీరుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాలోని ఓ చెరువులో సేద తీరుతున్న ప్రజలు

భారీ పొగ, బూడిద..

సియెర్రా నెవడా అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో కాలిఫోర్నియా సరిహద్దుకు సమీపంలోని ఉత్తర నెవడా ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ పరిమాణంలోని ఓ అగ్నికీల... పొగ, బూడిదతో కూడిన భారీ మేఘాన్ని సృష్టించింద‌ని లాస్ ఏంజెల్స్ టైమ్స్ పేర్కొంది.

ఆరేగాన్‌లోని ఫ్రీమౌంట్ వినెమా జాతీయ అడవిలో బలమైన గాలులతో కూడిన అగ్నికీలలు శనివారం నాటికి రెట్టింపు వేగంతో 120 చదరపు మైళ్లకు విస్తరించాయి. కెనడా వెస్ట్రర్న్ ప్రావిన్స్ బ్రిటీష్ కొలంబియాలోనూ మంటలు చెలరేగుతున్నాయి. దీంతో కెనడా ఆదివారం నూతన రైల్వే మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మార్గదర్శకాల్లో చేర్చింది.

వీడియో క్యాప్షన్, కశ్మీర్‌లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత, భారీగా కురుస్తున్న మంచు

ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగినంత కాలం పరిస్థితులు అదుపులోకి ఎప్పుడు వస్తాయనేది చెప్పలేం అని బెక్‌వర్త్ కాంప్లెక్స్ ఫైర్స్ సమాచార అధికారి లీసా కాక్స్ అన్నారు.

ఐడాహో రాష్ట్ర గవర్నర్ బ్రాడ్ లిటిల్ గత వారం ఎమర్జెన్సీ ప్రకటించారు.

పోర్ట్‌ల్యాండ్‌లోని ఆరేగాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రజలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పోర్ట్‌ల్యాండ్‌లోని ఆరేగాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రజలు

లక్షలాది మంది ప్రజలకు హెచ్చరికలు

జాతీయ వాతావరణ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) ప్రాథమిక సమాచారం ప్రకారం కాలిఫోర్నియా, నెవడా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉంది. శుక్రవారం కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో 54.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

లక్షలాది మంది ప్రజలు విపరీతమైన వేడి గుప్పిట్లో చిక్కుకున్నారు. ఎక్కువగా నీరు తాగడంతో పాటు, వీలైతే ఎయిర్ కండిషన్డ్ భవనాల్లో ఉండాల్సిందిగా ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం కూలింగ్ సెంటర్లు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)