హీట్‌వేవ్: అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు ప్రాణాలు తీస్తాయా? వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వేసవి నుంచి రక్షణకు గొడుగులో వెళ్తున్నవారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గళ్లఘర్
    • హోదా, బీబీసీ సైన్స్ అండ్ హెల్త్ కరస్పాండెంట్

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఐదు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్, మే నెలల్లో వడదెబ్బ తగిలి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను అప్పుడప్పుడూ వింటూ ఉంటాం.

ఇలాంటి విపరీతమైన వేడిని తట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ప్రాణాల మీదకు రాకుండా ఎలా కాపాడుకోవాలి?

ఈ అంశాలను బీబీసీ సైన్స్ అండ్ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గళ్లఘర్ వివరిస్తున్నారు.

గత ఆదివారం నాటి వరకు కెనడాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటలేదు

ఫొటో సోర్స్, Getty Images

మన శరీరాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తుంది?

మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత వద్ద మానవ శరీరం ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా పని చేస్తుంది.

మంచు తుఫాను లేదా వడగాడ్పుల్లో చిక్కుకున్నప్పుడు ఈ సాధారణ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడానికి శరీరం సతమతమవుతుంటుంది.

బయట వాతావరణంలో వేడి పెరిగిపోతుంటే శరీరంలో 37.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగించడానికి లోపల్లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది.

ఫలితంగా, అధిక వేడిని బయటకు విడుదల చేయడం కోసం చర్మంలో ఉన్న రక్తనాళాలు మరిన్ని తెరుచుకుంటాయి. అందుకే మనకు చెమట పడుతుంది. చెమట పడుతున్నకొద్దీ శరీరంలో వేడి తగ్గుతుంటుంది.

రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కీలకమే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కీలకమే

సమస్య ఎప్పుడు మొదలవుతుంది?

బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ శరీరంపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటూ ఉంటే రక్తపోటు (బీపీ) తగ్గుతుంటుంది. దీనివల్ల గుండెపై భారం పెరుగుతుంది. శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె వేగం పెరుగుతుంది.

దీంతో చిన్నచిన్న సమస్యలు మొదలవుతాయి. చెమట పొక్కులు రావడం, కాళ్ల వాపులాంటివి ఏర్పడతాయి. రక్తనాళాల్లోంచి నీరు కూడా విడుదల అవుతుంటుంది కాబట్టి కాళ్లల్లో నీరు చేరి వాచినట్టు ఉంటుంది.

రక్తపోటు బాగా తగ్గిపోతే, అవయవాలకు కావలసిన రక్తం చేరుకోదు. హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

మరోపక్క, చెమటలు ఎక్కువగా పట్టడం వలన, శరీరం నుంచి ద్రవాలు, లవణాలు ఎక్కువగా బయటకి వెళిపోతాయి. శరీర సమతౌల్యం దెబ్బతింటుంది. దాంతో పాటు బీపీ బాగా పడిపోతే వడదెబ్బ తగులుతుంది.

వడదెబ్బ లక్షణాలు:

  • మైకం కమ్మడం
  • మూర్ఛ రావడం
  • గందరగోళం
  • అనారోగ్యం
  • కండరాలు తిమ్మిరెక్కడం
  • తలనొప్పి
  • విపరీతమైన చెమట
  • అలసట, నీరసం

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వడదెబ్బ తగిలిన వ్యక్తులు అరగంటలో తేరుకుని, లేచి కూర్చోగలిగితే పెద్ద ప్రమాదం ఉండదు.

బ్రిటిష్ ఆరోగ్య వ్యవస్థ ఇచ్చే సలహాలు:

  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి తరలించాలి.
  • వారిని పడుకోబెట్టి కాళ్లు కాస్త పైకి ఉండేలా చూడాలి.
  • బాగా నీరు లేదా చల్లని పానీయాలు తాగించాలి.
  • శరీరాన్ని చల్లబరిచేందుకు నీళ్లు చిలకరించడం లేదా తడిబట్ట/స్పాంజితో తుడవాలి
  • శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు మెడ కింద, చంకల్లో ఐసు ముక్కలు లేదా కోల్డ్ కంప్రెస్ పెట్టడం కూడా మంచిదే.

అయితే, వడదెబ్బ తగిలిన అరగంటలో ఆ వ్యక్తి కోలుకోకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలి

వడదెబ్బ తగిలినవారికి ఒక్కోసారి చెమటలు పట్టకపోవచ్చు. శరీరం మరీ వేడెక్కిపోతే చెమటలు పట్టవు. అంటే శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోతే మూర్ఛ రావొచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు.

వేసవి

ఫొటో సోర్స్, Getty Images

వడదెబ్బ తగిలే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

ఆరోగ్యంగా ఉన్నవారికి ఉష్ణోగ్రతలు పెరిగినా వడదెబ్బ తగలకపోవచ్చు. కానీ, వృద్ధులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులతో బాధ పడేవారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ. వాతావరణంలో వేడి, శరీరంపై పెంచే ఒత్తిడిని వీరు తట్టుకోలేకపోవచ్చు.

డయాబెటిస్ టైప్1, టైప్ 2 ల వల్ల శరీరం వేగంగా నీటిని కోల్పోతుంది. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రక్తనాళాల్లో మార్పులు వచ్చి చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవచ్చు.

ముందుగా, శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉందని, చల్లబరచుకోవడానికి ఏదైనా చేయాలని గ్రహించగలగడం చాలా ముఖ్యం.

మనలో చాలామంది దీన్ని గుర్తించరు. సర్దుకుంటుందిలే అనుకుంటాం. అదే పొరపాటు. వేడి చేసిందని తెలియగానే నీరు ఎక్కువగా తాగుతూ, నీడలో ఉంటూ విశ్రాంతి తీసుకోవాలి.

పసి కందులకు, పిల్లలకు కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువే.

డెమెంటియా లాంటి మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు గుర్తించలేరు. వీరికి కూడా వడదెబ్బ తగిలే అవకాశాలు అధికంగా ఉంటాయి.

సరైన వసతి లేనివారు, ఇల్లు లేక రోడ్ల మీద ఉండేవారికి వేడి తాకిడి ఎక్కువగా ఉంటుంది.

భవనాల పై అంతస్తుల్లో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని మందులు ప్రమాదాన్ని పెంచుతాయా?

నిజమే. కానీ, వైద్యుల సలహా తీసుకోకుండా మందులు ఆపేయకూడదు. నీరు ఎక్కువగా తాగుతూ, ఎండకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి.

డైయూరెటిక్స్ అంటే మూత్ర విసర్జన పెంచే మందుల వల్ల శరీరంలోని నీరు అధికంగా బయటకు పోతుంటుంది. ఈ మందులను అధిక రక్తపోటు తగ్గించేందుకు, గుండె జబ్బులను నివారించేందుకు కూడా వాడతారు.

కానీ, వీటి వల్ల డీహైడ్రేషన్ కూడా అవ్వొచ్చు, శరీరంలో లవణాల సమతౌల్యం దెబ్బతినొచ్చు.

రక్తపోటును తగ్గించే యాంటీ హైపర్‌టెన్సివ్ మందుల వలన కూడా సమస్యలు రావొచ్చు. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరంలో బీపీ తగ్గుతుంటుంది. ఈ మందులు బీపీ స్థాయిని మరింత తగ్గించేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది.

ఎపిలెప్సీ, పార్కిన్సన్స్‌లకు వాడే మందులు చెమట పట్టకుండా నిరోధించవచ్చు. ఫలితంగా, శరీరం చల్లబడే అవకాశాలు తగ్గిపోతాయి.

శరీరం ఎక్కువగా ద్రవాలు, లవణాలను కోల్పోయినప్పుడు లిథియం, స్టాటిన్స్ లాంటి ఇతర ఔషధాలు రక్తంలో సాంద్రతను పెంచి మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు.

చిన్నపిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ

ఫొటో సోర్స్, NATHAN HOWARD/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చిన్నపిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ

వడగాడ్పులు ప్రాణాంతకమా?

అవును. ప్రతి సంవత్సరం అధిక ఉష్ణోగ్రతల వలన వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. శరీర ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచే ప్రయత్నంలో గుండె పోటు, స్ట్రోకులు వస్తాయి.

థర్మామీటర్‌లో 25-26 డిగ్రీల సెల్సియస్ దాటడం మొదలవగానే మరణాల రేటులో పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది.

అయితే, మండు వేసవిలో కన్నా వసంతంలో లేదా గ్రీష్మం ఆరంభంలో వచ్చే అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఎక్కువమంది చనిపోతున్నారని డాటా సూచిస్తోంది.

దీనికి కారణం వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులే కావొచ్చు. వేసవి పెరుగుతున్నకొద్దీ ఎండలతో ఎలా వేగాలో మనం నేర్చేసుకుంటాం. గతంలో జరిగిన పరిణమాలను గమనిస్తే వడగాడ్పులు వీచడం ప్రారంభమైన మొదటి 24 గంటల్లో అధిక మరణాలు సంభవించాయని తెలుస్తోంది.

మంచు తుఫానులు వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆరంభంలో బాగానే ఉంటుంది. చలి పెరుగుతున్నకొద్దీ ప్రాణాంతకం అవుతుంది.

పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పులు

సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలే అధికంగా ఉంటాయిగానీ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా కీలకమే. ఎందుకంటే శరీరానికి విశ్రాంతి కావాలి. శరీరం ఉష్ణోగ్రతను స్థిరంగా నిలపడానికి పగలనక, రాత్రనక కుస్తీ పడుతుంటే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

రాత్రయినా ఈ పని నుంచి శరీరానికి విశ్రాంతి కావాలి.

నీడన ఎక్కువగా ఉండటం, నీళ్లు ఎక్కువ తాగడం వేడిని ఎదుర్కోవడంలో ప్రధానం

ఫొటో సోర్స్, ALEXANDER NEMENOV/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, నీడన ఎక్కువగా ఉండటం, నీళ్లు ఎక్కువ తాగడం వేడిని ఎదుర్కోవడంలో ప్రధానం

వడగాడ్పులను ఎలా ఎదుర్కోవాలి?

ఒక్కటే మార్గం..నీడ పట్టున ఉండాలి, బాగా నీరు తాగాలి. వేసవి సెలవులను ఆహ్లాదంగా గడపాలంటే మన అలవాట్లను కొద్దిగా మార్చుకోవాలి.

10 కి.మీ. మారథాన్ పరిగెత్తాలనిపిస్తే, పగలో, మిట్ట మధ్యాహ్నమో పరిగెత్తడం అవసరమా లేక సాయంత్రం చల్లబడ్డాక పరిగెత్తడమా అనేది మీరే నిర్ణయించుకోవాలి.

బాగా నీరు తాగుతూ ఉండాలని గుర్తు పెట్టుకోండి. పాలు, టీ, కాఫీలైనా తాగొచ్చు. కానీ ఆల్కాహాల్ మాత్రం బాగా తగ్గించాలి. ఆల్కాహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి.

మీ చుట్టూ చల్లగా ఉండేలా చూసుకోండి. బయట ఎండ మండిపోతుంటే ఇంట్లోనే ఉండండి. తలుపులు, కర్టెన్లు వేసుకుని చల్లగా ఉండేలా చూసుకోండి.

లేదూ, బయటకి వెళ్లాల్సిందే అనుకుంటే పార్కుకు వెళ్లి చెట్ల కింద నీడ పట్టున కూర్చోండి. కాస్త చల్లగాలి తగిలేలా చూసుకోండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)