నీరు తాగకుండా మీరు ఎన్నాళ్లు బతకగలరు? మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకోవచ్చా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అబిగెయిల్ బీల్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
భూమి మీద జీవం మనుగడలో జలానిదే కీలక పాత్ర. అలాంటి నీరు కాసేపు అందకుండాపోతే మనకు ఏమవుతుంది?
చాజ్‌పావెల్ నిలబడి చూస్తున్నారు. నది ఆయనకు ఎంతో దూరంలో లేదు. బహుశా కొన్ని వందల మీటర్ల దూరంలో ఉండవచ్చు. బండరాళ్ల మీద నుంచి జారుకుంటూ నీరు లోయలోకి ప్రవహిస్తోంది. చూడటానికి అది చాలా దగ్గరగా ఉన్నట్లే ఉంది. కానీ తాను అందుకోలేనంత దూరంలో ఉంది.
“ఆ సమయంలో నేనెంత దాహంతో ఉన్నానో వర్ణించలేను’’ అన్నారు పావెల్. లోయకు ఆనుకుని ఉన్న ఒక కొండ అంచున నిలబడ్డ పావెల్‌కు తీవ్రంగా దప్పికవుతోంది.
గుక్కెడు నీటి కోసం తాను అనుభవించిన వేదనను పావెల్ గుర్తు చేసుకున్నారు. ఇదొక భయంకరమైన అనుభవం అన్నారాయన.“ నా శరీరం వశం తప్పుతున్నట్లు అనిపించసాగింది. ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతోంది’’ వెల్లడించారు పావెల్.
ప్రకృతి మనకు ఇచ్చిన అతి విలువైన పదార్ధం నీరు. అది అందుబాటులో లేని సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు పావెల్. ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌షైర్ ప్రాంతంలో పర్వాతారోహకులకు గైడ్‌గా పని చేస్తున్నారు పావెల్.
అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా ట్యాప్ తిప్పగానే మంచినీరు దొరుకుతుంది. ఇలాంటి ప్రాంతాలలో నివసించే ప్రజలు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వివిధ అవసరాల పేరుతో లీటర్ల కొద్ది నీటిని వృథా చేస్తుంటారు.
కానీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 110 కోట్లమంది ప్రజలు సురక్షితమైన మంచినీటిని పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా 270 కోట్లమంది ప్రజలు సంవత్సరంలో ఒక నెలరోజులైనా సరైన నీరు అందక ఇబ్బంది పడుతుంటారు.
ఈ భూమి మీద నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మన ప్రాణం, శరీరం నీటి ఆధారంగానే మనుగడ సాగిస్తున్నాయి. కాసేపు అది దొరక్కపోతే పరిస్థితి దారుణంగా మారిపోతుంది.

ఫొటో సోర్స్, Chaz Powell
యాత్రికుడి అనుభవాలు
రెండు నెలల యాత్ర సందర్భంగా పావెల్‌కు ఇది బాగా అనుభవమైంది. జాంబియాలోని జంబేరీ నది పుట్టిన ప్రదేశం నుంచి అది ప్రవహించినంత దూరం ఒంటరిగా ప్రయాణించాలని పావెల్ నిర్ణయించుకున్నారు.
తూర్పు అంగోలా మీదుగా నమీబియా, బోట్సువాన సరిహద్దుల నుంచి జాంబియా, జింబాబ్వే సరిహద్దుగుండా ప్రయాణించి ఓ కొండ వాలు ప్రాంతానికి చేరుకున్నారు పావెల్. దీనికి సమీపంలోనే విక్టోరియా జలపాతం ఉంటుంది. ఈ పర్వత ప్రాంతంలో నడక చాలా కష్టం.
“ఇక్కడి లోయలు ఏటవాలుగా, లోతుగా ఉంటాయి. దాదాపు 150 మైళ్ల దూరం వరకు ఇలాగే కొనసాగుతుంది’’ అని అక్కడి పరిస్థితి వివరించారు పావెల్.
అది 2016. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంవత్సరం. పగటిపూట ఒక్కోసారి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలున్నాయి. ఆ సమయంలో ఈ అడవిలో నడక మొదలుపెట్టారు పావెల్.
రోజుకు 36 కిలోమీటర్ల దూరాన్ని అధిగమిస్తూ ఆయన ట్రెక్కింగ్ కొనసాగుతోంది. కానీ ఈ లోయల దగ్గరికి వచ్చే సరికి స్పీడ్ తగ్గింది. “ అప్పట్లో రోజుకు కొన్ని మైళ్ల దూరమే ప్రయాణించే వాడిని. ఏవో కొన్ని చిన్నచిన్న గుట్టలను మాత్రం దాటగలిగేవాడిని. చాలా నెమ్మదిగా నా ప్రయాణం సాగింది’’ అని గుర్తు చేసుకున్నారు.
ఈ వేగంతో నడిస్తే ఈ లోయను దాటడానికి కనీసం నెలైనా పడుతుందని అంచనా వేశారు పావెల్. తనతోపాటు ఎవరూ లేరు. తినడానికి తెచ్చుకున్న పదార్ధాలు అయిపోతున్నాయి.“ అక్కడ నాకు కనిపించింది బబూన్( ఒకరకం కోతి)లు, ఆ లోయలో వేగంగా ప్రవహిస్తున్న సెలయేటి ప్రవాహాలు మాత్రమే’’ అని వివరించారు పావెల్.
రెండు వారాల తర్వాత ఈ కొండల నుంచి బైటపడటానికి వేరే మార్గంలో వెళ్లాలని పావెల్ నిర్ణయించుకున్నారు. ఆ దగ్గర్లోనే ఉన్న ఓ నది జాంబియా వరకు సాగుతుందని మ్యాప్ ద్వారా గుర్తించారు.
“ కొండ పైభాగానికి చేరి అక్కడి నుంచి 20 కిలోమీటర్లు నడిస్తే మరో నది వస్తుందని గుర్తించాను. ఆ దారిలో నడిస్తే మామూలు సమయంకన్నా నాలుగు గంటల ముందే చేరుకోవచ్చని అనిపించింది’’ తెలిపారు పావెల్
చేతిలో కేవలం 2 లీటర్ల బాటిల్ నీళ్లు తీసుకుని కొండపై భాగం మీదకు నడవడం ప్రారంభించారు పావెల్. నది వెంటే కదా నడిచేది అన్న ఉద్దేశంతో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లేవీ చేసుకోలేదు.
అయితే ఆయన నడక ప్రారంభించినప్పటికే ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. మూడు గంటల తర్వాత ఎలాగోలా ఆ లోయ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అది సముద్ర మట్టానికి సుమారు 750 మీటర్ల ఎత్తులో ఉంది. చేతిలో లీటర్ మంచినీరు మాత్రమే ఉంది.
కొండపైకి వెళ్లిన తర్వాత, తాను అనుకున్నదానికి, ఇక్కడున్న పరిస్థితికి చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు పావెల్.
“ కొండ మీద అంతా చదునుగా, నడవడానికి వీలుగా ఉంటుందని భావించాను. కానీ అది అందుకు భిన్నంగా అంతా కర్రా కంపలతో నిండి ఉంది. పైకి వెళ్లి చూశాక తాను వచ్చింది ఆ లోయ ప్రాంతంలోని ఓ చిన్న కొండ మీదకే అన్న విషయం అర్ధమైంది. మూడు గంటలపాటు వెతుక్కుంటూ నడిచినా దారి దొరకలేదు. కానీ చేతిలో ఉన్న బాటిల్‌లో నీరు అయిపోవచ్చింది’’ అని వెల్లడించారు పావెల్.
“ నేను మహా అయితే ఒకటి రెండు కిలోమీటర్లు నడిచి ఉంటాను. కానీ అక్కడక్కడే తిరిగి కొద్ది దూరంలో నిలిచిపోయాను. లాభం లేదని, వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు పావెల్. అయితే తిరిగి వెళదామనుకుంటే తాను వచ్చిన దారి దూరంగా ఉంది. తాను ఓ కొండ అంచు మీద ఉన్నారు. కింద లోయలో నది కనిపిస్తోంది. కానీ అక్కడికి వెళ్లే మార్గం మాత్రం కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Alamy
శరీరానికి ఎంత నీరు కావాలి?
మనిషి శరీరంలో సరాసరిన 60-70% శాతం నీరు ఆక్రమించి ఉంటుంది. అయితే ఆ మనిషి వయసు మీద కూడా ఈ శాతాలు ఆధారపడి ఉంటాయి. చెమట, మూత్రం, మలం, శ్వాస ద్వారా శరీరంలోని నీరు బయటకు పోతూ ఉంటుంది. తింటూ, తాగుతూ మనం దాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. ( శరీరంలోకి చేరే నీటిలో మూడింట ఒకవంతు ఆహారం ద్వారానే చేరుతుంది).
మనం తినకపోయినా, తాగకపోయినా మన శరీరం డీహైడ్రేట్ (నిర్జలీకరణం) అవుతుంది.
డీహైడ్రేషన్ కారణంగా మనకు మొదట కలిగేది దాహం. అప్పటికే మన శరీరం బరువులో 2% తగ్గుదల కనిపిస్తుంది. “ దాహం అనిపించిందంటే శరీరంలో మిగిలిన తేమ కూడా ఖర్చయిపోతుంది’’ అన్నారు గ్యాస్ట్రో ఇంటెస్టెనియల్ సర్జన్ ప్రొఫెసర్ దిలీప్ లోబో .
“ కిడ్నీలు మూత్రాశయానికి నీటిని పంపించడం తగ్గిస్తాయి. మూత్రం చిక్కబడుతుంది. చెమట పట్టడం తగ్గుతున్న కొద్దీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. రక్తం చిక్కబడుతుంది. ఆక్సిజన్ స్థాయిని మేనేజ్ చేయడానికి గుండె ఎక్కువసార్లు కొట్టుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.
“బయట వాతావరణం అనుకూలంగా ఉంటే డీహైడ్రేషన్‌ను ఎలాగోలా కంట్రోల్ చేయవచ్చు. కానీ సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, తీవ్రమైన నడక, శారీరక శ్రమ ఉన్న సమయంలో ఈ డీహైడ్రేషన్ ప్రాణాంతకంగా మారుతుంది.
“ ఉష్ణోగ్రతను తట్టుకునే స్థాయిదాటితే గుండె మీద విపరీతమైన ఒత్తిడిపడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది’’ అని ప్రొఫెసర్ దిలీప్ లోబో తెలిపారు. “చలికాలంలో మరణాల రేట్లు పెరుగుతాయి. కానీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలలో కూడా మరణాలు ఎక్కువగానే ఉంటాయి’’ అని ప్రొఫెసర్ లోబో వివరించారు
బాగా వేడిగా ఉన్న ప్రాంతంలో వ్యాయామం చేసేవారిలో 1.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు చెమట రూపంలో వెళ్లిపోతుందట. సుమారు 200 నుంచి 1500 మిల్లీ లీటర్ల నీరు శ్వాస నుంచి నీటి ఆవిరి రూపంలో వెళ్లిపోతుంది.
అయితే ఇది చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న తేమ, గాలి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
శరీరంలో నీటి పరిమాణం తగ్గగానే దాని ప్రభావం కనిపిస్తుంది. కొద్ది డీహైడ్రేషన్ వల్ల కూడా విపరీతమైన అలసట ఉంటుంది. శరీరం పని చేసే సామర్ధ్యాన్ని కోల్పోతుంది. ఒంట్లో నీరు తగ్గిన కొద్దీ చెమట కూడా తగ్గి తద్వారా శరీరం వేడెక్కుతుంది. ఇలా ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది.
శరీరం తీసుకునే నీటికన్నా బయటకు వెళ్లే నీరు ఎక్కువగా ఉంటే రక్తం చిక్కబడటం ప్రారంభిస్తుంది. దానివల్ల గుండె మీద భారం పడుతుంది.
మూత్రాన్ని బయటకు పంపడం తగ్గించి ఈ నీటి కొరతను తీర్చేందుకు మూత్రపిండాలు ప్రయత్నిస్తాయి. శరీర కణాలలోని నీరు కూడా రక్తంలో కలవడంతో ఆ కణాలు కుచించుకుపోతాయి. నీరు లేకపోవడం కారణంగా మన శరీరం బరువు 4% తగ్గిందంటే బీపీ (రక్తపోటు) పడిపోవడం, మనిషి స్పృహ తప్పడంలాంటి పరిణామాలు ఏర్పడతాయి.
ఇక మూడో దశలో శరీరం బరువు 7% తగ్గిందంటే అవయవాలు పని చేయడం మానేస్తాయి. “శరీరం బీపీని మేనేజ్ చేయడానికి చాలా కష్ట పడుతుంది. ఈ సమస్య నుంచి బైటపడటానికి శరీరం కిడ్నీలు, చిన్నపేగులాంటి అవయవాలకు రక్తాన్ని పంపడం తగ్గిస్తుంది. కిడ్నీల పనితీరుపై దీని ప్రభావంపడి అవి రక్తాన్ని వడకట్టకుండానే పంపడంతో శరీరంలోని మలినాలు పేరుకుంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘‘ఒక్క గ్లాసు నీరు దొరక్కపోతే మనిషి చనిపోతాడు’’ అన్నారు ప్రొఫెసర్ దిలీప్ లోబో.

ఫొటో సోర్స్, Alamy
డీహైడ్రేషన్ వల్ల మరణం ఖాయమా ?
కొన్నిసార్లు కొందరు వ్యక్తులు ఈ తీవ్రమైన డీహైడ్రేషన్ పరిస్థితులను తట్టుకోగలుగతారు. 1984 ఒలింపిక్ మారథాన్‌లో పాల్గొన్న అథ్లెట్ ఆల్బెర్టో సలజార్ ఇందుకు ఉదాహరణ. ఆయన పోటీలో పాల్గొన్న సమయంలో గంటకు 3.06 లీటర్ల నీరు చమట రూపంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అతని శరీరం బరువు 8% తగ్గింది. వెంటనే అతనికి సరిపడా నీళ్లు ఇవ్వడం, వైద్యసిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సలజార్ ప్రమాదం నుంచి బైటపడ్డారు.
ఇక పావెల్ విషయానికి వద్దాం. ఆయన ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. తాగడానికి నీరు అందుబాటులో లేదు. పరిస్థితి విషమిస్తోందని గమనించిన ఆయన అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం చేసే SOS టీమ్‌కు కాల్ చేశారు. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో పావెల్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఆయనలో భయం మొదలైంది.
పరిస్థితి దారుణంగా మారుతుందని గుర్తించిన పావెల్ తన మూత్రం తానే తాగడానికి సిద్ధమయ్యారు. ఆ మూత్రంలో రీహైడ్రేషన్ పౌడర్‌ను అధికంగా కలుపుకున్నారు.
ఒక ఆరోగ్యవంతమైన మనిషి శరీరం నుంచి విడుదలయ్యే మూత్రంలో 95శాతం నీరు, మిగతా 5శాతం కిడ్నీ నుంచి విడుదలైన అమోనియా, ఉప్పులాంటి వ్యర్ధాలు ఉంటాయి. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న వ్యక్తి నుంచి వచ్చే మూత్రం మరింత చిక్కగా, ఇంకా చెప్పాలంటే సముద్రపు నీరులాగా ఉప్పగా ఉంటుంది.
“ డీహైడ్రేషన్ వల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారినప్పుడు మూత్రం తాగడం తాత్కాలికంగా ప్రయోజనకరమే. కానీ మూత్రం మళ్లీ కడుపులోకి వెళ్లిన తర్వాత కిడ్నీలు అందులోని లవణాలను, నీటిని వేరు చేయాల్సి ఉంటుంది. అప్పటికే మూత్ర విసర్జన తక్కువగా ఉండటం వల్ల కిడ్నీలు పొడిగా మారతాయి. మూత్రాన్ని తయారు చేయలేని పరిస్థితిలోకి వెళతాయి. తాత్కాలిక ఉపశమనంగా మూత్రాన్ని తీసుకున్నా అది సరిపోదు’’ అని ప్రొఫెసర్ లోబో తెలిపారు.
మూత్రంలో ఎక్కువ నీరు లేకపోయినా రీహైడ్రేషన్ పౌడర్‌ను అధికంగా వాడటం పావెల్‌కు కొంత వరకు ఉపయోగపడింది. కానీ అది శరీరంలో లవణాల అసమతౌల్యానికి దారి తీస్తుంది. ఒక్కోసారి ఈ అసమతుల్యత మూర్చ, స్పృహ కోల్పోవడంలాంటి వాటితోపాటు బ్రెయిన్ హెమరేజ్‌కు కూడా దారి తీసే ప్రమాదముంది.
తాత్కాలికంగా డీహైడ్రేషన్ నుంచి బైటపడినా, ఆ తర్వాత నుంచి మళ్లీ అది ప్రభావం చూపించడం మొదలైంది. తానెప్పుడో ఓ డాక్యుమెంటరీలో చూసిన విషయాలు పావెల్‌కు గుర్తుకు వచ్చాయి. ఓ జర్నలిస్టు నైలునదిని వెంటనడస్తూ గుండెపోటుకు గురై మరణించాడని ఆ డాక్యుమెంటరీలో చెబుతారు. ఇప్పుడు అదే ఆయన మనసులో మెదులుతోంది. తనకు కూడ అలాంటిదేదో జరుగబోతోందని పావెల్ భయపడిపోయారు.
చివరకు SOSటీమ్ ఆయన కోసం హెలీకాప్టర్‌ను పంపిస్తున్నట్లు తెలిపింది. కానీ అది రావడానికి కనీసం నాలుగు గంటలు పడుతుందని చెప్పారు. “ఈ నాలుగు గంటల్లో నేను చచ్చిపోవడం ఖాయం. ఈ కొండ శిఖరం మీద నుంచి కిందపడో, లేదంటే ఈ శిఖరం మీదనే పడిపోయో ఏదో ఒక రూపంలో చచ్చిపోతానని అనుకున్నాను’’ అని ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు పావెల్.
అక్కడి నుంచి ఎలాగోలా కిందకు దిగుదామని ఒక చెట్టు వేరును పట్టుకుని దిగే ప్రయత్నం చేశారు. కానీ 15 అడుగుల ఎత్తు నుంచి జారిపడటంతో ఆయన ముక్కు పగిలింది.
అయితే చెట్టు వేరును పట్టుకుని కింది దిగాలన్న ప్రయత్నానికి కూడా డీహైడ్రేషన్ ప్రభావమే కారణం. ఎందుకంటే డీహైడ్రేషన్ మెదడుపై ప్రభావం చూపుతుంది. మనసును వికలం చేసి ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ కారణంగా మెదడులోకి నీరు ప్రవేశించడం తగ్గుంది.
చిన్నపాటి డీహైడ్రేషన్‌లు మనిషి జ్జాపకశక్తి, ఏకాగ్రతల మీద ప్రభావం చూపిస్తాయి. కొందరు పెద్ద వయసు వారిలో డీహైడ్రేషన్ మతిమరుపుకు కారణమవుతుందని తేలింది.
ప్రాణం నిలుపుకోవాలన్న బలమైన కోరికతో తనకు కనిపించిన చెట్టును, పుట్టను పట్టుకుని ఎలాగోలా కిందికి దిగారు పావెల్. కానీ అప్పటికే అతను శరీరం చాలా వరకు డస్సిపోయి ఉంది. స్పృహకోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు.
“నా చేతులు రక్తమోడుతున్నాయి. ముఖం నిండా నెత్తురే ఉంది. గాయాలతో కాళ్లు మండుతున్నాయి’’ అని చెప్పారు పావెల్. అయినా ఎలాగోలా అక్కడి నుంచి కిందకు దిగివచ్చారు. నది దగ్గరకు చేరుకున్నారు. మంచినీరు తాగి, సేదదీరి, తాను క్షేమంగానే ఉన్నానని రెస్క్యూటీమ్‌కు చెప్పడానికి దాదాపు గంటసేపు పట్టింది.
“నీరు తాగానికి ప్రయత్నించడం, చెట్టు నీడన కూర్చోవడంలాంటివి పావెల్‌కు ఎంతో మేలు కలిగించాయి. నీడలో కూర్చోవడంవల్ల శరీరం వేడెక్కడం తగ్గుతుంది. డీహైడ్రేషన్ ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది’’ అని లండన్‌లో ఎమర్జెన్సీ మెడికల్ ట్రైనర్‌గా పని చేస్తున్న నటాలీ కూక్సన్ వెల్లడించారు. నీరు దొరకగానే వెంటనే తాగడం బాగా పని చేసిందని, ఇలా చేయడం వల్ల త్వరగా కోలుకోవచ్చని నటాలీ అన్నారు.
పావెల్ వెంటనే రీహైడ్రేషన్ ప్రక్రియను మొదలు పెట్టకపోయినట్లయితే శరీరంలో అక్యూట్ ట్యూబ్యులర్ నెక్రోసిస్ అనే కిడ్నీ సంబంధ సమస్య ఏర్పడేది. శరీరంపై అదనపు భారంవల్ల గుండె మీద ఒత్తిడి పడటం, బీపీ పెరగడం, స్పృహ కోల్పోవడంలాంటి పరిస్థితులు ఏర్పడేవి. ఒక్కోసారి డీహైడ్రేషన్‌కు గురైనవారు కోలుకోవడానికి వారం కూడా పట్టొచ్చు.
వాతావరణంలో వేడిగా ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో డీహైడ్రేషన్ సమస్య తీవ్రతను పెంచుతుంది.
“ఇలాంటి ఉష్ణోగ్రతలను శరీరం నిభాయించుకోలేక పోతే సాధారణ జీవక్రియలు కూడా దెబ్బతింటాయి. మెదడు, ఊపిరితిత్తులు, గుండె పనితీరు మీద ప్రభావం పడుతుంది’’ అని కూక్సన్ వెల్లడించారు. దీనివల్ల చివరకు స్పహతప్పడం, అవయవాలు పని చేయకపోవడం, కోమా, ప్రాణాలు పోవడం వరకు ఏదైనా జరగొచ్చు’’ అన్నారు కూక్సన్.

ఫొటో సోర్స్, Chaz Powell
నీరు లేకుండా ఎన్నాళ్లు బతకగలం?
మనిషి నీరు లేకుండా ఎంతకాలం బతకగలడు అన్నది చాలా కాలం నుంచి వినిపించే సందేహం. అయితే ఆహారం, నీరు లేకుండా కొన్నిరోజుల వరకు మాత్రమే బతికే అవకాశం ఉందని చాలామంది సైంటిస్టులు చెప్పారు.
1944లో ఇద్దరు శాస్త్రవేత్తలు నీరు లేకుండా ఎన్నాళ్లు ఉండగలమోనని సొంతంగా ప్రయోగాలు చేశారు. వారిద్దరిలో ఒకరు మూడు రోజులు, మరొకరు నాలుగు రోజులు ఏ ద్రవం తీసుకోకుండా, కేవలం పొడి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారు.
ఒకటిరెండు రోజుల తర్వాత వారి శరీరంలో మార్పులు కనిపించాయి. ఆహారం మింగడానికి ఇబ్బందులు పడ్డారు. ముఖం పాలిపోయింది. అయితే ఈ పరిస్థితి చివరకు ప్రమాదంగా మారకముందే వారు తమ ప్రయోగాన్ని నిలిపేశారు.
నీరు లేకుండా ఎంతకాలం ఉండగలరనేది ఒక్కొక్క వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొందరి శరీరాలు నీరు ఇవ్వకపోయినా ఏదో ఒక రూపంలో గ్రహిస్తాయనడానికి ఆధారాలు లభించాయి.
1979లో ఆస్ట్రియాకు చెందిన ఆండ్రియాస్ మెహవెసెజ్ అనే వ్యక్తి ఆహారం, నీరు తీసుకోకుండా 18రోజులు గడిపి రికార్డు సృష్టించారు. 18 సంవత్సరాల ఆ యువకుడిని ఓ నేరంలో పోలీసులు అరెస్టు చేసి లాకప్‌లో వేశారు. ఆ తర్వాత అతని గురించి మర్చిపోయారు. దీంతో నీరు ఆహారం లేకుండా ఆండ్రియాస్ జైలులో 18రోజులు గడిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు 400వందల కోట్లమంది ఏడాదిలో దాదాపు ఒక నెలపాటు ఇలాంటి డీహైడ్రేషన్ సమస్యను అనుభవిస్తారని అంచనా. వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా ప్రజలకు మంచినీటిని దూరం చేస్తున్నాయి.
2025నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులమంది తాగునీటి సమస్యను ఎదుర్కొంటారని నివేదికలు చెబుతున్నాయి.
పావెల్ తన జీవితంలో ఒకే ఒక్కసారి పదిగంటలపాటు నీరు అందక ఇబ్బందిపడ్డారు. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి బైటపడ్డ ఆయన లివింగ్‌స్టన్‌కు తిరిగొచ్చిన తర్వాత ఒక వారంపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మరో మార్గంలో తన యాత్ర కొనసాగించారు.
137 రోజులు ప్రయాణించి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన జీవితంలో ఒకరోజు జరిగిన ఘటన మంచినీరు ఎంత ముఖ్యమో మనకు ఒక పాఠం నేర్పుతుంది.
ఇవి కూడా చదవండి:
- భారత్-నేపాల్ వివాదం: నేపాల్ ప్రధానితో రా చీఫ్ రహస్య భేటీ, ఆ దేశ అధికార పార్టీకి షాక్
- పాకిస్తాన్లో వంట గ్యాస్ అయిపోతుందా... డిమాండ్ పెరుగుతోంది, సరఫరా తగ్గుతోంది.. ఇప్పుడెలా?
- మాన్సాస్ ట్రస్టు: విజయనగర గజపతి రాజుల వ్యవహారాలు ఇప్పుడు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి?
- 'జాతీయ ప్రతిజ్ఞ'ను స్కూలు పిల్లలు చదువుతున్నారని ఆ రచయితకు 25 ఏళ్ళ తరువాత తెలిసింది
- మహాత్మాగాంధీతో బెజవాడ నాస్తిక కేంద్రానికి ఉన్న బంధం ఏంటి?
- ‘కలకత్తా’లో వేశ్యలకు బలవంతంగా జననేంద్రియ పరీక్షలు
- భారత్‌లో యుద్ధఖైదీ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎలా అయ్యారు?
- బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా ఎందుకు మెరుగ్గా ఉంది?
- చైనా-ఇరాన్ స్నేహం ఎందుకు బలపడుతోంది? ఇది అమెరికాకు ప్రమాదమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








