జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని పునరుద్ధరించిన తీరుపై నిరసనలు

Jallianwala Bagh

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జలియన్‌వాలా బాగ్ ప్రదేశంలో భారత ప్రభుత్వం సౌండ్, లైట్ షోలను నిర్వహిస్తోంది

బ్రిటిష్ కాలం నాటి దారుణమైన మారణకాండకు సాక్ష్యమైన స్మారక వనాన్ని పునరుద్దరించడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అమృత్‌సర్‌లో నూతన హంగులతో తీర్చిదిద్దిన జలియన్‌వాలా బాగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

1919లో జలియన్‌వాలా బాగ్ ప్రాంతంలో సమావేశమైన భారతీయులపై బ్రిటీష్ బలగాలు కాల్పులు జరపడంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు.

భారత జాతీయ ఉద్యమాన్ని ఈ మారణకాండ కీలక మలుపు తిప్పింది.

జలియన్‌వాలా బాగ్‌ ఘటన ప్రదేశంలోని మైదానాలు, రాతి స్మారకాలు, ద్వారాలు భారతదేశపు గంభీరమైన, బాధాకరమైన గతాన్ని గుర్తు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ ప్రదేశానికి హంగులు జోడించింది. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు 1919 ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ప్రతిబింబించేలా సౌండ్, లైట్ షో లను ప్రతిరోజూ నిర్వహిస్తోంది.

బ్రిగేడియర్ జనరల్ ఆర్‌హెచ్ డయ్యర్ ఆధ్వర్యంలోని బ్రిటీష్ సైన్యం, సమావేశం జరుగుతోన్న పార్క్‌లోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన ఇరుకైన సందుల్ని కూడా ఆధునీకరించారు. మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఆ సందుల్లో కుడ్య చిత్రాలతో పాటు శిల్పాలను ఏర్పాటు చేశారు.

కుడ్య చిత్రాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మారక గోడలను కుడ్య చిత్రాలతో అలంకరించారు

అక్కడి అమరవీరుల బావిని పారదర్శకంగా ఉండే తెరతో కప్పి వేశారు. నాడు బ్రిటీష్ సైన్యం బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు ఎంతోమంది ఈ బావిలో దూకినట్లు చెబుతారు.

''కొత్త తరాలు, ఈ పవిత్ర స్థలం చరిత్ర గురించి తెలుసుకునేందుకు, మన గతం నుంచి నేర్చుకునేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని కొత్తగా పునరుద్ధరించిన జలియన్‌వాలా బాగ్ అందిస్తుందని'' ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

కానీ విమర్శకులు మాత్రం భారత ప్రభుత్వం దేశ చరిత్రను చెరిపివేయడానికి, గతాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తుందంటూ విమర్శిస్తున్నారు. దీన్ని మతిలేని చర్యగా పేర్కొంటున్నారు.

''ఇది పురాతనమైన అమృత్‌సర్ నగరాన్ని కాస్త వినోదాత్మకంగా మార్చే ప్రక్రియ'' అని చరిత్రకారుడు కిమ్ వాగ్నర్ అన్నారు. ''ఘటన ప్రదేశాన్ని ఆధునీకరించడం అంటే, ఘటన తాలూకూ మిగిలిన చివరి ఆనవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టడమే'' అని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టు 'చరిత్రను మాయం చేసేందుకు, దానికి ఆకర్షణను జోడించేందుకు' ప్రయత్నించిందని జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, హిస్టోరియన్ చమన్ లాల్ అన్నారు.

''జలియన్‌వాలా బాగ్‌కు వెళ్లినప్పుడు ప్రజలు ఆ ప్రాంతపు బాధను, వేదనను అనుభవించగలగాలి. కానీ అందమైన గార్డెన్లతో ఇప్పుడు అది వినోదం పంచే ప్రదేశంగా మారిపోయింది. నిజానికి అది ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం కాదు'' అని ఆయన ద హిందూ వార్తాపత్రికతో చెప్పారు.

''చరిత్ర, వారసత్వాన్ని పణంగా పెట్టి స్మారక కట్టడాలను కార్పొరేటీకరించారు'' అని ప్రముఖ చరిత్రకారుడు ఎస్ ఇర్ఫాన్ హబీబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

''ఇప్పుడది చాలా అందంగా తయారైంది. ఇంకా ఆ గోడలపై అమరుల కుడ్యచిత్రాలెందుకు ఉంచారు?'' అని ప్రశ్నించారు.

మోదీ సర్కారు నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు కూడా విమర్శలు చేశారు.

''చరిత్రలో మనం ఏం కోల్పోయామో? దేని గురించి పోరాడామో ఆ ప్రదేశాలు గుర్తు చేస్తాయి. కొన్నిసార్లు గతకాలపు బాధను అనుభవించేలా చేస్తాయి. అలాంటి గంభీరమైన ప్రదేశాలను ఆధునీకరించడం, అందంగా తయారు చేయడమంటే మన జాతి చరిత్రకు పెద్ద హాని చేసినట్లే'' అని శివసేన నేత ప్రియాంక చతుర్వేది అన్నారు.

''మా చరిత్రను చెరిపివేస్తున్నారు. ఎందుకు?'' అని బ్రిటీష్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ ట్వీట్ చేశారు.

జలియన్‌వాలా బాగ్ ట్రస్ట్ సభ్యుడు, బీజేపీ ఎంపీ శ్వేత్ మాలిక్ తమ ప్రభుత్వ చర్యను సమర్థించారు.

స్మారకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శనివారం పునఃప్రారంభించిన తర్వాత ప్రజలు స్మారకాలను సందర్శించారు

''సందుల్లో ఏర్పాటు చేసిన శిల్పాలు సందర్శకులకు నాటి అమరవీరులను తల్చుకునేలా చేస్తాయి. గతంలో ప్రజలు వాటి చరిత్ర గురించి తెలుసుకోకుండానే ఆ సందుల ద్వారా నడిచారు. కానీ ఇప్పుడు వారు చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ సందుల్లో నడుస్తారు'' అని ఆయన అన్నారు.

జలియన్‌వాలా బాగ్ ఉదంతం జరిగిన రోజు... భారీగా యుద్ధ పన్నుల విధింపు, భారతీయ సైనికుల బలవంతపు నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ భారత జాతీయవాదులంతా అక్కడ సమావేశమయ్యారు. మరికొందరు అదే సమయంలో సిక్కుల బైశాకి పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. కాల్పులు జరుగుతున్నప్పుడు వారంతా కలిసిపోయారు.

అంతకుముందే బ్రిటీష్ అధికారులు అమృత్‌సర్‌లో 'మార్షల్ లా'ను విధించారు. బహిరంగ ప్రదర్శనలు పెరిగిపోతుండటంతో సమావేశాలను నిషేధించారు.

జనరల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే, బయటకు వెళ్లే మార్గాలు మూసివేసి ప్రజల గుంపుపై కాల్పులు జరపాల్సిందిగా తమ బలగాలను ఆదేశించారు. వారి వద్ద ఉన్న మొత్తం మందుగుండు సామగ్రి అయిపోయిన పది నిమిషాల తర్వాత వారు కాల్పులను ఆపారు.

ఈ ఘటనలో మరణాలసంఖ్య వివాదాస్పదమైంది. బ్రిటీష్ వలసదారులు చేసిన విచారణలో ఈ సంఖ్య 379గా తేలగా.... భారత వర్గాలు ఈ సంఖ్య దాదాపు 1000కి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)