చుండూరు మారణకాండ: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి తుంగభద్రలో విసిరేసిన కేసు ఏమైంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం...
"పొద్దున్న 9 గంటలప్పుడు మా పేటలోకి వచ్చారు. 'పోలీసులు వస్తున్నారు పారిపోండి' అంటూ కేకలు వినిపించాయి. నా కొడుకు కూడా మోదుకూరు వైపు పరుగులు పెట్టాడు. అక్కడ సెంటర్లో పట్టుకుని చంపేశారు’’ అంటూ 1991 ఆగస్టు 6 నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు అంగలకుదురు కోటిరత్నం.
ఆ రోజు జరిగిన మారణకాండలో ఆమె కొడుకు రాజమోహన్ హత్యకు గురయ్యారు.

‘‘అందరినీ అలానే చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ మల్లెతోటలో కొందరిని, మోదుకూరు దగ్గర కొందరినీ నరికి చంపారు. పొద్దుగునికిన తర్వాత వెళ్లి గోతాల్లో ఆ శవాలు వేసి, తుంగభద్ర కాలువలో పడేశారు. ట్రాక్టర్ల మీద రెడ్లు, తెలగాలు కలిసి గుంపులు, గుంపులుగా వెళ్లడం మేమంతా చూశాం. చుట్టు పక్కల ఊళ్ల రెడ్లు కూడా వాళ్లకి తోడుగా వచ్చారు. మూడు రోజుల తర్వాత గానీ శవాలు దొరకలేదు. ఒక్కొక్కరి శవం ఒక్కో చోట కనిపించింది. నా కొడుకు శవాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి, నన్ను గుర్తు పట్టమన్నారు’’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు కోటిరత్నం.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా చుండూరు మండల కేంద్రంలో సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఘాతుకానికి ఆమె ప్రత్యక్ష సాక్షి. ఆ తర్వాత కేసుల్లో కోర్టుకి హాజరయ్యి సాక్ష్యం చెప్పారు. నేటికీ ఆ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నామని ఆమె చెబుతున్నారు.
కోటిరత్నం ఒక్కరే కాదు..చుండూరు నుంచి విడదీసి ప్రస్తుతం అంబేద్కర్ నగర్ పేరుతో ఏర్పాటు చేసిన పంచాయతీ పరిధిలో ఉన్న మాల, మాదిగ కులస్తుల్లో 40 ఏళ్లు పైబడిన వారందరికీ అవి చేదు జ్ఞాపకాలే. తమ కళ్లెదురుగా సొంత మనుషులను కులం పేరుతో నరికి చంపేయడం వారందరికీ మరచిపోలేని అనుభవమే.

దేశమంతా మారుమ్రోగింది
చుండూరులో జరిగిన మారణహోమ ప్రభావం కేవలం అక్కడి స్థానికులకే పరిమితం కాలేదు. దేశమంతా సామాజిక ఉద్యమాల్లో ఈ ఘటన మారుమ్రోగుతూనే ఉంది.
1991 ఆగష్టు 6న జరిగిన ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత తన సోదరుడి మృతదేహం చూసి తల్లడిల్లిపోయిన పరిశుద్దరావు అనే దళితుడు గుండెపోటుతో మరణించారు.
చివరకు కాల్వల్లో గోనె సంచుల్లో దొరికిన శవాల పరిస్థితి చూసి తట్టుకోలేక పోస్ట్ మార్టమ్ నిర్వహించిన డాక్టర్ రవి చందర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆధిపత్య కులాలకు చెందిన వారి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటుగా మృతదేహాలను చూసి ఇద్దరు ప్రాణాలు విడిచారంటే ఈ మారణకాండ ఎంత దారుణంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
కులం పేరుతో చుండూరులో దళితుల ప్రాణాలు తీసిన ఘటనపై దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. అప్పుడు దిల్లీలో జరిగిన చుండూరు దళితుల నిరసన సభలో మాజీ ప్రధాని వి.పి.సింగ్ మాట్లాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగింది. నిందితులను శిక్షించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిరాహారదీక్ష చేపట్టిన శిబిరం వద్ద జరిగిన పోలీస్ కాల్పుల్లో కొప్పెర్ల అనిల్ కుమార్ అనే యువకుడు ప్రాణాలు పోయారు. దిల్లీలో ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లిన వారిలో ఓ మహిళ ప్రమాదవశాత్తూ మరణించారు.

కారంచేడు దారుణాలను తలపించేలా
ప్రకాశం జిల్లా కారంచేడులో 1985లో జరిగిన దారుణాలను చుండూరు ఘటన తలపించింది. కులం పేరుతో జరిగిన దారుణాల్లో ప్రధానంగా చెప్పుకునే కారంచేడు ఘటన జరిగి ఆరేళ్లు తిరగ్గానే చుండూరులో దారుణం జరిగింది.
కారంచేడులో చెరువు నీటి విషయంలో మొదలయిన వివాదంలో అగ్రకులాకు చెందినవారు దళితుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడలేదు. సరిగ్గా అదే పంథాలో హైస్కూల్లో అందరితో సమానంగా దళిత విద్యార్థులను కూర్చోనివ్వాలనే విషయంలో మొదలయిన తగాదా చినికి చినికి గాలివానలా మారింది.

ఆ తర్వాత 1991 జూలై 22న సినిమా థియేటర్లో కుర్చీకి కాలు తగిలిందనే కారణంతో రవి అనే దళిత యువకుడిపై దాడికి యత్నించడం, దళితులు ప్రతిఘటించడంతో చుండూరు రెడ్లు, తెలగ కులస్తులు రగిలిపోయారు.
దళిత వర్గాల నుంచి ఎదురు తిరిగే యువత రావడంతో సహించలేని పరిస్థితిలో సాంఘిక బహిష్కరణ చేశారు. బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన ఫలితాలు రాలేదు. చివరకు పోలీసులు ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో కూడా తాము ఉండబోమని రెడ్లు తెగేసి చెప్పడంతో సమస్య ముదిరింది.

ఆగస్ట్ 5న మొదలు...
చుండూరు అప్పటికే మండల కేంద్రం. సంఖ్య రీత్యా మాల, మాదిగ జనాభా ఎక్కువే. అయినప్పటికీ భూమి ఎక్కువగా రెడ్లు, తెలగాల చేతుల్లో ఉంది. దాంతో ఇరిగేషన్ సదుపాయాలు అభివృద్ధి చెంది భూముల ద్వారా ఆదాయం పెరిగిన వర్గాలు గ్రామం మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించాయి.
అదే సమయంలో వివిధ కారణాలతో దళితులలో చదువు పట్ల ఆసక్తి పెరిగింది. గ్రామంలో ఆనాటికే ఎస్సీలలో 100మంది వివిధ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. రైల్వే పనులు చేసుకుంటున్న వారు కూడా స్థిరమైన ఆదాయంతో గడుపుతున్నారు.
వ్యవసాయంలో కూడా రెడ్లు, తెలగాల భూములు కౌలు చేసుకుంటూ మాల, మాదిగలు కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే దశలో ఉన్నారు. రిజర్వేషన్ కోటాలో ఆ మండలాధ్యక్ష పదవి కూడా ఎస్సీలకు దక్కింది.
చదువుకున్న ఎస్సీ యువకుల్లో ప్రశ్నించడం, ఎదురు తిరగడం మొదలైన తర్వాత దానిని ఆధిపత్య కులాలకు చెందిన వారు సహించలేని పరిస్థితి ఏర్పడింది.
చిన్న చిన్న వివాదాలన్నీ కలిసి ఆగష్టు 5న ఎమ్మార్వో ఆఫీసుకి బయలుదేరిన రేషన్ డీలర్ గోళ్లమూడి యాకోబుపై మెయిన్ సెంటర్లో అందరూ చూస్తుండగానే దాడి చేసేదాకా వెళ్లింది. అప్పటికే గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ లెక్కచేయకుండా డీలర్ మీద దాడికి పూనుకోవడంతో ఉద్రికత్త పెరిగింది.
"అప్పటికే రెండు మూడు సార్లు గ్రామ నౌకర్లు వచ్చి కుబురు పెట్టారు. డీలర్ల మీటింగ్ జరుగుతుంది రావాలని. దాంతో మావాళ్లంతా ఎవరిళ్లల్లో వారున్నప్పటికీ నేను ఏ వివాదంలో లేను కదా అనే ధీమాతో బయలుదేరాను. మా పేట దాటి సెంటర్ కి వెళ్లే సరికి ఒక్కసారిగా ఓ 60 మంది గుంపుగా మీద పడ్డారు’’ అని యాకోబు ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు.
‘‘అరుగుల మీద కూర్చున్న పెద్దల దగ్గరకి పరుగు పెట్టాను. వాళ్ల దగ్గర ఒంగుని దణ్ణం పెడుతూ నాకూ ఈ గొడవలకు సంబంధం లేదని చెబుతున్నాను. ఈలోగా నా కాలు మీద గొడ్డలితో వేటు వేశారు. మరొకరు కత్తితో నరికారు. గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలోనే ఉన్న పోలీసులు వచ్చారు. వాళ్లని చూసి అంతా చెల్లాచెదరయిపోయారు. నన్ను తెనాలి ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని ఆనాటి ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
అప్పటికే గ్రామంలో రెండు రేషన్ డీలర్‌షిప్ రిజర్వేషన్లలో ఎస్సీలకు దక్కగా నేటికీ యాకోబు డీలర్ గా జీవనం సాగిస్తున్నారు.

నిందితులకు పోలీసుల సహకారం
రేషన్ డీలర్ పై జరిగిన దాడితో రగలిపోయిన ఎస్సీలలో కొందరు, బహిర్భూమికి వెళుతున్న ఓ రెడ్డి కులస్తుడిపై దాడికి పాల్పడ్డారు. ఆయన వికలాంగుడు కూడా. ఆయన తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది.
దానికి ముందే విజయ్ పాల్ అనే యువకుడు రెడ్డి కులానికి చెందిన ఓ మహిళను వేధించే ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు. ఈ ప్రతిదాడితో రెచ్చిపోయిన రెడ్లు, తెలగ కులస్తులు గ్రామంలోని ఇతర కులాల వారిని కూడా తమ వెంట రావాలని ఆదేశించారు.
‘‘అంతా కలిసి ప్రణాళిక ప్రకారమే ఆగష్టు 6 ఉదయం దాడి చేశారు. పోలీసులు కూడా వారికి సహకరించడం వల్లే అంత దారుణం జరిగిపోయింది’’ అని చుండూరు బాధితుల తరుపున ఉద్యమానికి నాయకత్వం వహించి ఎం. సుబ్బారావు బీబీసీతో అన్నారు.
"అప్పటికే 15 రోజుల నుంచి మాకు కౌలుకిచ్చిన భూములు తీసేసుకున్నారు. కూలీ పనులు చెప్పడం లేదు. కిరాణా దుకాణాల్లో మాకు సరుకులు ఇవ్వడం లేదు. అయినా సమస్యలతో నెట్టుకొస్తున్నాం. ఆగష్టు 5 ఘటనల తర్వాత పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సింది. కానీ అంతా బాగానే ఉందని చెబుతూ తాత్సారం చేశారు. చివరకు 6వ తేదీ ఉదయం ముఖ్యులందరం తెనాలి వెళ్లాం. ఆ తర్వాత 9గం.లకి పోలీసులు పేటలోకి వచ్చారు. దాడి చేసిన వారందరినీ అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో అంతా పొలాల వైపు పరుగులు పెట్టారు’’ అని సుబ్బారావు తెలిపారు.
‘‘మగాళ్లు, చదువుకున్న కుర్రాళ్లంతా కొందరు మోదుకూరు వైపు, కొందరు రైల్వే ట్రాక్ వైపు పరుగులు పెట్టారు. పేటలోంచి తరిమేస్తే పొలాల వైపు వెళ్లారు. అక్కడే కాచుకుని కూర్చున్న రెడ్లు, తెలగాలకు దొరికిపోయారు. ఇంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. పొలాల్లో చావు కేకలు వినిపిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. పైగా వాళ్లంతా పనులు చేసుకుంటూ పాడుతున్న పాటలంటూ ఎద్దేవా చేశారు. దీంతో 8 మంది దారుణంగా హత్యకు గురయ్యారు" అంటూ ఆయన వివరించారు.

అంత్యక్రియల్లోనూ వివాదమే
ఘటనా స్థలంలో 8 మంది హత్యకు గురయ్యారు. మృతుల్లో దేవరపల్లి జయరాజు, మాండ్రు రమేష్, రూబేను, జాలాది ఇమ్మానుయేలు, జాలాది ముత్తయ్య, మల్లెల సుబ్బారావు, జాలాది ఐసాక్, అంగలకుదురు రాజమోహన్ ఉన్నారు. వారి మృత దేహాలను గోనె సంచుల్లో మూటగట్టి తుంగభద్ర కాలువలో పడేయడంతో వాటి కోసం మూడు రోజుల పాటు గాలింపు సాగింది.
చివరకు కుళ్లిపోయి, అత్యంత దుర్భర స్థితిలో దుర్వాసనతో ఉన్న మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టమ్ తర్వాత అంత్యక్రియలు నిర్వహించే విషయం కూడా వివాదమైంది. మృతదేహాలను పూడ్చే స్థలం విషయంపై చివరకు నాటి గుంటూరు కలెక్టర్ నాగార్జున, ఎస్పీ ఆర్పీ మీనా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని 8 మందికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగా ఉన్నట్టు కనిపించడం లేదు. పిచ్చి మొక్కలు, చిరిగిన ఫ్లెక్సీ మాత్రం దర్శనమిచ్చాయి. ఏటా ఆగష్టు 6న నివాళులర్పించే కార్యక్రమం జరుగుతోంది.

న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం
గుంటూరు జిల్లా చుండూరు, అమృతలూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం-89 కింద 148, 302, 207, 201, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కానీ నిందితుల అరెస్టులు, బాధితులకు న్యాయం జరగడం లేదంటూ నిరసన కార్యక్రమాలు పెద్ద స్థాయిలో జరిగాయి. దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారావు నేతృత్వంలో పోరాటం సాగింది.
ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్థన్ రెడ్డి బాధితులను పరామర్శించేందుకు చుండూరు వచ్చారు. కానీ తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చుండూరు బాధితుల పోరాట కమిటీ నిరసనలు తెలిపింది.

చుండూరు బాధితుల పక్షాన ఉద్యమం సాగుతుండగానే సర్వజన సంక్షేమ సమితి పేరుతో పోటీ ఉద్యమం కూడా జరిగింది. వివిధ రూపాల్లో ఆ సంస్థ ఆందోళన చేసింది. చివరకు గుంటూరులో ఏసీ కాలేజీపై దాడి సందర్భంగా పోలీసు కాల్పుల వరకూ వెళ్లింది.
ఈ కేసులో విచారణ కోసం చుండూరులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని 107 మంది ఎంపీల సంతకాలతో లేఖలను రాష్ట్రపతికి ఇచ్చారు. తొలుత ప్రత్యేక కోర్టు విచారణ చేయాలని డిసెంబర్ 12, 1991 లోనే హైకోర్టు ఆదేశించిన అది అమలు కాలేదు. 1994 చివరిలో విచారణ ప్రారంభమయ్యింది.
విచారణ జాప్యం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని బాధితులు చెబుతున్నారు. తొలుత నిందితులు తాము కోర్టు ఖర్చులు భరించలేమంటూ పిటీషన్ వేశారు. ఆ తర్వాత బాధితులంతా క్రిస్టియన్స్ అని, ఎస్సీలు కాదని మరో అభ్యంతరం పెట్టారు.
చివరకు వారు కోర్టులో ఎస్సీలుగా నిరూపించుకోవాల్సి వచ్చింది. అలాంటి ఆటంకాల అనంతరం ఎట్టకేలకు విచారణ జరిగింది. చుండూరులో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక భవనం కూడా నిర్మించారు.
అయితే విచారణ గుంటూరుకి మార్చాలని కూడా నిందితులు కోరారు. కానీ చివరకు చుండూరులో విచారణ సాగింది.
అప్పటికే నిందితులుగా ఉన్న వారిలో 33 మంది చనిపోవడంతో 179 మందిని విచారించారు. ప్రత్యక్ష సాక్షులుగా 79 మందిని విచారించారు. చివరకు 2007 జూలై 31న సంఘటన జరిగిన 16 ఏళ్లకు తీర్పు వచ్చింది.
నిందితుల్లో 123 మంది మీద సాక్ష్యాలు లేవని విడుదల చేశారు. మిగిలిన వారిలో 21 మందికి జీవిత ఖైదు విధించారు. 35 మందికి ఒక సంవత్సరం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చింది.
అయితే ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శిక్షపడ్డవాళ్లంతా హైకోర్టులో అప్పీల్ చేశారు. ఏడేళ్ల తర్వాత 2014 ఏప్రిల్ 22న నిందితులను నిర్దోషులుగా పేర్కొని, అప్పటికీ శిక్ష అనుభవిస్తున్న వారిని హైకోర్టు విడుదల చేసింది.
అంతా నిర్దోషులైతే హత్యలు చేసిందెవరు?
చుండూరు దారుణానికి ఒడిగట్టిన వారిపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవంటూ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో అందరూ నిర్దోషులయితే హత్యలు చేసిందెవరూ అనే ప్రశ్న ఉత్పన్నమయ్యింది. వివిధ సంఘాలు ఈ తీర్పుని తప్పుబట్టాయి. కొందరు సుప్రీంకోర్టుకి వెళ్లారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ విచారణ సాగుతోంది.
"ఏపీ హైకోర్టులో 5 అప్పీళ్లు ఉంటే వాటిని వినకుండానే తీర్పు ఇచ్చేశారు. 60 మందిపై ఆధారాలున్నాయని చెప్పి కొందరికి యావజ్జీవం, మరికొందరికి ఒక ఏడాది శిక్షలు వేసిన తీరుపై అభ్యంతరం చెబుతున్నాం. నిందితులందరికీ ఒకే రకమైన శిక్షలు వేయాలని కోరుతున్నాం’’ అని చుండూరు బాధిత కుటుంబాల తరుపున పిటీషన్ వేసిన జాలాది మోజేస్ బీబీసీకి తెలిపారు.
హైకోర్టు జడ్జిలుగా ఉన్న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తీర్పు అందరినీ నిరాశ పరిచిందని, సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మోజెస్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
అన్నీ మరచిపోయి కలిసిమెలసి ఉంటున్నాం
30 ఏళ్ల క్రితం దారుణాలపై స్పందించాలని చుండూరు రెడ్లు, తెలగాలకు చెందిన పలువురిని బీబీసీ కోరింది. కానీ, చాలామంది ముందుకు రాలేదు. చివరకు ఆ కేసులో శిక్ష అనుభవించిన చిడుపూడి పున్నారెడ్డి ముక్తసరిగా మాట్లాడారు.
"ఆరోజు ఘటన జరగాల్సింది కాదు. అది గాలిదుమారంలా వచ్చింది. అది వాళ్ల తప్పు కాదు. మా తప్పు కూడా లేదు. ఇప్పుడంతా మరచిపోయాం. కలిసి మెలిసి ఉంటున్నాం. మా పొలాలు వాళ్లు చేస్తున్నారు. పనుల్లోకి వస్తున్నారు. గతం తవ్వుకోవడం కన్నా వాటిని మరచిపోవడమే అందరికీ మంచిది" అన్నారాయన.
కోర్టు తీర్పుల్లో న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలందరికీ ఎకరం భూమి ఇల్లు, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఉద్యమ సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ 57 మందికి మాత్రమే ఎకరం చొప్పున ఇచ్చారు. మరో 450కి పైగా కుటుంబాలకు అరెకరం చొప్పున ఇచ్చారు. మరో 30 కుటుంబాల వరకూ భూమి దక్కలేదని సుబ్బారావు బీబీసీకి తెలిపారు.
"వాళ్లిచ్చిన ఎకరం భూమి ఉంది, లక్ష రూపాయలున్నాయి. వాటితో నా బిడ్డ వస్తాడా. ఎవరూ తప్పు చేయలేదని కోర్టులు చెప్పడం వింతగా ఉంది. నిందితులు దర్జాగా తిరుగుతుంటే మా బిడ్డలు గుర్తుకురాకుండా ఎలా ఉంటారు" అని అంగలకుదురు కోటిరత్నం అనే మహిళ ప్రశ్నించారు.
‘దళిత చైతన్యం పెరిగింది’
''ఈ ఘటన తర్వాత దళిత రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి వచ్చింది. చుండూరు ఘటన తరువాత దేశవ్యాప్తంగా దళితుల ఐక్యత మొదలైంది. జాతీయ స్థాయి నేతలను ఈ ఘటన ఒకే వేదిక మీదికి తెచ్చింది. దాని ఫలితంగానే దళిత రాష్ట్రపతి అధికారంలోకి వచ్చారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం మొదటిసారిగా ఘటన జరిగిన గ్రామంలోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాల్సి వచ్చింది. బాధితులకు న్యాయం చేసేలా పునరావాస ప్యాకేజ్ ప్రకటించారు'' అని ప్రముఖ దళిత ఉద్యమకారుడు కత్తి పద్మారావు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








