కర్నాటక: 'ఇక్కడ అగ్ర కులాల వారికే హెయిర్ కటింగ్ చేస్తాం' అంటూ దళితులను కొట్టారు

ఫొటో సోర్స్, Hanumantha
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
"మీరెక్కడున్నా సరే మీ జీవితాలను నాశనం చేస్తామని వాళ్లు బెదిరించారు. మేమెక్కడున్నా, ఏం చేస్తున్నా వాళ్లు మమ్మల్ని విడిచిపెట్టరు. అందుకే మేం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం."
కర్నాటకలోని ఓ గ్రామంలో గత సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హనుమంత చెప్పిన మాటలివి.
27 ఏళ్ల హనుమంత , ఆయన మేనల్లుడు 22 ఏళ్లు బసవరాజు ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ, ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

ఫొటో సోర్స్, HANUMANTHA
అసలు ఏమైంది?
హెయిర్ కటింగ్ విషయంలో ఈ వివాదం మొదలైంది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో హోసాహళ్లి గ్రామంలో కిందటి ఆదివారం జుత్తు కత్తిరించుకోవడానికని హనుమంత, బసవ రాజు వెళ్లారు.
అక్కడకు వెళ్లగానే, "మీరెందుకు ఇక్కడకు వచ్చారు? మేము లింగాయతులకు (ఉన్నత కులం) మాత్రమే జుత్తు కత్తిరిస్తాం. ఇక్కడ హోలేయాలకు (దళితులకు) చోటు లేదు" అంటూ క్షవరం చేస్తున్న వ్యక్తి గద్దించారు.
ఈ గొడవ విని గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటికొచ్చారు.
"ఇది మా స్థలం. ఇక్కడకు మీరు రావడానికి వీల్లేదు అని వాళ్లు దెబ్బలాడడం మొదలుపెట్టారు. మేమెందుకు జుత్తు కత్తిరించుకోకూడదు అని అడిగాం. దాంతో, మమ్మల్ని తోసేశారు. తరువాత అందరూ కలిసి చితకబాదారు. వాళ్లు 20 మంది ఉన్నారు. మేము ఇద్దరమే ఉన్నాం. మేము ఫిర్యాదు చేస్తాం అని చెప్తే, ఏం చేస్తారో చేసుకోండి అని అన్నారు" అంటూ హనుమంత వివరించారు.
హనుమంత చెప్పిన విషయాలన్నీ ఒక వీడియోలో బహిర్గతమయ్యాయి. ఆ వీడియో వైరల్ అయింది.
"మా వాళ్ల అబ్బాయి ఒకడు ఈ సంఘటనను ఫోన్లో వీడియో తీశాడు" అని హనుమంత చెప్పారు.
ఆ గ్రామంలో దళితులవి 20 ఇళ్లు, లింగాయతులవి 500 ఇళ్లు
హనుమంత, బసవరాజు దళిత కాలనీలో నివసిస్తున్నారు. ఆ గ్రామంలో 20 ఇళ్లు దళితులవి అయితే, లింగాయతులవి 500 ఇళ్లు ఉన్నాయి. ముస్లింలు కూడా ఉన్నప్పటికీ వారి సంఖ్య చాలా తక్కువ. పైగా, వారు గ్రామ విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు.
హనుమంత, బసవరాజు ముందు యలబర్గా వెళ్లారు. అక్కడ లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు అన్నీ మూసివేసి ఉండడంతో గ్రామానికి వెనుదిరిగారు.
గ్రామంలో ఓ పెద్ద ఇంటి దగ్గర క్షవరం చేసే వ్యక్తిని సమీపించారు.
"ఈ యువకులిద్దరు హెయిర్ కట్ చేయమని అడిగారు. దాంతో గొడవ మొదలైంది. అక్కడ హెయిర్ కట్ చేస్తున్నవారు ఉన్న స్థలం తన ప్రైవేటు స్థలమని, అక్కడకు దళితులు రావడానికి వీల్లేదని ఆ ఇంటి యజమాని అన్నారు" అని కొప్పల్ పోలీస్ సూపరిండెంట్ టీ శ్రీధర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Arun Sharma/Hindustan Times via Getty Images
ఇది చిన్న సమస్య కాదు
జుత్తు కత్తిరించడం చిన్న సమస్యగా కనిపించవచ్చుగానీ నిజానికి ఇది చిన్న విషయం కాదు.
"దళితులకు జుత్తు కత్తిరించుకోవడం ఓ పెద్ద సమస్యగా మారింది. వెనుకబడిన కులాలకు చెందిన క్షురకులు దళితులకు హెయిర్ కట్ చేస్తున్నారని ఊళ్లో తెలిస్తే మిగతా కులాల వారు వీరి దగ్గర క్షవరం చేయించుకోరు. ఒకప్పుడు బావి నీటి గురించి ఇలాంటి తగాదానే ఉండేది. పైపుల నుంచి నీరు రావడం మొదలైన దగ్గర నుంచి ఈ సమస్య తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ హొటల్‌కైనా వెళ్లి చూడండి.. దళితులకు ప్లాస్టిక్ కప్పుల్లో మంచినీళ్లు, టీ ఇస్తారు. ఉన్నత కులాలవారికి అలా చేయరు" అని రాయచూర్ దళిత సంఘానికి చెందిన ఎం ఆర్ భేరి అన్నారు.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో గ్రామంలో ఇతర వెనుకబడిన కులాలవారు, ముస్లింలు కూడా ఉన్నతకులాల వారికే మద్దతు ఇస్తారు.
గతంలో కూడా ఇలాంటివి జరిగాయి
రాయచూర్ జిల్లా మన్వి తాలూకాలో, బగల్‌కోట్ జిల్లా హుంగుండ్ తాలూకాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని దళిత సంఘం కార్యకర్తలు తెలిపారు.
2020 డిసెంబర్‌లో మైసూర్ జిల్లా నాంజంగుడ్‌లో నాయక్ వర్గం వారు కూడా ఇలాంటి వివాదమే తీసుకొచ్చారు. నాయక్ కులం షెడ్యూల్డ్ తెగల పరిధిలోకి వస్తుంది. కానీ, మైసూర్ జిల్లాలో వీరిది ఆధిపత్య కులం. గ్రామంలోని ఇతర వెనుకబడిన కులాలవారు నాయక్ వర్గానికే మద్దతు ఇచ్చారు.
"అందుకే దళిత వర్గానికి చెందిన యువకులు పట్టణాలకు వెళ్లి హెయిర్ కట్ చేసుకోవాలని సూచిస్తారు. అయితే, దళిత యువతలో వస్తున్న జాగృతి కారణంగా వారు పాత పద్ధతులను ప్రశ్నిస్తున్నారు" అని భేరి అన్నారు.
హనుమంత, బసవరాజులపై దాడి చేసినవారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వారిపై కేసు వేశారు.
గ్రామంలో ఉన్న వాస్తవ పరిస్థితులను హనుమంత వివరిస్తూ.."దళితులు గ్రామంలో నచ్చిన చోటుకు వెళ్లలేరు. మిగతా వర్గాలవారు మాతో మాట్లాడరు. మేము రోజు కూలీలం. పొలాల్లో రోజు కూలీ కింద పని చేస్తాం. చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి పనులు చేస్తాం" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్ వ్యాక్సీన్: భారత్లో టీకా కార్యక్రమం అభివృద్ధి చెందిన దేశాల కన్నా వేగంగా జరుగుతోందన్న మోదీ మాటల్లో నిజమెంత?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- శ్రీలంక: సముద్రంలోకి విషం చిమ్మిన ఎక్స్ప్రెస్ పెర్ల్
- ఎల్జీబీటీ: స్వలింగ సంపర్కానికి చరిత్ర ఉందా...దానిని భావితరాలకు అందించాలన్న డిమాండ్ ఎందుకు వినిపిస్తోంది?
- ఫూలన్ దేవి: కొందరికి వీరనారి... ఇంకొందరికి కిరాతకురాలు
- కేరళ: కుటుంబ సభ్యులకు తెలియకుండా పదకొండేళ్ల పాటు ప్రియురాలిని ఇంట్లోనే దాచిన ప్రియుడు
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్.. అందరూ పన్ను ఎగవేతదారులేనా
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైర
- కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం సామాన్యుల జేబును భద్రంగా చూసుకుందా?
- హైదరాబాద్-విజయవాడ: విమాన ఛార్జీలకు సమానంగా ప్రైవేటు బస్సు టిక్కెట్లు...రవాణా శాఖ ఏం చేస్తోంది
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








