'దేవుడు లేడు.. నన్ను నాస్తికుడిగా గుర్తించాలి' అంటూ పోరాడుతున్న యువకుడు

రవి కుమార్ యువకుడు
ఫొటో క్యాప్షన్, రవి కుమార్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నా దృష్టిలో దేవుడు లేడు. నాకు కులమతాలు లేవు, దేవుడు లేడు అంటూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి" అంటూ హరియాణా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి న్యాయపోరాటం చేస్తున్నారు.

దేవుడు లేడన్న విషయాన్ని తనకు ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడే గ్రహించానని 33 ఏళ్ల రవి కుమార్ చెబుతున్నారు. 'నాస్తికుడు' అనే పదంతో తన రెండు చేతుల మీద ఆయన టాటూ వేయించుకున్నారు.

"ఏటా దీపావళికి మా నాన్న ఒక లాటరీ టికెట్ కొనేవారు. అదృష్టం కలిసిరావాలంటూ లక్ష్మీ దేవికి పూజలు చేసేవారు. కానీ, ఒక్కసారి కూడా మాకు జాక్‌పాట్ తగలలేదు. ఓరోజు నలుగురు అబ్బాయి నన్ను కొడుతుంటే నన్ను కాపాడాలంటూ కృష్ణుడిని వేడుకునున్నాను. కానీ, ఆయన వచ్చి నన్ను రక్షించలేదు" అని రవి కుమార్ గుర్తు చేసుకున్నారు.

హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా టోహానా గ్రామానికి చెందిన రవి కుమార్ మాకు ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించారు. "కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు" అంటూ ఆయన తీసుకున్న సర్టిఫికెట్ అది.

ఆ పత్రాన్ని 2019 ఏప్రిల్ 29న హరియాణా ప్రభుత్వం జారీ చేసింది. దాని మీద స్థానిక అధికారి సంతకం చేశారు.

కానీ, వారం తిరక్కముందే అధికారులు వచ్చి తాము పరిధిని దాటి వ్యవహరించామని, ఆ సర్టిఫికెట్‌ను వెనక్కి ఇవ్వాలని అడిగారు. అందుకు నిరాకరించిన రవి కుమార్, పంజాబ్ హరియాణా ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.

సెప్టెంబర్‌లో ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. "రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం, తాను నాస్తికుడినని చెప్పుకునే హక్కు ఆయనకు ఉంది. కానీ, అందుకోసం సర్టిఫికెట్ అవసరంలేదు" అని న్యాయమూర్తి అన్నారు.

ధ్రువీకరణ పత్రం
ఫొటో క్యాప్షన్, అధికారులు జారీ చేసిన పత్రం

పెయింటర్‌గా పనిచేస్తున్న రవి కుమార్ హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తనకు సాయం చేయాలంటూ రాష్ట్రపతికి ఉత్తరం కూడా రాశారు.

"నాకు సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు చెబుతోంది. కానీ, దాని అవసరం ఉంది. ప్రభుత్వం ప్రజలకు కుల, మత ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నప్పుడు, నేను నాస్తికుడిని అని సర్టిఫికెట్ పొందే హక్కు నాకు కూడా ఉంటుంది. నేను కూడా ఈ దేశ పౌరుడినే" అని రవి కుమార్ అంటున్నారు.

సాధారణంగా మతం మారినప్పుడు మాత్రమే మతానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం అవసరం అవుతుంది. వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు పొందేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలలో రిజర్వేషన్ల కోసం కొన్ని సముదాయాల ప్రజలు కులం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

తాను ఏ పథకం ప్రయోజనాలకూ దరఖాస్తు చేసుకోవట్లేదు కానీ నాస్తికుడినని చెప్పడానికే ఆ సర్టిఫికెట్ తీసుకుంటున్నానని రవి కుమార్ చెప్పారు.

తన పేరు చివరన 'నాస్తికుడ' అని పెట్టుకునేందుకు న్యాయపరమైన అనుమతి ఇవ్వాలనం కోరుతూ 2017 సెప్టెంబర్‌లో ఆయన స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు.

మూడు నెలల తర్వాత 2018 జనవరి 2న ఆయనకు అనుకూలంగా సివిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. అధికారిక దస్త్రాలలో ఆయనను "రవి కుమార్ నాస్తికుడు" అని గుర్తించాలంటూ న్యాయమూర్తి చెప్పారు.

దాంతో, పాఠశాల నుంచి బయటకు వెళ్లేటప్పుడు జారీ చేసే టీసీ, బర్త్ సర్టిఫికెట్‌, ఇతర గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుబుక్కుల్లో రవి కుమార్ తన పేరును మార్చుకున్నారు.

ఆ తర్వాత "నాకు కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు" అని సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మళ్లీ అధికారులకు దరఖాస్తు చేశారు. అప్పుడు ఒక ధ్రువీకరణ పత్రం పొందారు.

వృద్ధుడు
ఫొటో క్యాప్షన్, రవి కుమార్ తాత

తాము ఆలయాలకు, ప్రార్థానా మందిరాలకు వెళ్లడంలేదని, ఎలాంటి మతపరమైన కార్యక్రమాలూ చేయడంలేదని రవి కుమార్ తల్లిదండ్రులు చెప్పారు. అయితే, రవి కుమార్‌కు ఆ సర్టిఫికెట్ వచ్చిన విషయం గురించి వార్తా ఛానెళ్లలో ప్రసారం కావడంతో, తాము అధికారపరిధిని దాటి వ్యవహిరించామని అధికారులకు అర్థమైంది.

"దేవుడు ఉన్నాడా, లేడా అని మేము చెప్పలేం. ఆ సర్టిఫికెట్‌ను వెనక్కి ఇవ్వండి. కులం లేని నాస్తికుడు అని మార్చేసి మరో పత్రం జారీ చేస్తాం" అని అధికారులు అన్నారు. అందుకు రవి కుమార్ నిరాకరించారు.

జనాభా లెక్కల ప్రకారం, 33,000 మంది భారతీయులు తాము నాస్తికులమని ప్రకటించుకున్నారు.

దేవుడి ఉనికి గురించి బహిరంగంగా సవాల్ విసురుతున్న రవి కుమార్, మతాన్ని విడనాడాలని ప్రజలకు సూచిస్తున్నారు.

"దేవుడు ఉన్నాడని ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేకపోయారు. ఎందుకంటే దేవుడు లేడు. దేవుడిని మనిషే సృష్టించారు. దేవుడు లేడు. అదొక పదం మాత్రమే" అని ఆయన అంటున్నారు.

మత విశ్వాసాలను పాటించే కుటుంబంలోనే రవి కుమార్ పుట్టారు. వారి తల్లిదండ్రులు, తాత హిందూ మతాన్ని ఆచరించేవారు. ఆలయాలను సందర్శించేవారు, మతపరమైన పండుగలకు సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించేవారు.

"నా చిత్నతనంలో మా నాన్న నన్ను ఆలయాలకు తీసుకెళ్లేవారు. అప్పుడు చిన్నవాడిని కాబట్టి, అక్కడ ఏం ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో వెళ్లాను. దీపావళి రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే ధనవంతులం అవుతామని మా అమ్మ చెబుతుండేది. మనం ఆపదలో ఉన్నప్పుడు కృష్ణుడు కాపాడుతాడని మా తాతయ్య చెప్పేవారు. కానీ రాజకీయ నేతలు, మతపరమైన సంఘాల నాయకులు కుల మతాలను తమ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారని నేను ఎదిగే క్రమంలో అర్థం చేసుకున్నాను" అని రవి కుమార్ వివరించారు.

ఇద్దరు వ్యక్తులు
ఫొటో క్యాప్షన్, రవి కుమార్ తల్లిదండ్రులు

తాను దాదాపు 20 ఏళ్లుగా మతపరమైన ప్రదేశాలకు వెళ్లడంలేదని, ఆలయాలు, మసీదులు, చర్చ్‌ల కోసం ఖర్చు చేస్తున్న డబ్బుతో పాఠశాలు, ఆస్పత్రుల భవనాలు నిర్మిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

స్కూలు, కాలేజీ వయసులో నాస్తికుడినని ప్రకటించుకోవడం వల్ల తాను కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని రవి కుమార్ అంటున్నారు.

"నేను నాస్తికుడిని అని చెప్పుకోవడం వల్ల మా బంధువులు, స్నేహితులు చాలామంది నన్ను దూరం పెట్టారు. ఇరుగుపొరుగు వాళ్లు నన్ను పిచ్చోడిలా చూసేవారు. పెళ్లి చేసుకుందామంటే, ఎవరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రావట్లేదు" అని ఆయన చెప్పారు.

ఇల్లు
ఫొటో క్యాప్షన్, రవి కుమార్ నాస్తికుడు అంటూ వారి ఇంటి తలుపు మీద రాశారు

రవి కుమార్‌ ఆలోచనా విధానం పట్ల ఆయన తండ్రి ఇందర్ లాల్‌ కూడా మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

"నా కొడుకు నాస్తికుడని అందరూ అంటుంటే మొదట్లో చాలా బాధపడ్డాను. ఓసారి ఎక్కడైనా చనిపోదామని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాను. తర్వాత మనసు మార్చుకుని వెనక్కి వచ్చాను. ఇప్పుడు నేను కూడా నాస్తికుడిని అయ్యాను. ఇప్పుడు ఇంట్లో మతపరమైన ఏ కార్యక్రమాలూ చేయడంలేదు. మతపరమైన ప్రదేశాలకు వెళ్లడం మానేశాం" అని ఇందర్ లాల్ వివరించారు.

ప్రపంచంలో చాలా సమస్యలకు మూలాలు మతంలోనే ఉన్నాయని తనకు అర్థమైందని రవి కుమార్ చెబుతున్నారు.

"భారత్, పాకిస్తాన్‌లు తమ మధ్య సంఘర్షణకు మతాన్ని కారణంగా చూపిస్తున్నాయి. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉంది. మతాన్ని విశ్వసిస్తామని జనాలు అంటారు, కానీ రోజులో 24 గంటలూ ఎన్నో చెడు ఆలోచనలు చేస్తుంటారు. కత్తులు, తుపాకులు పట్టుకుని ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచంలో ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు" అని ఆయన అన్నారు.

"నేను అడుగుతున్నాను, ఒకవేళ దేవుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఉంటే, మరి ప్రజలకు ఇన్ని కష్టాలు, బాధలను ఎందుకు సృష్టించాడు?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు" అని రవి కుమార్ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)