ఆంధ్రప్రదేశ్: ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని’ - ఏపీ మంత్రి మేకపాటి.. ‘మరి జైల్లో ఉంటే..’ సోషల్ మీడియాలో ప్రశ్నలు - Newsreel
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? అన్న సందిగ్ధతపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ‘ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేదు’ అని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘2019 డిసెంబర్‌లో మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు రాజధానులు.. ఆర్థిక రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని గురించి ఏదైతే చెప్పారో, అందులో ఎలాంటి మార్పూ లేదు.
ముఖ్యమంత్రే స్పష్టంగా చెప్పారు.. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా విజయవాడ, న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అప్పట్లో ఏదైతే చెప్పామో దాన్నే అమలు చేస్తున్నాం. ఆ ప్రకారమే న్యాయ రాజధానిని కర్నూలులో పెడుతున్నాం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం రాజధాని అనే సబ్జెక్టే లేదు. సీఎం ఎక్కడ నివాసం ఉంటే అదే రాజధాని అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియేట్, రాజధాని అవుతుంది. నేను రాజ్యాంగం ప్రకారం చెబుతున్నాను. ఆర్టికల్ చాలా స్పష్టంగా చెబుతోంది.. రాజధాని అనే అంశమే లేదని. రాజధాని ఏంటంటే.. అడ్మినిస్టేటివ్.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారో.. ఆయన ఎక్కడ పనిచేస్తారో.. అక్కడే సచివాలయం ఉంటుంది. అది పులివెందుల కావొచ్చు. విజయవాడ కావొచ్చు. లేకపోతే రేపు వైజాగ్ కూడా కావొచ్చన్నమాట’’ అని గౌతమ్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఇచ్చిన సమాధానాల్లో ఏపీ రాజధాని నగరంగా విశాఖపట్నంను పేర్కొని, తర్వాత విశాఖపట్నంను కేవలం నమూనాగా మాత్రమే చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.
కాగా, మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పలువురు యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

సీఎం జగన్ ఇప్పుడు సిమ్లాలో ఉన్నారని, మరి ఏపీ రాజధాని సిమ్లా అవుతుందా? అని ఒక యూజర్ ప్రశ్నించారు.

ఒకవేళ (ముఖ్యమంత్రి) జైల్లో ఉంటే.. అప్పుడు ఏమవుతుంది? అని చాలామంది యూజర్లు ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం జీపీఎస్ ట్రాకర్ ఉపయోగించాలేమో అని మరొక యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

ఎక్కడ అంటే అక్కడ కూర్చుని చేయడానికి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదని, నిబంధనల ప్రకారం (కేంద్ర ప్రభుత్వం) గెజిట్ జారీ చేయాలని, అప్పటి వరకూ (విభజన) చట్టం ప్రకారం హైదరాబాదే ఏపీ రాజధాని అని మరొక యూజర్ కామెంట్ చేశారు.

ఫొటో సోర్స్, UGC
డ్రగ్స్ కేసులో ఈడీ ముందుకు పూరీ జగన్నాథ్.. 10 గంటలపాటు విచారణ
హైదరాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్ మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
ఉదయం 10.15 గంటల సమయంలో పూరీ జగన్నాథ్.. తన సోదరుడు, కుమారుడు, ఛార్టర్డ్ అకౌంటెంట్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు.
రాత్రి 8.30 గంటల వరకు వీళ్లు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. సుమారు 10 గంటలపాటు విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి ఈడీ విచారణ జరిపింది.
ఈ విచారణలో భాగంగా మున్ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని పూరీ జగన్నాథ్‌కు ఈడీ అధికారులు సూచించారు.
విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
మధ్యలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన్ను కూడా విచారణకు పిలిచారేమోనని తొలుత భావించినప్పటికీ.. పూరీ జగన్నాథ్‌ను ఇంతసేపు ఎందుకు వదల్లేదో తెలుసుకోవాలని తానే వచ్చానని బండ్ల గణేశ్ మీడియాకు చెప్పారు. అధికారులు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. విచారణలో ఉన్న పూరీ జగన్నాథ్‌ను బండ్ల గణేశ్ కలవలేదు.

ఫొటో సోర్స్, UGC
ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది.
పూరీ జగన్నాథ్ అనంతరం, సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకాబోతున్నారు.
2017లో హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ కేసులో సినీ ప్రముఖులకు అప్పట్లో ఎక్సైజ్ విభాగం క్లీన్‌చీట్ ఇచ్చింది.
అయితే, అనంతరం వివాదాల నడుమ ఈ కేసును ఈడీ విచారణకు స్వీకరించింది. తాజాగా పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు పిల్లలను బలవంతపెట్టొద్దన్న హైకోర్టు
తెలంగాణలో కరోనావైరస్ లాక్‌డౌన్‌ల అనంతరం, పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఈ అంశంపై రెండు వర్గాల వాదనల అనంతరం హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
''ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు. అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపైనా చర్యలు తీసుకోవద్దు. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలి. వారంలోగా ఈ మార్గదర్శకాలను జారీ చేయాలి''అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై స్టే
మరోవైపు గురుకులాలు, విద్యాసంస్థల వసతి గృహాలను ఇప్పుడే తెరవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ సదుపాయాల్లో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఈ కేసులో తదుపరి విచారణకు అక్టోబరు 4కి కోర్టు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన..
న్యాయ స్థానం ఆదేశాల అనుగుణంగానే ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు మినహాయించి.. ప్రభుత్వ ,ప్రైవేట్ స్కూళ్ళు బుధవారం నుంచి తెరుచుకుంటాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇందిరా రెడ్డి ప్రకటించారు.
అయితే తరగతులు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలా? లేక ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించాలా? అన్నది సంబంధిత స్కూలు యాజమాన్యం నిర్ణయించుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే విద్యా సంస్థలు ఇప్పుడు తెరుచుకోవడం సరికాదు అంటూ హైకోర్టులో పిల్ వేసిన న్యాయవాది బాలకృష్ణ మాట్లాడుతూ.. స్కూళ్ళు తెరుచుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ప్రభుత్వం ఎలా కల్పిస్తుందో, అసలు ఎలాంటి ప్రణాళికలు ప్రభుత్వం అమలుచేయాలనుకుంటోందో నాలుగు వారాల్లో న్యాయ స్థానానికి తెలపాల్సి ఉందన్నారు. అలానే కరోనా మూడో వేవ్ వస్తే దానిని ఎదురుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో కూడా చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- 1945 తరువాత అమెరికా యుద్ధాల్లో ఎందుకు ఓడిపోతోంది
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









