అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు

బీబీసీ విలేఖరి లైస్ డౌసెట్

కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే బూడిద రంగులో ఉన్న భారీ సైనిక విమానాలు కనిపించాయి. అమెరికా, ఇతర దేశాలకు చెందిన మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలు చాలా ఉన్నాయక్కడ.

ఎయిర్‌పోర్ట్ పైన ఆకాశంలో మిలటరీ హెలికాప్టర్లు తిరుగుతున్నాయి.

ప్రతి విమానం దగ్గరా అఫ్గానిస్తాన్ ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ క్యూలు ఎక్కడ ముగుస్తున్నాయో తెలియడం లేదు, అంత పొడవుగా ఉన్నాయి.

వారు వేసుకున్న దుస్తులు, వారితో పాటు కేవలం ఒక సూట్‌కేసు మాత్రమే ఉండాలని వారికి ఆదేశాలున్నాయి.

వాళ్లంతా తమ దేశాన్నే కాదు, అక్కడ తాము అంతవరకు అనుభవించిన జీవితాన్ని కూడా వదిలి వెళ్తున్నారు.

ప్రస్తుతం అమెరికా సైన్యం అధీనంలో ఉన్న కాబుల్ విమానాశ్రయం లోపల 14 వేల మంది అఫ్గాన్‌లు ఉన్నారు. వారంతా తాలిబాన్ల చేతికి చిక్కిన తమ సొంత దేశం నుంచి బయటపడేందుకు విమానమెక్కడానికి వచ్చినవారే.

అక్కడున్న 14 వేల మందిలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బిలాల్ సర్వరీ కూడా ఉన్నారు. తాను కష్టపడి సంపాదించినవన్నీ వదిలేసి వచ్చారాయన. తన కుటుంబం, కొన్ని జతల దుస్తులు మాత్రమే ఆయనతో ఉన్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గతంలో బీబీసీ జర్నలిస్టుగా పనిచేసిన బిలాల్ తన కుమార్తె సోలాను సొంత దేశం అఫ్గానిస్తాన్‌లోనే పెంచాలనుకున్నారు. సోలా అంటే శాంతి అని అర్థం. 2001 నుంచి అఫ్గానిస్తాన్‌లోనే ఆయన ట్రాన్స్‌లేటర్‌గా 20 ఏళ్లు పనిచేశారు.

ఇప్పుడు తానెందుకు అఫ్గాన్ వీడుతున్నాననేది తన కుమార్తె ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుందని ఆయన అనుకుంటున్నారు.

''ఒక తరం అఫ్గాన్‌లు తమ కలలు, ఆశలు, జీవితాలను సమాధి చేసి వెళ్లిపోతున్న రోజు'' అంటూ ఆవేదన చెందారు బిలాల్.

''కాబుల్‌ను మేం సొంతిల్లు అనుకుంటాం. వైరుధ్యాలు ఎన్ని ఉన్నా కాబుల్‌ను సొంత ఇల్లనే అంటాం. ఇక్కడే పెరిగాం మేం. తాలిబాన్లు గతం నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాను. యుద్ధ ట్యాంకులు, బుల్లెట్లకు దూరంగా ప్రతి ఒక్కరూ వారిని వారు చూసుకునే మార్గంలోకి వెళ్తున్నాం'' అన్నారాయన.

గత వారం రోజుల్లో సుమారు 17 వేల మంది అఫ్గాన్‌లు కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లారు.

వారిలో చాలామంది వివిధ వృత్తుల్లో ఉన్నవారు, విద్యావంతులు. వీరంతా వెళ్లిపోతే అఫ్గాన్ ఏమవుతుందన్న ఆందోళన బిలాల్ వ్యక్తం చేశారు. మంచి మనుషులున్న అఫ్గాన్ నుంచి మేధో వలస వల్ల నష్టం జరుగుతుందన్నారు.

విమానాశ్రయంలో లోపల సుమారు 14 వేల మంది ఉండగా ఎయిర్‌పోర్ట గేటు బయట లోపలి వెళ్లేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తూ మరో 10 వేల మంది ఉంటారు.

సమయం గడిచేకొద్దీ బయట ఉన్న ప్రజలు మరింత నిరాశకు గురవుతారు. శనివారం అత్యంత బాధాకరమైన రోజని ఎయిర్‌పోర్ట్ బయట ఉన్న జనంలో తొక్కిసలాట జరిగి చాలామంది మహిళలు మరణించారని అక్కడ ఉన్న రిపోర్టర్లు చెప్పారు.

విమానాశ్రయంలో జనం

తాలిబాన్లు కాబుల్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి ఎయిర్‌పోర్ట్ లోపల, బయట 20 మందికి పైగా మరణించారని నాటో లెక్కలు చెబుతున్నాయి.

ఆదివారం విమానాశ్రయం బయట కొంత రద్దీ తక్కువగా ఉందని, అయినా, తాలిబాన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, జనాన్ని నియంత్రించడానికి కర్రలతో కొట్టారని రాయిటర్స్ వార్తా ఏజెన్సీ చెప్పింది.

అఫ్గాన్‌ను వీడి వెళ్తున్నప్పటికీ దానర్థం తన సొంత దేశాన్ని వదులుకోవడానికి సిద్ధమైనట్లు కాదని బిలాల్ అంటున్నారు.

''అఫ్గానిస్తాన్‌తో మా బంధం ప్రాణాంతక ప్రేమ వ్యవహారం లాంటిది. చివరికి ఏమవుతుందో తెలియదు కానీ మేం దాన్ని వదులుకోం'' అన్నారు బిలాల్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)