జగ్తార్ సింగ్ జోహాల్: పెళ్లయిన 15 రోజులకే అరెస్ట్, నాలుగేళ్లుగా పోలీసుల అదుపులోనే, హిందూ నాయకుల హత్యకు కుట్రపన్నారని ఆరోపణ

జగ్తార్ సింగ్ జోహల్

ఫొటో సోర్స్, FREE JAGGI CAMPAIGN

ఫొటో క్యాప్షన్, జగ్తార్ సింగ్ జోహల్

భారత్‌లోని ఓ జైలులో నాలుగేళ్లుగా బందీగా ఉన్న వ్యక్తి కుటుంబాన్ని కలవాలని బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి డోమినిక్ రాబ్‌ను స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టర్జన్ కోరారు.

స్కాట్లాండ్‌లోని డంబర్టన్‌కు చెందిన జగ్తార్ సింగ్ జోహాల్‌ భారత్‌లో ఖైదీగా ఉన్నారు. కొందరు హిందూ నాయకుల హత్యకు కుట్రపన్నారనే ఆరోపణలతో ఆయనను ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద భారత్‌లో అరెస్ట్ చేశారు.

తనపై తప్పుడు ఆరోపణలు మోపారని, వాటిని అంగీకరించమంటూ చిత్రహింసలకు గురి చేశారని జోహాల్ తన న్యాయవాది ద్వారా గతంలో వెల్లడించారు.

ఎలాంటి విచారణ లేకుండానే తన భర్తను నిర్బంధించడంపై జోహాల్ భార్య ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆమె గతంలో డొమినిక్ రాబ్‌కు రాసిన లేఖలో 'కస్టడీలో జోహాల్‌ను చిత్రహింసలకు గురిచేయడం, ఆయనతో అనుచితంగా ప్రవర్తించడంపై తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు' రాశారు.

అయితే ఈ ఆరోపణలను భారత అధికారులు ఖండించారు. 'జోహాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు, చిత్రహింసలకు గురిచేసినట్లు ఆధారాలు లేవని' అన్నారు.

జగ్తార్ సింగ్ జోహల్

ఫొటో సోర్స్, FREE JAGGI CAMPAIGN

ఎవరీ జగ్తార్ సింగ్ జోహాల్? భారత పోలీసులకు ఎలా చిక్కారు?

2017 అక్టోబర్‌లో తన పెళ్లి కోసం జోహాల్ స్కాట్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు. పెళ్లి వీడియోల్లో జోహాల్ ఉత్సాహంగా బాంగ్రా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు.

పదిహేను రోజుల తర్వాత, తన భార్యతో షాపింగ్ చేస్తున్న సమయంలో జోహాల్‌ను పంజాబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వారి అదుపులోనే ఉన్నారు.

భారత్‌లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల గురించి రాసినందుకు జోహాల్‌ను అరెస్ట్ చేశారని స్కాట్లాండ్‌లో నివసించే ఆయన సోదరుడు గుర్‌ప్రీత్ చెప్పారు.

తమకు సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఈ నెల ప్రారంభంలో మంత్రి స్టర్జన్‌ను గుర్‌ప్రీత్ కలిశారు.

విదేశాంగ కార్యాలయ పనితీరుపై, విదేశాంగ కార్యదర్శిని కలవలేకపోవడం పట్ల గుర్‌ప్రీత్ నిరాశగా ఉన్నారని తెలుపుతూ రాబ్‌కు స్టర్జన్ లేఖ రాశారు.

ఆ లేఖలో జోహాల్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలవాలని ఆమె రాబ్‌ను కోరారు. బాధిత కుటుంబం ఆందోళనలు విని, వారికి సరైన సహాయం అందించాలని పేర్కొన్నారు.

అంతేకాకుండా జోహాల్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలు, సరైన విచారణ లేకుండా జోహాల్‌ను నిర్బంధించడంపై భారత అధికారులను ప్రశ్నించాలని రాబ్‌ను కోరారు.

దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న తన సోదరునితో చివరిసారిగా మూడు వారాల కిందట మాట్లాడినట్లు గుర్‌ప్రీత్ తెలిపారు.

జోహాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, కానీ తన కేసు విచారణలో జరుగుతోన్న ఆలస్యం పట్ల ఆందోళన చెందుతున్నారని గుర్‌ప్రీత్ చెప్పారు.

ఎట్టకేలకు మంత్రి స్టర్జన్‌ను కలిసే అవకాశం రావడం పట్ల గుర్‌ప్రీత్ హర్షం వ్యక్తం చేశారు.

స్టర్జన్‌ను కలిసిన గురుప్రీత్ సింగ్

ఫొటో సోర్స్, GURPREET JOHAL

ఫొటో క్యాప్షన్, స్టర్జన్‌ను కలిసిన గురుప్రీత్ సింగ్

'ఒక బ్రిటన్ పౌరుడు గత 1380 రోజులుగా భారత జైలులో బంధీగా ఉన్నప్పటికీ, అతన్ని విడుదల చేయాలని బ్రిటన్ ప్రభుత్వం కోరకపోవడం చాలా నిరాశ కలిగించే అంశం' అని గుర్‌ప్రీత్ అన్నారు.

హిందూ నాయకులు వరుస హత్యలకు కుట్రపన్నినట్లు జోహాల్‌తో పాటు మరికొందరు వ్యక్తులపై భారత అధికారులు చార్జిషీట్ నమోదు చేశారు.

చార్జిషీట్‌లో జోహాల్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టు గ్యాంగ్ 'ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్' (కేఎల్ఎఫ్) సభ్యునిగా పేర్కొన్నారు.

నేరపూరిత చర్యలకు మద్దతుగా నిలిచేందుకు కేఎల్‌ఎఫ్ మాజీ అధ్యక్షునికి జోహాల్ 3000 పౌండ్లు ఆర్థిక సహాయం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారత్‌లో హత్యలకు సంబంధించిన కుట్ర గురించి జోహాల్‌కు పూర్తి సమాచారముందని, ఆ చర్చల్లో జోహాల్ పాల్గొన్నట్లు చార్జిషీట్‌ల పోలీసులు పేర్కొన్నారు.

'అతనిపై హత్యతో పాటు తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల తీవ్రత గురించి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు కూడా సమాచారమిచ్చాం' అని బీబీసీతో భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు.

జోహాల్ అంశాన్నిగతేడాది నుంచి మానవ హక్కుల సంఘం పరిగణనలోకి తీసుకుంది.

'యూకే ప్రభుత్వం కారణంగా జోహాల్ కేసులో విఫలమవుతున్నారు' అని మానవ హక్కుల సంఘం డిప్యూటీ డైరెక్టర్ హారియట్ మెకాలెక్ అన్నారు.

'ఆయన్ను నిర్బంధించారు. అతనిపై మోపిన ఆరోపణలను బలవంతంగా ఒప్పించారు. దీంతో ఇప్పుడు అతను మరణశిక్షకు దగ్గరయ్యాడు' అని ఆమె అన్నారు.

'జగ్తార్ తరహాలో అన్యాయంగా, యథేచ్ఛగా నిర్బంధానికి గురైన ప్రజల్ని కాపాడటం కోసం యూకే ప్రభుత్వం దేశీయ పాలసీని రూపొందించింది. దీని ప్రకారం జోహాల్‌ను కాపాడటం యూకే ప్రభుత్వ భాధ్యతే. కానీ అతని విషయంలో యూకే ప్రభుత్వం విఫలమైంది' అని ఆమె వివరించారు.

ఈ ఏడాది ఆరంభంలో భారత ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా జోహాల్ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కూడా ఆమె విమర్శించారు.

'జోహాల్ గురించి మా ఆందోళనను నిరంతరం భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. అందులో చిత్రహింసలు, అనుచిత ప్రవర్తన, సరైన విచారణ లేకుండా నిర్బంధించడం గురించి ప్రస్తావించాం. కరోనా కారణంగా భారత పర్యటన ఆగిపోయింది. భారత అధికారులను నేరుగా కలవనప్పటికీ, తరచుగా ఫోన్‌ల ద్వారా జోహాల్‌తో మాట్లాడుతున్నట్లు' విదేశాంగ మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)