సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు

రాణి సొరాయా

ఫొటో సోర్స్, ULLSTEIN BILD VIA GETTY IMAGES

మహిళలు బురఖా ధరించకూడదు. పురుషులకు ఒకే భార్య ఉండాలనే సిద్ధాంతాలను అఫ్గానిస్తాన్ రాణి సొరాయా తార్జి చాలా గట్టిగా నమ్మేవారు.

ఆమె 1919-1929 వరకు అఫ్గానిస్తాన్‌ను పాలించిన అమానుల్లా ఖాన్ భార్య.

శతాబ్దాలుగా గిరిజన సంస్కృతిలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో సొరాయా భావాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు.

కొన్నేళ్ల తర్వాత అమానుల్లా ఖాన్ హోదా చక్రవర్తి నుంచి రాజుగా మారింది. వీరి పాలనలో భార్యాభర్తలిద్దరూ బాలికల, మహిళల విద్య కోసం కృషి చేశారు.

"నేను వారి రాజును. నా భార్య వారి రాణి, విద్యాశాఖ మంత్రి" అని అమానుల్లా ఖాన్ 1926లో ప్రకటన కూడా చేశారు. ఆ దేశాన్ని ఆధునికీకరించే ప్రక్రియలో సొరాయా పాత్రను ఆయన స్పష్టం చేశారు.

అమానుల్లా ఖాన్, సొరాయాల చిన్న కూతురు ‘ప్రిన్సెస్ ఇండియా’ 2014లో ఆమె తల్లి అందించిన వారసత్వం గురించి అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"ఆమె బాలికల కోసం తొలి స్కూలును స్థాపించారు. ఆమె తన పెద్ద కూతుళ్లు ఇద్దరినీ స్కూలుకు పంపడం ద్వారా ఇతరులకు మార్గదర్శకంగా నిలిచారు" అని చెప్పారు.

"మా అమ్మ సాధించిన విజయాలను అఫ్గాన్లు ఇప్పటికీ ప్రశంసిస్తారు".

"మా నాన్నగారు మహిళలు స్వతంత్రంగా ఉండాలని, రాయడం, చదవడం నేర్చుకోవాలని ప్రోత్సహిస్తూ చేసిన ప్రసంగాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు" అని ఆ ఇంటర్వ్యూలో ‘ప్రిన్సెస్ ఇండియా’ చెప్పారు.

ఆ కాలంలో సొరాయా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచారని చరిత్రకారులు కూడా అంగీకరిస్తారు.

సొరాయా

ఫొటో సోర్స్, RYKOFF COLLECTION / GETTY IMAGES

‘చదువుతోనే అభివృద్ధి’

మహిళలు హక్కుల విషయం మాట్లాడేందుకు ఆమె ఎప్పుడూ తన దేశానికి చెందిన మహిళలతో నేరుగా సంప్రదించాలని అనుకునేవారు.

1926లో అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం నాడు సొరాయా తన ప్రసంగంలో చరిత్రలో మహిళలు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడారు.

"మన అందరికీ స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది. అందుకే మనం స్వాతంత్ర్యాన్ని ఉత్సవంగా జరుపుకొంటాం. మన దేశం మొదటి నుంచీ పురుషులను మాత్రమే దేశానికి సేవ చేయమని చెప్పిందనే మాటలను మీరు నమ్ముతారా? మహిళలు కూడా ఈ ప్రయాణంలో భాగం కావాలి. మన దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి" అని అన్నారు.

"మనం కూడా ఈ దేశ అభివృద్ధి కోసం సహకరించాలి. అయితే, జ్ఞానాన్ని సంపాదించకుండా ఇది సాధ్యం కాదు" అని అన్నారు.

"ఇస్లాం తొలినాళ్లలో మహిళలు సమాజానికి సేవ చేసిన రీతిలోనే మనం కూడా సేవ చేయాలంటే, వీలైనంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి" అని మాట్లాడారు.

కాబుల్‌లో 1921లో బాలికల తొలి ప్రాథమిక పాఠశాల ది మస్తురాత్ స్కూల్ స్థాపనకు సొరాయా కారణమని ఆమె కుమార్తె గుర్తు చేసుకున్నారు.

1928 నాటికి మరిన్ని బాలికల పాఠశాలలు ఏర్పడ్డాయి.

"ఆమె అప్పటి కాలం కంటే ముందున్న మహిళ" అని జోనాథన్ గోర్నాల్ , సయెద్ సలాహుద్దీన్‌లు అరబ్ న్యూస్‌లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

"ది మస్తురాత్ స్కూలులో చదువుకున్న కాబుల్‌లోని ప్రముఖ కుటుంబాలకు చెందినవారి 15మంది అమ్మాయిలు, ఉన్నత విద్యనభ్యసించడానికి టర్కీ వెళ్లినట్లు ఆ వ్యాసంలో ప్రస్తావించారు.

యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను విదేశాలకు పంపడాన్ని ఆ రోజుల్లో చాలా మంది ఆశ్చర్యంతో చూశారు" అని షిరీన్ ఖాన్ బుర్కీ "ల్యాండ్ ఆఫ్ ది అన్ కాంకరబుల్: ది లైవ్స్ ఆఫ్ కాంటెంపరరీ అఫ్గాన్ విమెన్" అనే పుస్తకంలో రాశారు.

దేశాన్ని పాశ్చాత్య మార్గం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం సామాజిక సాంస్కృతిక విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని కొంత మంది భావించారు.

అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న సామాజిక పరిస్థితులకు పూర్తి విరుద్ధమైన జెండర్ విధానాలను అమానుల్లా పాలనలో ప్రవేశపెట్టినట్లు ఆ పుస్తకంలో రాశారు.

తల్లితండ్రుల ప్రభావం

సొరాయా తండ్రి మహమూద్ తర్జీ అఫ్గాన్ రాజకీయవేత్త, మేధావి. దేశంలో అనేక అభ్యుదయవాద ఆలోచనలను ఆయన ప్రవేశపెట్టారు.

తండ్రి అభ్యుదయ భావాలు సొరాయాపై ప్రభావం చూపాయి. ఆయనను అనుసరించిన వ్యక్తి అమానుల్లా ఖాన్ ఆయనకు అల్లుడు కావడమే కాకుండా, అఫ్గానిస్తాన్‌కు రాజయ్యారు కూడా.

"మహిళల అభివృద్ధికి సంబంధించిన అంశాలకు రూపకల్పన చేయడం, సంస్కరణలను ప్రవేశపెట్టడంలో తార్జీ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఒకే భాగస్వామిని కలిగి ఉండటం, సొంత కుటుంబంలో మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, బురఖా లేకుండా కనిపించడం లాంటివి తన కుటుంబంలో అమలు చేసి ఇతరులకు ఉదాహరణగా నిలిచారు".

ఈ విషయాన్ని సాన్ డీగో స్టేట్ యూనివర్సిటీలో ఎమెరిటా ప్రొఫెసర్ హుమా అహ్మద్ ఘోష్ రాసిన హిస్టరీ ఆఫ్ విమెన్ ఇన్ అఫ్గానిస్తాన్ - లెస్సన్స్ లెర్న్ట్ ఫర్ ది ఫ్యూచర్" అనే వ్యాసంలో రాశారు. ఈ వ్యాసం జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ స్టడీస్ లో ప్రచురితమైంది.

"అమానుల్లా కూడా బురఖాకు, బహు భార్యత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. బాలికల విద్యను కాబుల్‌లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రోత్సహించారు" అని ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

సొరాయా

ఫొటో సోర్స్, ULLSTEIN BILD VIA GETTY IMAGES

కుటుంబం

సొరాయా నవంబరు 24, 1899లో సిరియాలోని డమాస్కస్‌లో జన్మించారు. అప్పటికి సిరియా ఒట్టోమన్ రాజ్యంలో భాగంగా ఉండేది.

ఆమె అఫ్గానిస్తాన్ వచ్చే వరకూ అక్కడే విద్యనభ్యసించారు.

అమానుల్లా తండ్రి 1901లో అఫ్గానిస్తాన్‌కు చక్రవర్తి అయ్యే సమయానికి ప్రవాసంలో ఉన్న చాలా మంది తిరిగి వచ్చారు.

అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వంలో చేరాలని తర్జీకి ఆహ్వానం అందింది.

అప్పుడే అమానుల్లా, సొరాయా ప్రేమలో పడి 1913లో వివాహం చేసుకున్నారు. హబీబుల్లా హత్యకు గురైన తర్వాత అమానుల్లా అధికారంలోకి వచ్చారు.

"దేశానికి బ్రిటన్ నుంచి విముక్తి లభించిందని ఆయన పట్టాభిషేక సమయంలో ప్రకటన చేశారు".

"రాణి సొరాయా వస్త్రధారణ యూరప్ ఫ్యాషన్‌కు అనుగుణంగా ఉండేది. ఆమె భర్తతో కలిసి గుర్రపు స్వారీకి వెళ్లేవారు. ఆక్స్ఫర్డ్ నుంచి ఆమెకు గౌరవ డిగ్రీ కూడా ఉంది" అని అల్ జజీరా విలేఖరి టాన్యా సౌజియాన్ 2014లో గుర్తు చేసుకున్నారు.

"అఫ్గానిస్తాన్ లో తొలి మహిళల పత్రికను సొరాయా తల్లి అస్మా రస్మియా తర్జీ ప్రారంభించారు. ఈ పత్రికలో చరిత్రలో విజయం సాధించిన మహిళలు, ఇస్లాంలో మహిళలకిచ్చిన ఉన్నత స్థానం వంటి విషయాలు ప్రచురితమయ్యేవి. ఆమె తల్లి సిరియాలో జన్మించారు" అని చెప్పారు.

1927లో మొదలుపెట్టిన ఆ పత్రిక పేరు 'ఎర్షాద్ ఇ నిస్వాన్' (మహిళలకు అవగాహన). సొరాయా కూడాఈ పత్రికను రూపొందించేందుకు ఆమె తల్లికి చాలా సహాయం చేశారు. లింగ సమానత్వానికి సంబంధించిన అంశాలకు ఈ పత్రికలో ప్రాధాన్యం ఇచ్చేవారు.

ఆ తర్వాత అలాంటి ప్రచురణలు మరికొన్ని వచ్చాయి.

లండన్ లోని ఒక ఆసుపత్రిని సందర్శించిన సమయంలో

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లండన్ లోని ఒక ఆసుపత్రిని సందర్శించిన సమయంలో

పర్యటనలు

1927-1928 మధ్యలో రాణి సొరాయా ఆమె భర్తతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ వారికి అనేక సత్కారాలు జరిగాయి.

"యూరప్ దేశాల రాజధానుల్లో తిరిగేటప్పుడు ఆమెకు కొన్ని వందల మంది ప్రజలు అభివాదం చేశారు" అని గోర్నాల్, సలాహుద్దీన్ రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆ పర్యటనలో తమను ప్రభావితం చేసిన సాంఘిక, సాంస్కృతిక సంస్కరణలను స్వదేశంలో అమలు చేయాలని ప్రయత్నించారు.

"కానీ, బురఖా లేకుండా విదేశీ పురుషులతో డిన్నర్ చేస్తున్న, స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న రాణి సొరాయా ఫోటోలు విరివిగా ప్రచారమయ్యాయి" అని అహ్మద్ ఘోష్ గుర్తు చేసుకున్నారు.

"ఇవన్నీ స్వదేశంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి" అని గౌడ్ సౌజియన్ అన్నారు.

"సంప్రదాయ ముల్లాలు, ప్రాంతీయ నాయకులు ఆ ఫోటోలను తమ సంస్కృతి, మతం, మహిళల గౌరవాన్ని నాశనం చేసే అంశాలుగా పరిగణించారు" అని అహ్మద్ ఘోష్ పేర్కొన్నారు.

కొన్ని ఫోటోలను మార్పులూ చేర్పులూ కూడా చేసి ప్రచురించినట్లు కొంత మంది చెబుతారు. అయితే, దేశంలో పరిస్థితులను అస్థిరపరిచేందుకు బ్రిటిష్ వారే ఆ ఫోటోలను గిరిజన ప్రాంతాల్లో ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది.

స్వదేశంలో తలెత్తిన వ్యతిరేక పరిస్థితులతో అమానుల్లా ఖాన్, సొరాయాలు 1929లో ఇటలీకి పారిపోయి తలదాచుకోవాల్సి వచ్చింది. వారి నిష్క్రమణతో వారు ప్రవేశపెట్టిన సంస్కరణలకు కూడా కాలం చెల్లింది.

పారిస్ వీధుల్లో అఫ్గాన్ రాజుకు ఘన స్వాగతం లభించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పారిస్ వీధుల్లో అఫ్గాన్ రాజుకు ఘన స్వాగతం లభించింది.

1928 చివరి నుంచి అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం తీవ్రమైంది. దాంతో, మరి కొన్ని నెలల్లోనే హబీబుల్లా కలకాని అధికారంలోకి వచ్చారు. కానీ, 1929-1933 వరకు ముహమ్మద్ నాదిర్ షా పాలించారు.

ఆయన మద్దతుదారులతో కలిసి బాలికల పాఠశాలలను మూసివేయడం, బురఖాను ప్రవేశపెట్టడం లాంటివి తిరిగి అమలు చేశారని ఒహియో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాసిన "ది లాంగ్ లాంగ్ స్ట్రగుల్ ఫర్ ఉమెన్స్ రైట్స్ ఇన్ అఫ్గానిస్తాన్" అనే వ్యాసంలో పేర్కొన్నారు.

కానీ, అమానుల్లా ప్రవేశపెట్టిన సంస్కరణలను నాదిర్ షా తర్వాత పాలించిన ముహమ్మద్ జాహిర్ షా తిరిగి నెమ్మదిగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన 1933-1973 వరకు పాలించారు.

రాణి సొరాయా 1968లో ఇటలీలో మరణించారు. అంతకు ఎనిమిదేళ్ల ముందే అమానుల్లా మరణించారు.

మిలిటరీ ఎస్కార్టుతో ఆయన శవపేటికను రోమ్ ఎయిర్ పోర్టుకు చేర్చారు. అఫ్గానిస్తాన్‌లో ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.

1927లో టైమ్స్ పత్రిక ప్రచురించిన 20వ శతాబ్దపు అత్యంత ప్రభావశీల మహిళల జాబితాలో రాణి సొరాయా కనిపిస్తారు.

"అమానుల్లా ఖాన్ భార్యగా, రాణిగా 1920లలో ఆమె మధ్యప్రాచ్య దేశాల్లో శక్తిమంతమైన మహిళగా పేరు పొందారు.

అభ్యుదయ భావాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు పేరుంది" అని సుయిన్ హేన్స్ అనే విలేఖరి రాశారు.

అఫ్గానిస్తాన్‌లో బాలికల స్కూలు

"అమానుల్లా ఖాన్ సంస్కరణల మూలంగానే ఈ శతాబ్దం ప్రారంభంలో అఫ్ఘాన్ మహిళలు కొంత వరకైనా మానవ హక్కులను, స్వతంత్రాన్ని సంపాదించుకోగలిగారు" అని హామీదుల్లా బామిక్ అనే పరిశోధనకారుడు 2018లో మహిళల పరిస్థితులపై రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.

కానీ, దురదృష్టవశాత్తూ సోవియెట్ మద్దతుతో పాలించిన కాబుల్ ప్రభుత్వాలు కూలిన తర్వాత ముజాహిదీన్, తాలిబాన్ల పాలనలో ఈ విలువలన్నిటినీ పాతిపెట్టేశారు.

ఈ నెలలో, తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో, మహిళల్లో మళ్లీ భయాలు మొదలయ్యాయి.

గత రెండు దశాబ్దాల్లో వారు సంపాదించుకున్న సాంఘిక, ఆర్థిక హక్కులకు కాలం చెల్లవచ్చని ఊహిస్తున్నారు.

మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చని, బాలికలు స్కూలుకు వెళ్లవచ్చని తాలిబాన్ల ప్రతినిధి జాబీహుల్లా ముజాహిద్ చెప్పినప్పటికీ కూడా అనుమానాలు వెంటాడుతున్నాయి.

"షరియా నిబంధనలకనుగుణంగా మేం మహిళలను ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తాం" అని తాలిబాన్లు చెప్పారు.

షరియా చట్టాన్ని తాలిబాన్లు ఛాందసంగా విశ్లేషించి మహిళల హక్కులను కుదించేస్తారు.

అఫ్గానిస్తాన్‌లో ముఖ్యంగా మహిళల విషయంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయోననే విషయంపై ప్రపంచంలో చాలా దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)