అఫ్గానిస్తాన్: హజారా మైనారిటీ మగవాళ్లను తాలిబాన్లు 'హింసించి ఊచకోత కోశారు'

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లోని హజారా మైనారిటీలకు చెందిన చాలామందిని తాలిబాన్లు ఇటీవల దారుణంగా హింసించి ఊచకోత కోశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
ఘజ్నీ ప్రావిన్స్‌లో జులై ప్రారంభంలో ఈ దారుణాలు జరిగాయని పలువురు సాక్షులు చెప్పారు.
ఆదివారం కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబాన్లు తాము ఎంతో సంయమనంతో ఉన్నట్లుగా చెప్పుకొంటున్నారు.
కానీ, హజారాలపై అకృత్యాలు తాలిబాన్ పాలనకు భయానకమైన సూచన అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
హజారాలు అఫ్గానిస్తాన్‌లో మూడో అతిపెద్ద స్థానిక జాతికి చెందిన ప్రజలు.
షియా ఆచారాలు పాటించే హజారాలు సున్నీ ఆధిపత్య అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లలో తీవ్ర వివక్ష, హింసకు గురయ్యారు.

ఫొటో సోర్స్, EPA
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే
ఘజ్నీ ప్రావిన్స్‌లోని మాలిస్తాన్ జిల్లాలో జులై 4, 6 తేదీల మధ్య 9 మంది హజారా పురుషులను తాలిబాన్లు హతమార్చారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
ఆ హత్యలకు సంబంధించిన ఫొటోలు, ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రచురించింది.
ప్రభుత్వ బలగాలు, తాలిబాన్ల మధ్య పోరాటం తీవ్రమైనప్పుడు తాము కొండల్లోకి పారిపోయామని అక్కడి ముందరఖ్త్ గ్రామస్థులు చెప్పారు.
వారిలో కొందరు ఆహారం తీసుకెళ్లడానికి తిరిగి గ్రామంలోకి రాగా తాలిబాన్లు తమ ఇళ్లను లూటీ చేసి తమ కోసం వేచిచూస్తున్నట్లు తెలుసుకున్నారు.
ముందారఖ్త్ మీదుగా వెళ్తున్న ఇతర గ్రామస్థులను కూడా తాలిబాన్లు దోచుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఆరుగురు పురుషులను తుపాకులతో కాల్చి చంపారని, వారిలో కొందరిని తలలో కాల్చారని.. మరో ముగ్గురిని హింసించి హింసించి చంపారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో రాసింది.
ఒకరి చేతి కండరాలను కోసేశారని... ఇంకొకరి శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేశారని ఓ సాక్షి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎందుకింత కర్కశత్వం’
తమ వారిపై ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఓ వ్యక్తి ప్రశ్నించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. అందుకు తాలిబాన్ ఫైటర్ ఒకరు సమాధానమిస్తూ ''ఇది ఘర్షణ సమయం. అందరూ చనిపోతారు. మీ దగ్గర తుపాకులున్నాయా లేవా అనేది విషయం కాదు. ఇది యుద్ధ సమయం' అన్నారని ఆ సాక్షి చెప్పారు.
ఆమ్నెస్టీ సెక్రటరీ జనరల్ ఆగ్నస్ కలామార్డ్ మాట్లాడుతూ... ''తాలిబాన్ల తాజా కర్కశత్వం వారి గత పాలనను గుర్తు చేస్తోందని, మళ్లీ ఇప్పుడు వారి పాలన ఎలాంటి ముప్పును తేనుందనే దానికి ఇది ఒక భయానక సూచన'' అన్నారు.
తాలిబాన్ల పాలనలో మైనారిటీలకు ఉన్న ముప్పుకు ఇది సూచన అన్నారు ఆగ్నస్.
ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేసి ముప్పు ముంగిట ఉన్న అఫ్గాన్ ప్రజలకు రక్షణ కల్పించాలని ఐరాసను ఆమ్నెస్టీ కోరింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్లు చూస్తే నన్ను అక్కడికక్కడే చంపేస్తారు, చాలా భయమేస్తోంది’ - బీబీసీతో కాబుల్ మహిళ
- ‘వారు నన్ను దెయ్యం అనుకున్నారు’
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








