భారతదేశ సజీవ మృతులు: ‘వారు నన్ను దెయ్యంలా చూశారు’

పదేశర్ యాదవ్
ఫొటో క్యాప్షన్, పదేశర్ యాదవ్
    • రచయిత, క్లోయి హాజిమథేవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోల్‌కతాకు చెందిన పదేశర్ యాదవ్ సజీవంగా ఉన్నారు. కానీ, రికార్డుల్లో మాత్రం ఆయన మరణించినట్లు ఉంది.

దాదాపు 80 ఏళ్ల వయసున్న పదేశర్ తన కూతురు, అల్లుడు చనిపోవడంతో ఇద్దరు మనుమళ్లను పెంచే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.

వారి పోషణ, చదువు కోసం పదేశర్ తనకు సొంతూరులో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొంత అమ్మారు.

అది జరిగిన కొన్ని నెలలకు ఆయనకో ఫోన్ వచ్చింది.

పదేశర్ నుంచి భూమిని కొనుగోలు చేసిన వ్యక్తే ఆ ఫోన్ చేశారు. "పదేశర్ చనిపోయారని మీ మేనల్లుడు చెబుతున్నారు. చనిపోయిన పదేశర్ పేరుతో మోసగాడెవరో నాకు భూమిని విక్రయించారని చెబుతున్నారు" అంటూ ఆ వ్యక్తి ఫోన్‌లో అసలు విషయం చెప్పారు.

ఆ ఫోన్ కాల్‌తో ఆశ్చర్యపోయిన పదేశర్ వెంటనే తానుండే కోల్‌కతా నుంచి ఉత్తరప్రదేశ్‌‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాలో ఉన్న తన సొంతూరికి ప్రయాణమయ్యారు.

పదేశర్ అక్కడకు వెళ్లగానే ఆయన్ను చూసిన ఊరి వారంతా ఆశ్చర్యపోయారు.

వారంతా గుడ్లప్పగించి దెయ్యాన్ని చూసినట్లు చూశారని.. ఆ తరువాత వారు ''నువ్వు చనిపోయావు, నీకు కర్మకాండలు కూడా చేసేశారు'' అని చెప్పారు.

తాను, తన మేనల్లుడు బాగానే ఉండేవాళ్లమని, ఆయన కోల్‌కతా వచ్చినప్పుడంతా తన దగ్గరకు వచ్చేవాడని పదేశర్ యాదవ్ చెప్పారు. అయితే, ఊరిలో ఉన్న భూమిని అమ్మేయాలనుకుంటున్నానని చెప్పిన తరువాత నుంచి తన దగ్గరకు మేనల్లుడు రావడం మానేశాడని ఆయన చెప్పారు.

తనకిప్పుడు అంతా అర్థమైందని, తన భూమిని వారసత్వంగా పొందాలన్న ఆశతో మేనల్లుడు తాను చనిపోయినట్లు ప్రచారం చేశాడని పదేశర్ యాదవ్ చెప్పారు.

సొంతూరికి వచ్చిన పదేశర్‌ను చూసిన ఆయన మేనల్లుడు ''ఈయనెవరో నాకు తెలియదు. నా జీవితంలో ఎన్నడూ ఈయనను చూడలేదు. మా మావయ్య చనిపోయాడు'' అన్నారు.

ఈ పరిణామాలన్నిటితో తొలుత షాక్ తిన్న పదేశర్ ఆ తరువాత 'భారత సజీవ మృతుల సంఘం' (ది అసోసియేషన్ ఫర్ ది లివింగ్ డెడ్ ఆఫ్ ఇండియా)ను సంప్రదించారు.

లాల్ బిహారీ మృతక్
ఫొటో క్యాప్షన్, లాల్ బిహారీ మృతక్

లాల్ బిహారీ మృతక్ ఈ సంఘాన్ని నడుపుతున్నారు. 60 ఏళ్లు దాటిన లాల్ బిహారీ కూడా తన జీవితంలో మూడో వంతు కాలం చనిపోయినవాడిగానే బతికారు.

లాల్ బిహారీ చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు చదవడం, రాయడం రాదు. ఏడేళ్ల వయసులోనే చీరల తయారుచేసే కంపెనీలో పనికి కుదర్చడంతో ఆయన బడి ముఖమే చూడలేదు.

లాల్ బిహారీకి 20 ఏళ్లు వచ్చిన తరువాత సమీప పట్టణంలో సొంతంగా ఒక బట్టల దుకాణం తెరిచారు. అందుకోసం ఆయన బ్యాంకు అప్పుకోసం వెళ్లారు. బ్యాంకు రుణం కోసం పూచీకత్తు కావాలి.

అందుకోసం ఆయన అజామ్‌గఢ్ జిల్లాలోని తన స్వగ్రామం ఖలీలాబాద్‌లో ఉన్న తన వారసత్వ భూమి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ ఉండే రెవెన్యూ ఉద్యోగి లాల్ బిహారీ భూమి పత్రాలు గుర్తించారు. దాంతో పాటే లాల్ బిహారీ చనిపోయారంటూ ఉన్న డెత్ సర్టిఫికెట్ కూడా చూపించారు.

ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన లాల్ బిహారీ తాను బతికేఉన్నానని, మీ ముందే ఉన్నానని ఎన్ని రకాలుగా చెప్పినా అధికారులు ఆయన మాట వినలేదు.

లాల్ బిహారీ చనిపోయినట్లు రికార్డుల్లో ఉండడంతోపాటు ఆయన భూమి కూడా బాబాయి కుటుంబం పేరిట మార్చేసి ఉంది.

ఇది రికార్డుల్లో జరిగిన పొరపాటా లేదంటే తన బాబాయి చేసిన కుట్రా అనేది అప్పట్లో లాల్ బిహారీకి వెంటనే అర్థం కాలేదు.

భూమి పోవడంతో లాల్ బిహారీ వ్యాపారం మూతపడింది. ఆయన కుటుంబం నిరుపేదగా మారిపోయింది. అయితే, లాల్ బిహారీ మాత్రం తాను బతికే ఉన్నట్లు ఎలాగైనా నిరూపించుకోవాలనుకున్నారు.

తనలాంటివారు దేశంలో ఇంకా చాలామంది ఉన్నట్లు ఆయన తెలుసుకున్నారు.

భూములను కాజేయడానికి బంధువులు చేసిన కుట్రలో బతికి ఉన్నా చనిపోయినట్లుగా రికార్డులకెక్కినవారు ఎందరో ఉన్నారని బిహారీ తెలుసుకున్నారు.

అప్పుడే ఆయన 'అసోసియేషన్ ఫర్ లివింగ్ డెడ్ ఆఫ్ ఇండయా' స్థాపించారు. తనలాంటి వారినందరినీ సంఘంలో చేర్చారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 40 వేల మంది సజీవంగా ఉన్నా రికార్డుల్లో చనిపోయినట్లు ఉందని చెప్పారు.

వారిలో చాలామంది పేదలు, నిరక్షరాస్యులు, అట్టడుగు కులాలవారని బిహారీ చెప్పారు.

ఆ తరువాతే ఆయన లాల్ బిహారీ అనే తన పేరుకు చివరన 'మృతక్' అని పెట్టుకున్నారు. చనిపోయినవ్యక్తి అనే అర్థంలో ఈ పదాన్ని ఆయన తన పేరు చివరన చేర్చారు.

తనలాంటి మిగతావారితో కలిసి ఆయన ఎన్నోసార్లు నిరసన ప్రదర్శనలు చేశారు.

చనిపోయినట్లుగా రికార్డుల్లో ఉన్న ఓ రైతుతో మాట్లాడుతున్న లాల్ బిహారీ మృతక్(కుడివైపు వ్యక్తి)
ఫొటో క్యాప్షన్, చనిపోయినట్లుగా రికార్డుల్లో ఉన్న ఓ రైతుతో మాట్లాడుతున్న లాల్ బిహారీ మృతక్ (కుడివైపు వ్యక్తి)

ఆ తరువాత దేశం దృష్టిని ఆకర్షించేందుకు గాను 'సజీవ మృతుడి' పేరు ఎన్నికల బ్యాలట్‌పై ఉండాలని కోరుకుని ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. ఎన్నికలలో పోటీ చేశారు.

తాను బతికే ఉన్నట్లు నిరూపించుకోవడానికి అది కూడా పనిచేయకపోవడంతో ఆయన మూడు సార్లు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి చావు వరకు వెళ్లొచ్చారు.

ఎన్ని చేసినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన లాల్ బిహారీ చివరకు తన బాబాయి కొడుకును కిడ్నాప్ చేయాలనుకున్నారు.

అలా చేస్తే పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని, అప్పుడు తాను సజీవంగా ఉన్నట్లు గుర్తిస్తారని ఆయన భావించారు.

అయితే, లాల్ బిహార్ ప్లాన్ తెలుసుకున్న పోలీసులు ఆ వ్యవహారంలో తలదూర్చకుండా తప్పించుకున్నారు.

అయితే, లాల్ బిహారీ తాను చేసిన ప్రయత్నాల్లో దేనివల్ల కూడా సజీవంగా ఉన్నట్లు నిరూపించుకోలేకపోయారు.

కానీ, అధికారులే చివరకు ఆయన బతికి ఉన్నట్లు తేల్చారు.

ఆజామ్‌గఢ్‌ జిల్లాకు అప్పట్లో కొత్తగా వచ్చిన కలెక్టర్ ఒకరు లాల్ బిహారీ కేసుపై దృష్టిపెట్టి దర్యాప్తు చేసి ఆయన బతికే ఉన్నట్లు తేల్చారు.

దీంతో చనిపోయినట్లు రికార్డులకెక్కిన 18 ఏళ్ల తరువాత లాల్ బిహారీ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు.

దేశవ్యాప్తంగా తనలాంటి సమస్యనే ఎదుర్కొన్న వేలాది మందికి తన సంఘం ద్వారా సాయం చేశానని బిహారీ చెప్పారు.

అయితే, వారిలో అందరికీ తనలా న్యాయం జరగలేదని, కొందరు ఏళ్ల తరబడి పోరాడి విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొందరు న్యాయం జరిగేలోగానే సహజ మరణం పొందారని చెప్పారు.

తిలక్ చంద్
ఫొటో క్యాప్షన్, తిలక్ చంద్

తన పోరాటం ప్రారంభించిన రోజుల్లోనే తనలాంటి మరో వ్యక్తి కూడా కలిసివచ్చారని బిహారీ గుర్తుచేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన పేరు తిలక్ చంద్ ధకాడ్. ఇప్పుడాయన వయసు 70 ఏళ్లు ఉంటాయి. చిన్నతనంలో తాను తిరిగిన తన సొంత పొలాన్ని ఇప్పుడాయన కంచె బయట నుంచి చూస్తున్నారని.. ఆయన చనిపోయేలోగా ఆ పొలంలో మళ్లీ తిరగగలరో లేదో చెప్పలేమని బిహారీ అన్నారు.

తిలక్ చంద్ యువకుడిగా ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో దగ్గరలోని నగరానికి తరలిపోయారు.

దాంతో సొంతూరిలోని తన పొలాన్ని ఓ జంటకు కౌలుకు ఇచ్చారు. అయితే, తిలక్ చంద్ వేరే పనిపై ఆ ఊరికి మళ్లీ రాగా తన భూమి తనకు కాకుండా పోయిందని, తాను చనిపోయినట్లు రికార్డుల్లో ఉందని తెలుసుకున్నారు.

''స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న అధికారులు నేను చనిపోయినట్లు చెప్పారు. అదెలా జరగుతుందో నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది'' అని అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నారు తిలక్ చంద్.

తన(తిలక్ చంద్) నుంచి భూమిని కౌలుకు తీసుకున్న దంపతులే తాను(తిలక్ చంద్) చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని.. ఆ తరువాత ఆ జంటలోని మహిళ తన(తిలక్ చంద్) భార్యగా నటించి, భర్త చనిపోయినందున తన భూమిని అమ్మేస్తున్నానంటూ కోర్టును నమ్మించి ఆమె భర్తకే భూమిని బదలాయించిందని తిలక్ చంద్ చెప్పారు.

కాగా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతులను బీబీసీ సంప్రదించగా వారు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇలాంటి చాలా కేసులు వాదించిన అనిల్ కుమార్ అనే లాయర్ 'బీబీసీ'తో మాట్లాడుతూ ఒక్క ఆజమ్‌గఢ్ జిల్లాలోనే ఇలాంటి కేసులు వందకు పైగా ఉన్నాయని చెప్పారు.

ఇవన్నీ చాలా సంక్లిష్టమైన కేసులని అనిల్ కుమార్ చెప్పారు. కొన్నిసార్లు పొరపాటు వల్ల ఇలా జరుగుతుందని, మరికొన్ని సార్లు అధికారులు లంచాలు తీసుకుని తప్పుడు డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడం వల్ల జరుగుతుందని చెప్పారు.

తాను డీల్ చేస్తున్న ఒక కేసులో తన క్లయింట్ బతికే ఉన్నట్లు నిరూపించడానికి తనకు ఆరేళ్లు పట్టిందని, అయితే, అది జరిగి 25 ఏళ్లయినా.. ఆ వ్యవహారంలో తన క్లయింటు చనిపోయినట్లు తప్పుడు రికార్డులు సృష్టించిన వ్యక్తికి వ్యతిరేఖంగా దాఖలు చేసిన కేసులో తీర్పు ఇంకా రాలేదని అనిల్ కుమార్ చెప్పారు.

ఇలాంటి కేసులు త్వరితగతిన విచారించి దోషులకు శిక్ష వేస్తే మరిన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపొచ్చన్నారు అనిల్ కుమార్.

వీడియో క్యాప్షన్, 1976లో చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు బర్త్ డే చేసుకుంటున్నారు.. అసలు కథేంటంటే..

లాల్ బిహారీ మృతక్ చనిపోయినట్లు రికార్డులకెక్కి 45 ఏళ్లు దాటింది.. ఆయన తాను సజీవంగానే ఉన్నట్లు నిరూపించుకుని రెండు దశాబ్దాలు దాటింది.. అప్పటి నుంచి ఆయన ఏటా తన రెండో పుట్టిన రోజు(సజీవంగా ఉన్నట్లు నిరూపించుకున్న రోజు) మిత్రులతో జరుపుకొంటారు. ఆ సందర్భంగా ఆయన కేక్ కోస్తారు. పైకి చూడ్డానికి అది కేక్‌లా కనిపిస్తుంది కానీ లోపలంతా ఖాళీగా ఉంటుంది.

ఈ కేక్‌లాగే కొందరు ప్రభుత్వాధికారులు కూడా అంతే, ఒట్టి డొల్ల, అన్యాయం మనుషులు అంటారాయన.

ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి సజీవ మృతులు తనకు ఫోన్ చేస్తుంటారని, కానీ, ప్రస్తుతం 66 ఏళ్ల వయసులో ఉన్న తాను ఇక పోరాడలేనని లాల్ బిహారీ చెప్పారు.

'అసోసియేషన్ ఫర్ లివింగ్ డెడ్ ఆఫ్ ఇండియా'ను నడిపే శక్తి, డబ్బు ఇప్పుడ తనకు లేవని లాల్ బిహారీ చెప్పారు. ఆ బాధ్యతలు చూడ్డానికీ ఎవరూ లేరన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)