అఫ్గానిస్తాన్ విషయంలో బైడెన్ ఏమన్నారు.. వాస్తవాలేమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్
- హోదా, బీబీసీ న్యూస్
అఫ్గానిస్తాన్ విషయంలో తమ విధానం, ఆ దేశం నుంచి దళాలను ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయం వెనుక గల కారణాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుస వివరణలతో వెల్లడించారు.
బైడెన్ గతంలో చెప్పిన మాటలు, అఫ్గానిస్తాన్‌లో వాస్తవ పరిస్థితులతో ఆయన వివరణలను పోల్చుతూ 'బీబీసీ న్యూస్' నిజానిజాలు తేల్చింది.
'3 లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చి సన్నద్ధులను చేశాం' - బైడెన్
ఇది లెక్కకు మించిన సంఖ్యని చాలామంది నిపుణులు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను పర్యవేక్షించడానికి నియమించిన 'ది యూఎస్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ అఫ్గానిస్తాన్ రీకనస్ట్రక్షన్'(ఎస్ఐజీఏఆర్) లెక్క ప్రకారం 2021 ఏప్రిల్ నాటికి అఫ్గానిస్తాన్ భద్రతా బలగాల సంఖ్య 300,669.
ఇందులో ఆర్మీ/ఎయిర్‌ఫోర్స్(1,82,071), పోలీసులు(1,18,628) అందరూ ఉన్నారు. వీరిలో పోలీసులను సైనిక అవసరాల కోసం వినియోగించలేదు.
అంతేకాదు.. ఇందులో చాలామంది సిబ్బంది రికార్డుల్లోనే ఉన్నారు కానీ వాస్తవంలో లేరని కూడా 'యూఎస్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ అఫ్గానిస్తాన్ రీకనస్ట్రక్షన్' వెల్లడించింది.
గతంలో ఉండి ఇప్పుడు లేనివారు, క్రియాశీలంగా లేనివారు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పోలీసుల్లో చాలామంది ఉన్నట్లు తేల్చింది.
ఇలాంటి బోగస్ సిబ్బందిని మినహాయిస్తే మొత్తం బలగాల సంఖ్య ఇంకా తక్కువే ఉంటుంది.
అఫ్గాన్ భద్రతాదళాల్లోని బోగస్ సిబ్బంది పేరిట ఏడాదికి 30 కోట్ల డాలర్లు వేతనాలుగా చూపిస్తున్నారని గుర్తించింది.
'బీబీసీ న్యూస్ నైట్' చేసిన తాజా పరిశోధన ప్రకారం అఫ్గాన్ సైన్యంలో 50 వేల మంది కంటే తక్కువే ఉన్నారు. అంటే ఈ సంఖ్య ఎస్ఐజీఏఆర్ చెబుతున్న సంఖ్య కంటే కూడా చాలా తక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
'అఫ్గానిస్తాన్‌ను ఏకం చేయడానికి మనం ఇంకా వేలాది మంది అమెరికన్లను కోల్పోవాలా?' - బైడెన్
అఫ్గానిస్తాన్‌లో పోరాడుతున్న అమెరికా సైనికులు చనిపోవడమనేది చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో జరిగింది. 2015 నుంచి అఫ్గానిస్తాన్‌లో మొత్తం 94 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రక్షణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఎస్ఐజీఏఆర్ లెక్కల ప్రకారం 2001 అక్టోబరులో అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 1897 మంది అమెరికా సైనిక సిబ్బంది పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. మరో 415 మంది ఇతర కారణాల వల్ల మరణించారు.
20 వేల మందికిపైగా అమెరికా సైనికులు గాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
'అఫ్గానిస్తాన్ జాతి నిర్మాణమనేది ఎన్నడూ మా లక్ష్యం కాదు'
బైడెన్ సోమవారం టీవీల్లో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా జోక్యానికి కారణం కేవలం అమెరికాపై టెర్రిరస్ట్ దాడుల నివారణే తప్ప ఏకీకృత ప్రజాస్వామ్య అఫ్గానిస్తాన్ నిర్మాణం మాత్రం కాదన్నారు.
అఫ్గానిస్తాన్‌లో అమెరికా లక్ష్యాలకు సంబంధించి ఆయన గతంలో చెప్పిన మాటలకు ఇది పూర్తిగా విరుద్ధం.
2001లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో దిగినప్పటికి సెనేటర్‌గా ఉన్న బైడెన్ అప్పట్లో మాట్లాడుతూ.. ''అఫ్గానిస్తాన్‌లో ఉన్నంతలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం. అప్పుడే ఆ దేశ పునర్నిర్మాణానికి పునాది పడుతుంది'' అన్నారు.
పొలిటికో వెబ్‌సైట్ పేర్కొన్న ప్రకారం 2003లో ఆయన మరోసారి అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారు. ''దేశ నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా గందరగోళ పరిస్థితులా? రక్తపిపాసులైన యుద్ధ ప్రభువులను, మాదక ద్రవ్యాల వ్యాపారులను పుట్టిస్తున్న గందరగోళమా?' అంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'అఫ్గాన్ రాజకీయ నాయకులు కాడి పక్కన పడేశారు, పలాయనం చిత్తగించారు'
తాలిబాన్లు కాబుల్‌ను చేజిక్కించుకోవడానికి కొద్దిసేపటి ముందు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, తన సహాయకులతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు.
కానీ, మిగతా నేతలంతా అఫ్గానిస్తాన్‌లోనే ఉన్నారు. ఘనీ చేసిన పనిపై బహిరంగంగా ప్రకటనలు చేశారు.
2001 నుంచి 2014 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన హమీద్ కర్జాయ్ కాబుల్‌లోనే ఉన్నారు. ఆయన తన కుమార్తెలతో కలిసి ఒక వీడియోలో కనిపించారు. ప్రభుత్వ బలగాలు, తాలిబాన్లు కూడా ప్రజల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
ప్రజలు ఓర్పుతో ఉండాలని, రాజకీయ నాయకులంతా కలిసి శాంతియుత పరిష్కారం వెతకాలని ఆయన అభ్యర్థించారు.
అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ కూడా దేశంలోనే ఉన్నారు. అహ్మద్ మసూద్ వంటి నేతలూ దేశంలోనే ఉన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఉన్న నాయకులంతా కలిసి తాలిబాన్ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తున్నారని బీబీసీ విలేఖరి యాల్దా హకీమ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'అఫ్గాన్ సైన్యం ఏమాత్రం పోరాడకుండా పతనమైంది'
బైడెన్ చెప్పిన మాటలలో ఇది నిజం. యుద్ధం చివరి వారాల్లో అఫ్గాన్ బలగాలు నాటకీయంగా సులభంగా పతనమయ్యాయి.
అయితే, పెద్దఎత్తున అంతర్జాతీయ సేనలు హడావుడిగా వెళ్లిపోయిన కోణంలోంచి ఈ పతనాన్ని చూడాలి.
ఏప్రిల్‌లో బైడెన్ బలగాల ఉపసంహరణను ప్రకటించినప్పుడు 8 వేల సంకీర్ణ సేనలు, అఫ్గాన్ బలగాలకు లాజిస్టిక్ సపోర్ట్ అందించే 18 వేల మంది కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు.
అఫ్గాన్ సైన్యం గత 20 ఏళ్లుగా ఈ కాంట్రాక్టర్లు, ట్రైనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
అఫ్గాన్ ఆర్మీకి నిధులు భారీగా సమకూర్చినట్లు చెబుతున్నా అదంతా కాగితాలపై లెక్కలేనని, వాస్తవ పరిస్థితులు భిన్నమని చెబుతున్నారు. అవినీతి, స్థైర్యం లేకపోవడం అఫ్గాన్ ఆర్మీ పతనానికి కారణమనే ఆరోపణలున్నాయి.
గత 20 ఏళ్లలో అఫ్గానిస్తాన్ మిలటరీ, పోలీసు విభాగాలకు చెందిన 70 వేల మంది తాలిబాన్లతో పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
- అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








