ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అత్యంత ఆధునిక సైన్యం, అధునాతన ఆయుధాలు, అత్యంత అధునాతన వైమానిక దళాన్ని కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్తుండడంతో ఇప్పుడీ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి సమాధానం కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆధునిక యుద్ధంలో అమెరికా ఎందుకు గెలవలేకపోతోందని అమెరికన్ మేధావులు అయోమయంలో పడ్డారు.
మంగళవారం (ఆగస్టు 31న) అమెరికా దళాల ఉపసంహరణ పూర్తవుతుంది.
చైనా, రష్యాలు తాలిబాన్‌లతో చేతులు కలపడానికి ఉవ్విళ్లూరుతుండగా అఫ్గానిస్తాన్‌లో అమెరికా ప్రమేయం పూర్తిగా ముగిసిపోతుందా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
మరోవైపు అఫ్గానిస్తాన్, ఇరాక్‌లలో యూఎస్ అనేక విజయాలు సాధించిందంటూ అమెరికాను సమర్థించేవారు వాదిస్తున్నారు.
''యూఎస్ మిలిటరీ ఒసామా బిన్ లాడెన్ జాడని గుర్తించి మట్టుబెట్టింది. అల్-ఖైదాను మూడు చెరువుల నీళ్లు తాగించింది. దాని అగ్రనేతలు చాలా మందిని చంపేసింది. కొందరిని అరెస్టు చేసింది.
అఫ్గానిస్తాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది. మహిళల విద్య కోసం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఎందరో విద్యావంతులుగా తయారయ్యారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆటకట్టించారు. సద్దాం హుస్సేన్ తోపాటూ లిబియాలో కల్నల్ గడాఫీ వంటి నియంతలను గద్దె దింపారు. ఇవన్నీ అమెరికా విజయాలు కాదా?'' అని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ టామ్ కాసిడీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1945 తర్వాత అమెరికా చేసిన 5 ముఖ్యమైన యుద్ధాలు
అఫ్గానిస్తాన్, సిరియా, ఇరాక్, యెమెన్‌లలో ఉగ్రవాదులను నిర్మూలించడంలో తాము విఫలమయ్యామని అమెరికా భావిస్తోంది. తాలిబాన్‌లు తిరిగి అధికారంలోకి రావడం, అమెరికా వైఫల్యానికి అతిపెద్ద నిదర్శనం.
చరిత్రను పరిశీలిస్తే, అమెరికా 1945 వరకు దాదాపు అన్ని ప్రధాన యుద్ధాల్లో గెలుపొందింది. కానీ, 1945 నుంచి చాలా తక్కువ యుద్ధాల్లో అమెరికా సంపూర్ణ విజయాన్ని సాధించింది.
1945 తరువాత అమెరికా అయిదు ముఖ్యమైన యుద్ధాలు చేసింది. కొరియా, వియత్నాం, గల్ఫ్, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లతోపాటూ సోమాలియా, యెమెన్, లిబియాలలో కొన్ని చిన్నపాటి యుద్ధాలు కూడా చేసింది.
1991 గల్ఫ్ యుద్ధం మినహా అమెరికా మిగిలిన ఇతర యుద్ధాల్లో ఓటమి పాలైందనే చెప్పాలి.

ఫొటో సోర్స్, Reuters
యుద్ధాల్లో అంతిమంగా అమెరికా ఎందుకు ఓడిపోతుంది?
అఫ్గానిస్తాన్‌లో అమెరికా పరిపాలనలో కార్టర్ మల్కాసియన్ చాలా ఏళ్లు పని చేశారు. తన అనుభవాలను 'ది అమెరికన్ వార్ ఇన్ అఫ్గానిస్తాన్ - ఎ హిస్టరీ' పుస్తకాన్ని రాశారు. ఇది గత జులై మొదటి వారంలో ప్రచురితమైంది.
తన తాజా పుస్తకంలో కార్టర్ మల్కాసియన్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. 1945కి ముందు జరిగిన యుద్ధాలు దేశాల మధ్య జరిగేవని, అమెరికా ఎప్పుడూ ఈ యుద్ధాల్లో గెలిచేదని ఆయన చెప్పారు.
''కానీ, స్థానిక తిరుగుబాటుదారుల సైనిక బలం బలహీనంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ, నిబద్ధతతో పోరాటం చేయడంతో కొత్త యుగంలో జరిగిన అన్ని యుద్ధాల్లో అమెరికా ఓటమిని చవి చూసింది''
''ఓటమి భిన్నమైనది. బెంఘాజీ, సోమాలియా, సైగాన్ ఇప్పుడు కాబుల్ నుంచి తమ సేనలు నిస్సహాయ స్థితిలో తిరిగివచ్చిన తీరు అమెరికాను అప్రతిష్టపాలు చేసేలా ఉంది''
అమెరికా యుద్ధంలో ఎందుకు ఓడిపోతుందనడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఇందులో స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోకపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు.
''అఫ్గానిస్తాన్, ఇరాక్, సిరియా, లిబియా వంటివి భారీ అంతర్యుద్ధాలు. అధికారం లేదా భౌతిక బలాలు వంటివి మాత్రమే ఈ తరహా యుద్ధాల్లో విజయానికి హామీ ఇవ్వలేవు. ప్రత్యేకించి మరింత జ్ఞానం, నిబద్ధత కలిగిన శత్రువుతో పోరాడినప్పుడు అమెరికా వంటి దేశానికి స్థానిక సంస్కృతిపై అవగాహన ఉండాలి'' అని ఆ విదేశాంగ విధాన నిపుణులు, స్వార్త్‌మోర్ కాలేజీలో ప్రొఫెసర్ డొమినిక్ టియర్నీ బీబీసీ హిందీకి ఈ-మెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
యుద్ధభూమిలో అమెరికా స్థానం
డొమినిక్ టియర్నీ తన ''ది రైట్ టు లూజ్ ఏ వార్: అమెరికా ఇన్ యాన్ ఏజ్ ఆఫ్ అన్ విన్నబుల్ కాన్‌ఫ్లిక్ట్స్''అనే పుస్తకంలో అమెరికా ఇటీవలి యుద్ధాల్లో ఓటమి చెందిందని ఒప్పుకున్నారు.
ఈ పుస్తకంలో, కొత్త తరహా ఘోరమైన గెరిల్లా యుద్ధాలకి అనుగుణంగా అమెరికా ఎలా కష్టపడాల్సి వచ్చిందో డొమినిక్ టియర్నీ వివరించారు.
''ఈ తరహా యుద్ధాలలో అమెరికా సైనికులు పైచేయి సాధించలేకపోయారు. యుద్ధభూమిలో ఆపద సమయాల్లో అమెరికా అల్లకల్లోలం నుంచి బయటపడలేకపోయేది. దీంతో వేలాది మంది అమెరికన్ సైనికులు, దాని మిత్రదేశాలకు తీవ్ర నష్టం వాటిల్లేది''
అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రసంగ రచయిత డేవిడ్ ఫ్రూమ్ గతంలో ఇరాక్‌లో అమెరికా యుద్ధానికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అభిప్రాయం మారిపోయింది.
''మేం ఇరాక్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భావించాం. కానీ అలా జరగలేదు. మేం అజ్ఞానులం, అహంకారులం. మానవ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులకు మేం బాధ్యత వహించాం. అమెరికన్లకు కానీ, ఇరాకీలకు కానీ, ఈ ప్రాంతానికి కానీ ఎవరికీ యుద్ధం మంచిది కాదు" అని డేవిడ్ ఫ్రూమ్ పేర్కొన్నారు.
అమెరికా ఓటమికి ప్రధాన కారణం
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పశ్చిమ ఆసియా వ్యవహారాలలో నిపుణులైన ప్రొఫెసర్ అఫ్తాబ్ కమల్ పాషా కూడా అమెరికా ఓటమికి స్థానిక సంస్కృతిపై బలమైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు.
''అమెరికన్లు ఇతర దేశాల సంస్కృతిని అర్థం చేసుకోలేరు. అసలు తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. అమెరికా బలగాలు బాగ్దాద్‌లో ప్రవేశించినప్పుడు, ఇరాక్‌లోని షియా కమ్యూనిటి సద్దాం హుస్సేన్‌పై తిరుగుబాటు చేస్తుందని, అమెరికన్ సైనికులకు వారు పూల దండలతో స్వాగతం పలుకుతారని డిక్ షెనీ (అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు) డోనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ (అమెరికా మాజీ రక్షణ మంత్రి) బహిరంగంగా చెప్పేవారు.
వారు అనుకున్నట్లు ఎక్కడ స్వాగతం పలికారు? తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఇది ఇరాక్ అంతర్గత వ్యవహారాలపై అమెరికా ఎలాంటి అపోహలను కలిగి ఉందో సూచిస్తుంది''అని కమల్ పాషా బీబీసీ హిందీతో అన్నారు.
''అఫ్గానిస్తాన్‌లో అమెరికా సైనికులకు దుర్గమ ప్రదేశాలు ఎదురయ్యేవి. లోయలు, పర్వతాలు, గుహలు, గూఢచార స్థావరాలపై తాలిబాన్‌కు పట్టు ఉంది. కానీ, అమెరికా సైనికులకు వీటిపై సరైన అవగాహన లేదు. దీంతో ఎప్పుడైనా వీరికి కాస్త ప్రమాదకరం అనిపిస్తే చాలు, తమ శక్తిని అంతటిని ఉపయోగించి ఆ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించి, మొత్తం ప్రాంతాన్ని నాశనం చేసేవారు'' అని ప్రొఫెసర్ పాషా మరో ఉదాహరణను పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
జాతీయవాదం, ధర్మ యుద్ధం అనే భావజాలం
వియత్నాం యుద్ధంలో, ఉత్తర వియత్నాం ప్రభుత్వం వియత్-కాంగ్ అనే కమ్యూనిస్ట్ గెరిల్లా దళాన్ని స్థాపించింది. వారి కమ్యూనిస్ట్ భావజాలం, జాతీయవాద ప్రభావం అమెరికా సైనికులపై ఎక్కువగా ఉండేది. అమెరికన్ సైనికులు తమ దేశం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎవరి కోసం ఈ యుద్ధం చేస్తున్నామని తరచూ ఆలోచిస్తుండేవారు.
మరణాన్ని లెక్క చేయకుండా, దాని భావజాలాన్ని పునికి పుచ్చుకున్న ఈ గెరిల్లా దళం చివరకు అమెరికన్లను తరిమికొట్టగలిగింది.
తాలిబాన్‌లదీ అదే పరిస్థితి. తాలిబాన్లు దీనిని దేశ యుద్ధంగా మాత్రమే కాకుండా మతపరమైన యుద్ధంగా కూడా మార్చారని నిపుణులు చెబుతున్నారు.
''తాలిబాన్ మత, జాతి, ప్రాంతీయవాద భావజాలాలను వ్యాప్తి చేస్తే, దీనికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యం లేదా మానవ హక్కులు లేదా జాతీయవాదం వంటి సానుకూల సందేశాలను ఇవ్వడంలో అఫ్గాన్ ప్రభుత్వం విఫలమైంది'' అని ప్రొఫెసర్ డొమినిక్ టియర్నీ అన్నారు.
''తాలిబాన్లు యుద్ధంలో శక్తిమంతులు కావడానికి మతం కారణమైంది. వారు తమని తాము ఇస్లాం ప్రతినిధులుగా ప్రకటించుకున్నారు. విదేశీ ఆక్రమణనను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ ఆలోచనలు సాధారణ అఫ్గాన్‌లకు స్ఫూర్తినిచ్చాయి'' అని రచయిత కార్టర్ మల్కాసియన్ పేర్కొన్నారు. ప్రభుత్వ సైనికులకు మాత్రం ఇలాంటి ప్రేరణ ఏదీ లేదు. వారు ఎలాంటి కారణం లేకుండానే పోరాడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జిహాద్తో తాలిబాన్లు
తాలిబాన్ కోసం చనిపోవడానికి లేదా చంపడానికి సిద్ధంగా ఉన్న అఫ్గాన్ల సంఖ్య ఎక్కువగా ఉందని కార్టర్ మల్కాసియన్ తెలిపారు. యుద్ధభూమిలో తాలిబాన్లకు ఈ అంశం కలిసొచ్చిందన్నారు. కార్టర్ అఫ్గానిస్తాన్‌లో చాలా సమయం గడిపారు. ఆ సమయంలో ఆయన తాలిబాన్లను, వారి మద్దతుదారులను కూడా కలుసుకున్నారు.
కార్టర్ మల్కాసియన్ తన పుస్తకంలో ఓ తాలిబాన్ నేత వాఖ్యలను కూడా పొందు పరిచారు. ''పోలీసులు, ఆర్మీ సిబ్బంది మరణించిన సంఘటన గురించి ప్రతి రోజూ నేను వింటున్నాను. వారు తాలిబాన్‌లతో పోరాడటానికి కట్టుబడి ఉన్నారో లేదో నాకు తెలియదు. చాలా మంది పోలీసులు, సైనికులు డాలర్ల కోసం మాత్రమే పోరాడతారు. వారికి మంచి జీతం లభిస్తుంది. కానీ, తాలిబాన్లు జిహాద్‌కు కట్టుబడి పోరాడతారు. ప్రభుత్వాన్ని రక్షించడానికి పోలీసులకు, సైనికులకు మాత్రం ఎలాంటి ప్రేరణా ఉండదు''
తాలిబాన్లు యుద్ధ రంగంలో పోరాడటానికి వచ్చినప్పుడు, తమ తలపై కేవలం ముసుగు వేసుకుని మాత్రమే వచ్చేవారు. ఇక, అమెరికన్, అఫ్గాన్ ప్రభుత్వ దళాలు మాత్రం యుద్ధంలో ప్రాణాలను రక్షించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవి. ''అమెరికన్ సైనికులు తమకు చెందని దేశం కోసం పోరాడుతున్నారు. వారి నిబద్ధత తాలిబాన్లలా లేదు. తాలిబాన్లు దేశం కోసం పోరాడుతున్నారు. వారు దానిని మత యుద్ధంగా మార్చారు'' అని ప్రొఫెసర్ పాషా తెలిపారు.
ఈ ఓటముల నుంచి అమెరికా ఏ పాఠం నేర్చుకుంది?
సైగాన్, వియత్నాం నుంచి అమెరికన్ నాయకత్వం ఏమీ నేర్చుకోలేదు. 1993లో సోమాలియా లోపల సైనిక చర్యకు అమెరికా ఉపక్రమించడంతో అదే పాత తప్పును పునరావృతం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
చనిపోయిన అమెరికన్ సైనికులను మొగాదిషు వీధుల్లోకి లాగడాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. ఈ దృశ్యాలను చూసిన అమెరికన్ల కోపం కట్టలు తెంచుకుంది. చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఆఫ్రికాలో అమెరికాకు ఒక మలుపులాంటింది.
అక్టోబర్ 1993లో, అమెరికా దళాలు సోమాలి రాజధాని మొగాదిషుపై విరుచుకుపడ్డాయి. శక్తిమంతమైన సోమాలి ప్రభువు, జనరల్ మొహమ్మద్ ఫరా ఐడిద్, ఆయన ముఖ్య అనుచరులను పట్టుకోవడం అమెరికా లక్ష్యం. కానీ, యూఎస్ దళాలు వారి నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి.
రెండు అమెరికన్ బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశారు.
18 మంది అమెరికన్లు, ఇద్దరు యూఎన్ సైనికులు మరణించారు. ఆ సమయంలో సోమాలియాలో అంతర్యుద్ధం, కరవును అంతం చేయడానికి ఏర్పాటు చేసిన ఓ యూఎన్ మిషన్‌కు అమెరికా నాయకత్వం వహిస్తోంది.
ఆరు నెలల్లో యూఎస్ తన బలగాలను సోమాలియా నుంచి ఉపసంహరించుకుంది. ఈ మిషన్ వైఫల్యం.. ఆఫ్రికన్ సంక్షోభాలలో జోక్యం చేసుకోకూడదని అమెరికాను హెచ్చరించినట్టయింది.
ప్రొఫెసర్ డొమినిక్ టియర్నీ యుద్ధాల నుంచి నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పారు.
''ఒక యుద్ధం ముగియక ముందే రెండో యుద్ధాన్ని ప్రారంభించవద్దు. నైతికత, మతపరమైన ఉత్సాహం కారణంగా యుద్ధం ప్రారంభించకూడదు. చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటే తిరస్కరించకూడదు. సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోండి. యుద్ధాలను ప్రారంభించడం కంటే ముగించడం చాలా కష్టం అని గుర్తుంచుకోండి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పునరాగమనంపై ఆసక్తి ఉంటుంది
అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఓడిపోయినా తాలిబాన్‌లు తిరిగి అధికారంలోకి రావడం, రష్యా, చైనాల మధ్య స్నేహం అఫ్గానిస్తాన్ పట్ల వారికి పెరుగుతున్న ఆసక్తి వంటి కారణాల వల్ల ఈ ప్రాంతంపై అమెరికా దృష్టి ఇంకా ఉంటుందని ప్రొఫెసర్ పాషా అన్నారు.
''అఫ్గానిస్తాన్, ఇరాక్‌లో జాతి నిర్మాణం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మహిళా విద్య వంటివి కేవలం స్టంట్లు మాత్రమే. చైనా, రష్యాను దూరంగా ఉంచడం, మధ్య ఆసియాలో రష్యా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే అమెరికా ముఖ్య ఉద్దేశం'' అని పాషా అన్నారు.
''కానీ ఓటమి తరువాత, అమెరికా వ్యూహం విఫలమైంది. ఇప్పుడు చైనా, రష్యాను అఫ్గానిస్తాన్ నుండి ఎలా దూరంగా ఉంచాలి అనేది అమెరికా వ్యూహం కావచ్చు. తాలిబాన్‌పై ప్రభావాన్ని చూపగలిగే పాకిస్తాన్ అవసరం బహుశా అమెరికాకు మరోసారి ఉంది''
తాలిబాన్లతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలని కూడా కొందరు చెబుతున్నారు. ఇటీవల కాబుల్ విమానాశ్రయం వెలుపల జరిగిన బాంబు పేలుళ్ల అనంతర పరిణామాలు ఈ అవకాశానికి మరింత ఊతాన్నిస్తున్నాయి.
రష్యా, చైనాలు ఏకమయ్యాయి. అమెరికా దీని గురించి ఆందోళన చెందుతుంది. యూఎస్ దౌత్య కార్యాలయాలు లేదా యూఎస్ లోపల లేదా వెలుపల దాని సైనిక స్థావరాలపై తీవ్రవాద దాడులు చేసే సంస్థలకు తాలిబాన్ అఆధీనంలోని అఫ్గానిస్తాన్ మరోసారి స్వర్గధామంగా మారవచ్చని అమెరికా భావిస్తోంది.
అమెరికా తన సైన్యాన్ని మళ్లీ అఫ్గానిస్తాన్‌కు పంపుతుందా
ఎలాంటి పరిస్థితిలో అయినా సైన్యాన్ని మళ్లీ పంపే విషయంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోదని ప్రొఫెసర్ పాషా అన్నారు.
''గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా పాకిస్తాన్ మధ్య దూరం పెరిగింది. పాకిస్తాన్ విషయంలో అమెరికా సంతోషంగా లేదు. తాలిబాన్ ఒప్పందంలో అమెరికా పాకిస్తాన్ సహాయం తీసుకుంది.
సైనికులను ఉపసంహరించుకునే సమయంలో తాలిబాన్లు తమపై దాడి చేయరని పాకిస్తాన్ నుండి హామీ తీసుకుంది.
కానీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో అమెరికా వ్యూహం విఫలమైంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ అవసరం దానికి ఉంది. అమెరికాకు ఇప్పుడు మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ లాంటి నాయకుడి అవసరం ఉంది. మాజీ ప్రెసిడెంట్ బుష్ విజ్ఞప్తి మేరకు 2001 లో అఫ్గానిస్తాన్‌పై ఆయన దాడి చేశారు'' అని పాషా పేర్కొన్నారు.
''ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఆయన తన పదవీకాలాన్ని పూర్తి చేయగలడా లేదా అనేది చూడాలి'' అని ప్రొఫెసర్ పాషా అన్నారు.
''అధ్యక్షుడు జో బైడెన్ అఫ్గానిస్తాన్‌లో జరిగిన యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ, అమెరికా తిరిగి అఫ్గాన్‌పై దృష్టి పెట్టే అవకాశాలు లేకపోలేదు''
చైనాతో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న కారణంగా, అఫ్గానిస్తాన్ పెద్ద దేశాల మధ్య ప్రాక్సీ వార్ జరిగే ప్రదేశంగా మారుతుందని ప్రొఫెసర్ డొమినిక్ టియెర్నీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్‌లో భారీగా బంగారం, తాలిబాన్ల పాలనలో ఈ నిధి ఎవరికి దక్కనుంది?
- అఫ్గానిస్తాన్: కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న అమెరికా
- పాకిస్తాన్: గిల్గిట్ నుంచి 32 ఏళ్ల కిందట బయలుదేరిన ఆ విమానం ఏమైంది... ఆ మిస్టరీ ఏంటి?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల పాలనలో విదేశీ వాణిజ్యం ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది?
- అఫ్గాన్ సంక్షోభం: ఐసిస్-కె ఎవరు? ఇది ఎందుకంత హింసాత్మకమైనది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











