పాకిస్తాన్: గిల్గిట్ నుంచి 32 ఏళ్ల కిందట బయలుదేరిన ఆ విమానం ఏమైంది... ఆ మిస్టరీ ఏంటి?

ఫొటో సోర్స్, SHAHID IQBAL
- రచయిత, మహ్మద్ జుబేర్ ఖాన్
- హోదా, బీబీసీ ఉర్దూ
‘'మా నాన్న తన తుది శ్వాస విడిచే వరకు కూతురు, అల్లుడు, మనుమరాలిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. తన జీవితమంతా హిమాలయ పర్వతాల నుంచి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, భారత్ సరిహద్దు ప్రాంతాలలో కూలిన ఆ విమాన శకలాలను కనుక్కోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఆ విమానంలో ఆయన కూతురు, అల్లుడు, మనుమరాలు ఉన్నారు'' అని గిల్గిట్ వాసి అయిన షాహిద్ ఇక్బాల్ వెల్లడించారు.
ఆగస్టు 25, 1989 ఉదయం 7:30 గంటలకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ఫ్లైట్ నంబర్ 404 గిల్గిట్ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరింది. అందులో ప్రయాణికులు, సిబ్బంది సహా 54మంది ఉన్నారు. ప్రయాణికుల్లో అయిదుగురు పసి పిల్లలు కూడా ఉన్నారు.
ఆగస్టు 25 నాటి ప్రయాణమే ఆ విమానానికి చివరి ప్రయాణం. ఆ ఫ్లైట్ మిస్సయి ఇప్పటికి 32 సంవత్సరాలు గడిచాయి. కానీ, ఇంకా దాని జాడ దొరక లేదు. దానికి ఏమయ్యిందో ఎవరికీ తెలియదు.
విమానం శిథిలాల కోసం సుదీర్ఘ కాలం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి విఫలమైన అధికారులు, చివరకు ఆ రోజు ఫ్లైట్‌లో ప్రయాణించిన ప్రతి ఒక్కరు మరణించినట్లు ప్రకటించారు.
ఆ విమానంలో అబ్దుల్ రజాక్ కూతురు నీలోఫర్, అల్లుడు నసీరుద్దీన్, చంటిపిల్లయిన మనుమరాలు ఉన్నారు.

ఫొటో సోర్స్, SHAHID IQBAL
ఆ విమానం ఎక్కడికి వెళ్లింది?
అబ్దుల్ రజాక్ ఆ విమానం జాడ కనుక్కోవడానికి వ్యక్తి గతంగా కూడా తీవ్రంగా ప్రయత్నించారని ఆయన కొడుకు షాహిద్ ఇక్బాల్ వెల్లడించారు. ''విమానం శిథిలాలు కాదు, అందులో సూదంత చిన్న వస్తువు కూడా ఎవరికీ దొరక లేదు'' అని ఇక్బాల్ అన్నారు. కొంత కాలం తర్వాత అబ్దుల్ రజాక్ మరణించారు.
విమానంలో ఇద్దరు విదేశీయులు, అయిదుగురు చిన్నారులు సహా 49 మంది ప్రయాణికులు ఉండగా, అయిదుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో చాలామంది ప్రయాణికులు గిల్గిట్-బాల్టిస్తాన్‌కు చెందిన వారే.
విదేశీయుల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, విద్యావేత్తలైన డాక్టర్ రెనా సెడ్రెస్, పాల్ మెక్‌గవర్న్ ఉన్నారు.
షాహిద్ ఇక్బాల్ సోదరి నీలోఫర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. ''మా బావ నసీరుద్దీన్ గిల్గిట్‌లో ఓ అగ్రికల్చర్ బ్యాంక్‌కు మేనేజర్. తన సీనియర్ సహోద్యోగి ఆసీఫుద్దీన్‌తో కలిసి ఇస్లామాబాద్ వెళ్తున్నారు. ఆసిఫుద్దీన్ భార్య, పిల్లలు కూడా ఆ విమానంలో ఉన్నారు'' అని ఇక్బాల్ అన్నారు.
''అక్కా, బావా, మేనకోడలిని నేనే ఎయిర్‌పోర్ట్‌లో దింపి వచ్చాను. ఆసీఫుద్దీన్ కుటుంబం కూడా అక్కడే ఉంది. విమానం టేకాఫ్ కాగానే నేను ఇంటికి వచ్చాను. వారు ఇస్లామాబాద్ చేరుకున్నారా లేదా అని గంటన్నర తర్వాత వాకబు చేసినప్పుడు విమానం మిస్సయిందని చెప్పారు. ఆ మాటతో మా నెత్తి మీద పిడుగు పడినట్లయింది'' అని ఇక్బాల్ వివరించారు.
ఫ్లైట్ నంబర్ 404లో తమ బంధువులు ఉన్న వారిని కదిలిస్తే ఒక్కొక్కరు ఓ విషాద గాథను వినిపిస్తారు.

ఫొటో సోర్స్, JANG NEWSPAPER
'మా తమ్ముడు మళ్లీ రాలేదు'
గిల్గిట్‌లో వ్యాపారం చేస్తున్న జహూర్ అహ్మద్ తన తమ్ముడి కథను వివరించారు. సోదరుడు ఇజాజ్ అహ్మద్ అతని మేనమామ ఇబ్రహీం, మేనమామ స్నేహితుడు మహ్మద్ ఇర్ఫాన్ కూడా ఇదే విమానం ఎక్కారు.
''మా తమ్ముడు సెలవులు ముగించుకుని తిరిగి కాలేజీకి వెళ్లబోతున్నాడు. ముగ్గురు నవ్వుతూ, తుళ్లుతూ విమానం ఎక్కారు. నాకు షేక్‌హ్యాండ్ ఇస్తూ ఖుదా హఫీజ్ అని చెప్పాడు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. విమానం కనిపించకుండా పోయి 32 సంవత్సరాలైంది. దానికి ఏమయిందో ఇప్పటికీ తెలియలేదు'' అన్నారు జహూర్
ఈ సంఘటన తర్వాత తన తల్లి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని జహూర్ వెల్లడించారు. '' విమాన ప్రమాదం వార్త విన్నప్పుడల్లా మా అమ్మ ఏడ్చేది'' అన్నారాయన.

ఫొటో సోర్స్, JANG NEWSPAPER
ఫ్లైట్ నంబర్ 404కు ఏమయింది?
ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకోవడానికి బీబీసీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీని సంప్రదించింది. కానీ, ఇది చాలా పాత సంఘటన అని, విమానం జాడ గురించి ఎలాంటి రికార్డులు లేవని వారు సమాధానం చెప్పారు.
ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ అందించిన సమాచారం ప్రకారం, నంబర్ 404 విమానం ఫోకర్ ఎఫ్ -27 ఫ్రెండ్‌షిప్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది 1962లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అదృశ్యమయ్యే నాటికి ఆ విమానం 44,000 గంటలకు పైగా ప్రయాణించింది.
''ఈ విమానం ఆగస్టు 25, 1989 శుక్రవారం ఉదయం 7:36 గం.లకు గిల్గిట్ నుండి బయలుదేరింది. 7:40గం.లకు సిబ్బంది కంట్రోల్ రూమ్‌తో మాట్లాడారు. 7:59 గం.లకు విమానం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉందని చెప్పారు'' అని ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ వెల్లడించింది.
కంట్రోల్ సిబ్బంది మాట్లాడిన ఆఖరి మాటలు ఇవే. ఆ తర్వాత విమానం అదృశ్యమైంది.
సెర్చ్ ఆపరేషన్
విమానం మిస్సయిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని అప్పట్లో పీఐఏ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. సుమారు 700 మంది నిపుణులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లు, రెండు సి-130, రెండు పీఐఏ విమానాలు హిమాలయ పర్వత శ్రేణుల్లో సాగిన ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
పాకిస్తాన్ అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం కూడా తమ భూభాగంలో విమానం జాడ కనుక్కోవడానికి ఒక ఆపరేషన్ నిర్వహించింది.
దుర్గమంగా ఉండే నాగ పర్వత పరిసర ప్రాంతాలలో కూడా విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ సాగినట్లు అప్పటి వార్తా కథనాలను బట్టి తెలుస్తోంది. నాగ పర్వతాన్ని అధిరోహిస్తున్న ఇద్దరు బ్రిటీష్ పర్వతారోహకులు విమానం తాము చాలా కిందుగా ఎగురుతుండటాన్ని చూశామని వెల్లడించారు.

ఫొటో సోర్స్, SHAHID IQBAL
'నాన్న నమ్మలేదు'
చాలా రోజులపాటు ఈ ఆపరేషన్ కొనసాగినా విమానం జాడ మాత్రం తెలియరాలేదు. విమానంలోని వారంతా మరణించారని, ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని నమ్మని తన తండ్రి స్వయంగా నాగ పర్వతం దగ్గరకు వెళ్లి వెతికే ప్రయత్నం చేశారని, ఇందుకోసం స్థానికుల సహకారం కూడా తీసుకున్నారని ఇక్బాల్ వెల్లడించారు.
''మా నాన్నతోపాటు మరికొన్ని బాధిత కుటుంబాలు కొన్ని నెలలపాటు వెతికే ప్రయత్నం చేశాయి'' అని ఇక్బాల్ తెలిపారు.
విమానానికి ఏం జరిగి ఉండొచ్చు?
ఇరాక్ జాతీయ విమానయాన సంస్థలకు సలహాదారుగా పని చేసిన ఫిదా హుస్సేన్ ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. '' విమానానికి ఏమైందో చెప్పడం కష్టం. అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు. బ్లాక్ బాక్స్ కూడా దొరకలేదు. కాబట్టి ఏం చెప్పినా ఊహాగానమే'' అన్నారు హుస్సేన్
''ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మొదటిసారి కమ్యూనికేషన్ తర్వాత మళ్లీ కమ్యూనికేసన్ లేదు. విమానానికి ఏదైనా సమస్య ఉంటే పైలట్లు కంట్రోల్ రూమ్‌కు చెప్పేవారు. కానీ అలాంటి సందేశం ఏదీ రాలేదు. అంటే అనూహ్యంగా ప్రమాదం జరిగి ఉంటుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించే సమయం కూడా ఉండి ఉండదు'' అన్నారు హుస్సేన్.
అప్పట్లో ఏ చిన్న ఆధారంగానీ, రిపోర్ట్‌గానీ దొరికి ఉంటే దాని ఆధారంగా ఏదైనా పరిశోధన నిర్వహించవచ్చని, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు కాబట్టి అది ఇప్పుడు కారణాలు కనుక్కోవడం కష్టమని హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
నాగ పర్వతం మీద విమానం కూలి ఉంటే దానిని కనుక్కోవడం అంత సులభం కాదని హుస్సేన్ అన్నారు.
''విమానం మిస్సయిన విషయం తెలియగానే మేం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాం. అక్కడంతా గందరగోళంగా ఉంది. ఆ సమయంలో రకరకాల వార్తల వినిపించాయి. విమానానికి సొంత పైలట్ లేడని, టూరిస్టుగా వచ్చిన ఓ పైలట్‌కు బాధ్యతలు ఇచ్చారని ప్రచారం జరిగింది'' జహూర్ అన్నారు.
ఈ విషయాలన్నింటినీ తాము విచారణ కమిటీకి వివరించామని, కానీ ఆ కమిటీలోని అధికారుల ప్రవర్తన కూడా సరిగ్గా లేదని, తాము చెప్పిన విషయాలను వారు పట్టించుకున్నట్లు కనిపించలేదని అని జహూర్ వెల్లడించారు.
''విచారణ నివేదిక త్వరలో వస్తుందని మాకు చెప్పారు. నేటికి 32 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇంత వరకు ఏమీ చెప్పలేదు'' అన్నారు జహూర్
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు డ్రగ్స్‌తో ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ ఓపియం ఎంత పండుతుంది? - BBC RealityCheck
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ‘తాలిబాన్లను గుర్తించాలా? వద్దా? - భారత్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే..’
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








