అఫ్గానిస్తాన్: తాలిబాన్లు డ్రగ్స్‌తో ఎంత సంపాదిస్తున్నారు, ఇక్కడ ఓపియం ఎంత పండుతుంది? - BBC RealityCheck

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాల్టీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
తాము అధికారం కోల్పోయేనాటికి అఫ్గానిస్తాన్‌లో ఓపియం సాగు తగ్గిందని, విదేశాలకు అక్రమంగా సాగే డ్రగ్స్ సరఫరా కూడా తగ్గిపోయిందని తాలిబాన్‌లు చెబుతున్నారు.
2001 నాటికి ఓపియం పంట సాగులో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, తాలిబాన్‌లకు పట్టున్న ప్రాంతాలో ఈ పంట విరివిగా సాగయ్యింది. తర్వాత సంవత్సరాలలో క్రమంగా పెరుగుతూ వచ్చింది.
అఫ్గానిస్తాన్‌లో ఎంత ఓపియం పండుతుంది?
ఓపియం అంటే నల్లమందు మొక్కల నుంచి తీసిన పదార్ధాలను హెరాయిన్ సహా అనేక మత్తు పదార్ధాలలో వినియోగిస్తారు. ఓపియం పండించడంలో అఫ్గానిస్తాన్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్(యూఎన్ఓడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా పండే ఓపియం పంటలో 80% ఇక్కడే పండుతుందని, అఫ్గానిస్తాన్ ఆర్ధిక వ్యవస్థలో ఓపియం ద్వారా వస్తున్న ఆదాయం 11% వరకు ఉంటుందని యూఎన్ఓడీసీ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఓపియం గురించి తాలిబాన్‌లు ఏం చెబుతున్నారు?
అఫ్గానిస్తాన్‌ను తిరిగి చేజిక్కించుకున్నాకా తాలిబాన్ ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఓ ప్రెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ''మేం అధికారంలో ఉన్నప్పడు ఇక్కడ ఓపియం సాగు లేదు'' అని ఆయన అన్నారు. ''ఓపియం సాగును పూర్తిగా లేకుండా చేస్తాం'' అని ఆయన వెల్లడించారు.
అయితే, ఓపియం సాగు తాలిబాన్‌ల కాలంలో అంటే 1998 నాటికి 41,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండేది. అదే 2000 సంవత్సరం వచ్చేనాటికి 64,000 హెక్టార్లకు విస్తరించిందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
అది కూడా తాలిబాన్‌ల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలోనే ఎక్కువగా అంటే ప్రపంచ సాగులో దాదాపు 39% శాతం సాగు ఇక్కడే జరిగేది. కానీ, 2000 సంవత్సరంలో తాలిబాన్‌లు తాము అధికారంలో ఉన్న ప్రాంతాలలో ఓపియం పంటను నిషేధించారు.
2001లో విడుదలైన ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఓపియం నిషేధం అమలులో ఉంది.
తాలిబాన్‌లు నిషేధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఓపియం పట్టివేతలు 2001-2002 నాటికి చాలా వరకు తగ్గిపోయాయి. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఇటీవల అఫ్గానిస్తాన్‌లో అధికారం కోల్పోయిన ప్రభుత్వ హయాంలో అక్కడక్కడా ఓపియం పంట సాగు జరిగినా, అది ఎక్కువగా తాలిబాన్ లకు పట్టున్న ప్రాంతాలలో ఎక్కువగానే జరిగింది. 2020 నాటికి తాలిబాన్‌ల అదుపులో ఉన్న హెల్మాండ్ ప్రావిన్స్‌లో అత్యధికగా ఓపియం పంట సాగైనట్లు తేలింది.

ఫొటో సోర్స్, Reuters
ఓపియం నుంచి తాలిబాన్‌లు డబ్బు ఎలా సంపాదించే వారు?
2019నాటి వరకు ఓపియం పంట సాగు అఫ్గానిస్తాన్‌లో ప్రధానమైన ఉపాధిగా ఉండేది. సుమారు 120,000మంది ఈ పంటపై ఆధారపడి పని చేసేవారని యూఎన్ఓడీసీ నిర్వహించిన ఓపియం సర్వేలో తేలింది.
ఈ ఓపియం పండించే వారి నుంచి తాలిబాన్‌లు ప్రత్యేకంగా పన్నులు వసూలు చేశారు. వాటి సరఫరా ద్వారా కూడా ఆదాయం సంపాదించేవారు. సాగు పన్ను పేరుతో 10% ట్యాక్స్ వసూలు చేసేవారని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ఓపియంతో హెరాయిన్‌ను తయారు చేసే పరిశ్రమల నుంచి కూడా తాలిబాన్‌లు ట్యాక్సులు వసూలు చేసేవారు. అలాగే వ్యాపారులు, స్మగ్లర్ల నుంచి కూడా పన్నుల వసూళ్లు సాగేవి. ఇలా వసూలు చేసిన సొమ్ము దాదాపు 100-400 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
తాలిబాన్‌ల సంపదలో 60% అక్రమ డ్రగ్స్ వ్యాపారం నుంచే వచ్చిందని స్పెషల్ ఇన్‌స్పెక్టర్ ఫర్ అఫ్గాన్ రీకన్‌స్ట్రక్షన్ (సిగార్)కు సమర్పించిన నివేదికలో అమెరికా కమాండర్ జనరల్ జాన్ నికోల్సన్ పేర్కొన్నారు. అయితే, నిపుణులు ఈ గణాంకాలతో విభేదిస్తున్నారు.
అక్రమ డ్రగ్స్ వ్యాపారం మీద పరిశోధన చేస్తున్న డేవిడ్ మాన్స్‌ఫీల్డ్, ''ఐక్యరాజ్యసమితి, ఇంకా ఇతర సంస్థలు చెబుతున్న పన్నుల వ్యవస్థ వాస్తవంలో జరిగే పని కాదు. మహా అయితే ఇలాంటి పన్నుల ద్వారా ఏడాదికి సుమారు 40 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే సేకరించగలరు'' అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ డ్రగ్స్ ఎక్కడికి వెళతాయి?
అఫ్గానిస్తాన్‌లో పండే ఓపియం ద్వారా తయారైన హెరాయిన్‌లో 95% యూరప్ దేశాలకు చేరుతుంది. అమెరికాకు కేవలం 1% చేరుతుందని యూఎస్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికాలో వినియోగించే డ్రగ్స్ ఎక్కువగా మెక్సికో నుంచి వస్తాయి.
2017-2020 మధ్యకాలంలో సరఫరా అయిన ఓపియంలో దాదాపు 90% ఓపియం రోడ్డు మార్గం ద్వారానే చేరుతున్నట్లు అంచనా.
ఇటీవలి కాలంలో హిందూ మహాసముద్రం, యూరప్ మధ్య సాగే సముద్ర మార్గంలో నిఘా పెరిగి ఓపియం ఎక్కువగా పట్టుబడింది.
అఫ్గానిస్తాన్‌లో సాగు పెరగడం వల్ల గత రెండు దశాబ్దాలుగా ఓపియం ఉత్పత్తి, రవాణ సందర్భంగా పట్టివేతలలో కూడా పెరుగుదల కనిపించింది. అయితే, ఈ పట్టివేతలు ఆ దేశపు ఓపియం ఉత్పత్తి పై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని 'సిగార్' వెల్లడించింది.
2008 నుంచి సాగుతున్న ఈ పట్టివేతల్లో దొరికిన ఓపియం, అఫ్గానిస్తాన్ లో ఒక్క 2019 సంవత్సరంలో పండిన పంటలో 8% ఉంటుందని 'సిగార్' తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- కరోనావైరస్: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధం అవుతోంది?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









