Virginity Test: సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కన్యత్వ పరీక్షలు రద్దు చేసిన ఇండొనేసియా

ఇండొనేసియా

ఫొటో సోర్స్, Getty Images

ఇండోనేసియా సైన్యంలో చేరాలనుకునే మహిళలకు కొన్ని దశాబ్దాలుగా అక్కడి ఆర్మీ వర్జినిటీ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా మహిళ యోనిలోకి వేళ్ళను చొప్పించి హైమెన్ బిగుతుగా ఉందో లేదో పరీక్షిస్తారు. మిలిటరీలో ఏ విభాగంలో చేరాలన్నా కూడా ఈ పరీక్ష తప్పనిసరి.

ఈ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించిన మహిళల అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. దాంతో, వారికిక మిలిటరీ కెరీర్ దక్కదు.

కన్యత్వ పొర సరిగా ఉందని నిర్ధరించడానికి అధికారులు కొన్నిసార్లు తాము పెళ్లి చేసుకోబోయే మహిళలకు కూడా చేసేవారు.

సైన్యంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగా మహిళా అభ్యర్థులందరికీ వర్జినిటీ పరీక్షను కూడా నిర్వహిస్తారు.

మహిళలకు మాత్రమే చేసే ఈ పరీక్ష అవమానకరంగా, వివక్షాపూరితంగా ఉందంటూ కొన్ని సంవత్సరాలుగా మానవహక్కుల సంస్థలు నిందిస్తున్నాయి.

"కన్యత్వ పరీక్షలు" జెండర్ పట్ల జరిగే హింస లాంటివి. ఈ విధానాలను తిరస్కరించాలి" అని ఇండోనేసియా హ్యూమన్ రైట్స్ వాచ్ లో పరిశోధకుడు ఆండ్రియాస్ హాసోర్నో అన్నారు.

"ఈ పరీక్షలో రెండు వేళ్ళను యోనిలోకి చొప్పించి మహిళ గతంలో సెక్స్ లో పాల్గొన్నారో లేదో అంచనా వేస్తారు" అని చెప్పారు.

ఇది చాలా నొప్పితో కూడుకున్న ప్రక్రియ అని మానవ హక్కుల సంస్థతో మాట్లాడిన చాలా మంది మహిళలు చెప్పినట్లు చెప్పారు.

ఇండొనేసియా

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్షకు శాస్త్రీయ ఆధారాలు లేవని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబరు 2014లో ప్రకటించింది.

కన్నెపొర తీరుకు కన్యత్వానికి ఎటువంటి సంబంధం లేదని పునరుత్పత్తి నిపుణులుకూడా చెప్పారు.

శాస్త్రీయ సమాజం దృష్టిలో వర్జినిటీ అనేది వైద్యపరమైన పరిభాషే కాదు.

ఈ నేపథ్యంలో ఇండోనేసియా ఆర్మీ అధిపతి ఆందిక పెర్కాసా, "సైన్యంలో చేరాలనుకునే మహిళలకు చేసే ఈ పరీక్షలకు అంతం పలుకుతున్నాం" అని ప్రకటించారు.

"సైన్యంలో చేరేందుకు ఈ పరీక్ష చేయడం అనవసరం. ఆరోగ్యాన్ని ధ్రువీకరించడమే ఈ ఎంపిక విధానం లక్ష్యంగా ఉండాలి" అని ఆయన చెప్పారు.

ఇకపై, సైన్యంలో చేరాలనుకునే మహిళల శారీరక శిక్షణ తీసుకోగల సామర్ధ్యాన్ని మాత్రమే అంచనా వేస్తామని చెప్పారు.

కన్యత్వ పరీక్షలకు నో

ఫొటో సోర్స్, OMS

"సైన్యం సరైనపని చేస్తోంది. దీనినొక అశాస్త్రీయమైన, అవమానకరమైన చర్యగా గుర్తించి అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ప్రాంతీయ, బెటాలియన్ కమాండర్ల పై ఉంది" అని హాసోర్నో బీబీసీతో అన్నారు.

నౌకాదళం, వైమానిక దళం అధికారులు కూడా సైన్యాన్ని అనుసరించి ఈ విధానానికి అంతం పలకాలి" అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో సైన్యంలో చేరాలనుకునే సైనికుల ఉద్యోగాలు, వారి పాత్రలకనుగుణంగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని డెమొక్రటిక్ పార్టీ తెలిపింది.

అలాగే, ఈ పరీక్షను నిషేధించడం ద్వారా ఉద్యోగాల ఎంపిక విధానం మెరుగవుతుందని ఆయన అంగీకరించారు.

కన్యత్వ పరీక్షలను రద్దు చేస్తున్న ప్రకటన ఒక్క ఆర్మీకే పరిమితమా లేక ఇతర సైనిక విభాగాలకు కూడా వర్తిస్తారా అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు.

ఈ సందేహాలకు సమాధానాలు రానున్న వారాల్లో లభిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)