అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్ చేతికి చిక్కడం కంటే చచ్చిపోవడం మేలు’ - హజారా విద్యార్థిని కన్నీటి కథ

ఫొటో సోర్స్, AFP
ఇది కాబుల్ యూనివర్సిటీలో కొత్త సెషన్ కోసం సిద్ధం కావాల్సిన సమయం.
కానీ తాలిబాన్ ఫైటర్లు రోడ్లపై గస్తీ కాస్తుండడంతో చాలామంది విద్యార్థినులు చదువుపై ఆశ వదులుకున్నారు.
ప్రస్తుత పరిస్థితిపై గత కొన్నేళ్లుగా తాలిబాన్ చేతుల్లో కిడ్నాప్‌నకు, హత్యలకు గురవుతున్న హజారా సమాజానికి చెందిన ఒక విద్యార్థిని బీబీసీతో మాట్లాడారు.
బాగా చదువుకోవాలని ఆమె కన్న కలలన్నీ ఇప్పుడెలా ఛిద్రమయ్యాయో ఆమె బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
బీబీసీతో విద్యార్థిని పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే...
అది నేను మాటల్లో వర్ణించలేను. నేను కలలుగన్న ప్రతిదీ, నేను ఇప్పటివరకు చేసిన ప్రతిదీ, అంటే నా గౌరవం, నా ఆత్మాభిమానం, ఒక మహిళగా నా ఉనికి, నా జీవితం అన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.
ఒక్కో ఇల్లు వెతికి అమ్మాయిలను ఎత్తుకెళ్లడానికి, వాళ్లపై అత్యాచారం చేయడానికి వాళ్లకు ఎంతో సమయం పట్టదు. వాళ్లు మా ఇంటికి వస్తే, నేను బహుశా ఆత్మహత్య చేసుకుంటానేమో. నేను నా స్నేహితురాళ్లతో మాట్లాడుతూనే ఉన్నా. మేమంతా అదే చేయాలని ప్లాన్ చేస్తున్నాం. తాలిబాన్ చేతికి చిక్కడం కంటే చచ్చిపోవడమే మంచిదని అనుకుంటున్నాం.
మాకు చాలా భయంగా ఉంది. జరిగేది తలుచుకుంటూ వణికిపోతున్నాం.
అంతా తలకిందులైంది
రెండు నెలల క్రితం నా దృష్టంతా డిగ్రీ పూర్తి చేయడం మీదే ఉండేది. రాబోయే సెమిస్టర్ కోసం ఎలా చదవాలి, ఏం చేయకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నా. షెడ్యూల్ వేసుకున్నా. అన్నీ సవ్యంగా జరిగేలా ప్రయత్నిస్తున్నా. అప్పటికే తాలిబాన్లు దేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. చాలా మంది భయపడుతున్నారు. కానీ వాళ్లు కాబుల్‌ను ఎప్పటికీ ఆక్రమించలేరని నేను అనుకునేదాన్ని.
మజార్-ఎ-షరీఫ్ (కాబూల్‌కు నైరుతిగా అతిపెద్ద నగరం, తాలిబాన్ల వ్యతిరేకులకు కంచుకోట)పై వారు పట్టు సాధించే ముందు వరకు నా జీవితం మామూలుగా ఉండేది. కానీ వాళ్లు దానిని ఆక్రమించగానే, ఇక మా పని కూడా అయిపోయిందని నాకు అనిపించింది. తర్వాత వాళ్లు కాబుల్‌ను కూడా ఆక్రమించారు. నగరంలో కాల్పుల శబ్దం మాకు వినిపించింది. తాలిబాన్లు ప్రతి వీధిలోకీ చేరారని మాకు తెలిసింది.
తర్వాత అంతా మారిపోయింది.
సోషల్ మీడియాలో పోస్టుల గురించి భయం
మా కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంది. షాపులన్నీ మూతపడ్డాయి. గంట గంటకూ ధరలు పెరుగుతున్నాయి. కరెన్సీ మారక విలువ కూడా వేగంగా మారిపోతోంది.
నేను నా యూనివర్సిటీకి సంబంధించిన అన్ని కాగితాలు, డాక్యుమెంట్స్ తగలబెట్టాను. బాల్కనీలోకి వెళ్లి నా మార్కుల జాబితాలు, సర్టిఫికెట్లు అన్నీ కాల్చేశాను. నా దగ్గర చాలా పుస్తకాలున్నాయి. మంచి మంచి పుస్తకాలు చదువుకునేదాన్ని. ఇప్పుడు వాటన్నిటినీ కనపడకుండా దాచేశాను.
నా సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ చేశాను. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ ప్లాట్‌ఫాంలో మన ఉనికి కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరం కావచ్చని నాకు చెప్పారు. తాలిబాన్లు సోషల్ మీడియా చెక్ చేస్తారని, వాటిలో మా పోస్టులు కనిపెట్టి, మమ్మల్ని వెతికి పట్టుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే.
నాకు ఫేస్‌బుక్ పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే, దాన్లో నేను యాక్టివ్‌గా ఉండేదాన్ని. తాలిబాన్ ఏం చేయలేరు, వాళ్లకు వ్యతిరేకంగా నిలబడతా, చదువుకునే హక్కును ఎవరూ లాగేసుకోలేరు, నన్ను నాలుగు గోడల లోపల బంధించలేరు.. అంటూ నా పాత పోస్టుల్లో చాలా రాశాను. వాళ్లను తీవ్రవాదులని అన్నాను. ఇప్పుడు ఆ పోస్టులన్నీ వాళ్లకు కచ్చితంగా కోపం తెప్పిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Creative Stock
వాళ్లు కొన్ని రోజుల్లోనే ఇదంతా చేసేశారు. లోలోపలే నాకు ఏదో ఘోరం జరిగినట్టు, భయంగా, బాధగా అనిపిస్తోంది. మహిళలు హిజాబ్‌తోపాటూ సంప్రదాయ దుస్తులు ధరించాలని తాలిబాన్ ప్రకటించారు. దాంతో మహిళలందరూ భయంతో బురఖా, హిజాబ్ ధరిస్తున్నారు.
కొన్ని యూనివర్సిటీలు క్లాస్‌లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తెరలు పెట్టాయని విన్నాను. కొన్ని కుటుంబాలు తమ అమ్మాయిలను చదుకోడానికి బయటకు పంపించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే, తాలిబాన్ ఇంకా తమ నిజ స్వరూపం బయటపెట్టలేదు. కానీ, వాళ్లు దాన్ని కచ్చితంగా చూపిస్తారు. అప్పుడు ఏ సమస్యలు రాకుండా ఉండాలనే, ఈ కుటుంబాలు అలా చేస్తున్నాయి.
నేను తాలిబాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. (మహిళల హక్కులు కాపాడతామని తొలి మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు) వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. వాళ్లు అబద్ధం చెబుతున్నారని నేను కచ్చితంగా చెప్పగలను.
'మమ్మల్ని కచ్చితంగా చంపేస్తారు, లేదా రేప్ చేస్తారు'
నేను మంగళవారం మా నాన్నతో కలిసి మందులు తీసుకురావడానికి బయటికెళ్లాను.
అన్నీ మూసేసున్నాయి. నేను పూర్తిగా హిజాబ్ వేసుకోవాల్సి వచ్చింది. మహిళలు, 13, 14 ఏళ్ల బాలికలు కూడా బురఖా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. ఇది అప్పటి నగరంలా లేదు.
ఎక్కడ చూసినా తాలిబాన్ ఫైటర్లు తిరుగుతున్నారు. మనం పూర్తిగా హిజాబ్ వేసుకుని ఉన్నా మనల్ని చూస్తుంటారు. ఆ చూపులు.. మనం మామూలు మనిషి కాదన్నట్టు, మీ జీవితానికి నేనే యజమానిని, మీరంతా విసిరిపడేసే చెత్తలాంటి వారు అన్నట్లు ఉంటాయి.
నేను చదువుకుంటున్నప్పుడు ఎన్నో కలలు కనేదాన్ని. జీవితం గురించి ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ, ఎన్నో లక్ష్యాలు పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఈ దేశమే వదిలి వెళ్లాల్సుంటుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే నేను హజారాను. వాళ్లు గతంలో హజారా అమ్మాయిల స్కూలుపై దాడులు చేశారు. వందల మందిని చంపేశారు.
అందుకే వాళ్లు మమ్మల్ని కూడా కచ్చితంగా చంపేస్తారు. లేదంటే అత్యాచారం చేసిన తర్వాత చంపేస్తారు.
ఒక అమ్మాయిగా, ఒక మైనారిటీగా నాకు నా స్వదేశంలోనే ఎలాంటి రక్షణా లేకుండాపోయింది.
నా కుటుంబం మొత్తం భయంలో ఉంది. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి మేం అఫ్గాన్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం. చట్టపరంగా లేదా అక్రమంగా అయినా దేశం దాటేయాలని చూస్తున్నాం.
విమానాశ్రయంలో జనం భారీగా ఉన్నారు. తరలించడానికి ఎక్కడా అవకాశమే లేదు. చాలా దేశాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్క దేశం అఫ్గాన్‌లో అసలు ఏమీ జరగనట్లు చూస్తున్నాయి.
అఫ్గాన్లు మినహా అందరిపట్లా మానవత్వం
నేను విదేశీ ప్రభుత్వాలను ఒకటి కోరాలని అనుకుంటున్నాను. మీరెవరూ అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వకండి. ఎందుకంటే మీరు గుర్తిస్తే, మేం కచ్చితంగా ప్రాణాలతో మిగలం. పరిస్థితి బహుశా చావు కంటే ఘోరంగా ఉంటుందేమో ఎవరికి తెలుసు.
కానీ, నేను ఏ నగరాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించానో దానిని తాలిబాన్ ఫైటర్లు ఆక్రమించుకోవడం చూడడాన్ని మించిన దారుణం వేరే ఏదీ ఉండదు. నేను ఎమోషనల్ కావాలనుకోవడం లేదు. కానీ ప్రపంచమంతా మౌనంగా ఉండడం. ఎవరూ నోరు మెదపకపోవడం చూస్తుంటేనే నాకు ఎక్కువ బాధగా ఉంది.
ప్రపంచంలో చాలా దేశాలు అసలు తమకు ఏం పట్టనట్టే ప్రవర్తిస్తున్నాయి. అఫ్గాన్లు మనుషులు కారన్నట్లు చూస్తున్నాయి. ఇదంతా చూసి మా మనసు ముక్కలైపోయింది.
అందరిపట్లా మానవత్వంతో మెలగాలంటారు. కానీ, నాకు మాత్రం బహుశా అఫ్గాన్లు మినహా మిగతా అందరి పట్లా మానవత్వం చూపిస్తున్నట్లుగా అనిపిస్తోంది.
జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కొన్ని రోజుల క్రితం నేను ఎన్ని కలలు కన్నానో, ఏమేం సాధించాలని ఆలోచించానో అవన్నీ ఇప్పుడు అంతం అయ్యాయి.
(యువతి భద్రత కోసం ఆమె పేరు గోప్యంగా ఉంచాం)
ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా మానసిక ఒత్తిడికి లోనవుతుంటే భారత ప్రభుత్వ జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330 ద్వారా సాయం పొందవచ్చు. మీరు ఈ సమస్య గురించి మీ స్నేహితులతో, బంధువులతో కూడా మాట్లాడండి.
ఇవి కూడా చదవండి:
- హాజీ మస్తాన్, వరదరాజన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)


















