తాలిబాన్ ఆక్రమిత కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?

సేఫ్‌హోమ్‌లో లతీఫా

ఫొటో సోర్స్, Latifa

ఫొటో క్యాప్షన్, సేఫ్‌హోమ్‌లో లతీఫా
    • రచయిత, నేహా శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్‌లో సంక్షోభం కారణంగా అక్కడున్న భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తరలిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది అక్కడే చిక్కుబడిపోయి ఉన్నారు. క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు.

గత కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన ఓ భారతీయ మహిళ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు.

లతీఫా (పేరు మార్చాం) కాబూల్ నుంచి దిల్లీకి రావడానికి ఆగస్టు 19న ఎయిరిండియా విమానంలో సీటు బుక్ చేసుకున్నారు. కానీ అంతలోనే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. కాబూల్‌ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లగా...వాణిజ్య విమానాల సేవలు నిలిచిపోయాయి.

లతీఫా బుక్ చేసుకున్న విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.

ఆగస్టు 21న సాయంత్రం మేం ఆమెతో మాట్లాడే సమయానికి లతీఫా కాబూల్ ఎయిర్‌ పోర్ట్ బయట మినీ బస్‌లో కూర్చొని ఉన్నారు. 20 గంటలుగా తిండి, టాయ్‌లెట్ వసతులు లేకుండా ఆమె అదే బస్‌లో కూర్చుని, తన వంతు కోసం ఎదురు చూశారు.

భారత వాయుసేన విమానంలో అఫ్గాన్ నుంచి ఎలాగైనా బయట పడాలన్నది ఆమె ప్రయత్నం.

లతీఫాకు అఫ్గానిస్తాన్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఇరు దేశాల్లో బంధువులు ఉండటంతో ఆమె తరచూ రెండు దేశాల మధ్య ప్రయాణిస్తూ ఉంటారు.

తనను బంధించిన తాలిబాన్లను లతీఫా రహస్యంగా ఫొటో తీశారు

ఫొటో సోర్స్, LATIFA

ఫొటో క్యాప్షన్, తనను బంధించిన తాలిబాన్లను లతీఫా రహస్యంగా ఫొటో తీశారు

ఆగస్టు 15

(ఇక్కడ పేర్కొన్న సమయాలన్నీ అఫ్గానిస్తాన్ కాలమానం ప్రకారం)

ఆ రోజు అఫ్గానిస్తాన్‌లోని చాలా రాయబార కార్యాలయాలు రాత్రికి రాత్రే మూత పడ్డాయన్న విషయం లతీఫా నిద్ర లేవగానే తెలిసింది. అధికారులంతా తరలి వెళ్తున్నారనే విషయం తెలియడంతో ఆమె అప్రమత్తం అయ్యారు.

లతీఫా భారతీయురాలు కావడంతో ఆమెకు మరింత ముప్పు పొంచి ఉందని ఊహించిన ఆమె భర్త వీలైనంత త్వరగా లతీఫాను భారత్ పంపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వారిద్దరూ భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అందుబాటులో ఉన్న విమానం గురించి ఆరా తీశారు.

తన భర్త, అత్త మామలకు వీసా గురించి కూడా లతీఫా ప్రయత్నించారు.

''మేం భారత రాయబార కార్యాలయానికి చేరుకునేసరికి అదృష్టవశాత్తు అక్కడ అధికారులు ఉన్నారు. కానీ ఏదో గందరగోళంగా అనిపించింది. అధికారులు చాలా ఫైళ్లను, పేపర్లను తగలబెడుతూ కనిపించారు. సాయంత్రం వరకు కార్యాలయంలో తాము విధులు నిర్వహిస్తామని అధికారులు మాతో చెప్పారు. నా కుటుంబం అంతటికీ వీసా కావాలని నేను వారిని కోరాను. కుటుంబ సభ్యులందరి పాస్‌పోర్టులు, ఇతర ఫైళ్లను తీసుకొని సాయంత్రం రావాల్సిందిగా అధికారులు చెప్పడంతో నేను వెనుదిరిగాను'' అని లతీఫా వెల్లడించారు.

కానీ అప్పటికప్పుడే పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారిపోయాయి.

''తాలిబాన్లకు భయపడి ప్రజలు పరుగులు పెడుతున్నారు. నా భర్త నా చేయి పట్టుకోగా... మేమిద్దరం మా ఇంటి వైపు పరిగెత్తాం. అప్పుడు కాబుల్‌లో ఉన్న ప్రజలందరూ వీధుల్లోకి వచ్చినట్లుగా అనిపించింది. వారంతా ఎయిర్‌పోర్ట్ వైపు పరిగెడుతున్నారు. అది చాలా భయానకంగా అనిపించింది. మేం మా ఇంటికి చేరుకోగానే, భవన భద్రతా సిబ్బంది కూడా యూనిఫాం మార్చుకొని కుర్తా పైజామాలు వేసుకున్నారు. అంతలోనే తాలిబాన్లు మా ఇంటిని చుట్టుముట్టారు'' అని ఆమె వివరించారు.

అదే రోజు సాయంత్రం లతీఫా తన భర్తతో కలిసి పాస్‌పోర్ట్‌లతో భారత రాయబార కార్యాలయానికి వెళ్లారు. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులందరికీ వీసా లభించింది.

వారంతా భారత విదేశాంగ కార్యాలయం నుంచి ఫోన్ కోసం ఎదురు చూశారు. లతీఫా భారతీయురాలు కావడంతో ఆమెకు ప్రాధాన్యత లభించింది.

లతీఫాను బంధించిన ప్రాంతం

ఫొటో సోర్స్, LATIFA

ఫొటో క్యాప్షన్, లతీఫాను బంధించిన ప్రాంతం

ఆగస్టు 19

''భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి 19న నాకు మెసేజ్ వచ్చింది. కాబుల్‌లోని ఓ ప్రాంతానికి (భద్రతా కారణాల రీత్యా ప్రదేశం పేరు వెల్లడించడం లేదు.) రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. తరలింపు ప్రక్రియలో భాగమైన వారంతా అక్కడే సమావేశమయ్యారు. నా కుటుంబాన్ని వదిలి ఒక్కదాన్నే అక్కడి నుంచి రావడం చాలా కష్టంగా అనిపించింది. కానీ నా భద్రత గురించి మా వాళ్లంతా ఆందోళన చెందారు. తీరిగ్గా ఆలోచించి అందరూ కలిసి వెళ్లేంత సమయం లేదు. అందుకే ఒక్కదాన్నే బయల్దేరాను. కేవలం హ్యాండ్‌బ్యాగ్‌లను మాత్రమే అనుమతించడంతో ల్యాప్‌ట్యాప్, హార్డ్ డ్రైవ్స్, ఫోన్, పవర్ బ్యాంక్ తీసుకొని బయటకొచ్చాను'' అని లతీఫా చెప్పారు,

అక్కడ ఏర్పాటు చేసిన సురక్షిత ఇంటిలో లతీఫాతో పాటు దాదాపు 220 మంది ప్రయాణీకులు దేశం విడిచి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. అందులో భారత ముస్లింలు, హిందువులు, సిక్కులతో పాటు కొన్ని అఫ్గాన్ కుటుంబాలు కూడా ఉన్నాయి.

కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ ఇళ్లు కూడా సురక్షితంగా అనిపించలేదు. ఆ తర్వాతి రెండు రోజులు మరింత ఆందోళనగా గడిచాయి.

''అక్కడ సరైన ఏర్పాట్లు లేవు. మేం ఎప్పుడు విమానం ఎక్కుతామో తెలియదు. మాకు రక్షణగా ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. ఇంకా చెప్పాలంటే, తాలిబాన్లు మా వసతి గృహం ఎదురుగా నిలబడి మాకు పహారా కాశారు. దీంతో వేరే ముష్కరులు మాపై దాడి చేయలేక పోయారు. చాలా దుర్భలమైన స్థితిలో భయంతో మేం కనీసం రాత్రిళ్లు నిద్ర కూడా పోలేక పోయాం'' అని లతీఫా వివరించారు.

ఆగస్టు 20

ఆగస్టు 20న రాత్రి 11 గంటలకు ప్రజలను తరలించాల్సిందిగా అకస్మాత్తుగా ఆదేశం వచ్చింది. దీంతో 11-12:30 గంటల మధ్య 150 మంది ప్రయాణీకులను 21 సీట్లున్న 7 మినీ బస్‌లలో ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు.

''మాకు తాలిబాన్లు ఎస్కార్ట్‌గా వచ్చారు. ముందు ఒక కారు మాకు మార్గం చూపగా, వెనుక ఓ కారు మమ్మల్ని అనుసరించింది. రాత్రి 1:30 గంటలకు కాబుల్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నాం. అప్పటికే పెద్ద సంఖ్యలో జనం విమానం కోసం ఎదురుచూస్తున్నారు. ఓ పక్క తాలిబాన్లు కాల్పులు జరుపుతుండగా, మరోవైపు అమెరికన్లు ప్రజలను అదుపు చేయడానికి టియర్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్నారు. మమ్మల్ని ఎయిర్‌పోర్టుకు నార్త్‌ గేటు వైపుకు తీసుకెళ్లారు. ఈ దారిని ఎక్కువగా మిలిటరీ దళాలు ఉపయోగిస్తాయి'' అని లతీఫా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

మేం ఎయిర్‌ పోర్ట్ వరకైతే చేరుకున్నాం. కానీ అంతటితోనే అయిపోలేదు. మమ్మల్ని లోపలికి పంపేందుకు అమెరికన్లు నిరాకరించారు. దీంతో ఆ రాత్రంతా అక్కడే ఎయిర్‌పోర్ట్ బయట మినీ బస్‌లలో గడిచి పోయింది. లోపలికి వెళ్లేందుకు మాకు మరో మార్గం కనబడలేదు.

''మాతో పిల్లలు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. మేం నిజంగా రోడ్డుపై దిక్కుతోచని పరిస్థితుల్లో నిలబడ్డాం. కొందరు మహిళలు నెలసరిలో ఉన్నారు. వారికి బాత్రూంలు అందుబాటులో లేవు. అందరం రోడ్డుపై ఉన్నాం. ఆ సమయంలో ఎవరైనా మాపై దాడి చేసి ఉండొచ్చు'' అని లతీఫా చెప్పారు.

విమానం కోసం పడిగాపులుగాస్తున్న ప్రయాణికులు

ఫొటో సోర్స్, LATIFA

ఫొటో క్యాప్షన్, విమానం కోసం పడిగాపులుగాస్తున్న ప్రయాణికులు

ఆగస్టు 21

లతీఫాతో పాటు మిగతా ప్రయాణీకులకు అది కాళరాత్రి. కానీ తెల్లవారాక పరిస్థితులు మరింత భయానకంగా మారిపోయాయి.

''పొద్దున 10:30 గంటలకు తాలిబాన్లు మా బస్సుల వద్దకు వచ్చి మా ప్రతినిధిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అతని ఫోన్ లాక్కొని చెంపపై కొట్టారు. అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కాలేదు''అన్నారామె.

మా ఏడు బస్సుల్ని తాలిబాన్లు వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు.

''ఒక పారిశ్రామిక ప్రాంతానికి తీసుకెళ్లి నిర్బంధించారు. తాలిబాన్లలో కొంతమంది యువకులు ఉన్నారు. వారిలో కొందరికి 17, 18 ఏళ్లే ఉంటాయి. ఇక అంతా అయిపోయింది, ప్రాణాలతో మిగలమనే అనుకున్నాం. ఆ కొన్ని గంటలు నా జీవితంలోనే అత్యంత భయంకరమైనవి. మా కుటుంబాలను మళ్లీ కలవలేం. ఇక ఇంటికి వెళ్లలేం అనే అనుకున్నాం'' అన్నరు లతీఫా.

అక్కడ పురుషులను, మహిళలను వేర్వేరుగా కూర్చొబెట్టారు. పాస్‌పోర్ట్‌లను తీసుకొని తాలిబాన్లు ప్రశ్నించడం మొదలు పెట్టారు. అక్కడున్న వారిలో అఫ్గానీలను పెళ్లి చేసుకున్న భారతీయ మహిళలను వేరు చేశారు.

''నేను భారత మహిళను. భారతీయులతోనే కలిసి కూర్చుంటా అని వారికి చెప్పాను. కానీ వారు మాత్రం నన్ను అఫ్గాన్లతో కూర్చోవాలని ఆదేశించారు. అప్పుడు నా భారతీయ సోదరులకు వారు ఏం హాని తలపెడతారోనని భయమేసింది. వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి ఏదైనా చేస్తే ఎలా? అనే ఆలోచనతో వణికి పోయాను'' అని లతీఫా వెల్లడించారు.

''నువ్వు ఎందుకు అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటున్నావ్? అని ఒక తాలిబాన్ నన్ను అడిగారు. మేం అఫ్గాన్‌ను పునర్మించాలని ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. మళ్లీ అఫ్గానిస్తాన్‌కు వస్తావా అని అడగగా... నేను రానని చెప్పాను. మీరంటే మాకు భయమని చెప్పాను. కానీ భయపడాల్సిన పనిలేదని చెప్పి మాకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. కనీసం మా కళ్లలోకి కూడా వాళ్లు చూడలేదు. తర్వాత వారు బయట భద్రత ముప్పు ఉందని చెప్పారు. మేం సురక్షితంగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పుడే తాలిబాన్ల ఆధీనంలో ఉన్న భారతీయ మిత్రురాలి నుంచి మెసేజ్ వచ్చింది. తాలిబాన్లు తమకు ఆహారం ఇచ్చినట్లు, జాగ్రత్తగా చూసుకున్నట్లు ఆమె సందేశంలో తెలిపింది''.

అదే రోజు తాలిబాన్ అధికార ప్రతినిధి స్థానిక అఫ్గాన్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రయాణీకులను కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. కొంతమందిపై అనుమానాలున్న కారణంగా అందరి భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

కాబూల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను తరలించే సి-17 విమానాలు

ఫొటో సోర్స్, LATIFA

ఫొటో క్యాప్షన్, కాబూల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను తరలించే సి-17 విమానాలు

రెండు గంటల తర్వాత లతీఫాను అఫ్గాన్ పౌరులతో ఉన్న బస్‌లోకి పంపించారు. అందులో అఫ్గాన్ వ్యక్తుల్ని వివాహాం చేసుకున్న భారతీయ మహిళలు కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారిలో ఇతర భారతీయులను కూడా అదే బస్‌లో ఎక్కించారు.

మధ్యాహ్నం 3 గంటలకు వారు మళ్లీ కాబుల్ ఎయిర్‌పోర్ట్ నార్త్ గేటు వద్దకు చేరుకున్నారు.

‘‘భారత విదేశాంగ శాఖ మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కానీ వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదు. నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మమ్మల్ని తాలిబాన్లు ఎలా నిర్బంధించారో...అక్కడ మేమెలా భయపడ్డామో అంతా భారత అధికారులకు చెప్పాం. కానీ ఎటువంటి ముందడుగు పడలేదు. అధికారుల మధ్య ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయో మాకు తెలియదు. కానీ అక్కడ ఉన్న నాకు మాత్రం చాలా ఆందోళన కలిగింది'' అన్నారు లతీఫా

''ఒకవేళ వారికి ఏం చేయాలో కచ్చితంగా తెలియనప్పుడు...మమ్మల్ని తరలిస్తాం అని చెప్పి ఉండకూడదు. మేం మా ఇళ్లలోనే దాక్కొని ఉండేవాళ్లం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇళ్లు వదిలి బయటకు వచ్చేవాళ్లం కాదు. ఇప్పుడు మేం బయటకొచ్చి ఇలాంటి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాం'' అని లతీఫా అన్నారు.

ప్రయాణికులను తరలించడంలో సి-17 విమానాలు కీలక పాత్ర పోషించాయి.

ఫొటో సోర్స్, MOD VIA PA MEDIA

ఫొటో క్యాప్షన్, ప్రయాణికులను తరలించడంలో సి-17 విమానాలు కీలక పాత్ర పోషించాయి

సాయంత్రం 6 గంటలు:

మరో 15-20 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్ లోపలికి తీసుకెళ్తామని లతీఫా బృందానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారమిచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

సాయంత్రం 7 గంటలు:

ప్రయాణీకులను సురక్షిత గృహానికి తిరిగి వెళ్లాల్సిందిగా మంత్రిత్వ శాఖ నుంచి సందేశం వచ్చింది. ప్రతీ ప్రయత్నం వృథా అనిపించింది.

''మన ప్రభుత్వానికి సమర్థత లేదా? కనీసం వారు మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ లోపలికి కూడా అనుమతించలేరా? మేం ఇక్కడ నిస్సహాయంగా పడి ఉన్నాం. దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండి''.

ఒక రోజంతా భయానక పరిస్థితుల మధ్య అటూ ఇటూ తిరుగుతూ, నిద్ర లేకుండా, ఆకలితో, మానసికంగా కుంగిపోయిన లతీఫా బృందాన్ని తిరిగి సురక్షిత గృహానికి తరలించారు.

రాత్రి 7:50 గంటలు:

''అర్ధరాత్రి తర్వాత తరలింపు ప్రక్రియ చేపడతామని అధికారులు మాతో చెప్పారు. కానీ ఏం జరుగనుందో ఎవరికి తెలుసు? కొన్ని రోజులుగా వారు అదే మాట చెబుతూ వస్తున్నారు. మాకు నమ్మకం పోయింది. కొంతమంది తిరిగి ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. మూడు రోజులుగా మేం నిద్రపోలేదు. చిన్నపిల్లల తల్లులకు ఇదీ మరీ నరకంగా మారింది''.

చాలామంది శరణార్ధులు కొద్దిపాటి సామాన్లతో విమానం ఎక్కుతున్నారు
ఫొటో క్యాప్షన్, చాలామంది శరణార్ధులు కొద్దిపాటి సామాన్లతో విమానం ఎక్కుతున్నారు

రాత్రి 9 గంటలు:

తీవ్ర అలసట, నిరుత్సాహంతో లతీఫా ఇక భారత్‌కు వెళ్లడం జరిగే పని కాదని నిర్ణయించుకున్నారు. కానీ అదే రోజు రాత్రి కొంతమంది భారతీయులు, అఫ్గాన్లను విజయవంతంగా భారత వాయుసేన సి-17 విమానంలో తరలించారు. లతీఫాతో పాటు ఇంటికి వెళ్లిన కొంతమంది ఈ అవకాశాన్ని చేజార్చుకున్నారు.

రాత్రి 10:40 గంటలు:

''పరిణామాలు చాలా వేగంగా మారిపోయాని కొంతమంది నాతో అన్నారు. సురక్షిత గృహానికి చేరిన కాసేపటికే మళ్లీ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారని చెప్పారు. చాలా కొద్ది వ్యవధిలో నేను అవకాశాన్ని చేజార్చుకున్నా. నాకు సమాచారమిచ్చేంత సమయం వారికి లేదు. దీంతో నేను వెనుకబడ్డా. ఇప్పుడు వారంతా ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్నారు'' అన్నారామె.

''సురక్షిత గృహం నుంచి వెళ్లిపోవాలని మొదట నేను కూడా అనుకోలేదు. కానీ మేం మానసికంగా, శారీరకంగా చాలా అలసి పోయాం. అందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇంకా చాలా విమానాలు మాకోసం వస్తాయని నాకు తెలిసింది. అందుకే ఇంకా నాకు నమ్మకముంది'' అన్నారు లతీఫా.

ఆగస్టు 22

లతీఫాను రెండుసార్లు సంప్రదించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమె పేరును కొత్త లిస్టులో చేర్చింది.

భారత్ చేరుకున్న అఫ్గాన్ ప్రజలు

ఆగస్టు 23

ఉదయం 3:30 గంటలకు భారత మంత్రిత్వ శాఖ లతీఫాకు మరోసారి సమాచారమిచ్చింది. ఉదయం 6:30 గంటలకు ఓ ప్రాంతానికి చేరాలని సూచించింది. 7:30 గంటలకు ప్రయాణీకులతో బస్సులు ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరతాయని వెల్లడించింది.

ఉదయం 9గంటలు:

21 సీట్లున్న 2 మినీ బస్సులు 70-80 మంది ప్రయాణీలకుతో హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరాయి. అప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ముందులాగే ఉంది.

''పెద్ద సంఖ్యలో ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాలిబాన్లు ప్రజల్నికొరడాలతో కొడుతున్నారు. గాలిలో కాల్పులు జరుపుతున్నారు. వెంటనే బస్ కిటికీలు, పరదాలు మూసివేయాల్సిందిగా చెప్పారు. అది చాలా భయంకరంగా అనిపించింది.

ఉదయం 9:45 గంటలు:

లతీఫా ప్రయాణిస్తున్న బస్సు సురక్షింతంగా ఎయిర్‌పోర్ట్ మెయిన్ గేట్‌ను చేరింది.

''చాలా కష్టపడి మేం లోపలికి వెళ్లగలిగాం. మెయిన్ గేట్‌తో పాటు లోపల కూడా తాలిబాన్లు ఉన్నారు. తర్వాత మమ్మల్ని ఎయిర్‌పోర్ట్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ అమెరికా సైనికలు మమ్మల్ని వారించారు. కొందరు భారత అధికారులు వచ్చి మా పాస్‌పోర్ట్‌లు పరీక్షించారు''.

ఉదయం 11 గంటలు:

మహిళా ప్రయాణీకులందర్నీ టెంట్‌ల కింద కూర్చోబెట్టారు. అమెరికా సైనికులు మాకు ఆహారం అందించారు.

మధ్యాహ్నం 12:20 గంటలు:

''అమెరికన్లు వచ్చి మమ్మల్ని టెంట్‌ల నుంచి బయటకు పంపించారు. భారత విమానం కోసం ఎదురు చూస్తూ మండే ఎండలో తారు రోడ్డుపై కూర్చున్నాం. అమెరికన్ల నుంచి ల్యాండింగ్ అనుమతి కోసం భారత్ ఎదురు చూస్తున్నట్లు మాకు తెలిసింది.

మధ్యాహ్నం 1:04 గంటలు:

''దూరం నుంచి భారత వాయుసేన విమానం రావడాన్ని చూశాను. ఇప్పుడు నిజంగా మమ్మల్ని విమానంలోకి తరలిస్తున్నారు అనుకున్నాను''.

మధ్యాహ్నం 1:20 గంటలు:

''మేం భారత వాయుసేన విమానంలో కూర్చున్నాం. మమ్మల్ని వారు తజకిస్తాన్‌కు తీసుకెళ్లనున్నారు''.

మధ్యాహ్నం 2 గంటలు:

బీబీసీ ప్రతినిధి ఫోన్ చేసే సమయానికి లతీఫా మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అంటే దీనర్థం విమానం కాబూల్ నుంచి టేకాఫ్ అయి తజకిస్థాన్ మీదుగా భారత్‌కు పయనమై ఉంటుంది.

భారత్ చేరుకున్న అఫ్గాన్ ప్రజలు

ఆగస్టు 24

లతీఫా ప్రయాణిస్తున్న విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 9.40 గంటలకు (భారతదేశ కాలమానం ప్రకారం) చేరుకుంది. స్వదేశానికి చేరుకోవాలన్న లతీఫా ప్రయత్నం, తపన ఫలించాయి.

ఆమె స్వదేశంలో అడుగుపెట్టగానే నేను ఆమెకు ఫోన్ చేశాను. ‘స్వదేశానికి స్వాగతం లతీఫా’ అన్నాను.

దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

‘‘దీన్నంతా ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. నేనైతే ఇక్కడికి చేరుకున్నాను. కానీ, నా భర్త, నా కుటుంబం ఇంకా అఫ్గానిస్తాన్‌లోనే ఉన్నారు. నేను ఎలాంటి భయానక పరిస్థితుల నుంచి బయటపడ్డానో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. మేం కాబుల్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతోందో ఆలోచించుకోవడానికి ఒక నిమిషం సమయం కూడా లేదు. కానీ, దుషాంబే (తజకిస్థాన్) చేరుకున్న తర్వాత ఏం జరుగుతోందో తెలిసింది. నాకు మాటలు రావట్లేదు. నా భర్త, అత్తమామలు కూడా త్వరగా బయటపడాలని నేను ప్రార్థిస్తున్నాను. అప్పటిదాకా నేను ఇంటికి చేరనట్లే’’.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)