అఫ్గానిస్తానీలను తరలిస్తున్న విమానం సి-17 ప్రత్యేకతలేంటి? ఇందులో ఎంతమంది కూర్చోవచ్చు?

సి-17 విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న శరణార్ధులు

ఫొటో సోర్స్, US AIR MOBILITY COMMAND

ఫొటో క్యాప్షన్, సి-17 విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న శరణార్ధులు

ఆగస్టు 15న అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న రోజున అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఒకటి, 183 చిన్నారులు సహా, 823 మంది అఫ్గాన్ పౌరులను సురక్షితంగా తరలించింది.

బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్-3గా పిలిచే ఈ విమానానికి ఇదొక రికార్డు. నాలుగు ఇంజిన్లు ఉండే ఈ రవాణా విమానం కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రజలను ఎయిర్ లిఫ్టింగ్ చేస్తూ వార్తల్లో నిలిచింది.

అత్యవసర పరిస్థితుల్లో మనుషులను, సరుకులను చేరవేయడంలో సి-17 విమానాలు ఉపయోగపడుతున్నాయి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అత్యవసర పరిస్థితుల్లో మనుషులను, సరుకులను చేరవేయడంలో సి-17 విమానాలు ఉపయోగపడుతున్నాయి

80లలో తయారై, 90ల నుంచి రవాణాలో పాల్గొంటున్న ఈ విమానాన్ని సైనికులను, సరుకులను, కొన్నిసార్లు ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు ఉపయోగిస్తుంటారు.

ఆదివారం ఓ అఫ్గాన్ మహిళ సి-17లో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జర్మనీలోని రెమ్‌స్టెయిన్ ఎయిర్ బేస్‌కు వెళుతుండగా ఆ గర్భిణీ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయి. విమానంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు కాన్పు చేశారు.

అమెరికా, బ్రిటన్‌లతోపాటు భారతదేశం కూడా సి-17 విమానాలను వినియోగిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా, బ్రిటన్‌లతోపాటు భారతదేశం కూడా సి-17 విమానాలను వినియోగిస్తోంది

భారత్‌లో వినియోగం

అమెరికా, బ్రిటన్‌లతోపాటు ఇండియా కూడా ఈ సి-17 విమానాన్ని ఉపయోగిస్తోంది. ఆదివారం నాడు కాబుల్ విమానాశ్రయం నుండి దిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో 168మంది చేరుకున్నారు. వీరిలో 24మంది అఫ్గాన్‌ హిందువులు, సిక్కులు ఉన్నారు.

బోయింగ్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం భారత వైమానిక దళంలో సి-17 గ్లోబ్‌మాస్టర్ 3 తరహా 11 విమానాలు వినియోగంలో ఉన్నాయి. సహాయక చర్యల కోసం భారత వైమానిక దళం తరచుగా ఈ విమానాన్ని ఉపయోగిస్తుంది.

అఫ్గాన్ నుంచి ప్రతి రోజూ కొన్ని వేలమంది శరణార్ధులు విదేశాలకు తరలి వెళుతున్నారు.
ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ నుంచి ప్రతి రోజూ కొన్ని వేలమంది శరణార్ధులు విదేశాలకు తరలి వెళుతున్నారు

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి కూడా ఈ విమానం చాలా ఉపయోగపడింది.

యు.ఎస్.ఎయిర్ ఫోర్స్‌ ఫ్యాక్ట్‌షీట్ ప్రకారం ఈ విమానాన్ని 77 టన్నుల బరువును మోసుకెళ్లేలా రూపొందించారు. సాయుధ వాహనాలు, ట్రక్కులు, యుద్ధట్యాంక్‌లను కూడా ఈ విమానంలో తీసుకెళ్లవచ్చు.

ఆదివారం నాడు ఓ విమానంలో మహిళ ప్రసవించింది

ఫొటో సోర్స్, US AIR MOBILITY COMMAND

ఫొటో క్యాప్షన్, ఆదివారం నాడు ఓ విమానంలో మహిళ ప్రసవించింది

ఎంతమంది పని చేస్తారు?

ముగ్గురు వ్యక్తుల సిబ్బందిలో ఇద్దరు పైలట్లతోపాటు, వెనుక నుండి సరుకును దింపడం, ఎక్కించడం చేసే ఓ లోడ్‌ మాస్టర్ ఉంటారు. అఫ్గానిస్తాన్‌ నుంచి అనేకమందిని ఈ విమానాలు గల్ఫ్ దేశాలకు తరలించాయి.

ఖతార్ రాజధాని దోహాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో శరణార్ధుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అమెరికా శుక్రవారం తన విమానాలను నిలిపి వేసింది. 20,000 మంది అఫ్గాన్‌ దేశస్తులను శరణార్ధులుగా స్వీకరిస్తామని బ్రిటన్, కెనడాలు ప్రకటించాయి.

ఆగస్టు 15న ఒకేసారి సుమారు 800 మందికి పైగా అఫ్గాన్ శరణార్ధులను సి-17 విమానం మోసుకెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆగస్టు 15న ఒకేసారి సుమారు 800 మందికి పైగా అఫ్గాన్ శరణార్ధులను సి-17 విమానం మోసుకెళ్లింది

అయితే తాము ఎంతమంది శరణార్థులను తీసుకోబోతున్నామో అమెరికా, జర్మనీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా అధికారులు శరణార్ధులను తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ దేశం నుండి ప్రజలను తరలించడానికి ప్రభుత్వం 18 వాణిజ్య విమానాల సహాయం కూడా తీసుకుంటుందని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, పెంటగాన్ ఆదివారం ఒక ప్రకటన చేశాయి.

విమానంలో శరణార్థులు

ఫొటో సోర్స్, PA Media

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)