అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడంపై ఇస్లామిక్ స్టేట్ ఏమంది?

ఫొటో సోర్స్, IS PROPAGANDA
అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి వరుస ఘటనలపై తమను తాము ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకుంటున్న తీవ్రవాద సంస్థ స్పందించింది.
తాలిబాన్లు అక్కడ ఎలాంటి విజయం సాధించలేదని, అమెరికానే ఆ దేశం పగ్గాలు వారి చేతికి అప్పగించిందని వ్యాఖ్యలు చేసింది.
"ఇది జిహాద్ విజయం కాదు, బేరసారాలతో సాధించిన విజయం" అని ఆగస్టు 19న ప్రచురితమైన తమ అల్-నబా వారపత్రిక ఎడిటోరియల్‌లో ఇస్లామిక్ స్టేట్ చెప్పింది.
కొత్త తాలిబాన్లను ఇస్లాం ముసుగు ధరించిన బహురూపులుగా ఐఎస్ వర్ణించింది. ముస్లింలను తప్పుదారి పట్టించడానికి, ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ ఉనికిని అంతం చేయడానికి అమెరికా వారిని ఉపయోగించుకుంటోంది అని చెప్పింది.
అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా తాలిబాన్లు ప్రవర్తిస్తున్నారని అంతకుముందు ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు ఆరోపించారు.
జిహాద్ కొత్త దశకు తాము సన్నద్ధం అవుతున్నట్లు ఐఎస్ తన తాజా ప్రకటనలో చెప్పింది. అయితే, తమ తదుపరి లక్ష్యం ఎవరనేది స్పష్టం చేయలేదు. కానీ ప్రకటన చేసిన సందర్భాన్ని బట్టి అది అఫ్గానిస్తాన్ దిశగా సంకేతాలు ఇస్తున్నట్లు ఒక అంచనా వేయవచ్చు.

ఫొటో సోర్స్, Alamy
తాలిబాన్లు, ఇస్లామిక్ స్టేట్ ఘర్షణ
అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉనికి బలహీనం కావడంలో తాలిబాన్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2019లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా తాలిబాన్లు, అమెరికా, అఫ్గాన్ భద్రతా బలగాలు ఒక్కసారిగా దాడులు ప్రారంభించాయి. దాంతో ఐఎస్ తూర్పు అఫ్గానిస్తాన్‌పై ఉన్న తమ బలమైన పట్టును కోల్పోయింది.
అప్పటి నుంచి తాలిబాన్లు అమెరికాతో చేతులు కలిపారని ఇస్లామిక్ స్టేట్ ఆరోపణలు చేస్తూనే ఉంది.
2020 ఫిబ్రవరిలో అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్న తాలిబాన్లు అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఇతర గ్రూపులు ఉపయోగించనివ్వబోమని చెప్పారు.
దీనిపై స్పందించిన ఇస్లామిక్ స్టేట్ తాము అలాంటి ఒప్పందాలకు కట్టుబడి ఉండమని, అఫ్గానిస్తాన్‌లో తమ జిహాద్ కొనసాగుతుందని చెప్పింది.
"షరియా చట్టం అమలు చేస్తాం" అంటున్న తాలిబాన్ల వాదనపై ఇస్లామిక్ స్టేట్ తమ తాజా సంపాదకీయంలో సందేహాలు వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, ISLAMIC STATE
రెండింటి యుద్ధం ఎప్పుడు మొదలైంది
ఆరేళ్ల క్రితం 2015 జనవరిలో ఈ రెండు గ్రూపులూ ఒకదానిపై ఒకటి యుద్ధం ప్రకటించాయి. ఆ సమయంలో ఇస్లామిక్ స్టేట్ తమ ఖురాసన్ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియాలోని కొన్ని భాగాలను చరిత్రలో ఖొరాసన్ అనే పేరుతో చెబుతారు. ఇరాక్, సిరియాలో వేళ్లూనుకున్న ఇస్లామిక్ స్టేట్ అరబ్ ప్రపంచం బయట తమ విస్తరణ గురించి ప్రకటించడం అదే మొదటిసారి.
తాలిబాన్ల అప్పటి నేత ముల్లా మొహమ్మద్ ఉమర్ అధికారాన్ని సవాలు చేసిన మొదటి అతిపెద్ద తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లేదా దాఎష్. తాలిబాన్ ఫైటర్ ముల్లా మొహమ్మద్ ఉమర్‌ను ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు 'ఆమిర్ ఉల్ మొమిన్' అని పిలుస్తారు.
అల్ ఖైదా నేతలు తాలిబాన్ల ఆశ్రయం పొందారు. వారు ముల్లా మొహమ్మద్ ఉమర్ అధికారాన్ని అంగీకరించేవారు. కానీ, ఇస్లామిక్ స్టేట్ వారిపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
ఇస్లామిక్ స్టేట్ వర్సెస్ ఇస్లామిక్ ఎమిరేట్
రెండు జిహాదీ గ్రూపుల మధ్య చాలా అంశాలపై విభేదాలు ఉన్నాయి. ఒక దేశ సరిహద్దులకు కట్టుబడని ఇస్లామిక్ స్టేట్.. గ్లోబల్ జిహాద్ గురించి మాట్లాడుతుంది. అన్ని ముస్లిం దేశాలు, ప్రాంతాలతో ఒకే రాజకీయ యూనిట్ స్థాపించడం ఐఎస్ లక్ష్యం.
మరోవైపు, తమ ఎజెండా పరిధి అఫ్గానిస్తాన్ వరకే పరిమితమై ఉందని తాలిబాన్ గట్టిగా చెబుతోంది. అఫ్గానిస్తాన్‌కు విదేశీ ఆక్రమణల నుంచి విముక్తి కల్పించడమే వారి లక్ష్యం. అన్ని విదేశీ బలగాలూ తమ దేశం వదిలి వెళ్లిపోవాలని తాలిబాన్లు చాలా కాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు.
రెండు సంస్థల మధ్య మతపరమైన అంశాల్లో కూడా విభేదాలు ఉన్నాయి. తాలిబాన్లు ప్రాథమికంగా సున్నీ ఇస్లాం హనాఫీ శాఖను అనుసరిస్తారు. అఫ్గానిస్తాన్‌లో ఎక్కువమంది ఇదే శాఖకు చెందినవారు. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫీ శాఖను విశ్వసిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఇంటింటినీ జల్లెడ పడుతున్న తాలిబాన్లు.. భారత కాన్సులేట్లలోనూ సోదాలు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









