అఫ్గానిస్తాన్: సూసైడ్ బాంబర్ ప్రయాణిస్తున్న కారుపై అమెరికా క్షిపణి దాడి

ఫొటో సోర్స్, EPA
కాబుల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు సంభవించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో భవనాల మధ్య నుంచి నల్లని పొగలు పైకి లేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఈ ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదికారి ఒకరు ధ్రువీకరించారు.
మరోవైపు, ఐఎస్-కే గ్రూప్ సూసైడ్ బాంబర్ లక్ష్యంగా తాము క్షిపణి దాడి చేశామని అమెరికా అధికారులు తెలిపారు.
కాబుల్ విమానాశ్రయంపై దాడికి మాటు వేసిన ఆ సూసైడ్ బాంబర్ ఉన్న వాహనంపై డ్రోన్ సహాయంతో క్షిపణి ప్రయోగించినట్లు వారు వెల్లడించారు.
''మేం ఎంచుకున్న లక్ష్యంపై గురి తప్పకుండా దాడి చేశాం'' అని యూఎస్ మిలటరీకి చెందిన ఓ అధికారి బీబీసీ యూఎస్ పార్టనర్ నెట్‌వర్క్ సీబీఎస్‌కు చెప్పారు.
''సాధారణ పౌరులెవరూ ఈ దాడిలో మరణించినట్లు ఇంతవరకు సమాచారం లేదు'' అని ఆ అధికారి చెప్పారు.
క్షిపణి దాడి తరువాత ఆ వాహనం నుంచి మరిన్ని పేలుళ్లు జరిగాయని, దాన్ని బట్టి ఆ వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అర్థమవుతుందన్నారు.
సూసైడ్ బాంబర్‌గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రయాణిస్తున్న కారుపై అమెరికా దాడి చేసిందని తాలిబాన్ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ అసోసియేట్ ప్రెస్ వెల్లడించింది.
మరోవైపు కాబుల్ విమానాశ్రయం సమీపంలో రాకెట్ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. అయితే, అమెరికా చెబుతున్న క్షిపణి దాడి, ఈ రాకెట్ దాడి ఒకటేనా కాదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
గురువారం కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడులో 170 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షఫీ కరీమి పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌లోని దృశ్యాలు కాబుల్ సమీపంలో పేలుడు జరిగిన తరువాత తీసినవిగా కనిపిస్తున్నాయి.
ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నగరంలోని ఓ నివాసం మీద ఈ రాకెట్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
కాబుల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగే అవకాశం ఉందన్న బైడెన్
కాబుల్ విమానాశ్రయం దగ్గర మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
ఈ దాడులు ఆదివారం జరగవచ్చని తమ కమాండర్లు తనకు చెప్పారని ఆయన తెలిపారు.
మళ్లీ పేలుళ్ల ముప్పు ఉందనే విశ్వసనీయ సమాచారంతో విమానాశ్రయం సమీప ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ తమ దేశ పౌరులను కోరింది.
కాబుల్ విమానాశ్రయంలో అమెరికా దళాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి విడత అమెరికా దళాలు, దౌత్యవేత్తలు, అధికారులు అఫ్గానిస్తాన్ నుంచి బయల్దేరారు.
గురువారం విమానాశ్రయం దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో 170 మంది చనిపోయారు. ఆ దాడులు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ స్థానిక శాఖ ఐసిస్ ఖొరాసన్(ఐసిస్-కె) ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
ఈ పేలుళ్లకు ప్రతీకారంగా అమెరికా దళాలు శుక్రవారం తూర్పు అఫ్గానిస్తాన్‌లో డ్రోన్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఐసిస్-కె అగ్ర నేతలు ఇద్దరు చనిపోయారని అధికారులు చెప్పారు.
చనిపోయిన ఈ ఇద్దరు ఐసిస్ మిలిటెంట్లు కాబుల్ విమానాశ్రయం దగ్గర పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించారని అధికారులు చెబుతున్నారు. కానీ, వీరికి ఈ దాడులతో నేరుగా సంబంధం ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు.
తమ పని అప్పుడే అయిపోలేదని, బాంబు పేలుళ్లకు కారణమైన ప్రతి ఒక్కరినీ వేటాడడం కొనసాగిస్తామని, వారు తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బైడెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, US DEPARTMENT OF DEFENSE
రాబోవు రోజులు మరింత ప్రమాదకరం
ఐసిస్-కె అఫ్గానిస్తాన్‌లోని జిహాదీ మిలిటెంట్ గ్రూపులన్నిటి కంటే అత్యంత హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతోంది.
దాదాపు మొత్తం దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబాన్‌కు, ఈ గ్రూప్‌నకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి.
అమెరికాతో జరిగిన శాంతి ఒప్పందానికి అనుకూలంగానే తాలిబాన్లు యుద్ధ రంగాన్ని వదిలి పెట్టారని ఐసిస్-కె ఆరోపిస్తోంది.
అమెరికా దళాలు కూడా విమానాశ్రయం వదిలి వెళ్లడం ప్రారంభమైంది. 5800 ఉన్న వారి సంఖ్య ప్రస్తుతం 4 వేలకు తగ్గింది.
కాబుల్‌లో రాబోవు మరి కొన్ని రోజులు తమకు అత్యంత ప్రమాదకరంగా ఉండవచ్చని వైట్‌హౌస్ అధికారులు చెప్పారు.
"కాబుల్ విమానాశ్రయం చుట్టూ తాలిబాన్లు మరిన్ని చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది అఫ్గాన్ పౌరులను లోపలికి అనుమతించడం లేదు" అని అసోసియేటెడ్ ప్రెస్ చెప్పింది.
రెండు వారాల క్రితం తరలింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కాబుల్ విమానాశ్రయం నుంచి మొత్తం లక్షా పది వేల మందిని ఇతర దేశాలకు తరలించారు. వీరిలో అఫ్గాన్ పౌరులతోపాటూ విదేశీయులు కూడా ఉన్నారు.
శనివారం రోమ్ నుంచి కాబుల్ చేరుకున్న తమ విమానం దాదాపు 5 వేల మంది అఫ్గాన్ పౌరులను తరలించినట్లు ఇటలీ చెప్పింది. ఇప్పటివరకూ యూరోపియన్ యూనియన్ దేశాలు అఫ్గానిస్తాన్ నుంచి తరలించిన వారిలో ఇది అత్యధికం.
ఆగస్టు 17 నుంచి మొత్తం 2800 మందిని అఫ్గానిస్తాన్ నుంచి సురక్షితంగా తరలించామని ఫ్రాన్స్, దాదాపు 4 వేల మందిని తరలించామని జర్మనీ చెప్పాయి.
"అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ తరలించలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది" అని బ్రిటన్ సాయుధ దళాల చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
బ్యాంకుల ముందు నిరసనలు
విమానాల్లో దేశం నుంచి బయటపడాలనే ఆశలు అడుగంటడంతో చాలా మంది అఫ్గాన్ పౌరులు ఇప్పుడు పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దుల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశానికి తూర్పున స్పిన్ బోల్డక్ దగ్గర సరిహద్దులను తెరవడంతో కొంతమంది అక్కడ నుంచి బయటపడుతున్నారు. ప్రధాన బోర్డర్ క్రాసింగ్స్‌లో ఒకటైన తోర్ఖామ్‌ను మాత్రం మూసివేశారు.
ఆగస్టు 15న తాలిబాన్ కాబుల్‌పై పట్టు సాధించిన తర్వాత వివిధ దేశాల నుంచి అందే నిధులు ఆగిపోవడంతో అఫ్గానిస్తాన్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది.
దీంతో బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును ఎలాగైనా తిరిగి తీసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
శనివారం అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లో బ్యాంకుల బయట జనం భారీగా గుమిగూడారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ నిరసనలకు దిగారు.
"ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా అందకపోతే, వ్యాపారులు వ్యాపారం కోసం దాచుకున్న తమ డబ్బు తిరిగి తీసుకోలేకపోతే ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే పేదరికం ఉంది. దీనిని ఎవరూ పరిష్కరించలేరు" అని వారిలో ఒకరు రాయిటర్స్‌తో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- హాజీ మస్తాన్, వరదరాజన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








