ఆపరేషన్ సైక్లోన్: తాలిబాన్ ఎందుకు, ఎలా ఏర్పాటైంది? ఇందులో అమెరికా పాత్ర ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గుయిల్లెర్మో డీ ఓల్మో
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలో వారిని 'జంగ్-ఎ-ఆజాదీ కే సిపాయీ'(స్వతంత్ర పోరాట సైనికులు) అనేవాళ్లు. కానీ, వారిని ఇస్లాం మతవాద గెరిల్లా యోధులు అనడమే సబబు.
అఫ్గానిస్తాన్ స్థానిక గెరిల్లా యోధుల గ్రూపులు అమెరికా మద్దతుతో ఎన్నో ఏళ్లపాటు సోవియట్ యూనియన్‌తో పోరాడాయి. తనకు శత్రువైన సోవియట్ యూనియన్ ప్రణాళికలను అడ్డుకోవడానికి అమెరికా వారికి ఆయుధాలు, ఆర్థిక సాయం అందించేది.
రహస్య పత్రాలు, జర్నలిస్టుల పరిశోధనలు, ఆ సమయంలో ప్రముఖుల ప్రకటనలు, ఇంటర్వ్యూల ఆధారంగా దీని వెనుక ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
ఏళ్ల క్రితం వియత్నాం యుద్ధంలో తాను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో, అలాగే.. సోవియట్ యూనియన్‌ను కూడా ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా భావించింది.
దానికి అమెరికా 'ఆపరేషన్ సైక్లోన్' ప్రారంభించింది. అప్పట్లో మీడియా దీనిని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ చరిత్రలో అతిపెద్ద ఆపరేషన్‌గా వర్ణించింది.
సోవియట్ యూనియన్ సైనికులు వెనకడుగు వేసిన కేవలం ఎనిమిదేళ్లకే 1996లో తాలిబాన్ కాబుల్ మీద విజయం సాధించారు.
అఫ్గానిస్తాన్‌లో ఒక ఇస్లాం సనాతన పాలనను అమలు చేశారు. వారి పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచమంతా విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
అందుకే, అప్పటి తాలిబాన్ విజయంలో అమెరికాకు ఏదైనా పాత్ర ఉందా అనే ప్రశ్నకూడా వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అలా మొదలైంది...
అది 1979 వసంత కాలం. అప్పటి సోవియట్ యూనియన్ ఆర్మీ, 30 వేల మందికి పైగా సైనికులు, యుద్ధ విమానాలు, ట్యాంకులతో అఫ్గానిస్తాన్ వైపు కదిలింది. కాబుల్‌లోని విప్లవాత్మక ప్రభుత్వానికి సాయం అందించడానికి ముందుకొస్తోంది.
ఏడాది క్రితమే 'సౌర్ విప్లవం'తో అఫ్గానిస్తాన్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఇస్లాం మిలీషియా గ్రూపుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ మిలీషియా గ్రూపులు తమను ముజాహిదీన్‌లుగా చెప్పుకునేవి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం తమ పోరాటాన్ని జిహాద్‌గా భావించేవారు.
సోవియట్ యూనియన్ మాత్రం అఫ్గానిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభుత్వం అలాగే ఉండాలని కోరుకుంది. కానీ అధ్యక్షుడు బబ్రక్ కర్మాల్ పాలనకు వ్యతిరేకంగా ముజాహిదీన్‌ల తిరుగుబాటు అంతకంతకూ ఊపందుకుంది.
"అఫ్గానిస్తాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల్లో పని చేయాలని 50వ దశకం నుంచే సోవియట్ యూనియన్‌తో పోటీపడుతున్న అమెరికాకు అది ఆశ్చర్యం కలిగించింది" అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో అఫ్గాన్ చరిత్ర నిపుణులు రాబర్ట్ క్రూజ్ చెప్పారు.
అలాంటి పరిస్థితుల్లో అప్పటి అధ్యక్షుడు జిమీ కార్టర్ తన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జబెగ్‌న్యూ బ్రెజెజింస్కీ, మిగతా సలహాదారులతో అఫ్గానిస్తాన్‌లో ఒక నిఘా ఆపరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్కడి తిరుగుబాటుదారులకు ఆయుధాలు, ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
దాంతో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ యుద్ధంలో ప్రపంచాధిపత్యం కోసం పరస్పరం పోటీపడుతున్న రెండు దేశాలూ యుద్ధరంగంలో మాత్రం ఎదురెదురుగా తలపడడం లేదు.
కానీ, తృతీయ ప్రపంచ దశాల్లో జరిగే యుద్ధాల్లో ఒకరు మరొకరి ప్రత్యర్థులకు సాయం చేసుకునేవారు. ఇంగ్లిషులో దీన్ని 'ప్రాక్సీ వార్' అంటారు.
"అఫ్గానిస్తాన్‌లో తమ శత్రువులు సోవియట్ యూనియన్‌ను ఎదుర్కోడానికి అమెరికా జిహాదీలకు సాయం అందించింది" అని బీబీసీలో జిహాదీ మిలీషియా నిపుణులు మురాద్ శిశానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ సైక్లోన్‌లో ఏం జరిగింది?
ఆపరేషన్ సైక్లోన్‌లో భాగంగా మొదట తిరుగుబాటుదారులకు సోవియట్ కాలం నాటి పాత ఆయుధాలు మాత్రమే అందించేవారు. అంటే ఏకే 47 రైఫిళ్లు, వివిధ అరబ్ దేశాల ద్వారా ఆర్థిక సాయం అందించేవారు.
"దీని వెనుక తన ప్రమేయం లేదని చెప్పుకోడానికి వీలుగా అమెరికా అలా వేరే దేశాల ద్వారా సాయం అందించేది. ముజాహిదీన్లకు సాయం అందించడంలో అత్యంత చురుగ్గా ఉన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. అయితే ఈజిఫ్ట్ నేత అన్వర్ అల్ సదాత్, మిగతా నేతలు కూడా ముజాహిదీన్లకు సాయం అందించడంలో తమదైన పాత్ర పోషించారు" అని రాబర్ట్ క్రూజ్ చెప్పారు.
ఈ ప్రణాళికలో పాకిస్తాన్ నిఘా ఏజెన్సీలను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జిహాదీ గ్రూపులను ఎక్కువగా ఇక్కడ నుంచే ఆపరేట్ చేసేవారు.
రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడు అయిన తర్వాత అఫ్గానిస్తాన్‌లో అమెరికా ఉనికి స్పష్టంగా బయటపడడం మొదలైంది.
ముజాహిదీన్లకు అందించే సాయం మరింత పెంచాలని పైరవీలు చేసే ఒక లాబీ మెల్లమెల్లగా బలం పుంజుకుంది. సోవియట్ యూనియన్‌ను అడ్డుకోడానికి ఆయుధాలు మాత్రమే అందిస్తే సరిపోదని ఆ లాబీ నేతలు గట్టిగా వాదించేవారు.
1984లో అమెరికా కాంగ్రెస్ అఫ్గానిస్తాన్‌పై ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. ఇందులో "అఫ్గానిస్తాన్‌లో జంగ్-ఎ-ఆజాదీ సైనికుల పోరాడడానికి, చనిపోవడానికి మాత్రమే సాయం చేయడం వల్ల స్వాతంత్ర్యం సాధించాలనే వారి లక్ష్యం నెరవేరదు" అని అభిప్రాయపడ్డారు.
ఇది చివరికి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఓవల్ ఆఫీసులో ముజాహిదీన్ నాయకుల ప్రతినిధి మండలికి ఆతిథ్యం ఇచ్చేవరకూ వెళ్లింది.
1986లో తన స్టేట్ ఆఫ్ ద యూనియన్ స్పీచ్‌లో అఫ్గాన్ ఫైటర్లకు ఒక సందేశం ఇచ్చిన ఆయన "జంగ్ -ఎ-ఆజాదీ సైనికుల్లారా.. మీరు ఒంటరిగా లేరు, అమెరికా మీకు అండగా నిలుస్తుంది" అన్నారు.
కానీ రీగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన ప్రకటనకంటే కీలకమైనవిగా నిలిచిపోయాయి. అఫ్గాన్ గెరిల్లా ఫైటర్లకు స్టింగర్ మిసైళ్లు అందించాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఇది ఆ తర్వాత కాలంలో చాలా ముఖ్యమైనదని నిరూపితమైన ఒక నిర్ణయంగా మారింది.
ఈ మిసైళ్ల సాయంతో అఫ్గానిస్తాన్ కొండల వెనుక నక్కిన ముజాహిదీన్లు సోవియట్ హెలికాప్టర్లను కూల్చడం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సమీకరణాలు వేగంగా మారిపోతూ వచ్చాయి.
"స్టింగర్ క్షిపణుల విజయాలు చూసి కాంగ్రెస్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు" అని ఆఫ్గానిస్తాన్‌లో అమెరికా చురుగ్గా ఉండాలని బలంగా కోరుకున్న పైరవీకారుల్లో ఒకరైన డెమాక్రటిక్ పార్టీ సెనేటర్ చార్ల్స్ విల్సన్ అప్పట్లో అన్నారు.
అఫ్గానిస్తాన్‌కు సైన్యం పంపించాలనే నిర్ణయం తీసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత సోవియట్ యూనియన్ అక్కడ నుంచి వెనకడుగు వేసింది. 1988 సెప్టెంబరులో సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్ తన సైన్యాన్ని వెనక్కి రావాలని ఆదేశించారు.
అఫ్గాన్ ప్రభుత్వం, వివిధ వర్గాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తాము చిక్కుకుపోయామని అప్పట్లో సోవియట్ యూనియన్‌కు భావించింది. సోవియట్ యూనియన్ సైన్యం అండ లేకపోవడంతో అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సాయంతో తాలిబాన్‌కు ప్రయోజనం కలిగిందా...
"అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే అమెరికా తాలిబాన్ పోరాటానికి మద్దతిచ్చిందనే ఒక కుట్ర సిద్ధాంతం ఉంది. కానీ వాస్తవం అది కాదు. నిజం ఏంటంటే 1994 వరకూ అఫ్గానిస్తాన్ దక్షిణ నగరం కాందహార్‌లో తాలిబాన్ పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలీదు. వారంతా మదరసాల్లో శిక్షణ తీసుకుని వచ్చినవారు. పఖ్తూన్ మూలాలున్న యువకులు. వారందరూ తమను తాలిబ్(విద్యార్థి) యోధులుగా చెప్పుకునేవారు. మెల్లమెల్లగా కాందహార్‌లో వాళ్లకు ఆదరణ పెరుగుతూ వచ్చింది" అని మురాద్ శిశానీ చెప్పారు.
తాలిబాన్ ఆవిర్భానికి ముందే సోవియట్ యూనియన్ పతనమైంది. కానీ, అమెరికా సాయంతో సోవియట్ యూనియన్‌తో పోరాడిన కొందరు వార్ లార్డ్స్.. తాలిబాన్ సృష్టికి కారణమైన కొందరు నేతల్లో ఉన్నారనేది వాస్తవం అని ఆయన చెప్పారు.
సోవియట్ యూనియన్‌ను ఓడించడమే అమెరికా ప్రధాన లక్ష్యం. జిహాదీగా చెప్పుకోవడాన్ని అప్పట్లో ప్రతికూలంగా భావించేవారు కాదు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ లాంటి సంస్థల రక్తపాతం తర్వాతే జిహాద్ అనే మాటకు చెడ్డపేరు రావడం మొదలైంది.
అమెరికా అఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందించి ఉండచ్చు, కానీ అలా వేరే దేశాలు కూడా చేశాయి అంటారు మురాద్ శిశానీ.
మరోవైపు కాందహార్‌కు తాలిబాన్ వచ్చినపుడు, వారు తమను తాము ఒక శుబ్రమైన, కొత్త శక్తిగా చెప్పుకున్నారు అని రాబర్ట్ క్రూజ్ చెప్పారు
తాలిబాన్ నేతలు నిజానికి అమెరికా నుంచి సాయం పొందిన వారిలో లేరని, ఇస్లాం సంప్రదాయ బోధనలకు అనుగుణంగా పాలన అందిస్తామని ఇచ్చిన హామీ వల్లే వారు అప్పట్లో విజయం సాధించారని భావిస్తున్నట్లు రాబర్ట్ చెప్పారు.
"సోవియట్ యూనియన్‌పై విజయం సాధించడం, అమెరికా అండ ముజాహిదీన్లు తమ జిహాద్ గురించి గొప్పలు చెప్పుకునే స్థితికి తీసుకెళ్లాయి. అదే సమయంలో తాలిబాన్‌కు ప్రయోజనం కలిగింది" అని రాబర్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాకు ఏం దక్కింది?
అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ తిరిగి వెళ్లిపోవడంతోనే వారి పతనం, ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడడానికి రంగం సిద్ధమైంది.
90వ దశకంలో ప్రపంచ వేదికపై ఇక తమకు సవాలు విసిరే శక్తి ఏదీ లేదని అమెరికా భావించింది. చైనా నుంచి సవాలు ఎదురయ్యేవరకూ అమెరికాలో ఆ భావన అలాగే ఉంది.
"అఫ్గానిస్తాన్ అంతర్యుద్ధం సమయంలో ఏ ముజాహిదీన్ గ్రూపులకు మద్దతు అందించిందో వారి ద్వారా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా మౌనంగా ఉండాలనే మార్గాన్ని ఎంచుకుంది" అని రాబర్ట్ క్రూజ్ చెప్పారు.
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉండి సాయుధ తిరుగుబాటు పోరాటాలు జరిగిన మిగతా దేశాల్లాగే మారిందని రాబర్ట్ క్రూజ్ అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో ఆపరేషన్ సైక్లోన్‌ను సమర్థించిన వారు ఆ దేశ పరిస్థితి గురించి ఎప్పుడూ చింతించలేదు.
అధ్యక్షుడు జిమీ కార్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన జబిగన్యూ బ్రెజెజింస్కీ ఒక ఫ్రెంచ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయం స్పష్టంగా చెప్పారు: "ప్రపంచ చరిత్రలో ఏది అత్యంత ముఖ్యమైన విషయం? తాలిబానా లేక సోవియట్ యూనియన్ పతనమా?"
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
- తాలిబాన్లు తమ భార్యలను ‘అందంగా’ చూడటం కోసం మేకప్ సామాన్లు కొనుగోలు చేసినప్పుడు..
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- కాబుల్ ఎయిర్పోర్ట్ సమీపంలో బాంబు పేలుళ్లు, 90 మంది మృతి
- ‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ
- ఇందిరా పార్క్: 'పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు' అనే నిర్ణయంపై వివాదం, మహిళా సంఘాల ఆగ్రహం
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









