తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?

తాలిబాన్, ఐఎస్

ఫొటో సోర్స్, PRO IS PROPOGANDA

    • రచయిత, బీబీసీ మానిటరింగ్ టీమ్
    • హోదా, .

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుకూల మీడియా గ్రూపుల్లో తాలిబాన్లను ఖండిస్తూ వెలసిన పోస్టర్లు సర్క్యులేట్ అవుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తిరిగి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఐఎస్‌కి మద్దతు ఇచ్చే మీడియా గ్రూపులు, తాలిబాన్‌కి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ప్రచారం ప్రారంభించాయి.

ఆగస్టు 16 తర్వాత జోరందుకున్న ప్రచారం

అఫ్గాన్ రాజధాని కాబూల్‌ని తాలిబాన్లు స్వాధీనం చేసుకుని, దేశంలోని చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆగస్టు 16కి ఒక రోజు తర్వాత నుంచి ఐఎస్ మద్దతుదారులు తాలిబాన్ వ్యతిరేక ప్రచారాన్ని క్రమంగా పెంచుతూ వస్తున్నారు.

ఆగస్టు 19న తాలిబాన్లను అమెరికా తొత్తులుగా, తోడుదొంగలుగా అభివర్ణిస్తూ అఫ్గాన్ పరిణామాలపై ఐఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనంతరం తాలిబాన్ వ్యతిరేక ప్రచారం జోరందుకుంది.

అఫ్గానిస్తాన్‌లో పరిణామాలు అమెరికా సాధించిన విజయం అని, తాలిబాన్ల విజయం కాదని ఐఎస్ చెప్పింది. దీనికి కారణం.. అమెరికా జిహాద్ కన్నా కూడా చర్చలు అనే భావనను ప్రోత్సహించడంలో విజయం సాధించిందని తెలిపింది. కానీ, మిలిటెంట్ గ్రూపులకు జిహాదే లక్ష్యమని పేర్కొంది.‌

తాలిబాన్, ఐఎస్

ఫొటో సోర్స్, RYANZO PEREZ / EYEEM/GETTY IMAGES

తాలిబాన్ వ్యతిరేక ప్రచారం ఇంకా ఊపందుకోవచ్చు

ఆగస్టు 16 నుంచి 22 రకాల ప్రచార కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో పోస్టర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఐఎస్ అనుకూల మీడియా గ్రూపుల నుంచే ఎక్కువగా వచ్చాయి. వీటిలో మూడు ఫ్రెంచ్ అనువాదాలు కూడా ఉన్నాయి. వీటిని టెలిగ్రామ్‌లోను, 'రాకెట్‌చాట్‌'లోని ఐఎస్‌కు అనుకూల సర్వర్‌ ఒకదాంట్లోనూ పోస్ట్ చేశారు.

అయితే, ఇంతకు ముందు ఐఎస్ అనుకూల ప్రచారాల్లో వాడినట్టు ఈ ప్రచారంలో ఒక నిర్ధిష్ట హ్యాష్ ట్యాగ్ అంటూ ఏమీ లేదు. అయితే, రాబోయే రోజుల్లో ఒక హ్యాష్‌ట్యాగ్ కనిపించే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉండగా, ఓ ఐఎస్ అనుకూల మీడియా గ్రూప్ అయిన తలై అల్-అన్సార్, ఈ అంశంపై పోస్టర్‌లలో "అపోస్టేట్ తాలిబాన్" (మతాన్ని భ్రష్టు పట్టించిన తాలిబాన్) అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించింది.

ప్రముఖ ఐఎస్ అనుకూల మీడియా ప్రొడ్యూసర్ తర్జుమాన్ అల్-అసవిర్తి నుంచి వచ్చిన ఒక వీడియోలో ఒక వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడుతుంటాడు. తాలిబాన్లు అమెరికాతో కుమ్మక్కయ్యారని చెబుతుంటాడు. ఇందుకు ఎక్కువగా.. సీఐఏ ఇస్లామాబాద్ స్టేషన్ మాజీ చీఫ్ రాబర్ట్ ఎల్ గ్రెనియర్‌ తన పుస్తకం "88 డేస్ టు కాందహార్"లో రాసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుంటాడు.

రాబోయే రోజుల్లో తాలిబాన్ వ్యతిరేక ప్రచారం ఇంకా ఎక్కువగా ఊపందుకోవచ్చు.

కాగా, అల్-ఖైదా మద్దతుదారులు, అలాగే యెమెన్‌లోని ఈ గ్రూపుకు చెందిన శాఖ సభ్యులు మాత్రం దీనికి విరుద్ధంగా తాలిబాన్‌లది "చారిత్రాత్మక విజయం"గా అభివర్ణించారు. ఇలాగే, మరికొన్ని ఉదారవాద జిహాదీ, ఇస్లాం గ్రూపులు కూడా తాలిబాన్లకు మద్దతు ప్రకటించాయి.

తాలిబాన్, ఐఎస్

ఫొటో సోర్స్, AL-BATTAR

‘తాలిబాన్లు నిజమైన షరియాను అమలు చేయలేరు’

ఐఎస్ అనుకూల మీడియా గ్రూపుల్లోని వ్యక్తులే తాజా ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు. వీరిలో అనుభవజ్ఞులైన అల్-బత్తర్, తలాయే అల్-అన్సార్ ఉన్నారు. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో పోస్టర్లు విడుదల చేసిన వాటిలో అల్-ముర్హాఫత్, అల్-తక్వా, హదమ్ అల్-అశ్వర్, అల్-అడియాత్, అల్-అసవీర్తిలు ఉన్నారు.

ఆగస్టు 19 తర్వాత వచ్చిన తాలిబాన్ వ్యతిరేక ఇస్లామిక్ స్టేట్ పోస్టర్లు తాలిబాన్ మత ఉల్లంఘనలపై దృష్టి సారించాయి. శాంతి ఒప్పందంలో భాగంగా "అవిశ్వాసులు, మతభ్రష్టులు" తో చర్చలు జరపడం ఇందులో మొదటిది.

అఫ్గానిస్తాన్‌లో హజారా షియావంటి మైనారిటీలకు తాలిబాన్‌లు రాజీ సందేశాన్ని ఇచ్చారని సదరు మీడియా గ్రూపులు పేర్కొన్నాయి. ఈ ‘మతోన్మాదులైన’ హజారా షియా వంటి వాటిపై తప్పక పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఐఎస్ పేర్కొంది.

చాలా పోస్టర్లు ఐఎస్ అధికారిక ప్రకటనలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయి. దోహాలో సమావేశాలు లేదా షియా పండుగలకు హాజరు కావడం వంటి తాలిబాన్ "అతిక్రమణల" చిత్రాలను కొన్ని పోస్టర్లలో జతపరిచారు. వాటికి ఇస్లామిక్ స్టేట్ షరియాను అమలు చేస్తున్న చిత్రాలు కూడా జత చేశారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు నిజమైన షరియాను అమలు చేయలేరనే ఐఎస్ సందేహాన్ని చాలా పోస్టర్‌లు ప్రతిధ్వనించాయి.

తాలిబాన్, ఐఎస్

ఫొటో సోర్స్, TURJUMAN AL-ASAWIRTI

‘ఈ తాలిబాన్.. ఆ తాలిబాన్ కాదు’

మొత్తంగా ప్రస్తుతం ఉన్నది 20 సంవత్సరాల కిందటి ముల్లా ఒమర్ నాయకత్వంలోని తాలిబాన్ కాదని ఐఎస్ మద్దతుదారులు బలంగా ప్రచారం చేస్తున్నారు.

ఈ తాలిబాన్ పూర్తిగా మారిపోయిందని, ఈ ప్రాంతంలో జిహాద్‌ను అణగదొక్కడానికి అమెరికా ప్రణాళికలను రహస్యంగా అమలు చేస్తోందని చెబుతున్నారు.

ఆగస్టు 19 ఐఎస్ అధికారిక ప్రకటనలో, తాలిబాన్లను "ముల్లా బ్రాడ్లీ" ప్రాజెక్ట్ అని సంభోధించింది. ముల్లా బ్రాడ్లీ ప్రాజెక్ట్ అంటే.. జిహాదీ ఉద్యమాన్ని లోపలి నుంచే నిర్వీర్యం చేసేందుకు అమెరికాయే స్వయంగా కొందరు జిహాదిస్టులను రంగంలోకి దించడం. అమెరికా నియమించిన వాళ్లు వీళ్లు అంటూ.. కొందరు ముస్లిం ప్రముఖులను ప్రస్తావిస్తూ ఎంతో కాలంగా జిహాదిస్టులు ఈ ప్రాజెక్టును ఉటంకిస్తున్నారు.

"రెండు ప్రణాళికల మధ్య అఫ్గానిస్తాన్" అనే పేరుతో తర్జుమాన్ అల్-అసవిర్తి రూపొందించిన వీడియోను ఆగస్టు 22న టెలిగ్రామ్, రాకెట్‌చాట్‌లలో ఐఎస్ మద్దతుదారులు విస్తృతంగా షేర్ చేశారు.

వీడియో ప్రొడక్షన్‌పై దృష్టి సారించిన ఈ ఐఎస్ మద్దతుదారుడు.. తాలిబాన్ల "నిజ స్వరూపం" చూపిస్తానంటూ ఆగస్టు 19న కొన్ని పేజీల డాక్యుమెంట్లను, ఒక కొత్త వీడియోను విడుదల చేశారు.

ఇంగ్లీషు భాషలో ఉన్న ఈ అసవిర్తి వీడియోలో ముఖ్యమైన క్లిప్‌లు, వీడియో-గేమ్ యానిమేషన్‌లు ఉన్నాయి.

ఈ వీడియోలో రాబర్ట్ ఎల్ గ్రేనియర్ తన అనుభవాలను వివరిస్తుంటారు. 2001లో అమెరికా తాలిబాన్లపై దాడి చేసి, అఫ్గాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ముందు తాలిబాన్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ఎలా చర్చలు జరిపేందుకు ప్రయత్నించానో చెబుతుంటారు. ఆయన రాసిన "88 డేస్ టు కాందహార్" పుస్తకంలో ప్రస్తావించిన అంశాలను కూడా ఈ వీడియోలో పేర్కొన్నారు.

గ్రేనియర్ వ్యాఖ్యల ఆధారంగా.. తాలిబాన్ సంస్థ, దాని వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కాలంనాటితో పోల్చితే మారిపోయిందని, అమెరికాతో రహస్య ఒప్పందాల ద్వారా ముజాహిదీన్‌కు నమ్మకద్రోహం చేసిందని కూడా ఈ వీడియోలో ఉంది.

తాలిబాన్, ఐఎస్

ఫొటో సోర్స్, WATHIQ KHUZAIE/GETTY IMAGES

‘అమెరికాను ఆక్రమిస్తాం.. దేశం లోపల నుంచే వారిపై దాడి చేస్తాం’

జిహాదీలతో పోరాడే స్థానిక అఫ్గాన్ దళాన్ని, భాగస్వామిని కనుగొనాలని అమెరికా కోరుకుంటోందని, తాలిబాన్లు ఆ పాత్రను చేపట్టాలని అమెరికా భావిస్తోందని గ్రేనియర్ పేర్కొన్న ఒక క్లిప్ కూడా ఈ వీడియోలో ఉంది.

వీడియోలో అమెరికా యాసలో ఇంగ్లీష్ మాట్లాడే జిహాదీ వ్యక్తి.. "అమెరికా తన ప్రణాళికను కొత్త తాలిబాన్ నాయకత్వం ద్వారా అమలు చేయగలిగింది. ఈ నాయకత్వం ముల్లా ఒమర్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతాం అని ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రణాళికతో, వారు ఇస్లామిక్ ఖలీఫా స్థాపనను ఆపాలని కోరుకుంటున్నారు. తద్వారా ఆఫ్రికా, ఇరాక్, సిరియా, తూర్పు ఆసియాతోపాటూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్‌తో పోరాటం అమెరికాకు సులభం అవుతుంది" అని వ్యాఖ్యానిస్తాడు.

"ముజాహిదీన్ (ఐఎస్) ప్లాన్ చేసినట్లుగానే అమెరికా ట్రాప్‌లో పడింది. అలసిపోయి, చతికిలపడిన తర్వాత ఇప్పుడు యుద్ధాన్ని ముగించాలని ప్రయత్నిస్తోంది. కానీ అలా జరగదు. అమెరికాను ఆక్రమిస్తాం.. ఆ దేశం లోపల నుంచే వారిపై దాడి చేస్తాం" అంటూ ధిక్కార స్వరంతో సదరు వ్యక్తి వీడియోను ముగిస్తాడు.

ఈ వీడియోలో యాక్షన్-అడ్వెంచర్ వీడియో గేమ్‌లలో వాడే చిత్రవిచిత్రమైన యానిమేటెడ్ క్లిప్‌లను ఉపయోగించారు. ఈ క్లిప్‌లలో పూర్తిగా సాయుధులైన, భయపెట్టే యానిమేటెడ్ బొమ్మను.. ఐఎస్ ఫైటర్‌లకు సూచికగా వాడారు. ఈ వీడియోలో వాడిన యానిమేషన్‌ను ఏదైనా వాడుకలో ఉన్న వీడియో గేమ్ నుండి తీసుకున్నారా? లేక అల్ అసవిర్తి వీడియో కోసమే తయారు చేశారా? అనే విషంలో స్పష్టత లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)