మలాలా: ‘తాలిబాన్ బులెట్ నా ఎడమ కంటి మీంచి మెదడు వరకూ దూసుకుపోయింది’

ఫొటో సోర్స్, Malala
అఫ్గానిస్తాన్‌లో మహిళ పరిస్థితిపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్‌లతో గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు.
అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న మలాలా, తాను ఇక్కడి నుంచే అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె ముఖానికి వచ్చిన పక్షవాతానికి చికిత్స చేయించుకుంటున్నారు. 2012లో పాకిస్తాన్‌లో తాలిబాన్‌లు ఆమెపై కాల్పులు జరపడంతో ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటి బుల్లెట్ గాయానికి సంబంధించి ఆమెకు శస్త్ర చికిత్స జరుగుతోంది.
''తొమ్మిదేళ్లుగా నేను ఈ బుల్లెట్ గాయం నుంచి కోలుకోలేకపోయాను. కానీ, అఫ్గానిస్తాన్ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా లక్షల బుల్లెట్లను ఎదుర్కొంటున్నారు'' అన్నారామె.
సాయం కోసం వేడుకుంటున్న అఫ్గానీలను చూసి తన హృదయం రోదిస్తోందని మలాలా వ్యాఖ్యానించారు.
''నేను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాధినేతలకు లేఖలు వ్రాస్తున్నాను. ఫోన్‌లో మాట్లాడుతున్నాను. అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం నేటికీ పోరాడుతున్న కార్యకర్తలను నేను సంప్రదిస్తున్నాను. గత రెండు వారాల్లో, మేము చాలామందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో సాయపడ్డాం. కానీ అందరికీ నేను సహాయం చేయలేనని నాకు తెలుసు'' అన్నారు మలాలా.
పాకిస్తాన్‌కు చెందిన తాలిబాన్ తీవ్రవాది తలపై కాల్చినప్పుడు, తన వెంటే ఉన్న ఇద్దరు స్నేహితురాళ్లతో తాను ఇప్పటికీ మాట్లాడుతుంటానని, తమ మనసుల నుంచి ఆ దారుణ దృశ్యం ఇప్పటికీ చెరిగి పోలేదని వారు చెబుతుంటారని మలాలా వెల్లడించారు.

ఫొటో సోర్స్, AFP
అఫ్గాన్‌ల గురించి ఆందోళన
''నేను బోస్టన్‌లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఇది నాకు ఆరో ఆపరేషన్. నా శరీరానికి తాలిబాన్లు కలిగించిన నష్టం నుండి బైట పడేయడానికి వైద్యులు ఇంకా కృషి చేస్తున్నారు. అక్టోబర్ 2012లో, పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడు నేను పాఠశాలకు వెళుతుండగా నా తల మీద ఎడమవైపున కాల్చాడు. ఆ తూటా ప్రభావం నా ఎడమ కన్ను, పుర్రె, మెదడు వరకు పడింది. నా ముఖంలోని నాడీ వ్యవస్థ కూడా బాగా దెబ్బతిన్నది. దవడ కీలు విరిగింది. చెవి కూడా దెబ్బతింది’’ అన్నారు మలాలా.
‘‘నా మెదడులో ఇన్ఫెక్షన్‌ను అరికట్టేందుకు వైద్యుడు పుర్రె ఎముకను తొలగించారు. ఆ డాక్టర్ తీసుకున్న చర్యల కారణంగానే నేను ఈ రోజు బతికి ఉన్నాను. కానీ, తర్వాత నా అవయవాలు పని చేయడం మానేశాయి. దీంతో నన్ను ఇస్లామాబాద్‌కు తరలించారు. వారం తర్వాత వైద్యులు నాకు మెరుగైన చికిత్స అవసరమని భావించి విదేశాలకు పంపారు'' అని మలాలా నాటి ఘటనలను తన బ్లాగ్‌లో గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత తాను కోమాలోకి వెళ్లిపోయానని, కళ్లు తెరిచి చూసేసరికి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ ప్రాంతంలో ఉన్న క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్‌లో ఉన్నానని మలాలా చెప్పారు. తానింకా బతికే ఉన్నట్లు అప్పుడు అర్ధమైందని ఆమె వెల్లడించారు.
''నా చుట్టూ అపరిచితులు ఇంగ్లీషులో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. నేను అస్పష్టంగా చూడగలిగాను. నా మెడలోని ట్యూబ్ కారణంగా నేను మాట్లాడలేక పోయాను. మరికొద్దిరోజుల పాటు నేను మాట్లాడలేనని అర్ధమైంది. అందుకే నోట్‌బుక్‌లో రాయడం ప్రారంభించాను. నా గదికి ఎవరు వచ్చినా నోట్‌బుక్ మీద రాస్తూ వారిని కొన్ని ప్రశ్నలు అడిగేదాన్ని. నాకు ఏమైంది? మా నాన్న ఎక్కడ? ఈ చికిత్స కోసం డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు ? మా దగ్గర డబ్బు లేదు కదా'' లాంటి ప్రశ్నలు అడిగేదాన్ని'' అని మలాలా బ్లాగ్‌లో వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Malala
''అద్దంలో నేను...''
''నాకు అద్ధం కావాలని నర్సులకు నోట్ బుక్ మీద రాసి చూపించాను. అద్దంలో చూసుకుంటే నా ముఖంలో సగమే కనిపించింది. మిగిలిన ముఖం ఎవరి ముఖమో అన్నట్లుగా ఉంది'' అని మలాలా గుర్తు చేసుకున్నారు.
''నా తల మీద జట్టును సగం తొలగించారు. తాలిబాన్‌లే ఈ పని చేసి ఉంటారని అనుకున్నాను. కానీ, ఆపరేషన్ కోసం డాక్టర్‌లే జుట్టును తొలగించారని నర్సులు చెప్పారు. నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాను. ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జాబ్ దొరుకుతుందని నాకు నేనే అనుకున్నాను. డబ్బు సంపాదించాలని, సొంతంగా ఫోన్ కొనుక్కోవాలని, నా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఫీజు చెల్లించేంత డబ్బు సంపాదించాలని అనుకున్నాను'' అని వెల్లడించారు మలాలా.
''నాలోని శక్తిపై నాకు నమ్మకముండేది. ఆసుపత్రి నుంచి బైటికి రాగానే రెక్కలు కట్టుకుని పక్షిలా ఎగిరిపోవాలని కలలు కనేదాన్ని. కానీ నా శరీరంలో చాలా భాగాలు కదలలేవని గ్రహించాను. అయితే, ఇది తాత్కాలికమని డాక్టర్లు చెప్పారు'' అని పేర్కొన్నారామె.

ఫొటో సోర్స్, Malala
అనేక ఆపరేషన్‌లు
''నాకు రకరకాల ఆపరేషన్లు జరిగాయి. పుర్రె ఎముకను టైటానియం ప్లేట్‌తో భర్తీ చేశారు. దెబ్బతిన్న చెవి డ్రమ్‌కు కూడా చికిత్స చేశారు.
నా కుటుంబం బ్రిటన్‌కు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ తీసుకోవడం ప్రారంభించాను. నేను నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించాను. చిన్నపిల్లలాగే అడుగులు వేశాను. నాకు రెండో జీవితం మొదలైనట్లు అనిపించేది'' అని వివరించారు మలాలా.
''నరాలకు చికిత్స, కొన్ని నెలలపాటు మర్దన తర్వాత నా ముఖంలో కొంత మెరుగుదల కనిపించింది. పెదవులు మూసుకుని నవ్వితే నా పాత ముఖంలా ఉండేది. నవ్వినప్పుడు నా ముఖం రెండు వైపులా ఒకేలా ఉండదని అందరికీ తెలియకుండా ఉండాలని ముఖానికి చేతులు అడ్డం పెట్టుకునేదాన్ని'' అన్నారు మలాలా.

ఫొటో సోర్స్, Malala
అఫ్గాన్ మహిళల గురించి ఆందోళన
''నాకు ఇంకా రెండు పెద్ద ఆపరేషన్లు మిగిలి ఉన్నాయి'' అని మలాలా వెల్లడించారు.
''ఆగస్టు 9న నేను బోస్టన్‌లో ఉదయం అయిదు గంటలకు ఆసుపత్రికి వెళ్లడానికి నిద్ర లేచినప్పుడు, కుందుజ్ నగరాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ స్వాధీనం చేసుకున్న మొదటి ప్రధాన నగరం ఇది'' అన్నారు మలాలా.
"తరువాతి వారాల్లో అఫ్గానిస్తాన్‌లోని ప్రతి ప్రావిన్స్ తాలిబాన్ తుపాకుల నీడలోకి చేరినట్లు నేను వార్తలు చూస్తూనే ఉన్నాను. ఇది నన్నే కాల్చేసినట్లుగా ఉంది. నాపై కాల్పులు జరిపిన తర్వాత నేను తీవ్రవాదం, బాలికలపై ఆంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఇప్పుడు కూడా వాళ్ల తరఫున మాట్లాడాలని ఉంది'' అని తన బ్లాగులో రాశారు మలాలా.
ఇవి కూడా చదవండి:
- వై.ఎస్. జగన్ బెయిల్ రద్దు కేసు: ‘రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు.. సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా’ - సీబీఐ కోర్టు
- బ్రిటిషర్లకు పిచ్చెక్కించి, వందేళ్లకు ముందే ‘విముక్తి’ పొందిన భారతీయ పట్టణం
- 'మా నాన్న సెక్స్ పుస్తకాలు రాస్తారని నాకు ఎలా తెలిసిందంటే...'
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు మరణశిక్షలు విధిస్తున్నారు - ఐరాస
- కరోనా వ్యాక్సీన్లను చేతికే ఎందుకేస్తారు?
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








