వై.ఎస్. జగన్‌ బెయిల్ రద్దు కేసు: ‘రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు.. సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా’ - సీబీఐ కోర్టు

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ పూర్తయింది.

ఫొటో సోర్స్, facebook/ysjagan

ఫొటో క్యాప్షన్, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ పూర్తయింది
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్‌ పై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. మొన్నటి సాధారణ ఎన్నికల నాటి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న లెక్క ప్రకారం ఆయన మీద 38 కేసులు పెండింగులో ఉన్నాయి. అందులో 5 కేసులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ఇక ముఖ్యమైన ఆర్థిక నేరాల అభియోగాలతో కూడిన కేసుల్లో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. గతంలో సీబీఐ కేసులో అరెస్టై ఏడాదిన్నర పాటు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఆయన సాక్షులను, కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల వైసీపీ తరుపున గెలిచిన రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.

ఆయనపై ఉన్న కేసుల విచారణ సజావుగా సాగేందుకు జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టులో పిటిషనర్లతో పాటుగా సీబీఐ, జగన్ తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిశాయి.

ఇక కోర్టు తీర్పు మాత్రమే పెండింగులో ఉన్న తరుణంలో బుధవారం నాటి వాయిదాలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తిగా మారింది.

line

'రెండు పిటిషన్లపై ఒకేసారి తీర్పు.. సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా' - సీబీఐ కోర్టు

జగన్‌తో పాటు ఈ కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని రఘురామ క‌ృష్ణంరాజు ఆగస్టు మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో.. ఒకే కేసుకు సంబంధించిన నిందితులు, వారి బెయిల్ రద్దు చేయాలన్న కారణం కూడా ఒకటే కావడం, పిటిషనర్ కూడా ఒకరే కావడంతో.. ఈరోజు (ఆగస్టు 25వ తేదీ బుధవారం) జగన్ బెయిల్ రద్దుపై వెలువడాల్సిన తీర్పు వాయిదా వేస్తున్నామని సీబీఐ న్యాయస్థానం ప్రకటించింది.

విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిపింది.

కేంద్ర మంత్రులను తరచూ కలుస్తూ విజయసాయి రెడ్డి కేసును ప్రభావితం చేస్తున్నారని రఘురామ క‌ృష్ణంరాజు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరూ వివిధ కారణాలను సాకుగా చూపుతూ కోర్టు హాజరు నుంచి మినహాయింపులు పొందారని, దీనివల్ల కేసు విచారణలో తీవ్ర జ్యాపం జరుగుతోందని వివరించారు.

2013లోనే ఛార్జ్ షీట్లు దాఖలైనా ఇప్పటివరకు వాటిపై విచారణ తుదిదశకు చేరలేదని తెలిపారు.

ఈ కేసులో నిందితులకు, సాక్షులుగా ఉన్న అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవులు, పదోన్నతులు లభించాయని చెప్పారు.

సీబీఐ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, కౌంటర్ దాఖలుకు నాలుగుసార్లు గడువు కోరి.. మొదటిసారి దాఖలు చేసిన మెమోనే పరిగణనలోకి తీసుకోవాలనడం కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడమేనని రఘురామ క‌ృష్ణంరాజు తరపు న్యాయవాది తన వాదనల్లో వెల్లడించారు.

విజయసాయి రెడ్డి తరపు న్యాయవాది స్పందిస్తూ.. బెయిల్ మంజూరు సమయంలో కోర్టు విధించిన షరతులు అన్నింటినీ తాము విధిగా పాటిస్తున్నామని, సాక్షులు ఎవరినీ ప్రభావితం చేయట్లేదని, రాజకీయ లక్ష్యాల కోసమే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారని తెలిపారు.

ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు, వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై ఒకేసారి, ఒకే తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.

line
సాక్షులను ముఖ్యమంత్రి ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష్ణం రాజు తన పిటిషన్‌లో ఆరోపించారు.

ఫొటో సోర్స్, RAGHURAMAKRISHNAMRAJU

ఫొటో క్యాప్షన్, సాక్షులను ముఖ్యమంత్రి ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష్ణం రాజు తన పిటిషన్‌లో ఆరోపించారు

ఈ నేపథ్యంలో జగన్ పై ఉన్న సీబీఐ కేసుల్లో అభియోగాలకు సంబంధించిన వివరాలు ఇవీ:

జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్ రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి.

2010లో దాఖలైన పిటిషన్ల ప్రకారం, సీఎంగా ఉన్న తండ్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటికి ఎంపీగా ఉన్న జగన్ క్విడ్ ప్రో కో కి పాల్పడినట్టు ఆరోపించారు. కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సు, ఇతర అవకాశాలూ ఇప్పించి...బదులుగా సొంత సంస్థ జగతిలో పెట్టుబడులు దక్కించుకున్నారనేది ప్రధాన అభియోగం.

దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది.

2011 ఆగస్టు17న సీబీఐ కేసు నమోదు చేసింది. 2004-2009 మధ్య కాలంలో నేరం జరిగిందన్న అనుమానంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ.

నేరపూరిత కుట్ర (క్రిమినల్ కాన్‌స్పిరసీ), మోసం (చీటింగ్), నేరపూరిత నమ్మక ద్రోహం(క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), లెక్కలు తారుమారు చేయడం (ఫాల్సయిజేషన్ ఆఫ్ అకౌంట్స్), క్రిమినల్ మిస్ కాండక్ట్‌తో పాటు అవినీతి నివారణ చట్టాల కింద కేసు నమోదు చేసింది.

వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి, వైసీపీకే చెందిన ఎంపీ వి. విజయసాయి రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. మొత్తం 71 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.

ఇప్పటికే సీబీఐ 11 ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. వీటి ఆధారంగా ఈడీ ఐదు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది.

ఈ ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ కొనసాగుతోందని జగన్ తరుపు న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి గతంలో బీబీసీకి తెలిపారు.

జగన్ పై విచారణ జరుగుతున్న కేసుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు
ఫొటో క్యాప్షన్, జగన్ పై విచారణ జరుగుతున్న కేసుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడు

ఛార్జ్‌షీట్ వేసి పదేళ్లు...

ఈ కేసుకి సంబంధించి మొదటి ఛార్జ్‌షీట్‌ను సీబీఐ 2012 మార్చి 31న దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏ1 గా జగన్మోహన్ రెడ్డిని, ఏ2 గా విజయసాయి రెడ్డిని, వీరితో పాటు అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌, ట్రైడెంట్ లైఫ్ సైన్సైస్ సంస్థలు, ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఛార్జ్ షీట్ దాఖలయ్యి సుమారు పదేళ్లవుతోంది.

హెటెరో, అరబిందో ఫార్మా వంటి సంస్థలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో రూ.29.5 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలు లబ్ధి పొందాయన్నది ఆరోపణ.

విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్‌సీజెడ్‌‌లో భూమి కేటాయింపులకు కారణమదేనని సీబీఐ అభిప్రాయపడింది.

2012 ఏప్రిల్ 23న రెండు, మూడో ఛార్జ్‌షీట్‌‌లను దాఖలు చేసింది సీబీఐ.

రెండో ఛార్జ్‌షీట్‌లో పెట్టుబడిదారులను రూ.34.65 కోట్ల రూపాయల మేర మోసం చేసారని ఆరోపిస్తూ ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిని నిందితులుగా పేర్కొంది సీబీఐ.

మూడో ఛార్జ్‌షీట్‌లో కూడా ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డితో పాటు రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి తో పాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొంది.

133.74 కోట్ల రూపాయల ప్రయోజనాలు పొందినందుకు బదులుగా రాంకీ సంస్థ జగన్ కంపెనీలకు రూ.10 కోట్ల లంచం పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది.

రాంకీ సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకు ఇప్పించారని, విశాఖపట్నంలో ఎస్‌ఈజెడ్‌‌లో భూమి కేటాయించారని, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రాంకీ టౌన్ షిప్‌కు రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇచ్చారని, ప్రభుత్వ పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించారని సీబీఐ ఈ ఛార్జ్‌షీట్‌లో ఆరోపించింది.

ఈ మూడు ఛార్జ్‌షీట్‌ల తర్వాత 2012 మే లో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. 16 నెలలు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ 2013 సెప్టెంబర్‌లో బెయిలుపై విడుదల అయ్యారు.

జగన్ జైలులో ఉండగా సీబీఐ మరో ఏడు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది.

అవినీతి ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/YS JAGAN MOHAN REDDY

ఫొటో క్యాప్షన్, అవినీతి ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉన్నారు.

వరస ఛార్జ్‌షీట్లు

నాలుగో ఛార్జ్‌షీట్ 2012 ఆగస్టు 13న దాఖలు చేసింది సీబీఐ. ఈ ఛార్జ్‌షీట్‌లో జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన రూ. 854 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆరోపణలను ప్రస్తావించారు.

నిమ్మగడ్డ పెట్టుబడులకు బదులుగా వాన్‌పిక్ ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘిస్తూ 22,000 ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిందనేది ఆరోపణ.

ఈ ఛార్జ్‌షీట్‌లో నాటి క్యాబినెట్ మంత్రులు మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాద్ రావులను నిందితులుగా పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసి జైలుకి తరలించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరణమ, కొంతకాలంపాటు జగన్ మంత్రివర్గంలో ఉన్నారు.

ఐదో ఛార్జ్‌షీట్‌ 2013 ఏప్రిల్ 8న దాఖలైంది. ఇందులో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. జగన్ కంపెనీల్లో పునీత్ దాల్మియా రూ.95 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. బదులుగా కడప జిల్లాలోని తల్లమంచిపట్నం గ్రామంలో పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు 407 హెక్టార్ల మైనింగ్ లీజును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది. అప్పటి కాంగ్రస్‌ నేత, ప్రస్తుత తెలంగాణ క్యాబినెట్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఈ ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా పేర్కొంది.

ఆరో ఛార్జ్‌షీట్, ఏడో ఛార్జ్‌షీట్ 2013 సెప్టెంబర్ 10న దాఖలయ్యాయి.

ఆరో ఛార్జ్‌షీట్‌లో ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపించింది. బదులుగా ఇండియా సిమెంట్స్‌కు కృష్ణ, కాగ్నా నది జలాలనూ, భూమిని లీజుకు కేటాయించారని అభియోగం మోపింది.

ఏడో ఛార్జ్‌షీట్‌లో పెన్నా ప్రతాప్‌ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీలు జగన్ వ్యాపారాల్లో రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టాయని, బదులుగా అనంతపూర్ జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ భూమి, కర్నూలు జిల్లాలో 304.7 హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821ఎకరాలకు మైనింగ్ లీజు పునరుద్ధరించడం, హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ వద్ద హోటల్ ప్రాజెక్టుకు నిబంధనలలో సడలింపులు వంటి ప్రయోజనాలను పొందాయని సీబీఐ ఆరోపించింది.

ఎనిమిదో ఛార్జ్‌షీట్‌ 2013 సెప్టెంబర్ 10న దాఖలైంది. ఈ ఛార్జ్‌షీట్‌లో రఘురామ్ సిమెంటు సంస్థకు నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 2037.52 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ లీజును ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సీబీఐ.

తొమ్మిదో ఛార్జ్‌షీట్‌, పదో ఛార్జ్‌షీట్‌ 2013, సెప్టెంబర్ 17న దాఖలయ్యాయి.

తొమ్మిదో ఛార్జ్‌షీట్‌లో జగతి పబ్లికేషన్స్‌లో రూ.50 కోట్లు పెట్టుబడులు పెట్టినందుకుగానూ లేపాక్షి నాలెడ్జ్ హబ్‌‌కు అనంతపూర్ జిల్లాలో 8,844 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆరోపించారు.

పదో ఛార్జ్‌షీట్‌లో కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.15 కోట్ల పెట్టుబడికి బదులుగా ఇందూ టెక్ జోన్ సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించింది సీబీఐ.

11వ ఛార్జ్‌షీట్‌ 2014 సెప్టెంబర్ 9న దాఖలైంది. హైదరాబాద్‌లో ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు క్విడ్ ప్రో కో కింద జరిగినట్లు ఆరోపంచింది సీబీఐ. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డితో పాటు ఇందూ ప్రాజెక్ట్ ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఇందూ ప్రాజెక్టులు, కృష్ణ ప్రసాద్, చిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్టులు, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోమ్స్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్‌ను నిందితులుగా పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో రూ.70 కోట్ల పెట్టుబడులకు బదులుగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందూ ప్రాజెక్టుల ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అతి చవక ధరకే భూములు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

ఈ కేసుల్లో నిందితులు ప్రతి శుక్రవారం ప్రత్యేక సీబీఐ కోర్టుకు విచారణకు హాజరు కావాలి. ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దీని నుంచి మినహాయింపు కోరారు. కానీ, అందుకు వీల్లేదంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దాంతో కోర్టు ఈసారి మినహాయింపు ఇవ్వలేదు.

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ..

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ వేసిన పిటిషన్ విచారణ సాగుతోంది. ఇప్పటికే సీబీఐ లిఖితపూర్వకంగా తన నిర్ణయాన్ని కోర్టుకి తెలిపింది. ఈ పిటిషన్ పై కోర్టు విచక్షణకే నిర్ణయాధికారం వదిలేస్తున్నామని తెలిపింది.

పిటిషనర్ తరఫు న్యాయవాదులు పలు ఆరోపణలు చేశారు. కేసు దర్యాప్తుని అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.

అయితే జగన్ తరపు న్యాయవాదులు కూడా పిటిషనర్ రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే ఏపీలో ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించిన కేసుల్లో నిందితుడిగా ఉన్నారని కోర్టుకి తెలిపారు.

అదే సమయంలో ఈ కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని వేసిన పిటిషన్ పై విచారణ ప్రారంభమయ్యింది.

జగన్ బెయిల్ రద్దుపై పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసులో విచారణ పూర్తయ్యింది. ఇక తుది తీర్పు మాత్రమే వెలువడాల్సి ఉంది. దాంతో ఆగస్ట్ 25నాటి వాయిదాలో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)