అఫ్గానిస్తాన్: డబ్బు లేకుండా తాలిబాన్లు ఎలా పరిపాలిస్తారు, ఈ దేశం మరో సిరియా కానుందా?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, అసితా నాగేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుమారు ఇరవై ఏళ్ల తరువాత అఫ్గానిస్తాన్‌ను చేజిక్కించుకున్న తాలిబాన్లకు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యర్థుల బాధ లేదు. సాయుధ దళాలతోనో, ప్రతిపక్ష వర్గాలతోనో పోరాడాల్సిన అవసరం లేదు. కానీ, పతనం అంచున ఉన్న ఆర్థికవ్యవస్థను చక్కదిద్దడమనే పెను సవాలు వారి ముందుంది.
ఇప్పటికే భయాందోళనలతో అఫ్గాన్ ప్రజలు అనేకమంది దేశం విడిచి వెళ్లిపోతుండడంతో మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది.
ఓవైపు మానవ సంక్షోభం, మారోవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. ఇలాంటి తరుణంలో అఫ్గానిస్తాన్ భవిష్యత్తుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆగస్టు 15న తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీన చేసుకున్నప్పటి నుంచి ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిలిచిపోయింది.
బ్యాంకుల ఎదుట పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. కానీ, వాటిల్లో చాలా బ్యాంకులకు తాళాలు వేసి ఉన్నాయి. ఏటీఎంల నుంచి డబ్బులు రావడంలేదు.
ప్రజలకు చేతిలో ఉన్న డబ్బు అయిపోయే పరిస్థితి వచ్చింది. పౌరుల్లో నిస్సహాయత పెరుగుతోంది.
అఫ్గానిస్తాన్ ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతోంది? ఆ దేశానికి ఉన్న ఆదాయ వనరులు ఏమిటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
జీడీపీలో 40 శాతం విదేశీ నిధులే
ఇప్పటికే అఫ్గనిస్తాన్ ఆర్థికవ్యవస్థ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ ఆ దేశానికి, విదేశాల నుంచి ప్రధానంగా సహాయం అందుతుండేది.
ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం కానీ, అంతా కన్నా ఎక్కువగా విదేశీ నిధుల నుంచి సహాయం అందుతుంటే, ఆ దేశాన్ని సహాయంపై ఆధారపడిన దేశం (ఎయిడ్ డిపెండెంట్ కంట్రీ) అంటారు.
ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, అఫ్గానిస్తాన్ జీడీపీలో విదేశీ నిధుల వాటా 40 శాతం.
తాలిబాన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్న వెంటనే అమెరికా, జర్మనీ సహా ఇతర పాశ్చాత్య దేశాలు అఫ్గానిస్తాన్‌కు అందించే విదేశీ సహాయాన్ని నిలిపివేశాయి.
ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా అఫ్గానిస్తాన్‌కు చెల్లింపులు ఆపివేశాయి.
విదేశీ మారక నిల్వలు
అఫ్గానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ 'డా అఫ్గానిస్తాన్ బ్యాంక్' (డీఏబీ) విదేశీ మారక నిల్వలను కూడా ఫ్రీజ్ చేశారు. డీఏబీ వద్ద ప్రస్తుతం 900 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఇందులో అధిక భాగం అమెరికాలో డిపాజిట్ చేసి ఉన్నాయి.
తాలిబాన్ కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న రోజునే తాను దేశం విడిచిపెట్టి విమానంలో అమెరికా వెళిపోయినట్లు డీఏబీ మాజీగవర్నర్ అజ్మల్ అహ్మది గత వారం ట్వీట్ చేశారు.
డీఏబీ నిల్వలు చాలావరకు సురక్షితంగా ఉన్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి బంగారం, అమెరికా ట్రెజరీ బాండ్లను విదేశాలలో ఉంచారని ఆయన స్పష్టం చేశారు.
"అఫ్గానిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలలో కేవలం 0.1 నుంచి 0.2 శాతం మాత్రమే తాలిబాన్లకు అందుబాటులో ఉంటుంది. ఇది మరీ అంత పెద్ద మొత్తమేం కాదు" అని ఆయన అన్నారు.
తాలిబన్ల భయం
ఓవైపు ఆర్థిక సమస్యలు ఇలా ఉండగా, మరోవైపు పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు తీస్తున్నారు.
"అద్దె ఇవ్వకుండా, ఉచితంగా ఇళ్లల్లో ఉండమని యజమానులు అద్దెకుండేవారిని బతిమాలుకుంటున్నారు. ఇళ్లు ఖాళీగా కనిపిస్తే, తాలిబాన్లు తమ ఆస్తిని కబ్జా చేస్తారనే భయం వారిలో ఉంది" అని కాబుల్‌కు చెందిన ఒక కరెన్సీ డీలర్ అమెరికన్ వార్తాపత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్'తో చెప్పారు.
"అక్రమ మైనింగ్, డ్రగ్స్ తయారీ, వాణిజ్యం ద్వారా తాలిబన్లకు తగినంత ఆదాయం లభిస్తుందనే వాదన అంచనాలకు మించినది" అని అజ్మల్ అహ్మది ఫైనాన్షియల్ టైమ్స్ కోసం ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ప్రస్తావించారు.
అఫ్గాన్ పౌరులు విదేశాల్లో సంపాదిస్తున్న ధనాన్ని దేశంలో ఉన్న తమవారి కోసం పంపుతుంటారు. ఇది కూడా అఫ్గానిస్తాన్‌కు అందుతున్న విదేశీ నిధుల్లో ఒక భాగమే. ఈ మొత్తం అఫ్గాన్ జీడీపీలో 4 శాతం ఉంటుంది.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నడిపే 'వెస్ట్రన్ యూనియన్', 'మనీగ్రామ్' వంటి సంస్థలు కూడా ఆ దేశంలో తమ సేవలను నిలిపివేశాయి.
అంటే అఫ్గాన్ పౌరులకు విదేశాల్లో నివసిస్తున్న తమ బంధువులు, స్నేహితుల నుంచి అందుతున్న సొమ్ము కూడా ఆగిపోయింది.
తమ నిర్ణయం అఫ్గాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఎరుక తమకు ఉందని, వేగంగా మారుతున్న పరిస్థితులను తాము గమనిస్తున్నామని, తమ నిర్ణయాల్లో ఏవైనా మార్పులు ఉంటే, వినియోగదారులకు వెంటనే తెలియజేస్తామని వెస్ట్రన్ యూనియన్ గతవారం ప్రకటించింది.
‘మేం ఆపదలో ఉన్నాం’
బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంలలో డబ్బులు రావట్లేదు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి.. వీటన్నిటి కారణంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న అఫ్గాన కరెన్సీ మరింత బలహీనపడింది.
@HearAfghanWomen అనే ట్విట్టర్ ఖాతా నుంచి మారుపేర్లతో అఫ్గాన్ ప్రజలు తమ భయాందోళనలను, కష్టాలను పంచుకుంటున్నారు.
"వంట గ్యాస్ చాలా ఖరీదైపోయింది. బ్యాంకులన్నీ మూతపడ్డాయి. దుకాణాల్లో ఆహరపదార్థాల కొరత, మొబైల్ రీఛార్జ్ కావడం లేదు. మేం చాలా ఆపదలో ఉన్నాం" అని ఓ మహిళ రాశారు.
"ఆహారం కొనుక్కోవడానికి, దేశం విడిచి పారిపోయేందుకు డబ్బు కూడగట్టుకొనేందుకు ప్రజలు ఇంట్లో సామాన్లు అమ్మేసుకుంటున్నారు. ఇకపై అఫ్గాన్ పౌరుల ప్రయాణాలను అనుమతించబోమని గత రాత్రి తాలిబాన్ ప్రకటించింది. అంటే మా దేశంలోనే మేం బందీలైపోయాం అన్నమాట" అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
"గత కొద్ది రోజులుగా అఫ్గానిస్తాన్‌లో బ్యాంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. వారి వద్ద అఫ్గాన్ కరెన్సీ ఎంత ఉన్నా ప్రయోజనమేం లేదు. ఎందుకంటే, అఫ్గాన్ కరెన్సీ విలువ పడిపోయింది. విదేశీ సహాయం నిలిచిపోయింది. ప్రజల విశ్వాసం చెదిరిపోయింది" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ ఫవాజ్ గెర్గెజ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
సిరియా, యెమెన్ లాంటి పరిస్థితి
ఇవే కాకుండా, అఫ్గానిస్తాన్ తీవ్రమైన కరువును ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ఆ దేశంలో సగానికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతూ ఉండవచ్చు.
"గత మూడేళ్లల్లో అఫ్గానిస్తాన్‌లో ఇలాంటి కరవు ఏర్పడడం ఇది రెండోసారి. ఇప్పటికే ఆహార భద్రతా సమస్యలు, తీవ్రమైన పేదరికం, కరోనా కారణంగా క్షీణించిన ఆరోగ్యవ్యవస్థ ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పుడు తాలిబాన్ల రాక పరిస్థితులను మరింత దిగజారిపోయాయి. సిరియా, యెమెన్ దేశాల్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని ప్రొఫెసర్ ఫవాజ్ గెర్గెజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, తాలిబాన్లు దేశ ఆర్థికవ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు తప్పక చేస్తారని, విదేశీ సహాయం మళ్లీ ప్రారంభించే దిశగా చర్చలకు మొగ్గు చూపుతారని ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయి.
సిద్ధాంతాలు, రాజకీయ భావజాలం మారితే సరిపోతుందా?
జీ7 దేశాలు, ఆర్థిక, దౌత్య, రాజకీయపరంగా తాలిబాన్లపై ప్రభావం చూపించగలని, ఆ దేశాల మధ్య జరిగిన సమావేశానికి హాజరైన తరువాత బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
జీ7 దేశాలలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
"ఈ సమయంలో ఇంకాస్త కఠినంగా ఉండకుండా జీ7 దేశాలు కొంత ఆశ కలిగిస్తున్నాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తాలిబాన్లతో షరతులతో కూడిన సంబంధాలు నెరపాలనే ఆలోచనలో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. అంటే తాలిబాన్లు కొంత తెలివిగా వ్యవహరిస్తే అఫ్గాన్ విదేశీ నిల్వలు, డీఏబీ ఆస్తులు వారికి అందుబాటులోకి రావొచ్చు" అని ప్రొఫెసర్ గెర్గెజ్ అభిప్రాయపడ్డారు.
"అఫ్గాన్ ప్రజలకు నిత్యావసరాలు, సేవలు అందించడం తాలిబాన్ల బాధ్యత. మేం మారాం అని వాళ్లు చెబుతున్న మాటలను నిరూపించాలంటే ఇదొక మార్గం" అని ఆయన అన్నారు.
అయితే, ఇవన్నీ జరగడానికి తాలిబాన్లు తమ సిద్ధాంతాలు, రాజకీయ భావజాలంతో కొంతమేర రాజీపడితే సరిపోతుందా?
ఇది అంత సులువుగా తేల్చి చెప్పే విషయం కాదని ప్రొఫెసర్ గెర్గెజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
- తాలిబాన్లు తమ భార్యలను ‘అందంగా’ చూడటం కోసం మేకప్ సామాన్లు కొనుగోలు చేసినప్పుడు..
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- కాబుల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో బాంబు పేలుళ్లు, 90 మంది మృతి
- ‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్‌షీర్ లోయ కథ
- ఇందిరా పార్క్: 'పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు' అనే నిర్ణయంపై వివాదం, మహిళా సంఘాల ఆగ్రహం
- తాలిబాన్లు జిహాద్‌పై అమెరికా వదిలిన బాణమా... - ఇస్లామిక్ స్టేట్ ఎందుకలా ప్రచారం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












