మిషన్ పామాయిల్: మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్ ఎలా పని చేస్తుంది? ప్రమాదాలేంటి?

పామ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా 'నేషనల్ ఇడిబుల్ ఆయిల్ మిషన్ – పామాయిల్’కు పచ్చజెండా ఊపింది.

అంటే రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం, పామాయిల్ ప్రాసెసింగ్‌పై ప్రభుత్వం దృష్టిసారించనుంది.

ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పంటల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తారు.

దీని ద్వారా పామాయిల్ దిగుమతుల ఖర్చును తగ్గించుకోవాలని భారత్ భావిస్తోంది.

పామ్ ఆయిల్

ఫొటో సోర్స్, Getty Images

మిషన్‌లో ముఖ్యాంశాలు

  • ఆయిల్ పామ్ సాగు కోసం రూ.11,000 కోట్ల నిధులను రైతులకు ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించారు. ఇందులో రూ.8,844 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగతా రూ.2,194 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
  • 2025నాటికి పది లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్‌ను సాగుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • రానున్న పదేళ్లలో భారత్‌లో పామాయిల్ ఉత్పత్తిని 28లక్షల టన్నులకు తీసుకెళ్లాలని లక్ష్యం నిర్దేశించారు.
  • వీటిని సాగుచేసే రైతులపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగులో ఎలాంటి నష్టం రాకుండా జాగ్రత్త వహిస్తుంది.
  • ఇదివరకు హెక్టారుకు రూ.12,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ సాయాన్ని రూ.29,000కు పెంచారు.
  • ఇప్పటికే సాగుచేస్తున్న చెట్ల విషయంలో ఒక్కో చెట్టుకు రూ.250 చొప్పున ప్రత్యేక సాయం అందిస్తారు.
పామ్ ఆయిల్

ఇండోనేసియా, మలేసియానే ఆధారం

పామాయిల్‌ను భారీగా దిగుమతి చేస్తున్న భారత సంస్థల్లో బీఎల్ అగ్రో ఒకటి. ముఖ్యంగా ఇండోనేసియా, మలేసియాల నుంచి ఈ నూనెను దిగుమతి చేస్తున్నారు.

తాజా విధానంపై బీఎల్ అగ్రో చైర్మన్ ఘనశ్యామ్ ఖందేల్వాల్ బీబీసీతో మాట్లాడారు.

‘‘భారత్‌లో వంట నూనెల్లో 65 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. మిగతా 35 శాతాన్ని మనం దేశంలోనే పండిస్తున్నారు. ఈ 65 శాతంలో.. 60 శాతం పామాయిలే ఉంటుంది. ఎందుకంటే మిగతా నూనెల్లో దీన్ని కలుపుతుంటారు’’ అని ఆయన అన్నారు.

‘‘పామాయిల్ దిగుమతుల కోసం ఏటా భారత్ రూ.50,000 కోట్లను ఖర్చు పెడుతోంది. తాజా మిషన్ ద్వారా ఈ ఖర్చును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మిషన్‌ను ఘనశ్యామ్ స్వాగతించారు.

వీడియో క్యాప్షన్, వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?

భారత్‌లో సాగు ఇలా..

ప్రస్తుతం భారత్‌లో 3.7 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్‌ను సాగుచేస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో దీన్ని మూడు రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులలో ప్రధానంగా ఆయిల్ పామ్‌ను సాగుచేస్తున్నారు. మిజోరం, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌లలోనూ దీన్ని సాగుచేస్తుంటారు.

భూమధ్య రేఖకు అటూఇటూగా ఉండే ప్రాంతాల్లో ప్రధానంగా ఆయిల్ పామ్ పండుతుంది. శీతల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరగవు. మిగతా చమురు పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్‌తో హెక్టారుకు పది నుంచి 46 రెట్ల ఎక్కువగా దిగుబడులు సాధించొచ్చు.

ఒక హెక్టార్ ఆయిల్ పామ్ సాగు నుంచి నాలుగు టన్నుల వరకు పామాయిల్ వస్తుంది. అందుకే దీనిపై దృష్టి సారించాలని ఎప్పటినుంచో నిపుణులు సూచిస్తున్నారు.

శివ ప్రసాద్
ఫొటో క్యాప్షన్, శివ ప్రసాద్

ఆయిల్ పామ్ గిరాకీని ఒడిసిపట్టడమే లక్ష్యంగా పదేళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన శివప్రసాద్ వీటి సాగును మొదలుపెట్టారు. ఆయనకు పది ఎకరాల భూమి ఉంది.

పామాయిల్ సాగుపై బీబీసీతో శివ ప్రసాద్ మాట్లాడారు.

‘‘ఆయిల్ పామ్ చెట్టు పూర్తిగా ఎదిగేందుకు నాలుగు నుంచి ఆరేళ్లు పడుతుంది’’

‘‘ఆయిల్ పామ్ సాగుకు నీరు ఎక్కువగా అందించాల్సి ఉంటుంది. నీరు మరీ ఎక్కువైతే పంట దెబ్బతినే ముప్పు ఉంటుంది. అందుకే మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’’

‘‘ఒక ఎకరంలో ఆయిల్ పామ్ సాగు కోసం మనం దాదాపు రూ.50,000 ఖర్చు పెట్టాలి. ఏడాదిలో మనకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు దిగుబడి వస్తుంది. మన లాభం అనేది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.

ఒకసారి సాగు చేస్తే దాదాపు 30ఏళ్ల వరకు ఈ చెట్లు దిగుబడి ఇస్తుంటాయి. దీంతో దీన్ని లాభదాయకమైన పంటగా రైతులు చూస్తుంటారు.

వంటనూనె

ఫొటో సోర్స్, Science Photo Library

ముప్పులు కూడా ఉన్నాయ్..

2018లో ప్రపంచ మార్కెట్‌ కోసం రైతులు 7.7 కోట్ల టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేశారు. 2024నాటికి ఇది 107.6 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

అయితే, పామాయిల్‌కు గిరాకీ పెరుగుతుండటంతో మరిన్ని ఆయిల్ పామ్ చెట్లను పెంచాల్సి వస్తోంది. దీని కోసం ఇండోనేసియా, మలేసియాలలో అడవులు నరికేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒరంగుటాన్స్ లాంటి అడవి జంతువుల ఆవాస ప్రాంతాలు దీని వల్ల తగ్గిపోతున్నట్లు కూడా నివేదికలు వచ్చాయి.

ఇండోనేసియా, మలేసియాలో 1.3 కోట్ల హెక్టార్లలో ఆయిల్ పామ్‌ను సాగుచేస్తున్నారు. ప్రపంచంలో సగం ఆయిల్ పామ్ ఇక్కడే పండుతోంది.

గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం.. 2001 నుంచి 2018 కాలంలో ఒక్క ఇండోనేసియాలోనే 25.6 కోట్ల హెక్టార్లలో చెట్లను నరికివేశారు. ఇది న్యూజీలాండ్ భూభాగానికి సమానం.

అందుకే అటవీ భూములను నరికివేయకుండా ఆయిల్ పామ్‌ను పెంచే ప్రత్యామ్నాయలపై ప్రపంచ దేశాలు దృష్టిపెడుతున్నాయి.

పామ్ ఆయిల్

ఫొటో సోర్స్, WAHYUDI/AFP VIA GETTY IMAGES

భారత్‌లో ఏం జరుగుతోంది?

భారత్‌లోని ఆయిల్ పామ్ ఉత్పత్తి పెంపుదలకు ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, మరోవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండోనేసియా, మలేసియా తరహాలో ఇక్కడ తప్పులు చేయకుండా చూడాలని ప్రభుత్వాన్ని వారు అభ్యర్థిస్తున్నారు.

‘‘భారత్‌లో ఆయిల్ పామ్ సాగుకు వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అందుకే ఇండోనేసియా, మలేసియాలతో పోలిస్తే ఇక్కడ అంత నాణ్యమైన ఆయిల్ పామ్ ఉత్పత్తి కాదు’’ అని ఘనశ్యామ్ వివరించారు.

‘‘ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పుడు పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా జాగ్రత్త వహించాలి. అడవుల్లోని చెట్లను నరికివేసి సాగు చేయకూడదు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న భూముల్లోనే సాగు చేసేలా ప్రోత్సహించాలి’’ అని ఆయన సూచించారు.

మరోవైపు ‘‘ప్రభుత్వం సాగుకు ప్రాధాన్య రాష్ట్రాలుగా చెబుతున్న ఈశాన్య ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అడవులను నరికివేయకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి’’ అని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్‌కు చెందిన జీవీ రామాంజనేయులు వివరించారు.

మలేసియా, ఇండోనేసియాలలో రసాయనాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి రసాయనాలు ఇక్కడ ఉపయోగించకుండా ప్రభుత్వం చూడాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)