వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులతో ఆత్మీయ సమావేశం - ప్రెస్ రివ్యూ

వైఎస్ విజయమ్మ

ఫొటో సోర్స్, NOAH SEELAM/gettyimages

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి పన్నెండేళ్లవుతున్న సందర్భంగా ఆయన సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి తలపెట్టిన ఆత్మీయ సమావేశం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిందంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనం రాసింది.

‘వైఎస్ఆర్ మంత్రివర్గ సభ్యులు, సహచర నాయకులు, సన్నిహితులు తదితరులతో సెప్టెంబరు 2న హైదరాబాద్‌ శివారు మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశం జరగనుంది.

పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్‌ సన్నిహితులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నా.. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను, ఆయన పార్టీలో ఉన్న వారిని ఆహ్వానించడం లేదని ప్రచారం జరుగుతోంది.

రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల్లో ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్న వారినీ ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నా వైసీపీ నేతలను ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయమైది.

వైఎస్ఆర్‌కు అప్పట్లో సన్నిహితంగా ఉన్న నేతలతో పాటు అధికారులనూ ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కేవీపీ రాంచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితర నాయకులను, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నేతలు డి. శ్రీనివాస్‌, కె. కేశవరావు, సురేశ్‌రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి..

కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి సోదరులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇతర సీనియర్‌ నాయకులను వైఎస్‌ వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాల్గొంటున్నారు.

సుమారు వంద నుంచి 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ గౌరవాధ్యక్షురాలిగానూ ఉన్న విజయలక్ష్మి.. అన్ని పార్టీల్లోని వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానిస్తూ.. కుమారుడు వైఎస్‌ జగన్‌ను, వైసీపీ నేతలను ఆహ్వానించడం లేదన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షర్మిల.. కార్యక్రమం నిర్వహణలో తన వంతు కీలక పాత్రనూ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే ఈ కార్యక్రమానికి వైఎస్‌ సన్నిహితులను ఆహ్వానించడంలో తెలంగాణ ప్రాంతంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నట్లు విజయలక్ష్మి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ పెట్టడంలోను, ఆమె సభల నిర్వహణలోనూ విజయలక్ష్మి వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్‌ను మరోసారి స్ఫురణలోకి తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వేదికగా నిర్వహిస్తుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది’’ అని ఆ కథనంలో రాశారు.

తెలంగాణ ప్రభుత్వ చిహ్నం

ఫొటో సోర్స్, Telanganagovt

ఇకపై రెండేళ్లకే పదోన్నతులు

ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, ఒక క్యాడర్‌ నుంచి మరో క్యాడర్‌కు పదోన్నతి పొందేందుకు ఉన్న కనీస సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదించిందని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక తెలిపింది.

‘‘దీనికోసం తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ -1996ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం జీవో నంబర్‌ 259 జారీచేశారు. ఉద్యోగుల పదోన్నతులకు గతంలో జారీచేసిన 2వ నంబర్‌ జీవో ప్రకారం కనీస సర్వీసు మూడేండ్లు ఉండాలన్న నిబంధన విధించారు.

దీనిని సవరిస్తూ ప్రభుత్వం జీవో 259ను జారీచేసింది. 2020-21 ప్యానల్‌ ఇయర్‌కు పదోన్నతుల కనీన సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదిస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీచేసింది.

దాని ద్వారా 34 వేల మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారు. ఈ సడలింపు 2020- 21 ప్యానల్‌ ఇయర్‌కు మాత్రమే వర్తించగా, తాజాగా ప్యానల్‌ ఇయర్‌తో సంబంధం లేకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని జీవో-259లో స్పష్టంచేశారు.

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌లకు టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్‌, రాయికంటి ప్రతాప్‌, టీజీవో నేతలు వీ మమత, ఏ సత్యనారాయణ, ఎంబీ కృష్ణాయాదవ్‌, గ్రూప్‌ -1 అధికారుల సంఘం నేతలు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, హన్మంత్‌నాయక్‌, పీఆర్టీయూ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇదే ఆదేశాలు కొనసాగుతాయని జీవోలో పేర్కొనడంతో ఇవి శాశ్వత ఉత్తర్వులుగా భావించవచ్చని ఉద్యోగసంఘాల నేతలు అభిప్రాయపడ్డార’’ని ఆ పత్రిక తెలిపింది.

పోస్ట్ ఆఫీస్

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలోనూ విస్తరించనున్న తపాలా సేవలు.. మొబైల్, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌తో సహా ఇంకా ఎన్నో

ఇప్పటి వరకు బట్వాడా, ఆర్థిక సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు.. సేవా కేంద్రాలుగా మార్పు చెందుతున్నాయి. రైల్వే టికెట్లు, బస్‌ టికెట్లు, పాస్‌పోర్టు స్లాట్‌ బుకింగ్, పాన్‌కార్డ్‌ తదితర సేవలన్నీ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

గ్రామీణ ప్రాంతాలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డా.అభినవ్‌ వాలియా ‘సాక్షి’కి తెలిపారు.

కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహకారంతో దాదాపు 60కి పైగా సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా 20 వరకు సేవలను అందిస్తున్నట్లు చెప్పారు.

ఇక నుంచి మొబైల్, డీటీహెచ్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్‌ కోసం స్లాట్‌ బుకింగ్, ఆర్‌టీఏ, నేషనల్‌ పెన్షన్‌ స్కీం, ఫాస్ట్‌ ట్యాగ్‌ తదితర సేవలన్నింటినీ పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు.

ఇందుకోసం తపాలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 3,000 మంది ఆన్‌లైన్‌ సేవలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటికే 1,568 పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా మార్చినట్లు అభినవ్‌ వాలియా తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1.26 కోట్ల విలువైన 11 వేలకు పైగా సేవలను అందించామని పేర్కొన్నారు.

ప్రతి సేవకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్‌ నెలలో మరో 500 పోస్టాఫీసుల్లో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్టాఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఐఆర్‌టీసీ ద్వారా రైల్వే టికెట్లు 50 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ విధంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించినట్లు ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)