‘దళిత బంధు పథకం’తో హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు సాధ్యమేనా?

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
- రచయిత, అబ్బూరి సురేఖ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్, దళిత బంధు చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అన్ని పార్టీల నాయకులు దళితులపై ప్రేమ కురిపిస్తున్నారు.
అయితే అసలు దళితులకు, హుజూరాబాద్ ఎన్నికలకు ఉన్న సంబంధమేంటనే చర్చ మొదలైంది.
ఇంతకుముందు జరిగిన ఉపఎన్నికలలో దళితుల పట్ల చూపని మమకారం ఇప్పుడు ప్రతి పార్టీ కనబర్చడంపై ఆసక్తి నెలకొంది.
దళిత బంధు గురించి గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నప్పటికీ ఆచరణలోకి మాత్రం రాలేదు. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య విభేదాలు పూర్తిగా బయటపడడం, ఆయన బీజేపీలో చేరడంతో హుజూరాబాద్‌పై పట్టు సాధించేందుకు కేసీఆర్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే దళిత బంధును అమల్లోకి తెచ్చారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ రాజకీయ అనుభవం వర్సెస్ ఈటెల రాజేందర్ అస్తిత్వం అన్నట్లుగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్, బీజేపీలకు చెక్ పెట్టే లక్ష్యంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.
కేసీఆర్ సైతం తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి నుంచి దళిత బంధుని ప్రారంభించినా.. హుజూరాబాద్ నుంచే మొదలవుతుందని ప్రకటించారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 16న హుజూరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించిన సభలో దళిత బంధు వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వం ‘దళితబంధు’తో దళితులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ‘దళిత ఆదివాసీ దండోరా’ పేరుతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

హుజూరాబాద్‌కు దళిత రాజకీయాలకు ఏంటి సంబంధం?
బీజేపీలోకి చేరిన తరువాత ఈటెల రాజేందర్ ఈ ఎన్నికలను తన అస్తిత్వాన్ని నిరూపించే పోరాటంగా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈటెల రాజేందర్ 2003లో రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ 2009 నుంచి హుజూరాబాద్ రాజకీయాలలో పట్టు సాధించారు .
హుజూరాబాద్ రాజకీయాలను కులం కోణంలో చూస్తే ఈటెల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కూడా బీసీ వర్గానికి చెందిన వారు.
ఈ పరిస్థితులలో బీసీ ఓట్లు తమకు తగ్గినా ఇతర వర్గాల ఓట్లను గంపగుత్తగా సాధించడంపై కేసీఆర్ దృష్టిపెట్టారని, అందుకే దళిత బంధు పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
ఇది మొదటి వ్యూహం కాగా కేసీఆర్ తన రెండో వ్యూహంలో భాగంగా బీసీ వర్గానికే చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టికెట్ ప్రకటించడం. యువత, బీసీ కలయికగా గెల్లు శ్రీనివాస్‌ను వ్యూహాత్మకంగా హుజూరాబాద్ అభ్యర్థిగా నిలిపారు.
అలాగే, పద్మశాలి అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు.
అయితే, కేసీఆర్ ఎన్ని వ్యూహాలు రచించినా గెలుపు తమదేనంటోంది బీజేపీ.
‘‘అన్ని వర్గాలకు మేలు చేయడమే మా అజెండా’’ అని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, REVANTH REDDY ANUMULA/FACEBOOK
కాంగ్రెస్ దళిత దండోరా ఇప్పుడే ఎందుకు?
రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత దళిత దండోరా పేరుతో ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించారు.
సెప్టెంబర్‌లో రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
‘‘కాంగ్రెస్ ఎప్పుడూ దళితులకు అండగా ఉంది. ఇప్పుడు కూడా మరింత చేస్తుంది. అందుకే దళిత దండోరా’ అని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
దళిత బంధుపైనా కాంగ్రెస్ ప్రశ్నలు కురిపిస్తోంది . కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఇంతకుముందు దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ? కేసీఆర్ తాను చేసిన వాగ్దానాలు నిలబెట్టు కోకుండా , ఇలాంటి ఎన్నికల స్కీంతో రావడం హాస్యాస్పదం. ఇంతక ముందు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మళ్లించి ఇప్పుడు దళితులపై ప్రేమ ఎలా కురిపిస్తున్నారు? " అని ప్రశ్నించారు .
గత ఏడేళ్లలో 9 లక్షల అప్లికేషన్స్ వస్తే వాటిలో లక్ష అప్లికేషన్లు కూడా క్లియర్ చేయని ప్రభుత్వం ఇప్పుడు ఈ దళిత బంధు అంటు మభ్యపెడుతోందన్నారు. దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటిలోగా అమలు చేస్తారనేది కూడా ప్రభుత్వం చెప్పడం లేదని శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, TWITTER/DR.RSPRAVEENKUMAR
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పార్టీలు, నేతల హడావుడి మధ్య తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్‌పీలో చేరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
దళితుడైన ప్రవీణ్ కుమార్ దళిత విద్యార్థుల అభ్యున్నతి కృషి చేశారన్న పేరుంది. ఆయన హుజూరాబాద్ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి రావడం చర్చనీయమైంది.
ప్రవీణ్ కుమార్ ప్రభావమా? కాదా? అన్న చర్చను పక్కనపెడితే.. ఈ మధ్యనే దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు గాను దళితుడైన ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జను సీఎంఓలోకి తీసుకుంటున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
అలాగే, దళితుడైన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియమించారు. ఇందుకోసం సజ్జనార్‌ను బదిలీ చేయడం గమనార్హం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు స్టీఫెన్ రవీంద్ర కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, kcr
కేసీఆర్ సెంటిమెంటు నిజమేనా?
అయితే, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి టీఆర్ఎస్ నేతలు చెబుతున్న కారణం వేరు. బీజేపీకి, ఈటెల రాజేందర్‌కు భయపడి అక్కడి నుంచి ప్రారంభించలేదని.. పథకాలను అక్కడి నుంచి ప్రారంభించే సెంటిమెంట్ కేసీఆర్‌కు ఉందని, రైతుబంధు కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
"కుల రాజకీయం అని ఎందుకు అనుకోవాలి , ప్రతి కులానికి ప్రభుత్వం ఎంతోకొంత మేలు చేస్తుంది . ఇది ఎప్పటి నుంచో అనుకున్న పథకం , హుజూరాబాద్‌తో ముఖ్యమంత్రికి సెంటిమెంట్ ఉంది. అలాంటప్పుడు తప్పు ఎలా అవుతుంది . బీజేపీకి దళితుల మీద ప్రేమ ఉంటె , పది లక్షలకు మరో పదో ఇరవయ్యో లక్షలు కేంద్రం నుంచి ఇప్పించవచ్చు కదా’’ అన్నారు క్రిశాంక్.

ఫొటో సోర్స్, FB/TELANGANA CM0
హుజూరాబాద్‌లో దళితులు ఎందరు?
2011 జనాభా లెక్కల ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గ జనాభా 288604.
ఇందులో పిల్లలు 23441.
ఎస్సీలు 62084, ఎస్టీలు 2623 మంది ఉన్నారు.
అయితే ఒక అంచనా ప్రకారం బీసీ వర్గానికి చెందిన ఓటర్లు లక్ష ఇరవై వేలు. ఇక్కడ ముఖ్యంగా మున్నూరు కాపు, పద్మశాలి, ముదిరాజ్, గౌడ్ ఇంకా యాదవ్ వర్గానికి చెందిన వారి ఓట్లు కీలకం.
ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం హుజూరాబాద్‌లో సుమారు 21000 దళిత కుటుంబాలు ఉన్నాయి.
దళితుల గురించి మాట్లాడడానికి కారణాలు ఏంటి?
దళిత బంధు మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలనుకున్నారు.
ఒక అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రం లో దాదాపు 17 % దళితులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు 2023 నాటికి ఏ పార్టీ వైపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
దళితబంధు పథకం హుజూరాబాద్ ఎన్నికలు లక్ష్యంగా చేపట్టిందేనన్న విపక్షాలకు సమాధానంగా కేసీఆర్.. ‘‘తెరాస మఠం కాదు , మేము సన్యాసులం కాదు , రాజకీయ లబ్ది పొందడంలో తప్పు ఏముంది’’ అంటూ ఈ పథకం ఎన్నికల తాయిలమేనని తేల్చేశారు.
దళితుల కోసం కేసీఆర్ ప్రకటించిన ఇతర ‘వరాలు’ ఏమయ్యాయి?
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నుండి అవసరం అయినప్పుడల్లా దళిత కార్డు వాడుతూ వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కూడా రాష్ట్రానికి తొలి ముఖ్య మంత్రి ఒక దళితుడే అవుతారని, అది కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యపడుతుందని చెప్పడం గమనార్హం.
ఎన్నికల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఆ తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ప్రకటించారు. ఈ హామీ కూడా కార్యరూపం దాల్చలేదు.
ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ఎదురులేని పార్టీగా అవతరించడం, గట్టి పోటీ లేకపోవడంతో రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఘనవిజయాలు సాధిస్తూ వచ్చారు కేసీఆర్.
అయితే గత కొంత కాలంగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై దృష్టి పెట్టడం.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్న్యాయ పార్టీగా నిలబడాలని ప్రయత్నించడంతో పరిస్థితులు మారాయి.
ఈ విషయం గత జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ, దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ స్పష్టం అయ్యింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో టీఆర్ఎస్‌కు ఎన్నికల్లో గెలుపు గతంలోలాగా సులభంగా కనిపించట్లేదు.
ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దళిత బంధు పథకంపై విమర్శల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కులాలకూ ‘బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టి డబ్బులు ఇస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు.
ఇంత భారీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ.. దానికి వివరణలు ఇచ్చుకునే పరిస్థితే కనిపిస్తోంది తప్ప.. ఈ పథకంతో హుజూరాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు స్పష్టం అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపించట్లేదు.
ఇవి కూడా చదవండి:
- భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే భర్త రేప్ చేసినట్లేనా
- ‘తాలిబాన్ల పాలనలో జరిగిన అఘాయిత్యాలను మహిళలు ఇంకా మర్చిపోలేదు’
- తాలిబాన్ల పాలనలో ‘ఆడామగా మాట్లాడుకున్నా తప్పే.. ఏమడిగితే అది ఇచ్చేయాల్సిందే’
- జపాన్: ‘గృహిణి’ బాధ్యతల నుంచి తప్పుకుని, ఉద్యోగాల్లోకి వస్తున్న మహిళా శక్తి
- దారా షికోహ్: అన్న తల నరికి తండ్రికి బహుమతిగా పంపిన ఔరంగజేబు
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా?
- ఆంధ్రప్రదేశ్: తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చర్యలు తీసుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














