ఆంధ్రప్రదేశ్: తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చర్యలు తీసుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
విజయవాడ నగరంలో పటమటకు చెందిన వృద్ధ దంపతుల విషయంలో విజయవాడ సబ్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఇటీవల చర్చనీయాంశం అయింది. పక్షవాతంతో బాధపడుతున్న తమను బిడ్డలు పోషించడం లేదంటూ ఓ వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్, ఆ తల్లిదండ్రుల నిర్వహణ ఖర్చుల నిమిత్తం, నెలకు రూ.7వేల చొప్పున వారి సంతానం చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభమయింది.
తల్లిదండ్రుల పట్ల పిల్లల నిర్లక్ష్యానికి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకపోవడం, శ్మశానాల వద్ద వదిలేసి రావడం వంటి ఘటనలు మీడియాలో వచ్చాయి.
అయితే కొన్ని కేసులే న్యాయస్థానాల వరకూ వెళ్తాయి. తల్లిదండ్రుల పోషణ విషయంలో భార్య అభ్యంతరం పెడితే భర్త విడాకులు కూడా కోరవచ్చని కోర్టులు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయినప్పటికీ, వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చూపించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చట్టంపై అవగాహన లేకపోవడం, అమలు చేయాల్సిన యంత్రాంగం పెద్దగా శ్రద్ధ చూపకపోవడం వంటి అనేక కారణాలతో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు కనిపిస్తోంది.
వృద్ధుల బాగోగుల కోసం చట్టాలు ఉన్నాయా?
వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించింది.
వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, మెయింటెనన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో నిబంధనలు రూపొందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2011 డిసెంబర్ 28వ తేదీన జీవో నం. 49ని దానికి అనుగుణంగా విడుదల చేసింది. వృద్ధుల సంక్షేమానికి అనేక నిబంధనలను ఈ జీవోలో పొందుపరిచారు.
ఈనేపథ్యంలో చట్టం ఏం చెబుతోంది, సీనియర్ సిటిజన్లకు ఉన్న హక్కులేంటన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం ఏం చెబుతోంది?
చట్టం ప్రకారం, వృద్ధులకు పిల్లలు అంటే కొడుకు, కూతురు మాత్రమే కాకుండా మైనారిటీ తీరిన మనుమళ్లు, మనుమరాళ్లు కూడా పిల్లల జాబితాలోకే వస్తారు.
వృద్ధుల మెయింటెనన్స్ బాధ్యత అంటే వారికి ఆహారం, దుస్తులు, నివాస సదుపాయం, వైద్య, ఆరోగ్య ఖర్చులు కూడా పిల్లలదేనని చట్టం చెబుతోంది.
దత్తత తీసుకున్నవారి లేదా సవతి తల్లిదండ్రుల పోషణ కూడా పిల్లల బాధ్యతే.
వృద్ధుల సంక్షేమం, తల్లిదండ్రుల బాధ్యత విస్మరించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది. ఇందుకుగానూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసేలా చట్టంలో ఆదేశాలు పొందుపరిచారు.
చట్టం అమలు చేసే అధికారి ఎవరు?
ఈ చట్టంలోని సెక్షన్ 7లో సబ్ సెక్షన్ 2 కింద 'ప్రిసైడింగ్ ఆఫీసర్'ను నియమిస్తారు. వృద్ధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టం అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌కు అధ్యక్షత వహించే అధికారిని 'అప్పీలేట్ అధికారి'గా పేర్కొన్నారు.
సివిల్ కోర్టుకు సంబంధించిన అన్ని అధికారాలు ట్రిబ్యునల్‌కు ఉంటాయి. ట్రిబ్యునల్, సెక్షన్ 195తో పాటుగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, చాప్టర్ 25లోని అన్ని ప్రయోజనాల కోసం సివిల్ కోర్టుగా పరిగణిస్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసిన జీవో నం. 49 ప్రకారం, రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రస్తుతం ట్రిబ్యునల్ అప్పీలేట్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇటీవల విజయవాడ సబ్ కలెక్టర్ కూడా ఈ అధికారాలతోనే ఆదేశాలు ఇచ్చారు.
ఈ చట్ట ప్రకారం, పటమటకు చెందిన సైకం గోపాలస్వామి నలుగురు సంతానం ఆయనకు నిర్వహణ ఖర్చులు చెల్లించాల్సి వచ్చింది.
గోపాలస్వామికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ, పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి బాగోగులను వారు పట్టించుకోలేదు.
దీంతో ట్రిబ్యూనల్ అధికారాలను ఉపయోగించుకుని సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశాలు ఇవ్వడంతో నెలకు రూ. 7వేల చొప్పున గోపాల స్వామికి అందించేందుకు ఆయన పిల్లలు అంగీకరించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రిబ్యునల్‌కు ఎలా వెళ్లాలి?
రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉంటుంది. సమస్యల్లో ఉన్న తల్లిదండ్రులు లేదా వృద్ధులు అక్కడికి వెళ్లి ఫారం 'ఏ' నింపి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. లేదా రిజిస్టర్డ్ పోస్టు గానీ ఈమెయిల్ ద్వారా గానీ తమ ఫిర్యాదులు పంపించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి.
చట్టం ప్రకారం, దరఖాస్తును ప్రిసైడింగ్ ఆఫీసర్ స్వీకరిస్తారు. దానిని సంబంధిత రికార్డులలో నమోదు చేస్తారు. కొన్ని సార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సుమోటోగా కేసు స్వీకరించే అవకాశం కూడా ఉంది.
వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత, సెక్షన్ 5 (2) కింద దాఖలైన దరఖాస్తును 90 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా మరో 30 రోజుల వ్యవధి తీసుకునే అవకాశం మాత్రమే ఉంది.
అంటే ఫిర్యాదు చేసిన 4 నెలల్లోగా ఈ కేసు పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.
ఫిర్యాదుకు అనుగుణంగా బాధితుల వారసులకు నోటీసు జారీ చేస్తారు. అవి అందుకున్న వారు వ్యక్తిగతంగా హాజరుకావాలి. వారు స్పందించకపోతే దరఖాస్తుదారుని సాక్ష్యంగా పరిగణించి ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో, ఇరు పక్షాలూ భిన్నమైన వాదనలు వినిపిస్తే, అందరి సమ్మతితో ట్రిబ్యునల్ తరుపున రాజీ అధికారిని నియమిస్తారు. అప్పటి నుంచి నెలలోపు ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. రెండు పార్టీలకూ ఆమోదయోగ్యమైన సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించాలి.
రాజీ అధికారి అవసరమైన మేరకు రెండు పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తారు.
ట్రిబ్యూనల్ ఆదేశాల అమలు
రాజీ ద్వారా కూడా సమస్య పరిష్కారం కాకపోతే ట్రిబ్యూనల్ స్వయం నిర్ణయం తీసుకోవచ్చు. వృద్ధుల నిర్వహణ బాధ్యతలను తీసుకోవాల్సిందిగా ఆదేశించవచ్చు.
మెయింటెనెన్స్ చెల్లించాలని అవతలి పార్టీని నిర్దేశిస్తూ ఆదేశాలు ఇచ్చే సమయంలో ట్రిబ్యూనల్ పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- ఫిర్యాదుదారుని ప్రాధమిక అవసరాలు తీరడానికి ఎంత మొత్తం అవసరం?
- అవతలి పార్టీ ఆదాయం ఎంత ?
- వారసత్వంగా పిల్లలకు దక్కిన ఆస్తులు, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత?
గరిష్ట నిర్వహణ భత్యం నెలకు రూ. 10వేల లోపుగా ప్రస్తుతం లెక్కిస్తున్నారు. దాన్ని వారసుల మధ్య విభజిస్తారు.
ట్రిబ్యూనల్ ఆదేశాలను దరఖాస్తుదారునితో పాటుగా అవతలి పార్టీ వారికి కూడా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపిస్తారు.
ఓల్డ్ ఏజ్ హోంల నిర్వహణ
ఓల్డ్ ఏజ్ హోంలకు సంబంధించి అనుమతులు, నిర్వహణ నిబంధనలు, అమలుకు సంబంధించి ఆదేశాలు కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. వృద్ధాశ్రమాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 2001, కంపెనీల చట్టం, 1956 (1956 యొక్క సెంట్రల్ యాక్ట్ 1), ఇండియన్ ట్రస్ట్స్ యాక్ట్ కింద దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
వృద్ధాశ్రమం లక్ష్యాలు, పేరు, చిరునామా, వృత్తి, డైరెక్టర్లు/బోర్డ్ సభ్యులతో పాటుగా సంస్థలో పనిచేసే సిబ్బంది/ఉద్యోగుల అర్హతలు సహా వివరాలన్నీ బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారి నెలవారీ ఛార్జీల వివరాలు కూడా వెబ్ సైట్‌లోనూ, ఓల్డ్ ఏజ్ హోంలోనూ కూడా రాసి ఉంచాలి.
నిర్వహణలో కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలి. వైద్య సహాయం కోసం సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. వినోద కార్యక్రమాల నిర్వహణ నుంచి ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తల వరకూ అన్నింటినీ చట్టంలో పేర్కొన్నారు.
నిర్వహణ లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని ఈ చట్టంలో పేర్కొన్నారు.
అధికారులు బాధ్యత వహించాలి
జిల్లా స్థాయి మెజిస్ట్రేట్‌గా ఉన్న కలెక్టర్‌తో పాటుగా జిల్లా పోలీస్ అధికారులు కూడా సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ, వాటి పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వృద్ధులు తమ ఫిర్యాదులు అందించడానికి అనుగుణంగా ఫారం ఏ కాపీలను అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలి.
తగిన సంఖ్యలో నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌లు ఆన్‌లైన్‌లోనూ , అదే సమయంలో పంచాయితీలు, పోస్టాఫీసులు, మండల్ ప్యారిస్ కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లలో కూడా అందుబాటులో ఉంచాలనే నిబంధన ఉంది.
అంతేగాకుండా ఈ చట్టం రూల్స్ చాప్టర్ 6 ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ కూడా తన పరిధిలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ల జాబితాను తయారు చేయాలి. ప్రత్యేకించి రూల్ 21 (2) (iv) ప్రకారం ఏర్పడిన వలంటీర్స్ కమిటీ సహాయం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ జాబితా అప్ డేట్ చేస్తూ ఉండాలి.
సీనియర్ సిటిజన్లు తమ సమస్యలపై ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. వారి ఫిర్యాదులు/సమస్యలను స్థానిక పోలీసులు తక్షణమే పరిష్కరించాలి.
సీనియర్ సిటిజన్ల భద్రత కోసం అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్, యూత్ వలంటీర్స్, ప్రభుత్వేతర సంస్థలు, సమీప కాలనీ వాసుల సహకారం తీసుకుని పోలీసులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర మంత్రి సారధ్యంలో కమిటీ
సీనియర్ సిటిజన్ల సంక్షేమం, వృద్ధ తల్లిదండ్రుల సమస్యలకు సంబంధించిన చట్టం అమలు జరిగేలా చూసేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిల్లో కమిటీలు ఉండాలని ఇందులో పేర్కొన్నారు.
వీటిల్లో రాష్ట్రస్థాయిలో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రితో పాటుగా వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, హెల్త్, హోమ్ శాఖ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ప్రభుత్వ శాఖల కార్యదర్శులంతా ఈ కమిటీలో ఉంటారు.
ప్రభుత్వం నామినేట్ చేసిన నిపుణులు, కార్యకర్తలు కూడా ఈ కమిటీలో ఉంటారు. కొందరు సీనియర్ సిటిజన్లను కూడా ఈ కమిటీకి నామినేట్ చేస్తారు.
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమిషనర్ లేదా డైరెక్టర్ ఈ కమిటీకి ఇన్ఛార్జ్‌గా ఉంటారు. ఈ కమిటీ ప్రతీ ఆరునెలలకు ఓసారి సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు చాలా అరుదుగానే జరుగుతున్నట్టు చెప్పాలి.
సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం జిల్లా స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లేదా అర్బన్ పోలీస్ కమిషనర్, జిల్లా వైద్యాధికారి (డీఎం అండ్ హెచ్ఓ), జిల్లా వైద్య సేవల పర్యవేక్షణాధికారి (డీసీహెచ్ఎస్), డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆర్డీవోలు లేదా సబ్ కలెక్టర్లు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ రంగంలో పనిచేసే ఎన్‌జిఓల నుంచి ముగ్గురు ప్రతినిధులు ఈ కమిటీలో ఉండాలి. వారిలో ఒకరు మహిళ తప్పనిసరిగా ఉండాలి.
వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఈ కమిటీలో ఉంటారు.
జిల్లా కమిటీ మూడు నెలలకు ఓమారు సమావేశం కావాల్సి ఉంటుంది. సభ్యుల పదవీకాలం మూడేళ్లుంటుంది. రాష్ట్రప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను బట్టి ఈ కమిటీ సభ్యుల నియామకం జరుగుతంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి కమిటీ సమావేశాలు కరోనా కారణంగా జరగడం లేదని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా స్థాయిలో మాత్రం సమావేశాలు జరుగుతుండగా, అనేక చోట్ల ఆర్డీవో స్థాయిలోని ట్రిబ్యునల్స్ ద్వారా పలువురు వృద్ధులకు మేలు కలుగుతోందని అధికారులు అంటున్నారు.
ఒక్క విజయవాడ సబ్ కలెక్టరేట్ పరిధిలోనే గడిచిన కొన్ని నెలల్లో 34 కేసుల్లో మెయింటెనన్స్ కోసం ఖర్చులు చెల్లించాలనే ఆర్డర్స్ జారీ చేసినట్టు సబ్ కలెక్టర్ వివరించారు.

వెంటనే స్పందిస్తాం..జైలుశిక్ష కూడా ఉంటుంది
"విజయవాడ పటమటకు చెందిన వృద్ధులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాం. వారి కుటుంబానికి ఉపశమనం దక్కింది. ఎక్కువ మందికి చట్టం మీద అవగాహన లేదు. అడ్వకేట్ కూడా అవసరం లేకుండా నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. వారు వస్తే ఖచ్చితంగా సీనియర్ సిటిజన్లకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది.
‘‘చట్టం మీద అవగాహన పెరగాల్సి ఉంది. బాధ్యత మరచి, తల్లిదండ్రులను వదిలేస్తే చట్టం ఊరుకోదు. ట్రిబ్యూనల్ ఆదేశాల ప్రకారం మెయింటెనన్స్ ఖర్చులు చెల్లించకపోతే వారిని జైలుకు పంపించే అవకాశం కూడా ఉంది. రెండేళ్ల వరకూ శిక్ష పడుతుంది" అని విజయవాడ సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్ బీబీసీకి తెలిపారు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమ చర్యలు నామమాత్రమే
"సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం రూపొందించిన ఎండబ్య్లూపీఎస్సీ యాక్ట్ ఉంది. కానీ అది చాలామందికి తెలియదు. పిల్లలు కూడా కొందరు బాధ్యత మరచిపోతున్నారు. పైగా ఉద్యోగాల పేరుతో దూరంగా ఉంటున్న కారణంగా తల్లిదండ్రులకు వృద్దాప్యంలో ఎదురవుతున్న సమస్యలను ఖాతరు చేయడం లేదు’’ అని విజయవాడకు చెందిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి మార్గాని నాగేశ్వరరావు అన్నారు.
వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన చర్యలు ప్రస్తుతం నామమాత్రంగానే ఉన్నాయని, కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద ఫిర్యాదులు ఎందుకులే అని వదిలేస్తున్నారని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక
- దళిత గిరిజన దండోరా: 'దళిత బంధు' రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు-రేవంత్‌రెడ్డి
- ఆంధ్రప్రదేశ్: కొత్త విద్యా విధానంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








