తప్పిపోయి 40 ఏళ్ల పాటు ముస్లిం కుటుంబంతో ఉన్న పంచుబాయి చివరికి ఇల్లు ఎలా చేరారంటే..

ఫొటో సోర్స్, ANOOP DUTTA/BBC
- రచయిత, అనూప్ దత్తా
- హోదా, బీబీసీ కోసం
పురాతత్వ పరంగా మధ్యప్రదేశ్ బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. అక్కడి దమోహ్ జిల్లాలో ఇటీవల మత సామరస్యానికి అద్దంపట్టే ఒక ఘటన వెలుగుచూసింది.
జిల్లాలోని ఒక ముస్లిం కుటుంబం దాదాపు 40 ఏళ్లు మానసిక అనారోగ్యంతో ఉన్న ఒక అపరిచిత మహిళకు ఆశ్రయం కల్పించింది. ఇటీవల ఆమెను చివరకు తన కుటుంబంతో కలపగలిగింది.
జూన్ 17న మధ్యాహ్నం సుమారు రెండున్నర అవుతోంది. కోటాతాలా గ్రామంలో ఉన్న ఒక మూడు గదుల ఇంటి ముందు జనం భారీగా గుమిగూడి ఉన్నారు.
గ్రామస్థులు చాలా మంది ఆ ఇంటి ముందున్న నేరేడు చెట్టు కింద కూచున్నారు. అక్కడికి రావాల్సిన ఒక కారు కోసం ఆతృతగా చూస్తున్నారు.
ఎర్ర రంగు కారులో వస్తున్నవారికి హైవేకు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ గ్రామంలో, చేరాల్సిన ఇంటిని వెతకడానికి ఎంతోసేపు పట్టలేదు. ఊళ్లోకి రాగానే జనం ఆ కారును చుట్టుముట్టి ఆ ఇంటి వరకూ తీసుకొచ్చారు.
అది మర్హూమ్ నూర్ ఖాన్ ఇల్లు. నూర్ ఖాన్ ఒక ట్రక్కు డ్రైవర్. గ్రామంలో రెండు గదుల ఇంట్లో అద్దెకు ఉండేవారు. తర్వాత ఆయన కొత్త ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు ఆయన కొడుకు ఇస్రార్, తన తల్లి, మిగతా కుటుంబంతో పాటు ఉంటున్నారు.
కోటాతాలా గ్రామస్తుల కళ్లన్నీ ఆ కారులోంచి దిగుతున్నవారిపైనే ఉన్నాయి.
కార్లో నుంచి నాగపూర్, వర్ధమాన్ నగర్‌కు చెందిన పృథ్వీ భయ్యాలాల్ శింగాణే, ఆయన భార్య, శింగాణే స్నేహితుడు రవి దిగారు. ఆ ఇంట్లోకి వెళ్లారు.
లోపల గదిలో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా గత కొన్ని గంటలుగా పృథ్వీ, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్నారు.
అదే గదిలో దాదాపు 90 ఏళ్ల ఒక వృద్ధురాలు కూడా కూచుని ఉన్నారు. ఆమెకు అక్కడ ఏం జరుగుతోందో, వారంతా ఎందుకున్నారో తెలీదు. ఆమెకు ఏదీ గుర్తు లేదు.
గ్రామంలోని వారంతా ఆ వృద్ధురాలిని అచ్ఛన్ పిన్ని అని పిలుచుకుంటారు. ఆమె గత నాలుగు దశాబ్దాలుగా దూరమైన తనవారిని ఇన్నాళ్లకు కలుసుకోబోతున్నారు. కానీ, ఆమె వారిని గుర్తుపట్టే స్థితిలో కూడా లేరు.
ఇది 40 ఏళ్ల క్రితం నాగపూర్‌లో కనిపించకుండా పోయిన పంచుబాయి కథ. ఆమెను దమోహ్‌లో అందరూ అచ్ఛన్ పిన్ని అనిపిలుస్తారు.

ఫొటో సోర్స్, ANOOP DUTTA/BBC
ఫ్లాష్‌బ్యాక్, 1979 జనవరి
ఆమె తప్పిపోయిన తర్వాత ఏం జరిగిందో ఆ కథను ట్రక్ డ్రైవర్ నూర్ ఖాన్ కొడుకు ఇస్రార్ చెప్పారు,
“అది నేను పుట్టిన కొన్ని రోజుల తర్వాత జరిగిందట. ఒకరోజు నాన్న ట్రక్ నడుపుతూ దమోహ్ బస్టాండ్ ముందు నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఆయన నేలమీద పడిపోయిన ఒక మహిళను చూశారు”.
తండ్రి నూర్ ఖాన్ చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇస్రార్ మళ్లీ చెప్పడం కొనసాగించారు.
“దగ్గరికెళ్లి చూశాక ఆమెపై తేనెటీగలు దాడి చేసిన విషయం తెలిసింది. ట్రక్‌లో రాళ్లతో పాటు కూర్చున్న కూలీల సాయంతో నాన్న ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె మాకు అచ్ఛన్ పిన్ని అయ్యారు. మాతోపాటే ఉండిపోయారు” అన్నాడు.
గత 40 ఏళ్లలో నూర్ ఖాన్, పంచుబాయిని తన కుటుంబంతో చేర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెకు మానసిక బలహీనత ఉండడం, మరాఠీలో మాత్రమే మాట్లాడుతూ ఉండడంతో వారు ఆమె ఊరూ, పేరు కూడా సరిగా తెలుసుకోలేకపోయారు.
నూర్ ఖాన్ ట్రక్ డ్రైవరుగా ఉన్నప్పుడు, ఎప్పుడు మహారాష్ట్ర వెళ్లినా అచ్ఛన్ పిన్ని గురించి చెప్పి ఆమె కుటుంబాన్ని వెతకడానికి ప్రయత్నించేవారు.
“నాన్న చనిపోయిన తర్వాత మేం చాలాసార్లు ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో ఆమె వీడియో, ఫొటోలు అప్‌లోడ్ చేశాం, పిన్నిని ఆమె కుటుంబం దగ్గరకు చేర్చడానికి ప్రయత్నించాం. కానీ ఏవీ ఫలించలేదు” అని ఇస్రార్ చెప్పారు.
పర్సాపూర్ ప్రస్తావన
కానీ మే మొదటి వారంలో వారికొక ఆశా కిరణం కనిపించింది.
ఒక స్వచ్ఛంద సంస్థ రిసెప్షన్‌లో పనిచేస్తున్న ఇస్రార్ బీబీసీతో “మే 5న ఉదయం దాదాపు 8.30కు నేను రోజూలాగే టీ తీసుకుని అచ్ఛన్ పిన్ని గదిలోకి వెళ్లా. అమ్మ ఆ గదిని శుభ్రం చేస్తోంది. పిన్నితో మాట్లాడుతోంది. నేను అక్కడే నిలబడ్డా. మాటల మధ్యలో పిన్ని హఠాత్తుగా ‘పర్సాపూర్’ అని గొణికింది. మేం ఆమె నోటి నుంచి పర్సాపూర్ అనే మాట వినడం అదే మొదటిసారి. వెంటనే నేను గూగుల్‌లో చెక్ చేశా. అది మహారాష్ట్రలో అమరావతి జిల్లాలోని ఒక గ్రామం అని తెలిసింది” అన్నారు.
ఇస్రార్ ఫోన్లో పర్సాపూర్‌లో కనిష్క ఆన్‌లైన్ సంస్థకు చెందిన అభిషేక్‌ను సంప్రదించగలిగారు. అచ్ఛన్ పిన్ని గురించి అన్నీ చెప్పారు.
అచ్ఛన్ పిన్నికి సంబంధించిన ఒక వీడియోను ఇస్రార్ పంపిస్తే, అభిషేక్ దానిని సోషల్ మీడియా ద్వారా పర్సాపూర్‌లోని మొబైల్ యూజర్లకు చేర్చేలా ఒక డీల్ చేసుకున్నారు.
ఇస్రార్ తర్వాతి రోజు అంటే 7న ఉందయం వృద్ధురాలి వీడియో తీసి అభిషేక్‌కు పంపించారు.
పర్సాపూర్ నుంచి బీబీసీతో మాట్లాడిన అభిషేక్ “వీడియో, ఫొటోలు రాగానే నేను వాటిని చుట్టుపక్కల ఉన్న మొబైల్ యూజర్స్ గ్రూపులకు పంపించాను. రెండు గంటల్లో నాకే కాదు, సగం పర్సాపూర్‌కు ఆమెది ననిహాల్ అంజమ్‌నగర్ అనే విషయం తెలిసిపోయింది” అని చెప్పారు.
కొన్నిరోజుల్లోనే నాగపూర్ నుంచి పృథ్వీ భయ్యాలాల్ శింగాణే ఇస్రార్‌కు ఫోన్ చేశాడు, వీడియో, ఫొటోల్లో ఉన్న మహిళ తన నానమ్మ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ANOOP DUTTA/BBC
దమోహ్ ఎలా చేరారు?
కానీ 40 ఏళ్ల క్రితం పంచుబాయి నాగపూర్ నుంచి దమోహ్ ఎలా చేరారు.
పంచుబాయి మనవడు నాగపూర్, తూర్పు వర్దమాన్ నగర్‌లో ఉండే పృథ్వీ భయ్యాలాల్ శింగాణే బీబీసీతో జరిగిన విషయం చెప్పారు.
“మా నాన్నమ్మ పంచుబాయి నాగపూర్ నుంచి దమోహ్ ఎలా చేరుకుందో నాకు తెలీదు కానీ మా నాన్న భయ్యాలాల్ శింగాణే 1979లో లకడ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన విషయం తెలుసు’’ అన్నారు.
పృథ్వీ తన తల్లి నుంచి నాన్నమ్మ నాగపూర్‌లో తప్పిపోయిందనే కథను విన్నారు.
“1979 జనవరి 22-30 మధ్యలో మా నాన్న వాళ్ల అమ్మకు చికిత్స చేయించడానికి నాగపూర్‌లో ఉన్నారు. చికిత్స జరిగేవరకూ ఆయన అక్కడ ఒక ఇల్లు తీసుకున్నారు. ఒక రోజు మా నాన్నమ్మ కనిపించలేదు. వెతికినా కనిపించక మా నాన్న 1979లో లకడ్‌గంజ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కానీ నాన్నమ్మ ఆచూకీ దొరకలేదు” అన్నారు.
మానసిక అనారోగ్యంతో ఉన్న తన నాన్నమ్మను ఎలాంటి బంధం లేకపోయినా ఒక కుటుంబం 40 ఏళ్ల పాటు చూసుకోవడం అద్భుతమే అని పృథ్వీ చెప్పారు.
అచ్ఛన్ పిన్ని అప్పుడప్పుడూ తమ నాన్నను భయ్యా(అన్న) అనేదని, అమ్మను కమలా భాభీ(వదిన) అని పిలిచేదని ఇస్రార్ చెప్పారు. కమలా భాభీ అనేది వృద్ధురాలి అన్న భార్య పేరు అని తమకు పృథ్వీ చెప్పాకే తెలిసిందన్నారు, పంచుబాయి వాళ్ల అన్నయ్య పేరు చతుర్భుజ్. ఆయన అంజనానగర్‌లో ఉండేవారు.
తండ్రికి సాధ్యం కాకపోయినా అచ్ఛన్ పిన్నిని ఇన్నాళ్లకు ఆమె కుటుంబంతో కలిపినందుకు ఇస్రార్ సంతోషంగా ఉన్నారు.
కానీ, ఈసారీ జూన్ 30న తన పుట్టినరోజును అచ్ఛన్ పిన్ని లేకుండానే జరుపుకోవాలనే బాధ అతడి కళ్లలో కనిపించింది.
ఇవి కూడా చదవండి
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- చైనా నుంచి 70 శాతం బల్క్ డ్రగ్స్ దిగుమతి చేసుకోకుండా భారత్ ఉండగలదా?
- రష్యా అధ్యక్షుడిగా పుతిన్ జీవితాంతం ఉండిపోతారా? రిఫరెండం ఉద్దేశం ఏమిటి?
- ‘చైనాతో భారత్‌కు ముప్పు.. రంగంలోకి అమెరికా సైన్యం’ - మైక్ పాంపియో
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- గల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణపై ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవీ...
- భారత్, చైనా చర్చలు: బలగాల ఉపసంహరణకు అంగీకారం
- భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








