భారత్-చైనా ఉద్రిక్తతలపై అమెరికా: ‘చైనాతో భారత్‌కు ముప్పు.. రంగంలోకి అమెరికా సైన్యం’ - మైక్ పాంపియో

ఫొటో సోర్స్, Getty Images
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను అమెరికా ఎలా చూస్తోందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందనలు ఇప్పటివరకూ భారత్‌ను సంతృప్తిపరిచే స్థాయిలో లేవు. కానీ గురువారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తోపాటు ఆగ్నేయాసియాలో చైనా ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో.. ఐరోపా నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు బ్రసెల్స్ ఫోరమ్ 2020 వేదికగా ఆయన చెప్పారు. జర్మనీలోని తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఐరోపా సమాఖ్య అసంతృప్తి వ్యక్తంచేసింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ వల్ల భారత్‌తోపాటు వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌కూ ముప్పుందని మైక్ పాంపియో వ్యాఖ్యానించారు.
"చైనా ముప్పుకు అడ్డుకట్ట వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. చైనా ముప్పును సవాల్‌గా పరిగణిస్తున్నాం. దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను సిద్ధంచేస్తున్నాం."

ఫొటో సోర్స్, Getty Images
చైనా ముప్పు
చైనాతో పొరుగునున్న దేశాలకు ముప్పు పొంచివుందని, అన్ని అంశాలనూ అమెరికా జాగ్రత్తగా గమనిస్తోందని పాంపియో వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఐరోపా సమాఖ్య ప్రతినిధులతోనూ చర్చించినట్లు చెప్పారు. చైనా ఆర్థిక విధానాలనూ ఆయన బహిరంగంగా విమర్శించారు.
చైనా ముప్పులన్నింటికీ సంయుక్తంగా చెక్‌పెట్టేందుకు ట్రాన్స్-అట్లాంటిక్ సంకీర్ణం అవసరమని అన్నారు.
చైనా ముప్పులపై అమెరికా, ఐరోపా సమాఖ్య కలిసి పనిచేయాల్సిన అవసరముందని, అప్పుడే ఈ ముప్పులపై గట్టి చర్యలు తీసుకోగలమని వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా విషయంలో ఐరోపా చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
చైనా టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ హువావే కూడా చైనా సర్వైలెన్స్ స్టేట్‌లో భాగమా? అని ప్రశ్నించగా.. "హువావే ప్రధాన కార్యాలయంలో చైనా భద్రతా సిబ్బంది పనిచేస్తున్నారు. చైనా చట్టాల ప్రకారం.. వ్యక్తిగత సమాచారం సహా డేటా మొత్తాన్ని చైనా ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది." అని పాంపియో వివరించారు. ఈ విషయానికి సంబంధించి తమకు చాలా ఆధారాలు లభించాయని, వాటిపై బహిరంగంగా మాట్లాడలేనని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐరోపాలో అమెరికా బలగాలను ఎందుకు తగ్గిస్తోంది?
జర్మనీలో అమెరికా తమ బలగాల సంఖ్యను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తోంది. ఈ విషయంపై పాంపియో మాట్లాడారు.
"కొన్ని ప్రాంతాల్లో అమెరికా బలగాల సంఖ్యను తగ్గిస్తున్నాం. ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరిని మోహరిస్తాం. నేను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాతో పొంచివున్న ముప్పు గురించి మాట్లాడుతున్నా. అక్కడ భారత్‌కు ముప్పుంది. వియాత్నాంకు ముప్పుంది. మరోవైపు మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాలకూ ముప్పు పెరుగుతోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది సిబ్బందిని మోహరించాల్సిన అవసరముంది. దీనిపై భాగస్వామ్య దేశాలతో మాట్లాడుతున్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నాం" అని ఆయన అన్నారు.
అయితే, ఐరోపాలో బలగాలను తగ్గించడంపై ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ చర్యల వల్ల ఐరోపాలో రష్యా ముప్పు పెరుగుతుందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఈ వాదనను పాంపియో కొట్టిపారేశారు. పరిస్థితులను ఎప్పుడో సమీక్షించి ఉండాల్సిందని ఆయన అన్నారు.
"బలగాల మోహరింపులపై నిర్ణయాలను వివిధ సందర్భాలకు అనుగుణంగా ఎప్పుడో తీసుకున్నాం. వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా వీటిని సమీక్షించాల్సిందేగా? ముఖ్యంగా ముప్పులతోపాటు వాటి తీవ్రతనూ పరిగణలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగానే భద్రతా సిబ్బందిని మోహరించాలి. అది నిఘా సిబ్బందే కావొచ్చు లేదా మరే భద్రతా సిబ్బందైనా కావొచ్చు."

ఫొటో సోర్స్, US ARMY
భారత్‌దే బాధ్యత: చైనా
మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే బాధ్యత భారత్‌దేనని దిల్లీలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ వ్యాఖ్యానించారు. పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
"విభేదాలను పరిష్కరించుకునే సామర్థ్యం భారత్-చైనాలకు ఉంది. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు పెరగకుండా చూసే బాధ్యత భారత్‌పైనే ఉంది." అని వీడాంగ్ అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు.
ఆరు వారాలుగా లద్దాఖ్‌లోని భారత్, చైనా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యాలూ ఢీ అంటే ఢీ అని ఎదురుపడిన సంగతి తెలిసిందే. జూన్ 15న గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత్ సైనికులు అమరులయ్యారు.
రెండు దేశాలూ ఒకరికొకరు గౌరవించుకుంటూ, సహకరించుకుంటూ ముందుకు వెళ్లడడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుందని వీడాంగ్ అన్నారు.
"చైనా, భారత్.. రెండూ అభివృద్ధి చెందుతున్న దేశాలే. 100 కోట్లకుపైగా జనాభాతో రెండు దేశాలూ ఆర్థిక రంగంలో వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల విషయానికి వస్తే.. భారతే వాటిని తగ్గించాలి. భారత్ సైన్యం.. వాస్తవాధీన రేఖను దాటివచ్చి చైనా సైన్యంపై దాడి చేసింది. సరిహద్దు ఒప్పందాలను భారత సైన్యం ఉల్లంఘించింది." అని వీడాంగ్ వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఉద్రిక్తతలకు కారణం చైనానే అని భారత్ విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. చైనా సైన్యం ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించి భారత్ భూభాగంలోకి ప్రవేశించిందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఫొటో సోర్స్, Getty Images








