చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి ఎలాగైనా పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్‌ మెడకు చుట్టుకుంది...

పాకిస్తాన్ చైనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మారియా ఎలీనా నవాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా ‘వన్ బెల్ట్, వన్ రోడ్‌’ను చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తారు. దీన్నే ‘న్యూ సిల్క్ రోడ్’ అని కూడా పిలుస్తారు.

2013లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. దీని కింద తూర్పు ఆసియా నుంచి యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల వరకూ అనేక దేశాలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టి విస్తృత ప్రాజెక్టుల శ్రేణిని అభివృద్ధి చేయాల్సి ఉంది.

చైనా అంతర్జాతీయ సహకారం, ఆర్థికవ్యవస్థ దిశగా ఇది అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రూపొందించిన ప్రధాన వ్యూహం. కానీ విమర్శకులు అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావం పెంచుకోడానికే చైనా రుణాలు ఇచ్చే తమ వ్యూహాన్ని ఉపయోగిస్తోందని వారు భావిస్తున్నారు.

కానీ, ఉత్పత్తి, మూలధనం, టెక్నాలజీ ప్రవాహం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఆ ప్రాజెక్టు కరోనా మహమ్మారి వల్ల హఠాత్తుగా ఆగిపోయింది.

చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్న చాల దేశాలు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. వీటిలో చాలా దేశాలు తాము అప్పులు చెల్లించే పరిస్థితిలో లేమని చైనాకు ఖరాఖండీగా చెప్పేశాయి.

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిష్టాత్మక ‘న్యూ సిల్క్ రోడ్’ ప్రాజెక్టుకు ఇది అంతమా. లేక ఈ కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థతోపాటూ చైనా కూడా దాటేయగలిగే ఒక అడ్డంకి మాత్రమేనా?

చైనా

ఫొటో సోర్స్, Getty

వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్ట్

2013లో చైనా వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, యూరప్, లాటిన్ అమెరికాలోని 138 దేశాలకు పవర్ ప్లాంట్స్, గ్యాస్ పైప్ లైన్లు, రేవులు, విమానాశ్రయాలు నిర్మాణం, రైల్వే లైన్ల పేరుతో వందల కోట్ల రుణాలు ఇస్తామని మాట ఇచ్చింది.

అయితే చైనా ఇప్పటివరకూ ఈ న్యూ సిల్క్ రోడ్ ప్రాజెక్టుపై వచ్చే వ్యయం గురించి ఎప్పుడూ పూర్తి సమాచారం అందించలేదు.

కానీ అమెరికా కన్సల్టెన్సీ ఫర్మ్ ‘ఆర్‌డబ్ల్యుఆర్ అడ్వైజర్’ వివరాల ప్రకారం చైనా ‘వన్ బెల్ట్, వన్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యే దేశాలకు 461 బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది. వీటిలో ఎక్కువగా అమెరికా దేశాలే ఉన్నాయి. వాటిని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన దేశాలుగా చెబుతారు.

బీబీసీ చైనా సేవల ఎడిటర్ హోవర్డ్ ఝాంగ్ “మొదటి నుంచీ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చైనాలో అన్నివైపుల నుంచీ విమర్శలు వస్తున్నాయి. నిజానికి చైనాలో అధికారంలో ఉన్న పాలకుల్లో ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి ఏకాభిప్రాయం లేదు. చాలామంది షీ జిన్‌పింగ్ రాజకీయ భాగస్వామ్యంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కొంతమంది ఇది అనవసరం అని కూడా అంటున్నారు” అని చెప్పారు.

పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా కూడా ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రాజెక్టును విమర్శిస్తోంది. చైనా రుణాలు ఇచ్చే తమ దూకుడు వ్యూహంతో బలహీన దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని చెప్పింది.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

సంకట స్థితిలో చైనా

కానీ, నాణేనికి ఎప్పుడూ రెండు ముఖాలు ఉంటాయి.

యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఎస్ఓఎఎస్( స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్) చైనా ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్ లారెన్ జాన్‌స్టన్ న్యూ సిల్క్ రోడ్‌లో భాగంగా జరిగిన ఎక్కువ ఒప్పందాల వల్ల రెండు పక్షాలకూ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు.

“తమ యువత అభివృద్ధి కోసం కొత్త ప్రాజెక్టులు అవసరమైన ప్రభుత్వాలు లేదా వాటి కోసం నిధులు కావాలని కోరుకునే ప్రభుత్వాలు చైనా నుంచి అప్పు తీసుకుని, దానిని ఖర్చు చేస్తూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాల కోసమే వారు చైనా ముందు వంగుతున్నారు. ఎందుకంటే ఒక పేద దేశం, వేరే ఏ విధంగా పేదరికం నుంచి బయటపడగలదు” అన్నారు.

ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి వల్ల పాకిస్తాన్, కిర్గిస్తాన్, శ్రీలంక సహా చాలా ఆఫ్రికా దేశాలు ఈ ఏడాది రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని చైనాకు చెప్పేశాయని వార్తలు వస్తున్నాయి.

రుణ షరతులు మార్చాలని, వాయిదాల చెల్లింపులకు సమయం ఇవ్వాలని, లేదా రుణాలు మాఫీ చేయాలని అవి చైనాను కోరాయి.

ఈ పరిస్థితి చైనాను సంకట స్థితిలోకి నెట్టింది. అది ఇప్పుడు రుణ షరతులను మారిస్తే, లేదా రుణం మాఫీ చేస్తే, దానివల్ల ఆ దేశ ఆర్థికవ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది. దాంతో మహమ్మారి వల్ల ఆర్థికంగా నష్టపోయిన చైనాలో ప్రజల వైపు నుంచి ప్రతికూల స్పందన వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు అప్పులు చెల్లించాలని చైనా ఆ దేశాలపై ఒత్తిడి తెస్తే, అది అంతర్జాతీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ముఖ్యంగా మొదటి నుంచీ ‘న్యూ సిల్క్ రోడ్’ ప్రాజెక్టును ‘రుణాల సాలెగూడు’గా వర్ణిస్తున్న వర్గం నుంచే ఎక్కువగా వస్తాయి.

వన్ బెల్ట్ వన్ రోడ్ - చైనా కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty

అనిశ్చితి వాతావరణం

ఇదే ఏడాది ఏప్రిల్‌లో జీ-20 దేశాల సమూహం 73 దేశాలకు రుణాలు చెల్లించేందుకు 2020 చివరి వరకూ ఉపశమనం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ గ్రూప్-20 దేశాల్లో చైనా భాగం.

కానీ, దీనితోపాటూ రుణాల చెల్లింపులకు ఇచ్చిన ఆ గడువు ముగిసిన తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ దేశాలకు లోన్ డిఫాల్టర్స్ లాంటి పరిస్థితి ఎదురవుతుందా, దానిని ఇప్పుడు తోసిపుచ్చలేం.

“ఒక దేశం ఆర్థిక స్థితి ఎలా ఉంది, వాటి దగ్గర ఎన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి అనేది తెలీదు. రుణాలు చెల్లించడం ఆ దేశాలకు ఎంత సులభం అని నేను చెప్పను. కానీ ఇప్పుడు ఎంత అనిశ్చితి వాతావరణం ఉందంటే, దానిని బట్టి ఏడు నెలల తర్వాత, అసలు ఏమవుతుందో చెప్పడం చాలా ప్రమాదకరమే అవుతుంది” అని లారెన్ జాన్‌స్టన్ అన్నారు.

చైనా ఈ రుణాలను మాఫీ చేస్తుందని లారెన్ భావించడం లేదు. “దానం చేయడం చైనా సంస్కృతిలో భాగం కాదని” ఆమె చెప్పారు.

కానీ ఒక చైనా ప్రభుత్వ సలహాదారు పేరు బయటపెట్టద్దనే షరతుతో ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో మాట్లాడారు. “మేం రుణాల వడ్డీ చెల్లింపుల నుంచి ఉపశమనం అందించానే ప్రత్యామ్నాయం ఎంచుకోబోతున్నాం. కొన్ని దేశాలకు ఇచ్చిన రుణాల షరతుల్లో మార్పులకు కూడా అనుమతించవచ్చు” అన్నారు.

“శాశ్వతంగా రుణం మాఫీ చేయడం అనేది చివరి ప్రత్యామ్నాయం” అని కూడా ఆయన ఆ పత్రికకు చెప్పారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాతో ట్రేడ్ వార్

చైనా గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. వుహాన్ నుంచి మొదలైన కరోనా మహమ్మారికి ఆ దేశం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చైనా ఆ మహమ్మారిని సరిగా హాండిల్ చేయలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి చైనా ట్రేడ్ వార్ బెదిరింపుల ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఇది ‌పెద్ద షాక్ కావచ్చని బీబీసీ చైనా సేవల ఎడిటర్ హోవార్డ్ ఝాంగ్ భావిస్తున్నారు.

“ముఖ్యమైన విషయం ఏంటంటే ‘న్యూ సిల్క్ రోడ్‌’కు సంబంధించిన దేశాలకు ఇచ్చిన అప్పులు ఎక్కువగా అమెరికా డాలర్లలో ఉన్నాయి. అమెరికాతో ట్రేడ్ వార్‌లో ఉన్న చైనాకు డాలర్ల కొరత ఎదురయ్యే అవకాశం ఉంది. దానికి చైనాకు చాలా తక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు రుణాలు చెల్లించకపోతే, షీ జిన్‌పింగ్ ప్రభుత్వం చాలా బలహీన పడవచ్చు” అని హోవర్డ్ ఝాంగ్ అంటారు.

కానీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తన ముఖ్యమైన ఆర్థిక, రాజకీయ విజయంగా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఈ ప్రాజెక్టును పక్కన పెడుతున్నారు అనడానికి అవకాశాలు తక్కువే ఉన్నాయి.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

వ్యూహంలో మార్పులు

ఈ ప్రాజెక్టు కింద ఇచ్చిన రుణాల షరతుల్లో పారదర్శత లేకపోవడం, వాస్తవ ప్రయోజనాల గురించి చెప్పకపోవడం వల్ల చైనా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

అందుకే, 2019లో షీ జిన్‌పింగ్ కొత్త రూపురేఖలతో ‘న్యూ సిల్క్ రోడ్’ ప్రాజెక్ట్ ప్రకటించారు. అందులో ఆయన మరింత పారదర్శకత గురించి హామీ ఇచ్చారు. ఇకమీదట ప్రాజెక్టు కాంట్రాక్టులు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిర్ణయిస్తామని చెప్పారు.

కరోనా మహమ్మారి వల్ల వీటిలో చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఎందుకంటే చాల దేశాల్లో లాక్‌డౌన్, క్వారంటీన్ మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో రాబోవు నెలల్లో చైనా తన పెట్టుబడులను సమర్థించుకునేందుకు అనువుగా బహుశా ఈ ప్రాజెక్టుల ఫలితాలు రాకపోవచ్చు.

అయితే, అంతమాత్రాన న్యూ సిల్క్ రోడ్ తన అంతం దిశగా వెళ్తోందని కూడా అనలేం.

“మహమ్మారి వల్ల చైనా తన వ్యూహాన్ని మార్చవచ్చు. ఎక్కువ విజయవంతం అయిన ప్రాజెక్టులపై తమ ఫోకస్ పెంచవచ్చు” అని బీబీసీ చైనా సేవల ఎడిటర్ హోవర్డ్ ఝాంగ్ చెప్పారు.

“దాని సంకేతాలు మొదటి నుంచే కనిపిస్తున్నాయి. చైనా కొన్ని ప్రాజెక్టుల నుంచి మెల్లమెల్లగా అడుగు వెనక్కు తీసుకుంటోంది. కొన్ని మంచి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది” అని ఆయన చెపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)