కేసీఆర్ హాలియా సభపై గిరిజనులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు?

కేసీఆర్
ఫొటో క్యాప్షన్, హాలియా సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
    • రచయిత, జింకా నాగరాజు
    • హోదా, బీబీసీ కోసం

హాలియా అనేది నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఒక చిన్న మునిసిపాలిటి. అయితే తెలంగాణ రాజకీయాల్లో హాలియాకు ఒక విశిష్టమైన గౌరవం దక్కింది.

ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ పట్టణాన్ని ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా మూడుసార్లు సందర్శించారు. ఇలాంటి గౌరవం ఆయన సొంత నియోజకవర్గం బయట మరొక ఏ చిన్న ఊరికి లభించి ఉండదు.

ఇవాళ (ఆగస్టు 2) మధ్యాహ్నం ఆయన హాలియాలో 'నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రగతి సమీక్షా సమావేశం' నిర్వహించారు. ఇది కూడా హాలియాకు దక్కిన అరుదైన గౌరవం.

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిచాక ముఖ్యమంత్రి స్వయంగా నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల హామీల అమలును సమీక్షించడం గతంలో ఎపుడూ జరగలేదు.

కరతాళ ధ్వనుల మధ్య, ఈలల మధ్య, జిందాబాద్ నినాదాల మధ్య జరిగిన ఈ సమావేశం విశేషం ఏంటంటే, మరికొన్ని హామీలు ఇవ్వడం, ఇచ్చిన హామీలను తొందర్లోనే నెరవేరుస్తానని మరొక హామీ ఇవ్వడం.

ముఖ్యమంత్రి మూడో యాత్ర హాలియా ప్రజలకు సంతోషాన్నిచ్చి ఉండవచ్చు. కానీ ఆయన హాలియా సమావేశం తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనులను నిరుత్సాహ పరిచింది.

చాలా మంది గిరిజన నేతలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షపార్టీల నాయకులు హాలియాలో ముఖ్యమంత్రి చేస్తున్న ఉపన్యాసం లైవ్‌ను చూసి నిరాశ చెందారు.

నేను ఫోన్ చేసిన గిరిజన నేతలంతా కేసీఆర్ లైవ్ చూస్తున్నామనే చెప్పారు. సమావేశం తర్వాత మాట్లాడదామన్నారు.

కేసీఆర్
ఫొటో క్యాప్షన్, హాలియా సభలో కేసీఆర్

ముఖ్యమంత్రి సమావేశంపై ఎందుకంత ఆసక్తి?

2021 ఏప్రిల్ 14న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మూడు రోజుల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి హాలియాను సందర్శించారు. (మొదటిసారి ఫిబ్రవరిలో సందర్శించారు.) అప్పుడాయన ఒక హామీ ఇచ్చారు.

"రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించబోతున్నాను. తొందర్లో అధికారులందరిని వెంటేసుకుని వచ్చి, రెండు రోజులు ఈ ఊర్లోనే కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను. పోడు సమస్య రాష్ట్రమంతా ఉంది. నాగార్జున సాగర్‌లో కూడా ఉంది. అందుకే ఇక పరిష్కరించాలనుకున్నాను. దీనికోసం ప్రజాదర్భార్‌ పెట్టి నేను స్వయంగా పరిష్కరిస్తాను" అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఆ హామీ ఇచ్చి మూడు నెలలు గడిచింది. ప్రజాదర్భార్ జరగలేదు. ముఖ్యమంత్రి రాలేదు. ఆఫీసర్లూ రాలేదు. పోడు భూముల సమస్య అలాగే మూలుగుతూ ఉంది.

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఉద్యోగం వస్తుందా.. రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?

మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్ ఎన్నికల్లో గెలిచారు. ఈ రోజు ముఖ్యమంత్రికి ఆయన విజయోత్సవ విందు కూడా ఇచ్చారు.

ఈ రోజు సమావేశంలో గిరిజన భూ హక్కుల మీద కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేస్తారేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కాకపోతే ఆయన మరొక హామీ ఇచ్చారు.

"కేంద్ర చట్టం ప్రకారం, 2005కు ముందు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ తొందర్లోనే భూహక్కుల పత్రాలిస్తాం. ఈ సమస్య పరిష్కారానికి తొందర్లోనే శ్రీకారం చూడతాం" అని మరొక హామీ ఇచ్చారు.

దీనితో పాటు ఈసారి గిరిజనులకు మరొక హామీ జోడించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బంజారా గిరిజనులెక్కువ. అందువల్ల హాలియాలో బంజారాభవన్ కడతామని చెప్పారు.

ఆల్ ఇండియా ST ఫెడరేషన్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్
ఫొటో క్యాప్షన్, ఆల్ ఇండియా ఎస్టీ ఫెడరేషన్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్

'40 వేల ఓట్ల కోసమే హామీ'

ముఖ్యమంత్రి లైవ్‌ చూసి నిరాశ చెందిన వాళ్లలో బెల్లయ్య నాయక్ ఒకరు. ఆయన ఆల్‌ఇండియా ఎస్టీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు.

"ఇది నయవంచన. ఎన్నికల ముందు ఒక మాట. ఎన్నికలైన తర్వాత మరొక మాట మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదు. 30, 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న వారి నుంచి భూములు లాక్కున్నారు. అవేవి పోడు భూములు కాదు. అన్నీ సాగు భూములే. ఈ భూములకు హక్కుల పత్రాలివ్వకుండా లాక్కోవడంతో తెలంగాణలో చాలామంది గిరిజనులు ఉపాధి కోల్పోయారు.

నాగార్జున సాగర్‌లో ఇలాంటి భూములు పదివేల ఎకరాల దాకా ఉన్నాయి. భూములు పోవడంతో ఈ సీజన్‌లో గిరిజనులెవరూ పంట వేసుకోలేక పోతున్నారు. ముఖ్యమంత్రి 2005కు ముందు సాగుచేసుకుంటున్న భూములకు హక్కుల పత్రాలిస్తామంటున్నారు. అక్కడేమో అటవీ శాఖ అధికారులు గిరిజనులను సొంత భూముల్లోకే రానీయడం లేదు" అని బెల్లయ్య నాయక్ అన్నారు.

అటవీ భూములను అక్రమించుకున్నారనే పేరుతో, పోడు వ్యవసాయం చేస్తున్నారనే ఆరోపణతో తెలంగాణలో గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు అటవీ భూములంటూ అసైన్డు భూములను కూడా లాక్కుంటున్నారని, 1976 నుంచి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను కూడా లాక్కున్నారని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గిరిజనుల ఓట్ల కోసమే పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని చెప్పారని బెల్లయ్య ఆరోపించారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కృష్ణ పట్టి బెల్ట్ అనే ప్రాంతం ఉంది. ఇది గిరిజన ప్రాంతం. అక్కడ సుమారు 40 వేల మంది ఓటర్లున్నారని ఒక అంచనా. ఈ ఓట్ల కోసం గిరిజన భూమి హక్కుల ప్రతాలిస్తానని ముఖ్యమంత్రి ఆశపెట్టి ఓట్లు కాజేశారని బెల్లయ్య విమర్శించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

గిరిజనుల మీద రాజకీయాస్త్రం?

జూన్, జులై నెలల్లో తెలంగాణ గిరిజన ప్రాంతాలు ఉద్రిక్తంగా ఉంటాయి. ఈ నెలల్లో వర్షాలకు కురుస్తాయి కాబట్టి గిరిజనులంతా విత్తనాలు చల్లుకునేందుకు భూముల్లోకివస్తారు. వాళ్లని రానీయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటారు. ఆ భూముల్లో హరితహారం పథకం కింద చెట్లు నాటుతారు.

20 నుంచి 40 సంవత్సరాలుగా సేద్యం చేసుకుని,అక్కడ పండే పంటతో జీవిస్తున్న గిరిజనులను తరిమేస్తున్నారు. ఈ నిశబ్ద ఉద్రిక్తత దగ్గరికెళితేనే కనిపిస్తుంది.

సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో నేను పర్యటించి, అటవీ అధికారులు లాక్కున్న భూములను పరిశీలించాను. అక్కడ అటవీ శాఖ అధికారులు తరిమేసిన వాళ్లంతా 20 నుంచి 30 ఏళ్లుగా ఆ భూముల్లో సాగు చేస్తున్నారు.

ఆ మధ్య అధికారులే ఈ భూములన్నీ లాగేసుకుని, కంచె ఏర్పాటు చేశారు. 2019లో సర్సాల ఘర్షణ జరిగింది కూడా జూన్‌లోనే. అక్కడ అటవీ శాఖ అధికారుల మీద గిరిజనులు దాడి చేసినట్లు వార్తలొచ్చాయి.

ఒక అధికారి మీద జరిగిన దాడిని చూపే ఒక వీడియో వైరలయ్యింది.

'అక్కడ జరిగింది వేరు. వైరలయిన వీడియోలో చూపిందొకటి. తెలంగాణలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య జరిగే ఘర్షణలను స్థానిక విలేఖరులెవరూ రాయడానికి వీల్లేదు. అధికారులు చెప్పిన వార్తలే రాయాలి. సర్సాల వీడియో అలా అధికారులు తెలివిగా ఎంపిక చేసిన ఒక క్లిప్ మాత్రమే. దానిని పై స్థాయిలో నుంచి ప్రతికలకు లీక్ చేశారు' అని అక్కడున్న విలేఖరులంతా వివరించి చెప్పారు.

ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా ఇలాంటి దాడే గత నెల మధ్యలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో జరిగింది. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను లాక్కుని, వాటిలోకి ప్రవేశించకుండా అటవీ అధికారులు అడ్డుకోవడంతో గిరిజనులు అధికారి మీద దాడి చేశారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది.

ఇలాంటి ఘర్షణలు అన్ని జిల్లాల గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జూన్, జులై నెలల్లోనే ఎక్కువగా జరుగుతాయి.

tudum debba రాష్ట్ర అధ్యక్షుడు vattam Upender
ఫొటో క్యాప్షన్, 'తుడుం దెబ్బ' రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్

అలాంటి వార్తలు రాయకుండా గ్రామీణ విలేఖరుల మీద కట్టుదిట్టమైన నిఘా ఉందని గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ 'తుడుం దెబ్బ' రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ చెప్పారు. అందుకే గిరిజనుల జీవన పోరాట వార్త ఏ పత్రికలో రాదు అని ఆయన చెప్పారు.

భూములు కోల్పోతున్న గిరిజనులను తాము కలవకుండా ఇంటెలిజన్స్ అధికారులు, పోలీసులు తమపై నిఘాపెట్టారని, తమ కదలికల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచారని ఆయన చెప్పారు. భూములను ఎంత తెలివిగా అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్నారో ఉపేందర్ వివరించారు.

"తొలకరి పడగానే గింజలు చల్లుకునేందుకు గిరిజనులు తమ భూముల్లోకి వెళ్తారు. అప్పుడే హరితహారం మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు మందీ మార్భలంతో వస్తారు. ఎప్పుడూ అధికారులదే పై చేయి అవుతుంది. అలా రెండు మూడు సంవత్సరాలు గిరిజనులను తరిమివేస్తే, మొక్కలు పెద్దవి అవుతాయి. అపుడు ఇదంతా అడవి అని చెప్పి గిరిజనులను శాశ్వతంగా తరిమేయవచ్చు.

కొన్నిచోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అటవీ హక్కుల పత్రాలను కూడా ఫారెస్టు అధికారులు లాక్కుంటున్నారు. వాటిలో ఉన్న ఐటీడీఎ ప్రాజక్టు ఆఫీసర్ సంతకం చెల్లదు, డీఎఫ్ఓ సంతకం ఉండాలని దబాయిస్తారు. అది ఫేక్ పత్రం అని లాక్కుంటున్నారు అని ఉపేందర్ చెప్పారు.

ఇలా రాష్ట్రమంతా కొన్ని లక్షల మంది గిరిజనులను భూముల నుంచి తరిమేస్తున్నారు. 2005 కంటే ముందు సాగుచేసుకుంటున్న భూములకు హక్కుల పత్రాలను ఇవ్వాలని చట్టం ఉన్నా అమలుచేయడం లేదు. కనీసం సర్వే కూడా చేయడం లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఒక్క గిరిజనుడికి కూడా అటవీ హక్కులు పత్రాలు ఇవ్వలేదు. నిజానికి ఉన్నవే చాలా చోట్ల లాక్కుంటున్నారు" అని ఉపేందర్ చెప్పారు.

దీనికి కారణం మొక్కల పెంపకం సాకుగా చూపి, పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి భారీ ఆర్థిక సాయం పొందాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని, అడవులు పెరిగినట్లు చూపాలంటే గిరిజనుల సాగులో ఉన్న భూములను లాక్కుని చెట్లు నాటమేనని మార్గమని ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు.

Jagan Lal Naik TCong ST Cell President
ఫొటో క్యాప్షన్, తెలంగాణ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్

తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది గిరిజన కుటుంబాలకు అటవీ భూముల హక్కుల పత్రాలు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇలా వేలాది ఎకరాలు పంచారని గిరిజన నేతలు చెబుతున్నారు.

ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న వారికి పత్రాలు ఇవ్వడమే కాదు, తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆంధ్రాలో పిలుపునిచ్చారు.

తెలంగాణలో హక్కుల పత్రాలివ్వడం అనేది ఎన్నికల హామీగా వినిపిస్తోంది తప్ప అమలు వూసే లేదు. దీనికి కారణం రైతు బంధు పథకమేనని తెలంగాణ కాంగ్రెస్ గిరిజన విభాగం ఛైర్మన్ జగన్‌లాల్ నాయక్ అంటున్నారు.

గిరిజనులకు భూమి హక్కుల పత్రాలు ఇస్తే వాళ్లందరికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి. రైతుబంధు పథకం కింది సీజన్‌కు ఎకరానికి రూ. 5 వేలు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇవ్వాలి. అంటే ఏడాదికి పది వేలు. ఇలా గిరిజనులకు రాష్ట్రమంతా లక్ష ఎకరాలు పంపిణీ చేసినా ఏడాది వంద కోట్ల భారం పడుతుంది.

దీనిని తప్పించుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఏదో ఒకటి చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారని జగన్ లాల్ నాయక్ అన్నారు.

ఈ విషయం మీద పోరాటం చేసేందుకు ఆగస్టు 8న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాను కాంగ్రెస్ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.

గిరిజనులకు ఏవైనా హక్కులు కల్పించారంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగిందని, గత ఏడేళ్లలో తెలంగాణలో జరుగుతున్నది హక్కులను హరించడమేనని ఈ నేతలంతా చెప్పారు.

జిల్లాల్లో పర్యటించి, అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ప్రకటిస్తే, అటువైపు అధికారులు మాత్రం గిరిజనులను బెదిరించి, కేసులు పెట్టి, భూములను లాక్కుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)