కోవిడ్ వ్యాక్సీన్‌ను మాత్రల రూపంలో తీసుకోవచ్చా?

మాత్ర వేసుకొంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మ్యాడీ సావేజ్
    • హోదా, బీబీసీ న్యూస్, స్టాక్​హోమ్

ప్రస్తుతం కోవిడ్​ వ్యాక్సీన్ సూది మందు రూపంలో అందుబాటులో ఉంది. కానీ, భవిష్యత్తులో ఈ వ్యాక్సీన్లు ఇన్​హేలర్ లేదా మాత్రల రూపంలో లభ్యమయ్యే అవకాశం ఉంది.

దక్షిణ స్వీడన్​లోని అతి పెద్ద సైన్స్​ పార్కుల్లో ఒకటైన మెడికాన్​ విలేజ్‌లోని ఓ ప్రయోగశాలలో ఇన్‌హేలర్‌ తయారీపై అధ్యయనం జరుగుతోంది.

ఈ ప్లాస్టిక్ ఇన్​హేలర్​ అగ్గిపెట్టెలో సగం ఉంటుందని కెమిస్ట్ ఇంజెమో అండర్​సన్​ పేర్కొన్నారు.

కోవిడ్ ఇన్‌హేలర్

'క్షణాల్లో వ్యాక్సీన్ ఇన్‌హేలర్ రెడీ'

ఈ చిన్న ఇన్‌హేలర్‌ కరోనావైరస్​పై పోరాటంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆమె టీమ్​ బలంగా నమ్ముతోంది. దీని ద్వారా భవిష్యత్​లో పౌడర్ రూపంలో వ్యాక్సీన్​ను ప్రజలు ఇళ్ల వద్దనే తీసుకోవచ్చు.

'అది సులువే. తయారీకి కూడా తక్కువ ఖర్చు అవుతుంది' అని ఐకోనోవో కంపెనీ సీఈవో జోహాన్​ వాబర్గ్ వెల్లడించారు. మామూలుగా ఈ కంపెనీ ఆస్థమా రోగులకు ఇన్​హేలర్లను​ తయారు చేస్తుంటుంది.

'చిన్న ప్లాస్టిక్ స్లిప్​ను తీసేస్తే, వ్యాక్సీన్ ఇన్​హేలర్ రెడీ అవుతుంది. దాన్ని నోట్లో పెట్టుకుని, గట్టిగా ఊపిరి తీసుకుని, లోపలికి పీల్చాలి' అని వివరించారు.

కోవిడ్​-19కి వ్యాక్సీన్​ను పౌడర్​ రూపంలో తయారు చేసిన కంపెనీ ఐఎస్​ఆర్​. ఇదొక ఇమ్యూనాలజీ రీసెర్చ్ అంకుర సంస్థ. దీన్ని స్టాక్​హోమ్​లో స్థాపించారు. ఇన్​హేలర్ వ్యాక్సీన్​ తయారీకి ఈ కంపెనీతో ఐకోనోవో జట్టు కట్టింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

ద్రవరూప వ్యాక్సీన్లను భద్రపరచడంలో సమస్యలు

ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆమోదించిన ద్రవ రూపంలోని వ్యాక్సీన్లను భద్రపరచడానికి ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాల్సివస్తోంది.

దళసరి గాజు సీసాల్లో ఉంచిన కొన్ని వ్యాక్సీన్లను మైనస్ 70 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఫ్రిడ్జ్​ల్లో ఉంచి తరలిస్తున్నారు. లేకపోతే అవి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. ఈ పరిస్థితినే 'కోల్డ్ చైన్'​ అని పిలుస్తున్నారు.

'పౌడర్ వ్యాక్సీన్​ను కోల్డ్ చైన్ అవసరం లేకుండా సరఫరా చేయొచ్చు. అంతేకాకుండా నిపుణుల అవసరం లేకుండా వ్యాక్సీన్​ను స్వయంగా ప్రజలే తీసుకోవొచ్చు' అని ఐఎస్ఆర్​ వ్యవస్థాపకుడు, స్వీడన్​లో పేరొందిన వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయాల్లో ఒకటైన కరోలిన్​స్కా ఇనిస్టిట్యూట్​లో ఇమ్యూనాలజీ ప్రొఫెసర్​ ఓలా విన్​క్విస్ట్ చెప్పారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగం

ప్రస్తుతం ఈ కంపెనీ వ్యాక్సీన్లను బీటా (దక్షిణాఫ్రికా రకం), ఆల్ఫా (యూకే రకం)లపై పరీక్షిస్తోంది.

ఆఫ్రికా వంటి దేశాల్లోనూ, వేడి వాతావరణం కలిగిన ప్రాంతాల్లోనూ, కరెంటు సమస్యలు ఉన్న ప్రాంతాల్లోనూ టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి పౌడర్ వ్యాక్సీన్ ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ఐఎస్​ఆర్​కు చెందిన ఎయిర్​ డ్రైయిడ్ టీకా పూర్తి శక్తిని తెలుసుకోవడానికి ఇంకా కొన్ని ట్రయల్స్​ నిర్వహించాల్సి ఉంది.

ప్రస్తుతం డబ్యూహెచ్​ఓ ఆమోదం పొందిన వ్యాక్సీన్లతో సమానంగా రక్షణ కల్పిస్తుందా అన్నది కూడా తేలాల్సివుంది.

ఇప్పటివరకూ దీన్ని ఎలుకల మీద మాత్రమే ప్రయోగించారు. వచ్చే రెండు నెలల్లో మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు ఐఎస్​ఆర్​, ఐకోనోవ్ తగినన్ని నిధులను సమకూర్చుకున్నాయి.

కోవిడ్ ఇన్‌హేలర్
ఫొటో క్యాప్షన్, పీటర్సన్

పౌడర్ రూపంలో టీకా సక్సెస్ అయితే...

పౌడర్ రూపంలో ఉన్న టీకా విజయవంతమైతే అది కరోనావైరస్​పై పోరాటంలో కీలక మలుపుగా నిలుస్తుందని వైద్య రంగం భావిస్తోంది.

'సుదూర ప్రాంతాలకు సైకిళ్లు, ఒంటెల మీద కూల్ బాక్సులను తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది' అని 2016 నుంచి 2020 మధ్య యూనిసెఫ్​ గ్లోబల్​కు హెల్త్ చీఫ్​గానూ, ప్రస్తుతం కరోలిన్​స్కాలో గ్లోబల్ ట్రాన్స్​ఫర్మేషన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న స్టీఫాన్ స్వార్ట్లింగ్ పీటర్సన్ పేర్కొన్నారు.

కరెంటు సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాలకు పొడి రూపంలో ఉన్న వ్యాక్సీన్లు సులువుగా చేరుకోగలవు అని వివరించారు.

ప్రపంచంలో చాలా కంపెనీలు పౌడర్ రూపంలోని టీకాలపై ప్రయోగాలు జరుపుతున్నాయి. ఐకోనోవ్ నుంచి కేవలం పదినిమిషాల నడక దూరంలోని మరో అంకుర సంస్థ కూడా సరికొత్త టెక్నాలజీతో పౌడర్‌ రూపంలో వ్యాక్సీన్లను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తోందని పీటర్సన్​ తెలిపారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

జిక్కం అనే కంపెనీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ద్రవరూపంలోని వ్యాక్సీన్లను, వాటి ప్రభావం తగ్గకుండా పొడి రూపంలోకి మార్చే సాంకేతికతపై పరిశోధనలు చేస్తోంది.

పౌడర్ రూపంలోని టీకాలు కార్యరూపం దాల్చితే అభివృద్ధి చెందుతున్న దేశాలు పొడిని ప్యాకెట్లలో వేసి సీల్ చేసుకునే కేంద్రాలను సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. దాంతో వ్యాక్సీన్ తయారీలో చివరి దశ సొంత గడ్డపైనే పూర్తి చేసుకోవొచ్చు.

ఈ టీకా ఇంజెక్షన్​ రూపంలో ఇవ్వడానికి ముందు పౌడర్​ను స్టీరైల్ వాటర్​తో కలపాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, నాజల్ స్ప్రేల దగ్గర నుంచి మాత్రల వరకూ పలు రూపాల్లో టీకాలను అందించేందుకు సాంకేతికత ఉపయోగపడనుందని జిక్కం సీఈవో గోరాన్ కాన్రాడ్సన్​ వెల్లడించారు.

'కానీ అందుకు మరింత పరిశోధన అవసరం' అని ఆయన అభిప్రాయపడ్డారు.

కోవిడ్ ఇన్‌హేలర్
ఫొటో క్యాప్షన్, కన్రాడ్సన్​

'గ్రీనర్' ప్రత్యామ్నాయం

సింగిల్ డోస్ కోవిడ్​ వ్యాక్సీన్లను తయారు చేసిన జాన్సెన్​ కంపెనీకి యూకేలో వినియోగానికి గత నెలలో అనుమతి లభించింది.

ఈ కంపెనీ జిక్కం కంపెనీ టెక్నాలజీ ఆధారంగా పొడిని తయారు చేసేందుకు ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ పరిశోధన కరోనా వైరస్​ను ఉద్దేశించా లేదా ఇతర జబ్బులను నిరోధించడానికా అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

కానీ, సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం... ఈ పరిశోధనతో పంపిణీ, నిర్వహణను సులభతరం చేసే కొత్త టెక్నాలజీని కంపెనీ అన్వేషించబోతోంది.

పొడి రూపంలో వ్యాక్సీన్లను ఉత్పత్తి చేసే టెక్నాలజీలు ఇంజెక్షన్ అంటే భయపడేవారికి వరంగా మారనున్నాయి. అంతేకాకుండా, ఫ్రిడ్జ్​లు, ఫ్రీజర్ల అవసరాన్ని తగ్గిస్తుండటంతో వీటిని పర్యావరణహిత ప్రత్యామ్నాయాలుగా కూడా భావిస్తున్నారు.

వీటితో పాటు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వ్యాక్సీన్​ను తరలించేందుకు వీలవుతుంది.

'అందరూ సురక్షితం అయ్యే వరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాదు' అని కాన్రాడ్సన్​ అభిప్రాయపడ్డారు.

'కరోనావైరస్ ప్రపంచంలోని మరో ప్రాంతంలో ఉన్నంతవరకూ ఏం జరగబోతోందో మనం ఊహించలేం' అని పేర్కొన్నారు.

'ప్రపంచంలోని అన్ని ప్రాంతాల వారికీ వ్యాక్సీన్లను అందించగలిగేలా అందరూ సిద్ధంగా ఉండాలి' అని సెపీ(అంటువ్యాధులపై ముందస్తుగా సన్నద్ధంగా ఉండేలా కొత్త ఆవిష్కరణలకు కృషి చేసే కూటమి) అధికార ప్రతినిధి ఇంగ్రిడ్ క్రోమన్ పేర్కొన్నారు.

పొడి రూపంలోని వ్యాక్సీన్లు ప్రయోగదశలో ఉన్నాయని చెప్పారు. వాటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

'ఇవి విజయవంతమైతే, టీకాలు ఇంకా బాగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా వ్యాక్సీన్ల వృథాతో పాటు పంపిణీకి పెడుతున్న ఖర్చు తగ్గుతుంది' అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)