ప్రెస్ రివ్యూ: 'కేసీఆర్ ఈసారి అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా?'

అమిత్ షా

ఫొటో సోర్స్, AmitShah.Official/fb

జమిలి ఎన్నికలు జరిగితే ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విమర్శించారని 'ఈనాడు' ప్రధాన వార్త రాసింది. ఈ ఎన్నికల వ్యయం రూపంలో ప్రజలపై రూ.వందల కోట్ల భారాన్ని మోపారని అమిత్‌షా అన్నారు.

శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో జరిగిన 'మార్పు కోసం... భాజపా శంఖారావం' బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.

శాసనసభ ఎన్నికల యుద్ధానికి భాజపా సిద్ధమని అమిత్‌షా ప్రకటించారు.

మజ్లిస్‌కు, అసదుద్దీన్‌ ఒవైసీకి భయపడే.. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామనని ప్రకటించారు.

తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ 2014లో హామీని నిలుపుకోకుండా సీఎం పీఠం ఎక్కారనీ, 2018లోనైనా ఆమాట నిలుపుకొంటారా? అని ప్రశ్నించారు.

2010లో చంద్రబాబు ధర్నా చేసినప్పుడు మహారాష్ట్రలో, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని, ఆయనపై కేసు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అమిత్ షా అన్నారు. తనపై కేసు పెట్టిన ఆ పార్టీతోనే ఇప్పుడు చంద్రబాబు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటూ అమిత్ షా విమర్శించారని ఈనాడు కథనం తెలిపింది.

రామ్ దాస్ ఆఠవాలే

ఫొటో సోర్స్, facebook/ramdasathawale

భారత సైన్యం, క్రికెట్ జట్టు ఎంపికలోనూ రిజర్వేషన్ ఉండాలి

'భారత సైన్యంలో రిజర్వేషన్లు ఉండాలి. ఇతర విభాగాల్లోనూ రిజర్వేషన్ల అవసరం ఉంది. భారత క్రికెట్‌ జట్టు ఎంపిక మొదలు ఇతర క్రీడల్లోనూ రిజర్వేషన్లను కల్పిస్తే అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది' అని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది.

శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'బడుగు వర్గాలు చిన్నస్థాయి ఉద్యోగాలు, పనులు చేస్తూ నెలకు రూ.10-15 వేలు సంపాదిస్తున్నారు. అదే భారతీయ సైన్యంలో చేరితే నెల కు రూ.50 వేల జీతం వస్తుంది. సైన్యంలో పనిచేస్తే తొందరగా మరణిస్తారనే అపవాదు ఉంది. అది నిజం కాదు. సైన్యంలో పనిచేయని ఎందరో గుండెపోటుతోనో, మద్యానికి బానిసయ్యో, కేన్సర్‌తోనో, రోడ్డు ప్రమాదాల్లోనో చనిపోతున్నారు. సైన్యంలో చేరితే దృఢంగా ఉంటాం' అని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో పెట్రోల్‌ ధరలపై వెటకారంగా మాట్లాడారు. 'నాకు పెట్రోల్‌ ధరలపై ఆందోళన లేదు. ఎందుకంటే నేను మంత్రిని. నాకు ఉచితంగా పెట్రోల్‌ లభిస్తోంది. నేను మంత్రి పదవిలో లేకుంటే అప్పుడు ధరల గురించి ఆలోచిస్తాను. అయినా సగటు పౌరుడి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం ధరలు తగ్గించాలి' అని అన్నారు.

పాత నోట్లు

ఫొటో సోర్స్, బీబీసీ

నోట్ల రద్దుతో 35 లక్షల ఉద్యోగాలు పోయాయి

నోట్ల రద్దు వల్ల 35 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం (సీఎంఐఈ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహేశ్‌ వ్యాస్‌ తెలిపారని 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా సీఎంఐఈ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంచనా వేసినట్టు మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. దాదాపు లక్షా 72 వేల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.

నోట్ల రద్దు వల్ల యువకులు ఉపాధి కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆయన అన్నారు. నోట్ల రద్దు వల్ల పురుషులకన్నా మహిళలకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు.

2016 నవంబర్‌లో నోట్ల రద్దు జరగగా.. అంతకు ముందు నాలుగు నెలలు, ఆ తర్వాత నాలుగు నెలలు ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా నివేదిక రూపొందించినట్టు వ్యాస్‌ వెల్లడించారు.

నోట్ల రద్దుకు నెల రోజుల ముందుతో పోలిస్తే మరుసటి నెలలో అత్యధికంగా కోటీ 27లక్షల ఉద్యో గాలు ఊడిపోయాయని వ్యాస్‌ తెలిపారు. ఆ తర్వాతి నెలల్లో క్రమంగా మెరుగు పడుతూ ఆసంఖ్య 35 లక్షలకు పరిమితమైనట్టు ఆయన వివరించారని నవతెలంగాణ రాసింది.

నిరుద్యోగం, నిరుద్యోగులు, అభ్యర్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు 'పరీక్ష'

వరుసగా నెలరోజుల పాటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పరీక్షలు ఉండటంతో తెలంగాణకు చెందిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందంటూ 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

తెలంగాణలో 2 నెలల పాటు వరుసగా ఉద్యోగ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పరీక్షలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు.

రైల్వే, గురుకులం, గ్రూప్‌-4, కానిస్టేబుల్‌ పోస్టులకు ఒకే సమయంలో షెడ్యూళ్లు ఉన్నాయి.

ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు)లో గ్రూప్‌ 'డీ'కేటగిరీలో 62,907 ఖాళీలకు ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఇదే సమయంలో ఐబీపీఎస్‌ (బ్యాంకింగ్‌) పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 29, వచ్చే నెల 7వ తేదీన ఐబీపీఎస్‌ పీవో పరీక్షలకు ఇటీవలే షెడ్యూల్‌ విడుదలైంది. దీనికి తోడు యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌), ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌) పరీక్షలు కూడా సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 10 వరకు వేర్వేరు తేదీల్లో ఉన్నాయి.

ఇక, రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో దాదాపు 3 వేల ఖాళీలకు ఈనెల 26 నుంచి వచ్చే నెల 14 వరకు పీజీటీ, టీజీటీ అర్హత పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 30న కానిస్టేబుల్‌ పరీక్ష, వచ్చే నెల 7న గ్రూప్‌-4తో పాటు ఏఏఓ, ఎఎస్‌ఓ, డీపీఏ, బిల్‌ కలెక్టర్, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షలున్నాయి.

ఇలా నెల రోజులు వరుసగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలూ ఉండటంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

కాబట్టి గురుకుల పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయాలంటే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. దీంతో పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

తేదీల మార్పు కోసం శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ నియామకాల బోర్డు కార్యాలయం ఎదుట పలువురు అభ్యర్థులు ధర్నా నిర్వహించారని 'సాక్షి' తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)