యుగాండా: ప్రపంచంలోనే ‘అత్యంత చురుకైన దేశం’

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం, యుగాండా ప్రపంచంలోనే 'అత్యంత చురుకైన దేశం'. దీనికి కారణం ఏమిటి?
34 ఏళ్ల జెన్నిఫర్ నములెంబ్వా రోజూ గంటన్నర పాటు నడిచి పనికి వెళతారు. యుగాండా రాజధాని కంపాలాకు ఆగ్నేయంలో ఉన్న నమువాంగో నుంచి ఆమె రైల్వే లైన్, ఎనిమిది లైన్ల హైవే, కొలోహో కొండను దాటి ఉదయం తొమ్మిదికంతా కామ్‌వోక్యా సబర్బ్ చేరుకుంటారు.
జెన్నిఫర్ రెండు గంటల పాటు మూడంతస్తుల భవనాన్ని శుభ్రం చేసి, ఆ తర్వాత తన యజమాని చెప్పిన పనులన్నీ చేస్తారు. సాయంత్రం 5 కాగానే వచ్చిన దారిలోనే ఇంటికి తిరుగుబాట పడతారు.
అయితే, నడక అనేది ఆమెకు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాదు, పర్సుకు సంబంధించిన విషయం. ఆమె జీతం కేవలం ఏడు వేల రూపాయలు. ఇంటి అవసరాలు, ఇద్దరు పిల్లలు చదువులను దృష్టిలో పెట్టుకుని ఆమె రవాణాపై ఖర్చు పెట్టలేదు.
యుగాండాలో ఆమెలాగే ఎంతోమంది ఎంతో దూరం ప్రయాణించి పనులకు వెళతారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన ప్రకారం శారీరక కార్యకలాపాలపరంగా అత్యంత చురుకుగా ఉంటారని చెప్పిన యుగాండాలో పరిస్థితి ఇది.

మారుతున్న జీవన విధానం
ఈ దేశంలో కేవలం 5.5 శాతం మందికి మాత్రమే తగిన శారీరక కార్యకలాపాలు లేవని డబ్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది.
ఈ జాబితాలో మొజాంబిక్, టాంజానియా, లెసొథో, టోగో ప్రజలు కూడా శారీరక కార్యకలాపాలపరంగా చురుకుగా ఉన్నారు.
దీనికి విరుద్ధంగా కువైట్, అమెరికన్ సమోవా, సౌదీ అరేబియా, ఇరాక్ ప్రజల శారీరక కార్యకలాపాలు అత్యంత తక్కువగా ఉన్నాయి.
మొత్తం ప్రపంచంలోనే సుమారు పావుభాగం ప్రజలకు తగిన శారీరక వ్యాయామం ఉండడం లేదు.
ఈ నివేదిక ప్రకారం, ధనిక దేశాలతో పోలిస్తే, తక్కువ ఆదాయం కలిగిన దేశాలలో శారీరక కార్యకలాపాలు ప్రజల జీవన విధానంలో భాగంగా మారాయని తెలుస్తోంది.
ఇక యుగాండాలోని గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే, ఇక్కడ సుమారు 70 శాతం ప్రజలు వ్యవసాయ కార్యకలాపాలలో పాలు పంచుకుంటారు.

కంపాలాకు సుమారు రెండు గంటల ప్రయాణం దూరంలో ఉండే 68 ఏళ్ల అబియాసలీ సెరెకో పని ఉదయం 5 గంటలకే ప్రారంభం అవుతుంది. 10 ఎకరాల పొలం కలిగిన సెరెకో మొదట పశువుల పాలు పిండాక, పశువుల పాకను శుభ్రం చేస్తారు. తన పొలాన్ని మొత్తం ఆయన ఒక్కరే చూసుకుంటారు.
''నేను రోజుకు 8 గంటలు పని చేస్తాను. ఇంత వయసొచ్చినా, నాకు ఇప్పటికీ ఒక్క నొప్పి కూడా లేదు. మా కుటుంబం తినే తిండి అంతా నేను పండించిందే. ఒకవేళ నేను పని చేయడం ఆపేస్తే, నేను జబ్బు పడతానేమో'' అంటారు సెరెకో.
అయితే, యుగాండాలోనూ జీవన విధానం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఫిట్‌నెస్‌తో ఉండడం అంత సులభం కాదు.
కంపాలా నగరం అంత ఫిట్‌నెస్ - ఫ్రెండ్లీ నగరం కాదు. నగరంలో పచ్చగా కనిపించే పార్కులు తక్కువ. కార్ల నుంచి విపరీతమైన పొగ. వాటి నుంచి వెలువడే కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
ఇక పాఠశాలల్లోనూ పిల్లలకు ఆరోగ్యం గురించి బోధించడం తగ్గిపోయింది.

శారీరకంగా చురుకుగా లేకపోవడం అంటే ఏమిటి?
శారీరక కార్యకలాపాలు అంటే, శరీరంలోని ప్రతి భాగం కదలడం. వేగంగా నడవడం, వాటర్ ఎయిరోబిక్స్, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడడంలాంటవి శారీరక కార్యకలాపాల కిందకు వస్తాయి.
వ్యాయామం వల్ల హృదయస్పందన, ఉచ్ఛ్వాసనిశ్వాసాల వేగం పెరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. చురుకుగా ఉన్నామని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక.
ఎంత సేపు సమయం వ్యాయామం చేయాలి?
- 19 నుంచి 64 ఏళ్ల వయసు వరకు వారానికి 150 నిమిషాల తగుమాత్రం ఎయిరోబిక్ వ్యాయామాలు లేదా 75 నిమిషాల తీవ్రమైన ఎయిరోబిక్ వ్యాయామాలు చేయాలి.
- వేగంగా నడవడం, సైక్లింగ్, టెన్నిస్, హైకింగ్, స్కేట్ బోర్డింగ్, వాలీబాల్, బాస్కెల్ బాల్, డబుల్స్ టెన్నిస్ లాంటి వాటిని తగుమాత్రం ఎయిరోబిక్ కార్యకలాపాలుగా పేర్కొనవచ్చు.
- జాగింగ్, వేగంగా ఈత కొట్టడం, సింగిల్స్ టెన్నిస్, హాకీ, రగ్బీ, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్.. ఇవి తీవ్రమైన శారీరక కార్యకలాపాలు
- ఎక్కువ కాలం పాటు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నచిన్న పనులు చేయాలి.
సబితి మతొవు ఒక ప్రాథమిక పాఠశాలలో శారీరక వ్యాయామ ఉపాధ్యాయుడు.
''శారీరక వ్యాయామం అన్నది టైమ్ టేబుల్‌లో ఉండాలి. కానీ క్రమక్రమంగా కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు'' అని మతొవు తెలిపారు.
ఇలా అయితే యువత ఎలా ఫిట్‌గా ఉంటుందని మతొవు ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో, గ్రామాల్లో చాలా చోట్ల ఆటస్థలాలు లేవు. ఉన్న చోట వ్యాయామ ఉపాధ్యాయులు లేరు అని మతొపు వెల్లడించారు.

ఈ ఏడాది జులై 7న దేశాధ్యక్షుడు యొవెరి ముసెవెని జాతీయ శారీరక కార్యకలాపాల దినోత్సవాన్ని ప్రారంభించారు. అయితే కేవలం ఉత్సవాలతో ఆరోగ్యం బాగుపడదు.
యుగాండాలోని ఇగాంగ జిల్లాలోని మకరెరె స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన రాయ్ విలియం మమెగా 2013లో ఒక పరిశోధన చేశారు. ఉగాండా ప్రజల జీవన విధానం మారుతోందని దానిలో గుర్తించారు.
''ఈ పరిశోధనలో పాల్గొన్న 85 శాతం మంది శారీరకంగా చాలా చురుకుగా ఉన్నారు. వాళ్ల బ్లడ్ షుగర్, బరువు అన్నీ చక్కగా ఉన్నాయి. తగినంత చురుకుగా లేని 15 శాతం మందికి చురుకుగా ఉన్నవారికంటే మధుమేహ వ్యాధి, హైబీపీ వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ'' అని మకరెరె తెలిపారు.
ఇటీవల ఉగాండాలో ఆహార పరిస్థితులు కూడా మారుతున్నాయి. ప్రతి చిన్న పట్టణంలోను హై కాలరీ, ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఉపయోగించడం ఎక్కువైంది. దీంతో దేశంలో వ్యాధులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతానికైతే యుగాండా ప్రజలు తాము ఎన్ని అడుగులు వేస్తున్నారు, ఎంత సేపు నడుస్తున్నారు అని లెక్కించుకునే పరిస్థితిలో లేరు.
కానీ, అత్యంత చురుకుగా ఉండే జాబితాలో మొదటిస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంచాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








