టైఫూన్ మాంగ్కూట్: ఫిలిప్పీన్స్‌లో 49 మంది మృతి... చితికిపోయిన గ్రామీణ ప్రాంతాలు

మాంగ్కూట్

ఫొటో సోర్స్, EPA

టైఫూన్ మాంగ్కూట్ ధాటికి ఫిలిప్పీన్స్‌లో 49 మందికి పైగా మృతి చెందారని అధికారులు తెలిపారు.

టుగ్యూగారో నగరంలోని దాదాపు అన్ని భవనాలకూ నష్టం జరిగింది. కొన్నిచోట్ల సమాచార సంబంధాలు తెగిపోయాయని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. కాగయాన్ రాష్ట్రంలో పంట నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని ఆధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 50 లక్షల మందికి పైగా ఉంటారు. తుపాను ప్రభావంతో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు.

అలలు 20 అడుగుల ఎత్తు వరకూ ఎగిసిపడే అవకాశం ఉండడంతో సమీప ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించారు. లక్ష మందికి పైగా ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

మాంగ్కూట్

ఫొటో సోర్స్, EPA

ఈ పెను తుపాను ప్రస్తుతం దక్షిణ చైనా వైపు వెళ్తోందని వాతావరణ నిపుణులు తెలిపారు.

కాగా, తుపాను సహాయక చర్యల్లో భాగంగా ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు సహాయ సిబ్బంది మృతి చెందారని అధికారులు తెలిపారు.

ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకూ అత్యంత విషాదకరమైనదిగా భావించే సూపర్ టైఫూన్ హైయాన్‌ 2013లో వచ్చింది. ఆ తుపానులో 7 వేల మందికి పైగా మృతి చెందారు.

భారీ వర్షంలో గొడుగుతో ఇబ్బందులు పడుతున్న మహిళ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావంతో ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి

తాజా తుపాను బీభత్సం

మాంగ్కూట్ టైఫూన్ ఈశాన్య ఫిలిప్పీన్స్‌లోని బగ్గావ్ దగ్గర స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 1.40కి తీరం దాటింది.

తీరం దాటిన తర్వాత గాలుల వేగం తగ్గడంతో మాంగ్కూట్ సూపర్ టైఫూన్ స్థాయి నుంచి తగ్గి, ప్రస్తుత గాలుల వేగం ప్రకారం కేటగిరీ 4 లో ఉంది.

స్థానికులు ఒంపాంగ్‌గా చెబుతున్న ఈ తుపాను మేఘాల పరిధి దాదాపు 900 కిలోమీటర్లు వ్యాపించి ఉంది. ఇది గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పశ్చిమంగా వెళ్తోంది.

ఇప్పటివరకూ వచ్చిన ఉష్ణమండల తుపానుల్లో ఇది అత్యంత బలమైనదని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.

శనివారం ఉదయం వరద, గాలుల బీభత్సం దృశ్యాలను ఫిలిప్పీన్స్ రెడ్ క్రాస్ షేర్ చేసింది.

టైఫూన్ ఆదివారం మధ్యాహ్నానికి హాంకాంగ్ గుండా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇది మంగళవారం నాటికి ఉష్ణమండల అల్పపీడనంగా బలహీనం అవుతుందని భావిస్తున్నారు.

తుపాను సహాయక చర్యల్లో భాగంగా జబ్బుపడిన ఒక చిన్నారిని వైద్యం కోసం తరలిస్తున్న కుటుంబం

ఫొటో సోర్స్, AFP

అధికారుల సన్నాహాలు ఎలా ఉన్నాయి?

తుపాను పరిస్థితులను ఎదుర్కోడానికి, గతంలో కంటే మెరుగైన సన్నాహాలు చేశామని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు.

చాలా రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర, విమాన ప్రయాణాలు నియంత్రించారు, చాలా స్కూళ్లు మూసివేశారు. సహాయక చర్యలకు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు.

భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడవచ్చని, హఠాత్తుగా వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం ఈ తుపాను చైనాను తాకవచ్చని భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా నాలుగో స్థాయి ప్రమాద హెచ్చరికను సూచించే పసుపు జెండాను ఎగురవేశారు. దక్షిణ చైనాలో హైస్పీడ్ రైలు సర్వీసులు రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)