హరికేన్ ఫ్లోరెన్స్: కేరొలినా, వర్జీనియాల్లో వరద బీభత్సం

తుపాను

ఫ్లోరెన్స్ తుపాను వల్ల ఉత్తర, దక్షిణ కాలిఫోర్నియా, వర్జీనియాలోని చాలా ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

హరికేన్ నుంచి దీని తీవ్రత ఉష్ణమండల తుపాను స్థాయికి తగ్గింది. కానీ తూర్పు తీరం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్లు కూలిపోవడంతోపాటు, చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి.

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో, ఈ తుపాను మెల్లగా తూర్పు రాష్ట్రాలపై పట్టు బిగిస్తోంది.

తుపాను కారణంగా అయిదుగురు మృతి చెందారు, వేలాది మంది సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన షెల్టర్లలో తలదాచుకున్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న 17 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఒక ఇంటిపై చెట్టు కూలడంతో అందులో వ్యక్తిని కాపాడిన పక్కంటి వ్యక్తి

ఉత్తర కాలిఫోర్నియాలో తుపాను మృతులు

  • శుక్రవారం విల్మింగ్ టన్‌లో ఒక చెట్టు ఇంటిపై పడడంతో లోపల ఉన్న తల్లీ బిడ్డలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు చెప్పారు.
  • లినోయిర్ ప్రాంతంలో 70 ఏళ్ల వయసున్న ఇద్దరు మృతి చెందారు. ఎలక్ట్రిక్ జనరేటర్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఒకరు చనిపోగా, ఇంకొకరు ఇంటి బయటకు వెళ్లినప్పుడు బలమైన గాలులు వీయడంతో మృతి చెందారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
  • హాంస్టెడ్ పట్టణలో ఒక మహిళ గుండెపోటుతో మృతి చెందారు. అప్పటికప్పుడే ఆస్పత్రికి తరలించినా, రోడ్లపై చెట్లు కూలిపోవడంతో సమయానికి ఆమెను కాపాడలేకపోయారు.
తుపాను

తుపాను తాజా పరిస్థితి

కేటగిరీ 1 హరికేన్‌గా తుపాను శుక్రవారం ఉదయం ఉత్తర కాలిఫోర్నియాలో ఉన్న, రైట్స్ విల్లీ బీచ్ దగ్గర తీరం దాటింది.

రెండు కేరొలినాలను హఠాత్ వరదలు ముంచెత్తే విపత్తు ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది.

ఉత్తర కేరొలినాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే 10 అడుగులకు పైగా నీళ్లలో మునిగి ఉన్నాయి.

ఉత్తర కేరొలినా గవర్నర్ రాయ్ కూపర్ హరికేన్ మరికొన్ని రోజులు తన ప్రతాపం చూపించే అవకాశం ఉందని, ఇలాంటి విపత్తు వెయ్యేళ్లకు ఒకసారి వస్తుందని ఉత్తర కేరొలినా గవర్నర్ రాయ్ కూపర్ అన్నారు.

ఫ్లోరెన్స్ తుపాను వల్ల 18 లక్షల కోట్ల గ్యాలన్ల నీళ్లు అమెరికాను ముంచెత్తనుందని వాతావరణ నిపుణులు చెప్పారు.

విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఉత్తర కేరొలినాలో ఇప్పటికే 8 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. దీనిని పునరుద్ధరించడానికి కొన్ని రోజులు, వారాల కూడా పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.

తుపాను

ప్రజలు ఎలా ఎదుర్కొంటున్నారు?

ఉత్తర కేరొలినాలో ఉన్న అత్యవసర షెల్టర్లలో 20 వేల మందికి పైగా ఉన్నారు. తుపాను శాంతించేవరకూ వాళ్లు అక్కడే ఉంటారని అధికారులు చెప్పారు.

ఉత్తర కేరొలినాలోని జాక్సన్‌విల్లీలో గురువారం రాత్రి తుపాను ధాటికి కూలిపోతున్న ఒక హోటలు నుంచి అధికారులు 60 మందిని కాపాడారు.

నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో, 30 వేల మంది నివసించే, న్యూ బెర్న్, ఉత్తర కేరొలినాలోని చాలా ప్రాంతాలు 10 అడుగుల నీళ్లలో మునిగాయి.

తుపాను

ఫొటో సోర్స్, Getty Images

నేవీ అధికారులు, వాలంటీర్లు ఇళ్లలో చిక్కుకుపోయినవారిని పడవలలో వెళ్లి కాపాడుతున్నారు.

సహాయ కార్యక్రమాలకు ఆంటంకం లేకుండా వచ్చే వారం అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వరద బాధిత ప్రాంతానికి వెళ్తారని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)