తాలిబాన్‌లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం

ప్రపంచపటం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాబ్లో ఉకావా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

తాలిబాన్‌లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత కొన్ని దేశాలు అక్కడ అధికార మార్పిడిని ఆమోదించేందుకు సిద్ధమవుతున్నాయి.

దీనిపై మాస్కో నుంచి బీజింగ్ వరకు, బెర్లిన్ నుంచి ఇస్లామాబాద్ వరకూ వివిధ దేశాల రాజధానుల్లో దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి.

కాబుల్‌లో ఆగస్టు 26న చోటు చేసుకున్న వరుస బాంబుపేలుళ్లను చూస్తుంటే, తిరుగుబాటు బృందాలు తాలిబాన్ల పాలనకు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయని అర్థమవుతోంది.

ఈ పరిస్థితులలో, తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత వివిధ వర్గాల వారికుండే ప్రయోజనాలేంటి? కొన్ని కీలకమైన ప్రపంచ దేశాలపై ఈ అధికార మార్పిడి ప్రభావం ఎలా ఉండబోతోంది?

పాకిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు చమన్ సరిహద్దు వద్ద భారీగా చేరుకున్న అఫ్గాన్ ప్రజలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోకి ప్రవేశించేందుకు చమన్ సరిహద్దు వద్ద భారీగా చేరుకున్న అఫ్గాన్ ప్రజలు

పాకిస్తాన్

కాబుల్‌లో అధికార మార్పిడి ప్రభావం అఫ్గానిస్తాన్ పొరుగు దేశమైన పాకిస్తాన్‌పై అధికంగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ పరిణామాలతో పాకిస్తాన్‌కు లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి.

రెండు దేశాల మధ్య 2,400 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. పాకిస్తాన్ లో 14లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉన్నట్లు అధికారిక లెక్కలున్నాయి. అనధికారికంగా కూడా అంతే సంఖ్యలో శరణార్థులు ఉంటారని అంచనా.

అఫ్గానిస్తాన్‌లో అస్థిరత వల్ల పాకిస్తాన్ కు నష్టాలున్నాయి. కానీ, తాలిబాన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.

తాలిబాన్లకు సహాయం చేస్తున్న విషయాన్ని పాకిస్తాన్ మొదటి నుంచీ ఖండిస్తూనే వస్తున్నప్పటికీ, 1990లలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు తాలిబన్ల అధికారాన్ని గుర్తించిన దేశాల్లో పాకిస్తాన్ ఒకటి.

తాలిబాన్లతో సంబంధాలను తెంచుకున్న దేశాల్లో పాకిస్తానే ఆఖరుది.

"తర్వాత, వారి మధ్య సంబంధాల్లో బీటలు వారినప్పటికీ, ఈ సారి మాత్రం వారు కొంత బలాన్ని సమకూర్చుకున్నారనే భావన పాకిస్తాన్‌లోని నిర్ణయాత్మక అధికారం ఉన్న వర్గాల్లో కలిగింది" అని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ లండన్ విజిటింగ్ ఫెలో ఉమర్ కరీమ్ అన్నారు.

భారతదేశంతో తమకు ఉన్న పోటీ కోణంలోంచి చూసే పాకిస్తానీలకు మాత్రం తాలిబాన్లు అధికారంలోకి రావడమనేది భారతదేశం ప్రభావం తగ్గించే అంశంగా అనిపిస్తుంది.

"ముఖ్యంగా అఫ్గానిస్తాన్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో జలాలాబాద్, కాందహార్ నగరాల్లో భారతీయ రాయబార కార్యాలయాలు ఉండటం పాకిస్తాన్‌కు చికాకు పెట్టే అంశం. ఇవి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పని చేసే తెహ్రీక్ ఏ తాలిబాన్ , బలూచ్ తిరుగుబాటు బృందాలను పోషిస్తాయని పాకిస్తాన్ భావిస్తుంది’’

"తాలిబాన్లు అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ తన ప్రభావాన్ని మళ్లీ పెంచుకోగలనని అనుకుంటోంది" అని కరీమ్ చెప్పారు.

"అఫ్గానిస్తాన్ వాణిజ్యం చాలా వరకు పాకిస్తాన్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు పిండి, బియ్యం, కాయగూరలు, సిమెంటు, నిర్మాణపనులకు సంబంధించిన సరకుల వంటివి వ్యాపారం" అని చెప్పారు.

దీనికి తోడు, పాకిస్తాన్ మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకు ఆఫ్గనిస్తాన్ మీదుగా ఒక ఆర్థిక వంతెనను సృష్టించుకోవాలని చూస్తోంది.

ఈ ఆర్థిక ఆవశ్యకత ఉండటంతో భద్రతతో సహా వివిధ అంశాల్లో పాకిస్తాన్‌కు సహకరించేలా తాలిబాన్లను ప్రోత్సహించవచ్చు.

"ప్రపంచంలో ఏకాకిగా ఉన్న తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వెళ్లలేదు" అని కరీమ్ అన్నారు.

శరణార్థులు

రష్యా

అఫ్గానిస్తాన్‌లో తిరుగుబాటుదారులతో 1979 -1989 మధ్యలో దశాబ్దం పాటు పోరాడి, గెలిచి ఓడిన యుద్ధాన్ని రష్యా ఇంకా మర్చిపోలేదు.

అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం రష్యాకు ప్రయోజనాలు తక్కువే ఉన్నప్పటికీ.. అఫ్గానిస్తాన్‌లోని అస్థిరత రష్యాతో సన్నిహిత సంబంధాలున్న మాజీ సోవియెట్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చు.

కాకసస్ ప్రాంతంలో ఉన్న జిహాదీలకు, రష్యాకు, తాలిబాన్లకు కూడా శత్రువులైన ఇస్లామిక్ స్టేట్‌తో అనుబంధంగా ఉన్న సంస్థలకు అఫ్గానిస్తాన్ సురక్షిత కేంద్రంగా మారుతుందేమోనని రష్యా ఆందోళన చెందుతోంది.

ముఖ్యంగా తాలిబాన్ల అధికారాన్ని రష్యా గుర్తించింది. పశ్చిమ దేశాల సేనలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగక ముందు నుంచే తాలిబాన్లతో సంప్రదింపులు మొదలుపెట్టింది.

"అఫ్గానిస్తాన్ విషయంలో రష్యా తన ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోంది" అని రష్యా గ్లోబల్ అఫైర్స్ జర్నల్ ఎడిటర్ ఫ్యోడోర్ లుక్యనోవ్ బీబీసీతో చెప్పారు.

రష్యా సైనికులు

ఫొటో సోర్స్, Reuters

"ఒక వైపు రాజకీయ భద్రతను స్థిరపరిచే హామీ ఇచ్చేందుకు తాలిబాన్లతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు, అఫ్గాన్ భూభాగం నుంచి తజికిస్తాన్‌లోకి తీవ్రవాదులు చొరబడకుండా ఉండేందుకు తజికిస్తాన్‌లో అధిక సంఖ్యలో రష్యా సేనలున్నాయి.

రష్యా ఆ దేశానికి తజికిస్తాన్‌కు పెద్ద ఎత్తున సైనిక సహకారం కూడా అందిస్తోంది" అని చెప్పారు.

రష్యా ప్రభావం ఉన్న ప్రాంతంగా భావించే అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం ఆ ప్రాంతంపై వాషింగ్టన్ పట్టును తగ్గిస్తోంది.

"మాకు ఏదైతే మేలు చేస్తుందో అది అమెరికాకు హాని చేస్తుంది. మాకు హాని చేసేది అమెరికన్లకు మేలు చేస్తుంది.

ఈ రోజు అమెరికన్ల పరిస్థితి బాలేదు. అంటే అది మాకు మంచిదని అర్థం" అని మాస్కోలో రాజకీయ విశ్లేషకుడు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో చెప్పారు.

జిన్‌పింగ్, పుతిన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జిన్‌పింగ్, పుతిన్

చైనా

అఫ్గానిస్తాన్‌లో చైనాకు ఆర్థిక, భద్రత సంబంధిత ప్రయోజనాలున్నాయి.

అమెరికా అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడంతో చైనా సంస్థలు అఫ్గానిస్తాన్‌లోని గనులను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాయి.

మైక్రో‌చిప్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీ పరికరాలలో వాడే అరుదైన ఖనిజాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది.

అఫ్గాన్ ఖనిజ నిల్వల విలువ సుమారు లక్ష కోట్ల డాలర్లు ఉంటుందని అమెరికా నిపుణులు అంచనా వేశారు.

వీటికి మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయని అఫ్గాన్ ప్రభుత్వం అంటుంది.

"కానీ, రాజకీయ భద్రతతో పొంచి ఉన్న ముప్పు గురించి చైనా సంస్థలు తూకం వేసుకుంటున్నాయి" అని అంతర్జాతీయ వ్యవహారాలను ప్రచురించే చైనా వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ ఆగస్టు 24న పేర్కొంది.

దీంతోపాటు, పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేసుకుని చైనా వ్యవహరిస్తుంది.

చైనా అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు ఏర్పరుచుకునేందుకు వ్యూహాత్మకంగానూ కొన్ని కారణాలున్నాయి. ఇరాన్, పాకిస్తాన్‌లతో వాణిజ్యం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చైనా నిర్మిస్తున్న సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్‌కు సంబంధించి కూడా అఫ్గానిస్తాన్ కీలకమే.

రష్యా ఆందోళన చెందుతున్నట్లుగానే చైనా కూడా అఫ్గానిస్తాన్ భూభాగం తీవ్రవాదులకు కేంద్రంగా మారుతుందేమోనని ఆందోళనతో ఉంది.

"చైనా అఫ్గానిస్తాన్‌తో చాలా తక్కువ సరిహద్దును కలిగి ఉంది" అని దౌత్య వ్యవహారాల విశ్లేషకుడు జోనాథన్ మార్కస్ అన్నారు.

‘‘చైనా తన దేశంలో ఉన్న ముస్లిం మైనారిటీలను అణచివేస్తుండడంతో బీజింగ్‌కు వ్యతిరేకంగా ఇస్లాం తీవ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు అఫ్గానిస్తాన్‌ను కేంద్రంగా వాడుకోవచ్చు. అందుకే తాలిబాన్లను సమర్థించేందుకు చైనా ఆసక్తిని చూపడంలో వింతలేదనిపిస్తోంది" అని అన్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి మాదక ద్రవ్యాల సమస్య, తీవ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 25న జరిగిన ఫోను సంభాషణలో పరస్పర అంగీకారానికి వచ్చారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తాలిబాన్ ఫైటర్లు

ఇరాన్

"సంప్రదాయ ఆయుధాల తయారీలో పేరున్న రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) విభాగం కుద్స్ ఫోర్స్ ద్వారా ఇరాన్ తాలిబాన్లతో కొన్నేళ్లుగా సన్నిహితంగానే ఉంటోంది" అని కరీమ్ చెప్పారు. అయితే, ఈ బృందాన్ని అమెరికా తీవ్రవాద బృందంగానే పరిగణిస్తుంది.

"తాలిబాన్ నాయకులకు ఇరాన్ ఆతిథ్యం ఇవ్వడంతో పాటు వారికి ఆర్థిక, ఆయుధ సహకారాన్ని అందించింది. దానికి బదులుగా తాలిబాన్లు అఫ్గాన్ షియాలు ముఖ్యంగా హజారా తెగ వారిని ఆమోదించడం మొదలుపెట్టారు. అందుకే సెంట్రల్ అఫ్గానిస్తాన్‌లో ఉన్న హజారా భూభాగం ఒక్క బులెట్ కూడా పేలకుండానే సులభంగా తాలిబాన్ల చేతుల్లోకొచ్చేసింది" అని అన్నారు.

"ఇరాన్ కూడా అమెరికా వదిలిపెట్టిన లేదా ప్రస్తుతం తాలిబాన్ల చేతుల్లో ఉన్న కొన్ని ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధ సామాగ్రిని తెప్పించుకుని విశ్లేషించుకోవడానికి ఆసక్తి చూపించవచ్చు" అన్నారు కరీమ్.

"అఫ్గానిస్తాన్‌లో సుస్థిరత ఏర్పడితే అక్కడి నుంచి ఇరాన్ వలస వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గొచ్చు. ప్రస్తుతం ఇరాన్ 7,80,000 మంది శరణార్థులకు ఆశ్రయం ఇస్తోంది" అని యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది.

అఫ్గానిస్తాన్ నుంచి తరలింపు

ఫొటో సోర్స్, Reuters

పాశ్చాత్య దేశాలు

"మేమీ యుద్ధాన్ని జయించాం. అమెరికా ఓడిపోయింది" అని తాలిబాన్ నాయకుడొకరు బీబీసీ ప్రతినిధి సికందర్ కిర్మానీకి ఏప్రిల్ నెలలోనే చెప్పారు. అప్పటికి వారు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకోలేదు.

కానీ, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు మాత్రం పోయిన తమ ప్రతిష్టను తిరిగి సాధించుకునేందుకు కొంత సమయం పడుతుంది.

"సేనలు వైదొలగడం ద్వారా అఫ్గాన్‌ ప్రజలను రక్షించే పనులను పూర్తిగా నిలిపివేయకూడదు. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో మరింత అత్యవసర పరిస్థితిలో కూరుకుపోయిన అఫ్గాన్లకు సహాయం చేయాలి" అని ఆగస్టు 25న జర్మనీ పార్లమెంట్లో మాట్లాడుతూ ఏంజెలా మెర్కెల్ చెప్పారు.

"కొత్తగా అధికారంలోకి వచ్చిన అఫ్గాన్ నాయకులతో ఎటువంటి సంబంధాలను ఏర్పర్చుకుంటామో ఇప్పట్లో నిర్ణయించలేం" అని యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చార్లెస్ మైఖేల్ ఆగస్టు 24న జరిగిన జి-7 దేశాల సమావేశం అనంతరం చెప్పారు.

"కొత్త పాలకులు అవలంబించే చర్యలు, వైఖరిపై ఆధారపడి అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు ఉంటాయి" అన్నారాయన.

అఫ్గాన్ నేలపై తీవ్రవాదం పెరగకుండా చూడడం, శరణార్థుల సమస్యకు సరైన పరిష్కారం చూపడం పశ్చిమ దేశాల ముందున్న ప్రాధాన్యాంశం.

కాబుల్ ఎయిర్‌పోర్టు దగ్గర బాంబు దాడులు చేసింది ఐఎస్-కే అని తేలడంతో తీవ్రవాద ముప్పు మరింత స్పష్టంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)