తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రిచర్డ్ సగ్
    • హోదా, బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రా

అప్పుడే మరణించిన వ్యక్తి మృతదేహం కోసం ఒకప్పుడు చాలా మంది ఎదురుచూసేవారు.

వేడి రక్తాన్ని కప్పుల్లో వేసుకొని తాగేందుకు వారు కాచుకుని కూర్చునేవారు. ఆ రక్తాన్ని తాగితే వ్యాధులు తగ్గుతాయనేది వారి నమ్మకం.

ఒకప్పుడు డెన్మార్క్‌లో ఇలా నమ్మేవారు చాలా మందే ఉండేవారు.

వినడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ, రక్తం తాగితే మూర్ఛ వ్యాధి తగ్గుతుందనే విషయాన్ని మధ్యయుగంలో చాలా మంది నమ్మేవారని ఐరోపా వైద్య నిపుణులు చెబుతున్నారు.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

రెండు రకాలుగా...

ఆధునిక యుగం తొలి నాళ్లలో వైద్యం కోసం నరమాంసం ఉపయోగించడాన్ని రెండు రకాలుగా చూడొచ్చు.

వీటిలో మొదటది మమ్మీ వైద్యం. దీనికి అప్పట్లో ప్రాచుర్యం ఎక్కువే ఉండేది. జాగ్రత్తగా భద్రపరిచిన ఈజిప్షియన్ల మృతదేహాల నుంచి సేకరించిన ఎండబెట్టిన మాంసాన్ని ఈ వైద్యంలో ఉపయోగించేవారు. కొన్నిసార్లు మాంసాన్ని పొడిగాచేసి కూడా వాడేవారు.

రెండోది తాజా మృతదేహాల నుంచి సేకరించిన పదార్థాలతో వైద్యం చేయడం. అంటే వేడివేడి రక్తం, శరీరంలోని కణజాలం, కొవ్వులను వైద్యంలో ఉపయోగించడం. వీటిని కూడా కొన్నిసార్లు ఎండబెట్టి ఉపయోగించేవారు.

24ఏళ్లకు కాస్త అటూఇటూగా ఉంటూ, ఎలాంటి వ్యాధులూ లేకుండా మరణించిన వ్యక్తి తాజా మాంసాన్ని మేలైన ఔషధంగా అప్పట్లో వైద్య నిపుణులు భావించేవారు. సదరు వ్యక్తి హింసాత్మకంగా మరణిస్తే, అతడి శరీర పదార్థాలకు వైద్యంచేసే శక్తి మరింత ఎక్కువగా ఉండేదని నమ్మేవారు.

మరికొన్ని వైద్యాల్లో మానవ పుర్రె, మరణానంతరం పుర్రెపై పెరిగే కొన్ని రకాల నాచులను కూడా ఉపయోగించేవారు.

అంతర్గత రక్త స్రావాలను అడ్డుకునేందుకు చేసే వైద్యంలో మమ్మీల శరీర పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మూర్ఛ వ్యాధి చికిత్సలో అయితే, రక్తంతోపాటు పుర్రె పొడి కూడా వాడేవారు.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

నరమాంస భక్షణే..

మృతదేహాలతో చేసే ఇలాంటి చికిత్సలు ఆధునిక వైద్య చరిత్రలో మనకు అసలు కనపడవు. అయితే, ఇవి మూఢనమ్మకాలు, దొంగ చికిత్సల కంటే కాస్త భిన్నమైనవి.

అరబ్ సంప్రదాయ మూలాలున్న ఈ చికిత్సలను చాలా మంది విద్యావేత్తలు కూడా నమ్మేవారు. తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లిష్ రచయిత జాన్ డన్, క్వీన్ ఎలిజబెత్ శస్త్రచికిత్సా నిపుణుడు జాన్ బానిస్టర్, రసాయన శాస్త్రవేత్త రాబెర్ట్ బాయిల్ ఈ చికిత్సలను నమ్మేవారు.

1685లో మరణం అంచున ఉన్న కింగ్ చార్లెస్-2ను బతికించేందుకు ప్రయత్నించిన చికిత్సల్లో మానవ పుర్రె పొడితో వైద్యం కూడా ఒకటి.

మానవ మృతదేహంతోచేసే ఈ చికిత్సలను ఒకరకమైన నరమాంస భక్షణగానే నిపుణులు పరిగణించేవారు.

15వ శతాబ్దంనాటికి నరమాంస భక్షణను ఐరోపా మొత్తం నిషేధించింది. అయితే, నరమాంస వైద్యాన్ని మాత్రం వారు నరమాంస భక్షణ కింద పరిగణించేవారు కాదు.

అప్పట్లో ఈ వైద్యం ఎంత ప్రాచుర్యంలో ఉండేదంటే, కొందరు వ్యాపారులు అక్రమంగా ఈజిప్టు సమాధులను తవ్వేసేవారు. కొందరైతే మరణించిన బిచ్చగాళ్లు, ఒంటెల మాంసాన్ని కూడా సమాధుల్లో జాగ్రత్తగా భద్రపరిచిన మృతదేహ మాంసంగా చెప్పి అమ్మేసేవారు.

18వ శతాబ్దంవరకు ఈ వైద్యం కొనసాగింది. జర్మనీలో ఐతే వందేళ్ల ముందువరకు ఈ చికిత్సలు కొనసాగించినట్లు ఆధారాలున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

‘‘మంచి ఔషధం’’

సమాజంలో చాలా వర్గాల నుంచి వ్యతిరేకత నడుమ ఈ వైద్య చికిత్సలు అంతకాలం ఎలా మనుగడ సాగించాయి?

దీనికి అప్పట్లో చెలామణీలోనున్న వైద్య నిపుణులే కారణమని చెప్పవచ్చు. వారు ఇలాంటి చికిత్సలను బలంగా నమ్మేవారు.

1599లో కైరోలోని ఓ పిరిమిడ్‌ను చూసిన ఓ పర్యటకుడు ఇలా రాసుకొచ్చారు. ‘‘ఇక్కడ ప్రాచీనుల మృతదేహాలను రోజూ తవ్వి తీస్తున్నారు. వీటి నుంచి సేకరించిన పదార్థాలను సేవించాలని రోగులపై వైద్యులు ఒత్తిడి చేసేవారు’’అని ఆ పర్యటకుడు పేర్కొన్నారు.

దీని ప్రకారం, మమ్మీల నుంచి సేకరించి పదార్థాలను సేవించాలని రోగులను వైద్యులు ఒత్తిడి చేసేవారని తెలుస్తోంది.

1647లో ప్రముఖ రచయిత థామస్ ఫుల్లెర్ అయితే, మమ్మీని ‘‘మంచి ఔషధం.. చెత్త ఆహారం’’గా అభివర్ణించారు. అంటే మమ్మీలోని మాంసాన్ని చికిత్స కోసం వైద్యులు శుద్ధిచేస్తారని ఆయన భావించేవారు.

అయితే, ఇక్కడ శుద్ధి అనేది శాస్త్రీయంగా జరగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మతపరమైన లేదా విశ్వాసాలకు అనుగుణంగా మృతదేహాల పదార్థాలను వారు శుద్ధిచేసేవారు.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

అధ్యాత్మిక కోణం..

మధ్యయుగంనాటి పునరుజ్జీవన ఉద్యమం (రెన్నైసాన్స్)లో ఆత్మకు ప్రత్యేక స్థానముండేది. మనలో జరిగే మార్పులకు ఆత్మే కారణమని అప్పట్లో బలంగా నమ్మేవారు.

‘‘ఆత్మ(సోల్)కు రూపం లేదు. అయితే, ఇది మన శరీరంలో ఉంటుంది. శరీరంలోని రక్తం, ప్రాణవాయువులతో ఏర్పడే జీవాత్మలతో(స్పిరిట్స్) ఈ ఆత్మకు సంబంధముంటుంది’’అని అప్పట్లో భావించేవారు.

‘‘ఆత్మతో అనుసంధానమై ఉండే ఈ జీవాత్మలు శరీరం మొత్తం ఆవరించి ఉంటాయి. మన శరీర క్రియలను ఇవే నడిపిస్తాయి.’’

‘‘జీవి మనుగడలో ఈ జీవాత్మలు చాలా కీలకం. బాహ్య ప్రపంచంతో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇవే అనుసంధానిస్తాయి.’’

చాలా మంది రెన్నైసాన్స్ తత్వవేత్తలు.. నరమాంస వైద్యాన్ని జీవాత్మలను (స్పిరిట్స్‌ను) నేరుగా స్వీకరించేందుకు దక్కిన అవకాశంగా భావించేవారు.

ముఖ్యంగా రక్తం తాగేటప్పుడు ఈ వాదనను చెప్పవారు. ‘‘జీవాత్మలోని జీవాన్ని రోగి తీసుకుంటున్నట్లు భావించేవారు. అప్పుడే మరణించిన వ్యక్తి రక్తంలో జీవాత్మలను తీసుకుంటే సదరు రోగి వ్యాధి నయమవుతుందని భావించేవారు.’’

‘‘మానవ ర్తం చాలా వ్యాధుల నుంచి రోగులను కాపాడగలదు’’అని అప్పటి ప్యూరిటన్ ప్రధాని ఎడ్వార్డ్ టేలర్ కూడా తన పుస్తకంలో రాసుకొచ్చారు.

1747లోనూ మూర్ఛ వ్యాధికి చికిత్సగా తాజా వేడి రక్తాన్ని తాగాలని రోగులకు ఇంగ్లండ్‌లో వైద్య నిపుణులు సూచించినట్లు ఆధారాలున్నాయి.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

హింసాత్మకంగా చనిపోతే..

మానవ శరీర మాంసంతో చికిత్సలకు అప్పట్లో ఆధ్యాత్మిక భాష్యాలు కూడా చెప్పేవారు.

ఉదాహరణకు, హింసాత్మకంగా మరణించిన ఓ యువకుడి మమ్మీనే తీసుకుందాం.

‘‘ఆ వ్యక్తి హింసాత్మకంగా చనిపోతే, అతడిలోని జీవాత్మలు (స్పిరిట్స్) గుండె, మెదడు, ఇతర కీలకమైన అవయవాల నుంచి వెంటనే బయటకు వెళ్లిపోతాయి. శరీర కణజాలం, జుట్టు లేదా చర్మంలోకి ఈ జీవాత్మలు చేరుతాయి. ఇలాంటి మాంసం చాలా శక్తివంతమైనది’’అని కూడా అప్పటివారు నమ్మేవారు.

ఎంబాల్మింగ్ ప్రక్రియల వల్ల ఈజిప్టు మమ్మీల్లో కణజాలం బిగుతుగా, పొడిగా ఉంటుంది. అంటే వీటిలో జీవాత్మలు భద్రంగా ఉన్నాయనిభావించేవారు.

అదే విధంగా పుర్రెపై ఏర్పడే నాచులోనూ జీవాత్మలు ఉన్నాయని భావించేవారు. ఒకవేళ వ్యక్తికి ఉరితీసి లేదా ఊరిపి ఆడకుండా గొంతుపట్టుకుని చంపితే, ఏడేళ్లవరకు అతడి పుర్రెలో జీవాత్మలు ఉంటాయని కొందరు భావించేవారు.

గుండెను చికిత్సల్లో ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే, అప్పట్లో గుండె ఎడమ కవాటంలో స్వచ్ఛమైన, మేలిమి జీవాత్మలు ఉండేవని వారు నమ్మేవారు.

నరమాంస భక్షణ

ఫొటో సోర్స్, Getty Images

ఆత్మ వైద్యం..

ఈ నరమాంస వైద్యాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూసేవారు.

కొందరు దీన్ని మూఢ నమ్మకంగా భావిస్తే, మరికొందరు దీన్ని వ్యాపారంలా చూసేవారు. మరికొందరు మానవుల నుంచి సేకరించిన మేలిమి పదార్థాలతో వైద్యంగా పరిగణించేవారు.

‘‘ఆధునిక వైద్యంలో మమ్మీలకు అసలు చోటులేదు. నేడు అలాంటి పద్ధతులను ఎవరూ పాటించడంలేదు. శాస్త్రీయ సాంకేతల్లో పురోగతి వల్ల ఆధ్మాత్మికత నుంచి సైన్స్ వేరుపడింది’’అని 1780ల్లో ప్రముఖ వైద్యుడు సామ్యూల్ జాన్సన్ అన్నారు.

మమ్మీలతో వైద్యం, మృతుల పుర్రెల పొడితో చికిత్సలను పక్కనపెట్టేయడాన్ని 1782లో భౌతిక శాస్త్రవేత్త విలియం బ్లేక్ ప్రశంసించడాన్ని మనం గమనించొచ్చు.

(డర్హమ్ యూనివర్సిటీలో రిచర్డ్ సగ్ ప్రొఫెసర్. నరమాంసంతో వైద్యంపై ఆయన ‘‘మర్డర్ ఆఫ్టర్ డెత్’’ పేరుతో ఓ పుస్తకం రాశారు. ఈ కథనం తొలుత బీబీసీ హిస్టరీ ఎక్స్‌ట్రాలో ప్రచురితమైంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)