తాలిబాన్: అఫ్గానిస్తాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్ ఏమైపోయారు? ప్రత్యర్థి వర్గం కొట్టి చంపిందా

ఫొటో సోర్స్, SEFA KARACAN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
- రచయిత, ఖుదా-ఏ-నూర్ నాసిర్
- హోదా, బీబీసీ, ఇస్లామాబాద్
ఖతార్ రాజధాని దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ నయీమ్ సోమవారం ఒక వాట్సాప్ ఆడియోను మీడియాకు విడుదల చేశారు.
అఫ్గానిస్థాన్‌లో కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాన మంత్రిగా కొనసాగుతున్న, దోహాలోని తాలిబాన్ కార్యాలయ అధిపతి అబ్దుల్ ఘనీ బరాదర్ ఈ ఆడియో క్లిప్‌లో మాట్లాడుతున్నారు.
కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘‘నేను కనిపించడంలేదని చాలా రోజుల నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నేను కొన్ని పనులపై తిరుగుతున్నాను. నాతోపాటు నా పక్కనున్న అందరూ క్షేమంగానే ఉన్నారు. మాపై వస్తున్న వార్తల్లో నిజంలేదు’’ అని ఆ ఆడియోలో బరాదర్ చెప్పారు.
సెప్టెంబరు 12న బరాదర్ అధికార ప్రతినిధి మూసా కలీం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘‘అఫ్గానిస్తాన్ అధ్యక్ష భవనంలో రెండు తాలిబాన్ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ ఘర్షణలో బరాదర్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన మరణించారు’’ అంటూ మీడియాలో వాస్తున్న వార్తల్లో నిజంలేదని లేఖలో పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్‌లోని అధ్యక్ష భవనంలో ఆదివారం ఖతార్ విదేశాంగ మంత్రితో సమావేశమైన తాలిబాన్ నాయకులకు సంబంధించి వీడియోను మీడియాకు విడుదల చేశారు. దీనిలో కూడా బరాదర్ కనిపించడకపోవడంతో అసలు ఆయనకు ఏమైంది? ఆయన ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
‘‘చాలా కోపంగా ఉన్నారు’’
తాలిబాన్ నాయకుడు ముల్లా హెబ్తుల్లా అఖుంద్‌జాదాను కలిసేందుకు ముల్లా అబ్దుల్ బరాదర్ కాందహార్ వెళ్లారని, త్వరలోనే ఆయన తిరిగి వచ్చేస్తారని తాలిబాన్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన కేంద్ర మంత్రి ఖలీల్ ఉర్ రెహ్మాన్‌కు బరాదర్‌కు గత గురువారం లేదా శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగిందని దోహా, కాబుల్‌లలోని తాలిబాన్ వర్గాలు బీబీసీతో చెప్పాయి. వాగ్వాదం అనంతరం కోపంతో బరాదర్ కాందహార్ వెళ్లిపోయారని వివరించాయి.
ఇలాంటి ప్రభుత్వం తనకు అవసరంలేదని బరాదర్ చెప్పినట్లు తాలిబాన్ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ సమాచారాన్ని బీబీసీ ధ్రువీకరించడానికి వీలుకాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆయనకు ఎలాంటి ప్రభుత్వం కావాలి?
తాలిబాన్‌లోని కాందహార్ వర్గం, హక్కానీ నెట్‌వర్క్‌ల మధ్య మొదట్నుంచీ విభేదాలు ఉన్నాయి. అయితే, కాబుల్‌ను తాలిబాన్లు తమ నియంత్రణలోకి తీసుకున్న తర్వాత, ఈ విభేదాలు ఎక్కువయ్యాయి.
‘‘కాందహారీ లేదా ఉమ్రీ తాలిబాన్, హక్కానీ నెట్‌వర్క్‌ల మధ్య విభేదాలు ఈనాటివి కావు. అయితే, ఇప్పుడు కాందహారీ తాలిబాన్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. వీటిలో ఒకటి మొహమ్మద్ యాకూబ్ వర్గం, రెండోది ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వర్గం. ఈ రెండు వర్గాలూ ప్రభుత్వంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి’’అని తాలిబాన్ వర్గాలు తెలిపాయి.
‘‘అయితే, ఇస్లామిక్ ఎమిరేట్ ఏర్పాటుకు హక్కానీ నెట్‌వర్క్ ఎంతో కృషిచేసిందని, తమకే ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని హక్కానీ నెట్‌వర్క్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.’’
‘‘కేవలం మత పెద్దలు, తాలిబాన్లతో నడిచే ప్రభుత్వంలో తాను పనిచేయలేనని బరాదర్ అంటున్నారు’’అని దోహా, కాబుల్‌లలోని తాలిబాన్ వర్గాలు బీబీసీకి చెప్పాయి.
‘‘గత 20 ఏళ్లలో ఎంతో నేర్చుకున్నానని బరాదర్ చెప్పారు. ముఖ్యంగా మహిళలు, మైనారిటీలతోపాటు అన్ని వర్గాలకూ తమ ప్రభుత్వంలో చోటు కల్పిస్తామని ఆయన అంతర్జాతీయ సమాజానికి మాట ఇచ్చారు’’అని తాలిబాన్ వర్గాలు వివరించాయి.
‘‘ప్రభుత్వం ఏర్పడకముందు నుంచే ఈ విభేదాలు ఉన్నాయి. అయితే, క్యాబినెట్‌ను ప్రకటించేటప్పుడు అందరూ దీనికి అంగీకరించారు’’అని తాలిబాన్‌కు చెందిన మరో అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, REUTERS/STRINGER
కాబుల్‌లో ప్రభుత్వం ఇలా..
మరోవైపు అఫ్గాన్‌లో కొత్త క్యాబినెట్‌ను ప్రకటించినప్పటికీ, పనులు ఇంకా మొదలుకాలేదని, ఇప్పటివరకు ఒక మంత్రి మాత్రమే తమ విధానాలను ప్రజల ముందు ఉంచారని కాబుల్‌లోని జర్నలిస్టులు చెబుతున్నారు.
అన్ని మంత్రిత్వ శాఖలూ పనిచేస్తున్నాయని తాలిబాన్లు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ చాలావరకు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు తెరచుకోవడం లేదు.
‘‘మంత్రులు పనిచేయడం మొదలుపెట్టారని చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు కేవలం విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బాఖీ హక్కానీ మాత్రమే తమ విధానాలను ప్రజల ముందు ఉంచారు. మిగతా మంత్రుల నుంచి ఎలాంటి స్పందనా లేదు’’అని కాబుల్‌లోని పాకిస్తానీ జర్నలిస్టు తహీర్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాబుల్‌లో పరిస్థితి..
‘‘ఇప్పటికీ కాబుల్‌లోని బ్యాంకులు మూసే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అయితే, వాటి నుంచి కేవలం పరిమిత మొత్తంలో మాత్రమే డబ్బులు తీసుకునే వీలుంది’’అని బీబీసీ ప్రతినిధి మాలిక్ ముదాసిర్ చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయం మళ్లీ తెరచుకోవడంపై మాలిక్ మాట్లాడుతూ.. ‘‘ఖతార్ అధికారులే ఎక్కువగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తున్నారు. కాబుల్ విమానాశ్రయం మళ్లీ తెరచుకోవడంలో వారే ప్రధాన పాత్ర పోషించారు’’అని అన్నారు.
కాబుల్‌లోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో తరగతులు మొదలయ్యాయి. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు ఇంకా తెరచుకోలేదు.
చాలా మంది టీచర్లకు రెండు నెలల నుంచీ జీతాలు అందలేని మాలిక్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








