అఫ్గానిస్తాన్: తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ... అమెరికాకు 'మోస్ట్ వాంటెడ్'

సిరాజుద్దీన్ హక్కానీ

ఫొటో సోర్స్, FBI

ఫొటో క్యాప్షన్, సిరాజుద్దీన్ హక్కానీ

అఫ్గానిస్తాన్‌ను ‘‘ఇస్లామిక్ ఎమిరేట్’’గా మారుస్తున్నట్లు తాలిబాన్లు ప్రకటించారు. మరోవైపు తమ తాత్కాలిక పాలక వర్గాన్ని కూడా వెల్లడించారు.

ప్రభుత్వ అధిపతి, అంటే ప్రధాన మంత్రిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌ కొనసాగుతారని, డిప్యూటీ ప్రధాన మంత్రులుగా అబ్దుల్ ఘనీ బరాదర్, ముల్లా అబ్దుల్ సలాం హనఫీలు బాధ్యతలు నిర్వహిస్తారని తాలిబాన్లు ప్రకటించారు.

అయితే, హక్కానీ గ్రూప్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈయనకు హోం మంత్రి బాధ్యతలను తాలిబాన్లు అప్పగించారు.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా వెతుకుతోంది...

గత 20ఏళ్లలో అఫ్గానిస్తాన్‌లో విధ్వంసకర దాడులకు తెగబడినట్లు హక్కానీ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌గా పిలుస్తున్న ఈ సంస్థకు సిరాజుద్దీన్ అధిపతి. ఈయనకు తాలిబాన్లతోనూ మంచి సంబంధాలున్నాయి.

హక్కానీ నెట్‌వర్క్ బాంబు దాడి చేపట్టింది. ఈ దాడిలో 150 మందికిపైగా ప్రజలు మరణించారు.

హక్కానీ నెట్‌వర్క్‌కు అల్‌ఖైదాతో దగ్గరి సంబంధాలున్నాయి. అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో హక్కానీ నెట్‌వర్క్ పేరు కూడా ఉంది.

తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images

సిరాజుద్దీన్ హక్కానీ పేరు ఎఫ్‌బీఐ వెతుకుతున్న వ్యక్తుల జాబితాలో ఉంది. కాబుల్‌లోని ఓ హోటల్‌లో 2008 జనవరిలో జరిగిన ఓ ఉగ్రదాడికి సంబంధించిన కేసులో ప్రశ్నించేందుకు సిరాజుద్దీన్‌ను అమెరికా వెతుకుతోంది. ఆ దాడిలో ఓ అమెరికా పౌరుడు సహా ఆరుగురు మరణించారు.

అమెరికా నేతృత్వంలోని నాటో దళాలపై వరుస దాడులకు సిరాజుద్దీన్ కుట్ర పన్నినట్లు ఎఫ్‌బీఐ అభియోగాలు మోపింది. మరోవైపు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్‌పై కూడా 2008లో ఆత్మాహుతి దాడి చేపట్టినట్లు హక్కానీ నెట్‌వర్క్‌పై ఆరోపణలు ఉన్నాయి.

2011 సెప్టెంబరు 2న కాబుల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయానికి సమీపంలో నాటో దళాలపై జరిగిన దాడిని హక్కానీ నెట్‌వర్క్ చేపట్టిందని రుజువైంది. ఈ దాడిలో నలుగురు పోలీసు అధికారులు సహా ఎనిమిది మంది మరణించారు.

సిరాజుద్దీన్ హక్కానీ

ఫొటో సోర్స్, FBI

ఫొటో క్యాప్షన్, సిరాజుద్దీన్ హక్కానీ

రూ.73 కోట్ల రివార్డు

‘‘సిరాజుద్దీన్ 5.7 అడుగుల ఎత్తు ఉంటాడు. అతడి వయసు 45 ఏళ్లకు అటూఇటూగా ఉంటుంది. పాకిస్తాన్‌లో ఉండే ఇతడు అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో క్రియాశీలంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. అతడిని పట్టించేవారికి సుమారు రూ.73 కోట్ల రివార్డు అందిస్తాం’’అని సిరాజుద్దీన్ ప్రొఫైల్‌లో ఎఫ్‌బీఐ పేర్కొంది.

గత ఏడాది న్యూయార్క్ టైమ్స్‌కు సిరాజుద్దీన్ ఒక కథనం రాశారు. ‘‘నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తమ ఆప్తులను పోగొట్టుకున్నారు. ఇక్కడ అందరూ అలిసిపోయారు. ఈ హత్యలు ఇక్కడితో ఆగిపోవాలి’’అని దానిలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)