తాలిబాన్ల చేతిలో కొత్త ఆయుధం సోషల్ మీడియా, ప్రపంచానికి తమపై ఉన్న అభిప్రాయం మార్చడమే లక్ష్యం

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సారా అటిక్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా, నాటో సేనలు అఫ్గానిస్తాన్ నుంచి తిరుగుముఖం పట్టడం ప్రారంభమైన మే నెలలో అఫ్గాన్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్‌పై తాలిబాన్లు తమ దాడులు తీవ్రతరం చేశారు.
ఇదే సమయంలో వారు తమ ధోరణికి భిన్నంగా సోషల్ మీడియాలో ప్రచారమూ ప్రారంభించారు.
తాలిబాన్ల సోషల్ మీడియా అకౌంట్ల నెట్‌వర్క్ నుంచి అఫ్గాన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులతో పాటు తాలిబాన్ల విజయాలపైనా ప్రచారం మొదలైంది.
తాలిబాన్లు ఎప్పటికప్పుడు సాధిస్తున్న విజయాల గురించి ట్వీట్లలో గొప్పగా చెబుతుండేవారు. #kabulregimecrimes #westandwithTaliban #ﻧَﺼْﺮٌ_ﻣٌِﻦَ_اللهِ_ﻭَﻓَﺘْﺢٌ_ﻗَﺮِﻳﺐٌ (దేవుడి అండ ఉంది. విజయం సమీపంలోనే ఉంది) వంటి హ్యాష్ టాగ్‌లు ట్విటర్‌లో వాడారు. వీటిలో #kabulregimecrimesను అఫ్గానిస్తాన్‌లో ట్రెండ్ చేశారు.
దీంతో అఫ్గానిస్తాన్ అప్పటి వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలేహ్.. తాలిబాన్‌ల సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దని ప్రజలను, భద్రతాదళాలను కోరారు.
భద్రతకు ముప్పు తెచ్చేలా ప్రజలెవరూ సైనిక సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని కూడా ఆయన అప్పట్లో సూచించారు.
మీడియా, సోషల్ మీడియాలను ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన తాలిబాన్‌లు ఈసారి పంథా మార్చుకుని తమ సందేశాన్ని బయట ప్రపంచానికి చేర్చడానికి గాను సోషల్ మీడియాను వాడుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
తాలిబాన్‌లు తొలిసారి 1996లో అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటర్నెట్‌ను నిషేధించారు. టీవీలు, కెమేరాలు, వీడియో టేపులను స్వాధీనం చేసుకోవడం, తగలబెట్టడం వంటివి చేశారు.
అయితే, 2005లో వారు తమ అధికారిక వెబ్‌సైట్ 'అల్ ఎమరహ్'ను ప్రారంభించారు. అనంతర కాలంలో ఆ వెబ్‌సైట్ ఇంగ్లిష్, అరబిక్, పాష్టో, దారీ, ఉర్దూ భాషలకు విస్తరించింది.
తాలిబాన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ నేతృత్వంలోని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ కల్చరల్ కమిషన్ ఈ వెబ్‌సైట్ కంటెంట్‌ను పర్యవేక్షిస్తుంది. ఆడియో, వీడియో, టెక్స్ట్ కంటెంట్ ఇందులో ఉంచుతున్నారు.
జబీహుల్లా ముజాహిద్‌కు గతంలో ఉన్న ట్విటర్ అకౌంట్ సస్పెండైంది. అయితే, 2017 నుంచి ఆయన మరో కొత్త అకౌంట్ ప్రారంభించి దాన్నుంచే ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు ట్విటర్‌లో 3,71,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.
తాలిబాన్ల భావజాలాన్ని ఆన్‌లైన్‌లో ప్రచారం చేసే పెద్ద నెట్‌వర్క్ ఒకటి ఆయన కింద పనిచేస్తోంది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ సోషల్ మీడియా డైరెక్టర్‌గా క్వారీ సయీద్ ఖోస్తీ వ్యవహరిస్తున్నారు.
ట్విటర్‌లో తాలిబాన్లకు సంబంధించిన హ్యాష్‌టాగ్‌లు ట్రెండ్ చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో తమ సందేశాలు వ్యాప్తి చేయడం కోసం వేర్వేరు బృందాలు పనిచేస్తున్నాయని ఖోస్తీ 'బీబీసీ'తో చెప్పారు.
''మా శత్రువులకు టీవీలు, రేడియోలు, సోషల్ మీడియాలో వెరిఫైడ్ అకౌంట్లు ఉన్నాయి.. మాకు అలాంటివేమీ లేవు. అయినా, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వారితో మేం పోరాడి గెలిచాం'' అని ఖోస్తీ అన్నారు.
అఫ్గానిస్తాన్‌లో 86 లక్షల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారు. నెట్‌వర్క్ సరిగా లేకపోవడం, డాటా చార్జీలు అధికంగా ఉండడం వంటి అనేక సమస్యలున్నాయి అక్కడ. తాలిబాన్ల సోషల్ మీడియా టీం సభ్యులకు నెలకు 1000 అఫ్గనీలు(సుమారు రూ. 850) డాటా ఖర్చులకు గాను ఇస్తారు.
''మాకు అన్ని వసతులూ ఉన్న నాలుగు మల్టీమీడియా స్టూడియోలు ఉన్నాయి. మా ఆడియో, వీడియో కంటెంట్ అంతా అక్కడ తయారవుతుంది'' అని ఖోస్తీ చెప్పారు.
అల్ ఎమరాహ్ వెబ్‌సైట్, యూట్యూబ్‌లో వస్తున్న తాలిబాన్ అనుకూల కంటెంట్ అంతా అక్కడే తయారవుతోంది.
ట్విటర్, యూట్యూబ్‌లలో తాలిబాన్లు ఎలాంటి అడ్డంకులు లేకుండానే తమ కంటెంట్ పబ్లిష్ చేయగలుగుతున్నారు. కానీ, ఫేస్‌బుక్ తాలిబాన్లను ప్రమాదకర సంస్థగా ప్రకటించడంతో అక్కడ మాత్రం వారి కంటెంట్, ఖాతాలు, పేజీలను కూడా ఫేస్‌బుక్ తరచూ తొలగిస్తుంటుంది.
ఫేస్‌బుక్ విస్తృతి దృష్ట్యా ఆ ప్లాట్‌ఫాంపై మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఖోస్తీ బీబీసీతో చెప్పారు.
హక్కానీ నెట్‌వర్క్‌ను అమెరికా టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించినప్పటికీ ఆ నెట్‌వర్క్ అగ్రనేత అనాస్ హక్కానీ, ఇతర నేతలకు ట్విటర్ అకౌంట్లు ఉన్నాయి. వేలాది మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
తాలిబాన్‌ల సోషల్ మీడియా టీం సభ్యుడు ఒకరు 'బీబీసీ'తో మాట్లాడుతూ... 2020 ఫిబ్రవరిలో తాలిబాన్‌ల డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ 'న్యూయార్క్ టైమ్స్'లో రాసిన ఒక వ్యాసాన్ని ట్విటర్‌లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామని, ఆ నిర్ణయం తరువాతే తాలిబాన్లలో చాలామంది ట్విటర్ ఖాతాలు ప్రారంభించారని చెప్పారు.
''అఫ్గానిస్తాన్‌లో చాలామందికి ఇంగ్లిష్ తెలియదు. కానీ, కాబుల్ పాలకులు చాలామంది మాత్రం ట్విటర్‌లో ఇంగ్లిష్‌లోనే పోస్టులు పెట్టేవారు. వారి ట్వీట్ల లక్ష్యం అఫ్గానిస్తాన్ ప్రజలు కాదు. అంతర్జాతీయ సమాజం కోసమే వారు ఆ ట్వీట్లు చేసేవారు'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ సోషల్ మీడియా టీం సభ్యుడు బీబీసీతో చెప్పారు.
''కాబుల్ పాలకుల ప్రచారాన్ని తిప్పికొట్టాలని మేం నిర్ణయించుకున్నాం. అందుకే మేం కూడా ట్విటర్‌పై దృష్టి పెట్టాం'' అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
తమ టీం సభ్యుల్లో కొందరికి వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారని, అయితే, పొరుగు దేశాల విదేశాంగ విధానాలకు సంబంధించిన పోస్టులపై తమ వారెవరూ కామెంట్లు చేయరాదని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని చెప్పారు. అలా చేస్తే ఆయా దేశాలతో తాలిబాన్ల సంబంధాలకు ఇబ్బంది వస్తుందని చెప్పారు.
గతంలో తాలిబాన్లు తమ నాయకులు, ఫైటర్లకు సంబంధించిన ఎలాంటి వివరాలైనా అత్యంత రహస్యంగా ఉంచేవారు. చివరకు తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ చిత్రం కూడా సరైనది ఎక్కడా కనిపించేది కాదు.
కానీ, ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందే లక్ష్యంతో తాలిబాన్ నాయకులు మీడియా ముందుకు వస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.
తాలిబాన్లు కాబుల్‌ను వశం చేసుకున్న తరువాత ఆ గ్రూప్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆ తరువాత అనేక మంది తాలిబాన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లకు జబీహుల్లా ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.
ఇందుకు పూర్తి విరుద్ధంగా... ఇంతకాలం అంతర్జాతీయ సేనల కోసం పనిచేస్తూ సోషల్ మీడియాలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన, అభిప్రాయాలు వ్యక్తంచేసిన అఫ్గాన్ పౌరులు, సంస్థలు, మీడియా, ఇతరులు అందరూ తమ ఉనికిని రహస్యంగా ఉంచుతున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు. లేనిపక్షంలో సోషల్ మీడియా ఖాతాల్లోని తమ సమాచారం ఆధారంగా తాలిబాన్లు తమను టార్గెట్ చేస్తారని భయపడుతున్నారు.
తాలిబాన్లు ఇప్పటికే ప్రతీకార దాడులు ప్రారంభించారని, తమకు వ్యతిరేకంగా వ్యవహరించినవారికోసం వెతుకున్నారని, చాలామందిని చంపేశారని తమకు సమాచారం ఉందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలు చెబుతున్నాయి.
పౌరులు ఎవరైనా తమ ఖాతాలను లాక్ చేసుకోవాలనుకుంటే అందుకు వీలుగా ఒకే క్లిక్‌తో లాక్ చేసుకునేలా ఓ టూల్‌ను ఫేస్‌బుక్ అఫ్గానిస్తాన్‌లో అందుబాటులోకి తెచ్చింది.
అంతేకాకుండా అఫ్గానిస్తాన్‌లోని ఫేస్‌బుక్ ఖాతాలకు సంబంధించి ఫ్రెండ్స్ లిస్ట్ సెర్చ్ చేసే ఆప్షన్‌ను తాత్కాలికంగా తొలగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
తాలిబాన్లు తాము మారిపోయామని, ఒకప్పటి క్రూర విధానాలు వదిలిపెట్టామని చెబుతున్నప్పటికీ అప్గాన్ ప్రజలు కానీ బయటి ప్రపంచం కానీ ఆ మాటలు నమ్మడం లేదు.
అయితే, ప్రపంచానికి తమపై ఉన్న అభిప్రాయం మారాలంటే ఒకప్పుడు తాము వ్యతిరేకించిన టెక్నాలజీనే సాధనంగా మలచుకోవాలని తాలిబాన్లు గ్రహించారు.
ఇవి కూడా చదవండి:
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









