అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?

ఫొటో సోర్స్, REUTERS/Stringer
- రచయిత, మానసీ దాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు దశాబ్దాల క్రితం అమెరికా సైనిక చర్యలతో అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్లను గద్దె దించింది. నేడు అమెరికా సేనల ఉపసంహరణతో మళ్లీ తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు.
కాబుల్‌ను ఆగస్టు 15న తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు గందరగోళంగా మారాయి.
నేడు అఫ్గానిస్తాన్ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. మళ్లీ ఇది ‘‘ఉగ్రవాదుల స్థావరం’’గా మారిపోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌కు సంబంధించి గత రెండు దశాబ్దాల్లో నలుగురు అమెరికా అధ్యక్షులు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే, అఫ్గాన్‌లో అమెరికా సేనలు విఫలం కావడానికి బాధ్యులు ఎవరు? అనే అంశంపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, REUTERS/Larry Downing
జార్జి బుష్
2001 సెప్టెంబరు 11న మిలిటెంట్లు నాలుగు విమానాలను హైజాక్ చేశారు. ఈ విమానాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెన్సిల్వేనియాలపై దాడులు చేశారు.
ఈ దాడులు జరిగే సమయంలో అమెరికా విదేశాంగ శాఖకు మైఖెల్ మెక్‌కిన్లీ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఆయన అఫ్గాన్‌కు అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. అప్పటి పరిస్థితులపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘ఆ దాడులు జరిగేటప్పుడు, నేను విదేశాంగ శాఖ కార్యాలయంలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలారం మోగింది. వెంటనే మేం కిటికీలో నుంచి బయటకు చూశాం. బయట దట్టమైన పొగ కనిపించింది. మేం బయటకు వచ్చిచూస్తే, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.’’
అమెరికా గడ్డపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో 9/11 అతిపెద్దది. దీన్ని అఫ్గానిస్తాన్‌తో సంబంధమున్న అల్‌ఖైదా చేపట్టింది. ఈ దాడుల్లో 2,977 మంది మరణించారు. మరో 6,000 మందికిపైగా గాయాలపాలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
అల్‌ఖైదాపై దాడులు..
9/11 దాడులకు కొన్ని సంవత్సరాల ముందు, అల్‌ఖైదా విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. అల్‌ఖైదాతో తాలిబాన్లకున్న సంబంధాల విషయంలోనూ హెచ్చరికలు జారీచేసింది.
అయితే, ఈ దాడులు మాత్రం అమెరికా రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి.
‘‘అమెరికా తనను తాను ఎలా రక్షించుకోవాలో కొత్త మార్గాలను అన్వేషించింది. అదే సమయంలో 9/11 దాడులకు గట్టిగానే స్పందించింది’’అని మైఖెల్ అన్నారు.
‘‘ఈ దాడుల తర్వాత, విదేశీ గడ్డలపై మిత్రదేశాలతో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై అమెరికా దృష్టిపెట్టింది. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా 20ఏళ్ల క్రితం బుష్ తీసుకొచ్చిన అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు నేటికీ మనకు కనిపిస్తాయి.’’
జార్జి బుష్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఈ దాడులు జరిగాయి. దీంతో ఈ దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుంది? అనే అంశంపై మీడియాలో చర్చ జరిగింది.
‘‘తాలిబాన్లకు అల్టిమేటం ఇవ్వాలని ఆనాడు నిర్ణయించారు. ఈ దాడుల వెనకున్న బాధ్యుల్ని అమెరికాకు అప్పగించాలని తాలిబాన్లకు చెప్పారు. అంతేకాదు తమ భూభాగం నుంచి మళ్లీ దాడులకు కుట్రలు పన్నబోమని నిరూపించుకోవాలని సూచించారు’’అని మైఖెల్ వివరించారు.
అయితే, ఈ దాడులతో తమకేమీ సంబంధంలేదని తాలిబాన్లు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే అమెరికా సైనిక చర్యలు మొదలుపెట్టింది.
ఈ చర్యలకు అమెరికాకు ప్రజల నుంచి మద్దతు లభించింది. అమెరికాలోని విపక్షాలు కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని అందరూ సూచించారు.
2001 డిసెంబరులో అమెరికా సైనిక చర్యలతో అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. దీంతో చాలా మంది అల్‌ఖైదా నాయకులు పాకిస్తాన్‌కు పారిపోయారు. అల్‌ఖైదా దాదాపుగా నిర్వీర్యమైంది. అమెరికా మిషన్ విజయవంతమైందని ఆనాడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Cpl John Scott Rafoss/MoD Crown copyright/PA Wire
ఇరాక్ యుద్ధం..
సైన్యం సాయంతో తాలిబాన్లను అమెరికా సులువుగానే ఓడించింది. అయితే, అక్కడి ప్రజలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం మాత్రం చాలా కష్టమైంది.
ఇక్కడి పునర్నిర్మాణ సమస్యను పరిష్కరించే లోపే, మార్చి 2003లో ఇరాక్ రూపంలో మరో సమస్య ఎదురైంది. తమ ప్రాథమ్యాలను మార్చుకుని, ఇరాక్‌లో యుద్ధం చేయాలని బుష్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక దేశాన్ని పునర్నిర్మించడం ఎంత కష్టమో గ్రహించడంలో బుష్ ప్రభుత్వం దాదాపుగా విఫలమైంది. దీంతో అఫ్గాన్‌లో అభివృద్ధి కుంటుపడింది. అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
‘‘ఆనాడు కొంతమంది తాలిబాన్లు లొంగిపోవాలని భావించారు. మరికొందరు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని అనుకున్నారు. దీన్ని అవకాశంగా మలచుకోవడంలో బుష్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి’’అని మైఖెల్ అన్నారు.
ఆ తర్వాత, మళ్లీ నెమ్మదిగా అఫ్గాన్‌లో తాలిబాన్లు పుంజుకున్నారు. బుష్ రెండోసారి అధ్యక్షుడుగా కొనసాగిన సమయంలో.. అఫ్గాన్‌లో మళ్లీ తాలిబాన్లు దాడులు చేయడం మొదలుపెట్టారు.
‘‘2004లో తాలిబాన్లు ఆరు దాడులు చేశారు. 2005లో ఈ దాడులు 21కి పెరిగాయి. 2006లో అయితే, ఏకంగా 141 దాడులు చేశారు’’అని తాలిబాన్: ద పవర్ ఆఫ్ మిలిటెంట్ ఇస్లాం ఇన్ అఫ్గానిస్తాన్ అండ్ బియాండ్ పుస్తకంలో అహ్మద్ రషీద్ వివరించారు.
తాలిబాన్ల దాడులకు ప్రతిగా, అఫ్గాన్‌లో అమెరికా తమ బలగాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చింది. అఫ్గాన్‌లో అమెరికా సేనలు పెరిగినప్పటికీ, సమస్యలు మాత్రం అలానే ఉండేవి.
ఇక్కడ యుద్ధంలో అమెరికా గెలిచినప్పటికీ, వెనక్కి ఎలా వెళ్లాలో అమెరికా దగ్గర స్పష్టమైన వ్యూహం అంటూ ఏదీ లేకుండా పోయింది.
‘‘రాజకీయ, సామాజిక కోణాలు ఇక్కడ భిన్నంగా ఉండేవి. బయటవారికి అఫ్గాన్‌లో పరిస్థితులు సరిగా అర్ధమయ్యేవి కాదు’’అని మైఖెల్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బరాక్ ఒబామా
బుష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ వ్యవహారాలపై అమెరికా జాతీయ భద్రతా మండలికి ప్రొఫెసర్ పాల్ డి.మిల్లర్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఒబామా హయాంలోనూ దాదాపు ఏడాది పాటు మిల్లర్ ఈ పదవిలో కొనసాగారు.
దీనికి ముందుగా, అమెరికా సైన్యం, నిఘా విభాగాల్లోనూ మిల్లర్ పనిచేశారు. ఒబామా తన ఎన్నికల ప్రచారంలో అఫ్గాన్‌లో సైనిక చర్యలకు మద్దతు పలికారని మిల్లర్ వివరించారు.
‘‘2008 జులైలో ఒబామా ఇచ్చిన ప్రసంగంలో అఫ్గానిస్తాన్‌పై విదేశాంగ విధానం గురించి ఒబామా మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన యుద్ధమని, దీనిలో ఎలాగైనా విజయం సాధించాలని ఆయన అన్నారు.’’
‘‘2009 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బుష్ విధానాలను ఒబామా ముందుకు తీసుకెళ్లారు. దీంతో అఫ్గాన్‌లో అమెరికా సేనల సంఖ్య 37,000కు పెరిగింది.’’

ఫొటో సోర్స్, Reuters
వ్యూహాల్లో మార్పు..
అయితే, కొన్ని రోజుల తర్వాత అఫ్గాన్ విషయంలో ఒబామా తమ వ్యూహాల్లో మార్పులు చేశారు.
‘‘అఫ్గాన్‌లో పెరుగుతున్న హింసను కట్టడి చేసేందుకు మరిన్ని బలగాలను పంపిస్తామని ఒబామా అన్నారు. అఫ్గాన్ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యూహాన్ని కౌంటర్-ఇన్సర్జెన్సీ స్ట్రాటజీగా అభివర్ణించారు.’’
‘‘నిజానికి అది సరైన వ్యూహం. ఎందుకంటే అక్కడ స్థిరతమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలి. అయితే, అక్కడ సవాళ్లు చాలా ఉన్నాయి.’’
ఇదే సమయంలో, అఫ్గానిస్తాన్ ఎన్నికల్లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. హింస కూడా పెరిగింది.
‘‘మరింత మంది సైనికులను పంపండి. లేకపోతే, ఇక్కడ ఉగ్రవాదంపై పోరాటంలో పైచేయి సాధించడం కష్టం అవుతుంది’’అని అఫ్గాన్‌లో అమెరికా సేనలకు నేతృత్వం వహిస్తున్న కమాడర్ జనరల్ స్టాన్లీ మెక్ క్రిస్టల్ ఆనాడు వ్యాఖ్యానించారు.
దీంతో 2009 ఫిబ్రవరిలో 17,000 మందిని, డిసెంబరులో 30,000 మంది అఫ్గాన్‌కు పంపేందుకు ఒబామా ఆమోదం తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒసామా హతం.. కానీ
9/11 దాడులకు 11ఏళ్ల తర్వాత పాక్‌లో అమెరికా నేవీ సీల్స్ ఆపరేషన్ చేపట్టి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో అల్‌ఖైదా, తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ప్రధాన ఆపరేషన్ దాదాపుగా ముగిసింది.
దీని తర్వాత, తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించారు. ఆ సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ఉపాధ్యక్షుడిగా కొనసాగేవారు.
బలగాల ఉపసంహరణపై ఆనాడు చేసిన ప్రకటనను అతిపెద్ద తప్పుగా మిల్లర్ అభివర్ణించారు.
‘‘అప్పటివరకు తాలిబాన్లపై చాలా ఒత్తిడి ఉండేది. వారి ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయిందని వార్తలు కూడా వచ్చేవి. అయితే వారు మంచి అవకాశం కోసం ఎదురుచూసేవారు’’అని మిల్లర్ వివరించారు.
‘‘అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో.. తాలిబాన్లకు మంచి అవకాశం దొరికింది. ఈ ప్రకటనతో అమెరికా వైఖరి మారినట్లు కనిపించింది.’’
‘‘ఇప్పటివరకు సైన్యం సాధించిన పురోగతి మొత్తం నీరు గారినట్లు అయ్యింది. ప్రస్తుత పరిస్థితులకు ఒబామా హయాంలో తీసుకున్న నిర్ణయాలే బీజం వేశాయి.’’

ఫొటో సోర్స్, REUTERS/Shannon Stapleton
డోనల్డ్ ట్రంప్
అమెరికా ప్రభుత్వం, సైన్యంలో సీనియర్ జియోపొలిటికల్ అడ్వైజర్‌గా పొజేషా డీజెనెరా పనిచేశారు.
‘‘అఫ్గాన్‌లో ఏం జరుగుతుందో ట్రంప్ పట్టించుకునేవారు కాదు. విదేశాలతో ఎలా ముందుకు వెళ్లాలో ట్రంప్ సొంతంగా నిర్ణయాలు తీసుకునేవారు. అఫ్గాన్‌లో యుద్ధాన్ని కొనసాగించడం ఆయనకు అసలు ఇష్టం లేదు. బలగాలను వెనక్కి పిలిపించాల్సిన సమయం వచ్చిందని ఆయనే స్వయంగా చెప్పారు’’అని డీజెనెరా అన్నారు.
‘‘మరోవైపు ప్రజలు కూడా అఫ్గాన్‌లో అమెరికా సేనలను వెనక్కి పిలిపించాలనే ఉద్దేశంతోనే ఉండేవారు.’’
‘‘ట్రంప్ కూడా మునుపటి అధ్యక్షుల్లా కాకుండా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకునేవారు. ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పకుండానే, ఏకపక్షంగా తాలిబాన్లతో ట్రంప్ చర్చలు మొదలుపెట్టారు. మిత్రదేశాలకు చెప్పకుండానే, ఉపసంహరణ తేదీని ప్రకటించారు. దీంతో అంతా ఈ తేదీని అంగీకరించాల్సి వచ్చంది.’’
‘‘విదేశీ సేనలపై దాడులు చేపట్టబోమని తాలిబాన్లతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అఫ్గాన్ ప్రభుత్వానికి ఈ చర్చల్లో పాత్రే లేదు.’’

ఫొటో సోర్స్, REUTERS/Hussein Sayed
తాలిబాన్లకు ధైర్యం..
తాలిబాన్లు యుద్ధం చేసిచేసి అలసిపోయారని, అందుకే ఈ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ట్రంప్ అన్నారు.
‘‘నిజానికి ట్రంప్‌కు పరిస్థితులు అర్థంకాలేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోగలిగే నిపుణులను పక్కన ఉంచుకోవడంలోనూ ట్రంప్ విఫలం అయ్యారు’’అని డీజెనెరా వ్యాఖ్యానించారు.
‘‘అఫ్గాన్‌లో అమెరికా సేనల సంఖ్య తగ్గుతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. అఫ్గాన్‌లో పరిస్థితులకు అనుగుణంగా పాకిస్తాన్ స్పందన కూడా మారుతూ వచ్చింది. తాలిబాన్లతో చర్చల విషయంలో పాక్‌ను ట్రంప్ పట్టించుకోలేదు.’’
తాలిబాన్లతో తమ ఒప్పందాన్ని ఫిబ్రవరి 2020లో ట్రంప్ ప్రకటించారు. అఫ్గాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నాటో దళాలు అందరికీ ఈ ఒప్పందం అమలవుతుంది. వీరంతా మే 1, 2021 కల్లా వెనక్కి వెళ్లాలని ఒప్పందంలో నిర్ణయించారు.

ఫొటో సోర్స్, EPA/SASCHA STEINBACH
ఆ ఒప్పందానికి అనుగుణంగా 5,000 ఖైదీలను జైలు నుంచి అమెరికా విడుదల చేసింది. వీరిలో చాలా మంది తాలిబాన్‌లో చేరారు. మరోవైపు తాలిబాన్ కూడా 1,000 మంది ఖైదీలను విడుదల చేసింది.
ట్రంప్ అధ్యక్షుడయ్యేనాటికి అఫ్గాన్‌లో అమెరికా సేనల సంఖ్య 8,500కు తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ సంఖ్య 13,000కు పెరిగింది.
‘‘బలగాలను వెనక్కి పిలించాలనే నిర్ణయం తప్పుకాదు. కానీ దీన్ని కాస్త మెరుగ్గా చేయొచ్చు’’అని డీజెనెరా అన్నారు.
‘‘ఆ నిర్ణయంలో ఎలాంటి తప్పూలేదు. కానీ అమలులోనే సమస్య ఉంది. దీని అమలులో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో ట్రంప్ వర్గం విఫలమైంది. అంతేకాదు, తర్వాత వచ్చే ప్రభుత్వానికి బాధ్యతలను పూర్తిగా అప్పగించడంలోనూ ట్రంప్ విఫలమయ్యారు.’’

ఫొటో సోర్స్, EPA/JIM LO SCALZO
జో బైడెన్
జార్జ్ టౌన్ యూనివర్సిటీలోని సెక్యూరిటీ స్టడీస్ విభాగంలో ప్రొఫెసర్‌గా క్రిస్టీన్ ఫెయిర్ కొనసాగుతున్నారు. ఐక్యరాజ్యసమితి పొలిటికల్ ఆఫీసర్‌గా ఈమె 2007లో అఫ్గాన్‌కు వెళ్లారు.
‘‘ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనితీరును గురించి మాట్లాడుకోకుండా ప్రస్తుత పరిస్థితుల గురించి అంచనా వేయలేం’’అని క్రిస్టీన్ అన్నారు.
‘‘అఫ్గాన్, తాలిబాన్ల విషయంలో ఒబామా, బైడెన్‌ల ఆలోచనలు ఒకేలా ఉంటాయి. తాలిబాన్లపై దృష్టి సారించడం అర్థరహితమని వీరు భావిస్తారు.’’
‘‘అల్‌ఖైదా తరహాలో తాలిబాన్లు అమెరికాకు పెద్ద ముప్పు కాదనే భావన వీరిలో ఉంది. మరోవైపు తాలిబాన్లను తమ శత్రువులుగా మార్చుకోవాలని వీరు అసలు అనుకోరు. అల్‌ఖైదా సభ్యుల్ని అంతం చేయడం వరకే వీరి మిషన్ పరిమితమైంది.’’
‘‘అయితే, అమెరికా సేనలు లేకుండా అఫ్గాన్‌లో పరిణామాలు ముందుకు కదలని పరిస్థితి వచ్చింది. ట్రంప్ ఒప్పందాన్ని బైడెన్ అనుసరిస్తున్నారని అందరూ అంటున్నారు. అందులో నిజం లేదు. తను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా బైడెన్ ఇదే చేయాలని అనుకున్నారు.’’

ఫొటో సోర్స్, REUTERS/Stringer
ఆ నిర్ణయాలను బైడెన్ మార్చి ఉండాల్సింది..
‘‘ట్రంప్ ఒప్పందంలో చాలా లోపాలు ఉన్నాయి. అయితే, తాజా పరిస్థితుల్లో బైడెన్ తప్పులేదని అనుకోవడానికి వీల్లేదు’’అని క్రిస్టీన్ అన్నారు.
‘‘ట్రంప్ నిర్ణయాలను బైడెన్ మార్చి ఉండాల్సింది. కానీ అలా చేయాలని బైడెన్ అనుకోలేదు.’’
‘‘తాలిబాన్లు పదేపదే తమ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వచ్చారు. దీని ఆధారంగా బైడెన్ వర్గం ఒప్పందం నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అయితే, భారీగా సైనికుల్ని ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ప్రణాళికలను బైడెన్ ఒక్కసారి కూడా విమర్శించలేదు. నిజానికి బైడెన్ చేయాలనుకున్నదే, ట్రంప్ చేశారు.’’
బలగాల ఉపసంహరణ తేదీని మే 1 నుంచి సెప్టెంబరు 11కు బైడెన్ పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ దీన్ని ఆగస్టు 31కి కుదించారు.
‘‘తాలిబాన్లు ఇంత త్వరగా దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేరని బైడెన్ అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే, అఫ్గాన్ మొత్తాన్నీ తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.’’

ఫొటో సోర్స్, Corporal Adrian Harlen/MoD/PA Wire
ఎన్నికలతో ఒత్తిడి
‘‘ఎటూ తేలని అఫ్గాన్ యుద్ధాన్ని మరిన్ని రోజులు కొనసాగించకూడదని, అఫ్గాన్‌లో మరిన్ని రోజులు సేనలను మోహరించడం అనవసరమని మొదట్నుంచీ బైడెన్ వర్గం భావిస్తోంది’’అని క్రీస్టీన్ అన్నారు.
‘‘అమెరికాలో ఎన్నికలకు ముందు నుంచే ఈ అంశంపై డెమొక్రటిక్ పార్టీ వర్గాల్లో చర్చలు జరిగేవి. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నిరుద్యోగ రేటును తగ్గించడంపై తాము దృష్టి సారించాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు.’’
‘‘సెనేట్, ప్రతినిధుల సభల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య తేడా చాలా తక్కువగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. అఫ్గాన్‌లో కల్లోల పరిస్థితులకు ఇది కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.’’

ఫొటో సోర్స్, REUTERS/Stringer
ఇంతకీ దీనికి బాధ్యులు ఎవరు?
ఇప్పుడు మొదటి ప్రశ్న దగ్గరకు వద్దాం. అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనల వైఫల్యానికి బాధ్యులు ఎవరు?
అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం కంటే ఇరాక్ యుద్ధమే ప్రాధాన్యంగా బుష్ ప్రభుత్వం ముందుకు వెళ్లింది.. బలగాలను ఉపసంహరించుకోవాలనే ఒబామా నిర్ణయంతో తాలిబాన్లలో ధైర్యం పెరిగింది.. ట్రంప్ ఒప్పందంతో తాలిబాన్లకు అనుకున్న దానికంటే ఎక్కువే లబ్ధి చేకూరింది.. జరుగుతున్న పరిణామాలను అడ్డుకోకుండా బైడెన్ చూస్తూ కూర్చున్నారు.
ఈ నలుగురు అమెరికా అధ్యక్షులూ అఫ్గాన్‌లోని రాజకీయ నాయకులపై చాలా ఎక్కువగా ఆధారపడ్డారు. తాలిబాన్లను చాలా తక్కువగా అంచనా వేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు అధ్యక్షులూ ఈ సంక్షోభానికి కారణం అని మనం చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యంలోని కర్బన ఉద్గారాలతో ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








