అష్రఫ్ ఘనీ: ‘వేరే దారి లేకే వెళ్లిపోయాను, క్షమించండి’

ఫొటో సోర్స్, Reuters
తాలిబాన్లు కాబుల్‌ను కైవసం చేసుకునేటప్పటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పారిపోయిన అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
''కాబుల్ విడిచి వెళ్లాలన్నది నా జీవితంలో తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం'' అని చెప్పిన ఘనీ ఈ పరిణామాలకు వేరే రకమైన ముగింపు ఇవ్వలేకపోయానంటూ క్షమాపణలు చెప్పారు.
ఆగస్ట్ 15న తాలిబాన్‌లు కాబుల్ దిశగా సాగడంతో ఘనీ అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయారు.
ప్రజలను వదిలిపెట్టి వెళ్లాలనుకోలేదు కానీ, అంతకుమించి తనకు వేరే దారి లేకపోయిందని ఘనీ చెప్పారు.
యూఏఈకి వెళ్లినప్పుడు 16.9 కోట్ల డాలర్లు తనతో తీసుకెళ్లినట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఆ ఆరోపణలు నిరాధారమని చెప్పారు.
బుధవారం ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ''హింసను నివారించేందుకు దేశం విడిచి వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది'' అన్నారు.
''1990ల మాదిరిగా వీధి పోరాటాలు జరగకుండా నివారించేందుకు నేను దేశం వీడి వెళ్లాలని ప్యాలస్ సెక్యూరిటీ నాకు సూచించడంతో వెళ్లాను'' అని ఆ ప్రకటనలో ఘనీ చెప్పారు.
అఫ్గానిస్తాన్ ప్రజాస్వామ్య, సంపన్న, సార్వభౌమ రాజ్యంగా ఏర్పడడానికి తాను 20 ఏళ్లు కృషి చేశానని ఘనీ చెప్పారు.
తన కంటే ముందు పనిచేసినవారి మాదిరిగానే తన అధ్యాయం కూడా విషాదంగా ముగిసినందుకు చాలా బాధగా ఉందన్నారాయన.
సంక్షోభ సమయంలో దేశాన్ని వీడి వెళ్లడంపై 72 ఏళ్ల ఘనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
తాను వెళ్లిపోవడానికి దారి తీసిన పరిస్థితులను సమీప భవిష్యత్తులో వివరిస్తానని ఘనీ అన్నారు.
ఆగస్ట్ 18న ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన ఘనీ.. తనను బంధించి చంపే అవకాశం ఉండడంతో భద్రతావర్గాలు తనను దేశం విడిచి వెళ్లమని కోరాయని చెప్పారు.
తాలిబాన్లు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన వెంటనే తన కోసం ప్రతి గదీ వెతికారని ఘనీ చెప్పారు.
వేసుకున్న చెప్పులను విడిచి షూ వేసుకోవడానికి కూడా తనకు సమయం ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను భారీ మొత్తంలో డబ్బు తీసుకుని వెళ్లిపోయాననడంలో ఏమాత్రం నిజం లేదని ఘనీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 1965: పాకిస్తాన్ కమాండోలు పారాచూట్లలో భారత వైమానిక స్థావరాలపై దిగినప్పుడు...
- పాకిస్తాన్ జైల్లో 24 ఏళ్లు ఉన్న వ్యక్తి చివరికి స్వదేశానికి ఎలా చేరుకున్నారంటే...
- రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్, ఇంతకీ సమస్య ఎక్కడుంది?
- అఫ్గానిస్తాన్ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు, కీలక స్థానాల్లో అతివాదులతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








